ఎమ్బీయస్‌ : అసూయకు మతం ముసుగు

లక్నోలో హెడాఫీసు వున్న ''అవధ్‌నామా'' అనే ఉర్దూ పత్రిక ముంబయి ఎడిషన్‌కు ఎడిటరుగా వున్న షిరీన్‌ దాల్వి అనే ఆమె ఆరు కేసులతో బాటు ప్రాణాలకు ముప్పు కూడా ఎదుర్కొంటోంది. ఎవరూ గుర్తు పట్టకూడదని…

లక్నోలో హెడాఫీసు వున్న ''అవధ్‌నామా'' అనే ఉర్దూ పత్రిక ముంబయి ఎడిషన్‌కు ఎడిటరుగా వున్న షిరీన్‌ దాల్వి అనే ఆమె ఆరు కేసులతో బాటు ప్రాణాలకు ముప్పు కూడా ఎదుర్కొంటోంది. ఎవరూ గుర్తు పట్టకూడదని బురఖా వేసుకునే అలవాటు కొత్తగా చేసుకుంది. ఉద్యోగం పోయింది, ఆమెను చంపినా పాపం లేదని సాటి ఉర్దూ పాత్రికేయులు అంటున్నారు. ఇంతకీ ఆమె చేసిన పాపం ఏమిటి? తాజా సంచికలో ''చార్లీ హెబ్డో'' ఉదంతం గురించి కథనం వేస్తూ, కవర్‌పేజీపై ఆ పత్రిక ముఖచిత్రంతో బాటు, వారు వేసిన కార్టూన్‌ ప్రచురించడం. ఆమె వేసిన కార్టూన్‌లో ప్రవక్త పేరు లేదు, ఆయనను అవమానపరిచే ధోరణీ లేదు. ఒక గడ్డపాయన దిగాలుగా కూర్చుని ''మూర్ఖులచేత ప్రేమించబడుతున్నందుకు బాధగా వుంది'' అంటూంటాడు. ముస్లిము ఉగ్రవాదులు మూర్ఖంగా మతం పేర హింసకు పాల్పడి ప్రవక్తకు చెడ్డపేరు తెస్తున్నారన్న వ్యంగ్యం మాత్రమే అందులో వుంది. దానితో బాటు ఆ కార్టూన్లను నిరసిస్తూ యిచ్చిన పోప్‌ కొటేషన్‌ – 'భావప్రకటనా స్వేచ్ఛకు కూడా పరిమితులున్నాయి, మతవిశ్వాసాలను వెక్కిరించడానికి దాన్ని వాడకూడదు' కూడా వేసింది. పైగా గొడవ రాగానే ఆమె లిఖితపూర్వకమైన క్షమాపణ చెప్పింది. అయినా సద్దు మణగడం లేదు. చార్లీ హత్యలకు దారి తీసిన కార్టూన్లను అనేక పత్రికలు, వెబ్‌సైట్‌లు వేశాయి, అనేక టీవీలు చూపాయి, వాళ్లెవరికీ రాని హెచ్చరికలు యీమెకు రావడానికి కారణం వృత్తిపరమైన అసూయ అంటున్నారు.

