రివ్యూ: కిక్
రేటింగ్: 2.5/5
బ్యానర్: నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్
తారాగణం: సల్మాన్‌ఖాన్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, రణ్‌దీప్ హుడా, నవాజుద్దీన్ సిద్దికీ తదితరులు
కథ: వక్కంతం వంశీ
మాటలు: రజత్ అరోరా
సంగీతం: హిమేష్ రేషమ్మియా
కూర్పు: రామేశ్వర్ భగత్
ఛాయాగ్రహణం: అయనన్కా బోస్
నిర్మాత, దర్శకత్వం: సాజిద్ నడియాడ్వాలా
విడుదల తేదీ: జులై 25, 2014
సౌత్ రీమేక్స్ మీద గురి కుదిరిన సల్మాన్‌ఖాన్ ఈసారి రవితేజ కిక్ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ఈ హిందీ కిక్ ఏమాత్రం కిక్కిచ్చేదో చూద్దాం…
కథేంటి?
షైనా (జాక్వెలీన్), హిమాన్షు (రణ్‌దీప్ హుడా) ఇష్టపడితే ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. ఒకర్నొకరు తెలుసుకోవడానికి బాగుంటుందని హిమాన్షుని పికప్ చేసుకోవడానికి షైనాని ఎయిర్‌పోర్ట్‌కి పంపిస్తారు. రైలు ప్రయాణంలో షైనా తనకి లవ్‌లో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్తుంది. కిక్ కోసం ఏదైనా చేసే దేవీ లాల్ సింగ్‌ని (సల్మాన్) ప్రేమించానని, కానీ అతను తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని షైనా చెబుతుంది. పోలీస్ అయిన హిమాన్షు తన కెరీర్లో సాల్వ్ కాకుండా మిగిలిపోయిన పజిల్‌లాంటి డెవిల్ (సల్మాన్) అనే దొంగ గురించి ఆమెకి చెప్తాడు. షైనా ప్రేమించిన దేవీలాలే ఈ డెవిల్. అతనెందుకు దొంగగా మారాడు?
కళాకారుల పనితీరు:
ఈ సినిమా చూస్తున్నంత సేపు రవితేజని గుర్తు చేసుకోకపోతే… తన పరిధుల్లో సల్మాన్ ఈ పాత్రని బాగానే చేసాడని చెప్పాలి. సల్మాన్ స్టయిల్ని, మేనరిజమ్స్‌ని ఇష్టపడే వారికి సినిమా అంతటా కనుల పండుగే. సల్మాన్ స్టయిల్ని ఎలివేట్ చేసే ఆ మూమెంట్‌నీ డైరెక్టర్ వేస్ట్ చేయలేదు. జాక్వెలీన్ ఫెర్నాండెజ్ ఇంతకు ముందు వరకు చేసిన చిత్రాల్లో ఒకలా ఉంటే… ఇందులో మాత్రం ఏ లిస్ట్ యాక్ట్రెస్‌లా అనిపిస్తుంది. ఈ సినిమా ఆమెని సరాసరి టాప్ స్టార్స్ లీగ్‌లో నిలబెడుతుంది. రణ్‌దీప్ హుడా తన పాత్రని పర్ఫెక్ట్గా పోషించాడు. ఎక్కడా ఎక్కువ, తక్కువలు లేవు. నవాజుద్దీన్ సిద్దికీ ఉన్న కాసేపట్లో అదరగొట్టేసాడు. మిథున్ చక్రవర్తి, సౌరభ శుక్లా తదితరులు సపోర్టింగ్ రోల్స్‌లో తమ బాధ్యత నిర్వర్తించారు. నర్గీస్ ఫాక్రీ ఐటెమ్ సాంగ్ హాట్‌గా ఉంది. ఆమెకి డాన్స్ కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది.
సాంకేతిక వర్గం పనితీరు:
అయనంకా బోస్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అనిపిస్తుంది. హిమేష్ రేషమ్మియా సంగీతం కూడా బాగానే ఉంది. జుమ్మే కీ రాత్, హ్యాంగోవర్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ‘డెవిల్’ సీన్స్‌కి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. దర్శకుడిగా సాజిద్ నడియాడ్వాలా ఫర్వాలేదనిపించాడు. ఎంటర్టైన్మెంట్ని వదిలేసి ఎమోషన్స్‌పై, హీరోయిజంపై డిపెండ్ అవడం అతను చేసిన మిస్టేక్. ఒరిజినల్లోని కామెడీ హిందీ ఆడియన్స్ టేస్ట్‌కి సూట్ కాదు అనిపిస్తే ఆ స్థానంలో వినోదం పండిరచడానికి వేరే మార్గాలు అన్వేషించి ఉండాల్సింది కానీ పూర్తిగా ఆ బలాన్ని వదిలేసుకుని ఉండకూడదు.
విశ్లేషణ:
ఒరిజినల్ ‘కిక్’ చూసిన వారికి ఈ హిందీ రీమేక్ కిక్కివ్వడం కొంచెం కష్టమే. రవితేజకి టైలర్ మేడ్ క్యారెక్టర్ అయిన ఈ పాత్రని ఎవరు పోషించినా కానీ ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత తేలిక్కాదు. సల్మాన్‌ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా కానీ రవితేజతో పోలిస్తే ఈ పాత్రలో తేలిపోయాడు. అయితే ఇది ‘కిక్’ తెలిసిన తెలుగు ప్రేక్షకులకి కలిగే ఫీలింగ్ మాత్రమే. సల్మాన్ ఫాన్స్ ఎప్పట్లానే భాయ్ పర్ఫార్మెన్స్తో శాటిస్ఫై అయిపోతారు. వారి కిక్కుకేం లోటుండదు.
యాజిటీజ్‌గా రీమేక్ చేసేయకుండా కొన్ని మార్పు చేర్పులు చేసారు. రీమేక్‌లో మార్పులు చేస్తున్నప్పుడు ఒరిజినల్లో బెస్ట్ ఏదో, బ్యాడ్ ఏదో జడ్జ్ చేయడం చాలా అవసరం. ‘కిక్’కి పెద్ద ప్లస్ అయిన బ్రహ్మానందం క్యారెక్టర్ని హిందీ వెర్షన్లో పూర్తిగా తీసేసారు. దీంతో ఎంటర్టైన్మెంట్ నాలుగొంతులకి పడిపోయింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ కూడా తెలుగులో ఉన్నంత సహజంగా లేవు. ఇలియానా పాత్ర కూడా రవితేజతో సమానంగా రెబెల్లా ఉంటుంది తెలుగులో. కానీ హిందీలో ఆ యాంగిల్ మిస్ అయ్యారు. తెలుగు కంటే హిందీ రీమేక్‌లో బెటర్ అనిపించింది, బాగుందీ ఏంటంటే… నవాజుద్దీన్ సిద్దికీ చేసిన విలన్ క్యారెక్టర్. అసలే సూపర్ టాలెంటెడ్ యాక్టర్ ఏమో… తెరపై కనిపించినంత సేపు కిక్ ఇచ్చాడు. ఇది నిజం… సల్మాన్ ఫాన్స్‌ని మినహాయిస్తే.. మిగిలిన వారికి ఈ సినిమా పరంగా కిక్ ఇచ్చే పర్సన్ నవాజుద్దీన్ ఒక్కడే.
ఒరిజినల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ని బాగా తగ్గించేసి ద్వితీయార్థాన్ని బాగా ఎమోషనల్‌గా మార్చేసారు. ప్రీ క్లయిమాక్స్‌లో సల్మాన్ అదే పనిగా కన్నీళ్ల పర్యంతం అయిపోతుంటాడు. ఇక తెలుగు వెర్షన్లో రవితేజ క్యారెక్టర్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. హిందీ వెర్షన్లో ఆ కన్సిస్టెన్సీ మిస్ అయింది. బహుశా రవితేజ ఎనర్జీ లెవల్స్‌ని మ్యాచ్ చేయడానికి సల్మాన్ ఇబ్బంది పడ్డం వల్ల ఈ ఇబ్బందొచ్చి ఉండొచ్చు. ఒరిజినల్‌తో సరితూగే ఎంటర్టైనర్ కాకపోయినా కానీ ఇది ఖచ్చితంగా సల్మాన్ చేసిన ఇటీవలి రీమేక్స్ కంటే బెటర్ రీమేక్ అనేది మాత్రం ఒప్పుకోవాలి. వాంటెడ్ (పోకిరి), రెడీ కంటే కూడా ఈ రీమేక్ బాగుంది. సల్మాన్ నటించిన సాధారణ సినిమాలే కోట్లు కొల్లగొడుతున్నప్పుడు కాస్తో కూస్తో కాంటెంట్ ఉన్న ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టేయాలి. సల్మాన్ ఫాన్స్ అయితే కిక్ చూడాల్సిందే. కానీ రవితేజ కిక్కి ఫాన్స్ అయితే మాత్రం ఈ వెర్షన్ చూసొచ్చాక ఎంటర్టైన్మెంట్ పరంగా ఏర్పడిన ఆ లోటు పూడ్చుకోవడానికి ఒరిజినల్ని ఇంకోసారి చూసి తీరాల్సిందే.
బోటమ్ లైన్: భాయ్ ఫాన్స్‌కి మాత్రమే కిక్కు!
-జి.కె.