షిరీన్‌ ఉత్తర ముంబయి శివార్లలోని కౌసాలో నివసించే మధ్యతరగతి ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. ఆ కుటుంబాల్లో నాల్గో తరగతి దాటి ఆడపిల్లల్ని చదివించరు. కానీ ఆమె డిగ్రీ చదివింది. విద్యార్థినిగా వుండగానే వ్యాసాలు రాసి ఉర్దూ పత్రికలకు పంపేది. వారు వేసేవారు కూడా. అబ్దుల్లా కమాల్‌ అనే ఉర్దూ కవిని పెళ్లాడాక అతని ప్రోత్సాహంతో 'ఉమై వాజ్‌దాన్‌' అనే కలంపేరుతో ఆమె రాస్తూ వుండేది. అతను పోయిన తర్వాత షిరీన్‌ దాల్వి పేరుతో ప్రఖ్యాతి కెక్కింది. సాజిద్‌ రషీద్‌ అనే ఉదారవాద ముస్లిం సంపాదకుడుగా నడిపే ''సహఫత్‌'' అనే ఉర్దూ పత్రికలో సహసంపాదకురాలిగా చేరింది. రషీద్‌ హఠాత్తుగా మరణించినపుడు ఛాందస ముస్లిం జర్నలిస్టుల సంస్థ 'ఫోరమ్‌ ఎగెనెస్ట్‌ బ్లాస్‌ఫెమీ' అంత్యక్రియలను బహిష్కరించింది. ఆ సంస్థకు నాయకుడుగా వున్న జుబైర్‌ అజ్మీయే షిరీన్‌పై మొదటి కేసు పెట్టిన ప్రబుద్ధుడు. షిరీన్‌ ప్రతిభను గుర్తించిన ''అవధ్‌నామా'' తన ముంబయి ఎడిషన్‌కు ఆమెను సంపాదకురాలిని చేయడంతో వారందరికీ కడుపు మండింది. దేశంలోని ఉర్దూ పత్రికలలో దేనికీ ఒక మహిళ సంపాదకురాలిగా లేదు. ఆ పదవిపై ఆశ పెట్టుకుని భంగపడిన నిహాల్‌ సాగిర్‌ అనే సహోద్యోగి యిప్పుడు షిరీన్‌పై నింద మోపుతున్నాడు. ''ఆ కార్టూన్‌ వేయవద్దని నేను చెప్పినా ఆమె వినలేదు, 'మనం విశాలదృక్పథం కలిగి వుండాలి, మహా అయితే కొందరు ఛాందసులు కొన్ని కాపీలు తగలబెడతారంతే' అని కొట్టి పారేసింది.'' అని ఒక యింటర్వ్యూలో చెప్పాడు. ''అది అబద్ధం, మా ఆఫీసులో ఎవరూ ఏమీ అనలేదు. డిటిపి ఆపరేటరైనా సరే యిదేమిటమ్మా అని వుంటే మానేసేదాన్ని'' అంటోంది షిరీన్‌. 

కార్టూన్‌ వెలువడ్డాక మౌల్వీలు, ముల్లాలు, మతవాద సంస్థలు నిరసనలు తెలిపాయంటే, కేసులు పెట్టాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ యీ విషయంలో కేసులు పెట్టి అల్లరి చేస్తున్నదంతా జర్నలిస్టులే! ఉర్దూ పత్రకార్‌ సంఘ్‌కు అధ్యకక్షుడిగా వున్న ఇజార్‌ అహ్మద్‌ ''ఆమె చేసిన నేరం క్షమార్హం కానే కాదు. దానికి  తగిన శిక్ష మృత్యుదండన మాత్రమే. పోనీ కదాని మేం ఇండియన్‌ చట్టాల ప్రకారం శిక్ష విధించమని మాత్రమే కోరుతున్నాం. అది ఆమె అర్థం చేసుకోవాలి.'' అన్నాడు. ఈ గొడవ బయటకు రాగానే ''అవధ్‌నామా'' తన ముంబయి ఎడిషన్‌ మూసేసి, ఉద్యోగులందరినీ యింటికి పంపేసి, చేతులు కడిగేసుకుంది. షిరీన్‌ ఒంటరిగానే కేసులన్నీ ఎదుర్కోవాలి. ఆమెకు అండగా ముస్లిం మేధావులు, ముస్లిం సంస్థలు నిలిచాయి. ''మన విశ్వాసాలు దెబ్బ తినేలా ఎవరైనా కార్టూన్‌ వేసినా, వ్యాసం రాసినా మనం ఆ పత్రికను కొనడం మానేయవచ్చు, చదవడం మానేయవచ్చు, యాడ్స్‌ యివ్వడం మానేయవచ్చు. నిరసనగా లేఖలు రాయవచ్చు, వారికి ప్రతిగా మనమే కార్టూన్లు వేయవచ్చు, లేదా మనమే ఒక పత్రిక పెట్టవచ్చు. అంతేకానీ జర్నలిస్టులను, రచయితలను వెంటాడి వేధించడం తప్పు.'' అంటున్నారు వాళ్లు. పోలీసులు ఆమెను ఫిబ్రవరి 4 న అరెస్టు చేయగా కోర్టు బెయిలు యిచ్చింది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]