ఎమ్బీయస్‌: బాబాయ్‌-అబ్బాయ్‌.. ఆపై అమర్‌

యుపిలో పెద్ద పార్టీ ఐన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో పుట్టిన ముసలానికి యివాళ సాయంత్రం ములాయం తెర దించడానికి రాజీ ఫార్ములా సూచించినట్లు తాజా వార్త. దీనిలో వున్న ముగ్గురు ముఖ్యపాత్రలు పైన శీర్షికలోనే వచ్చేశారు.…

యుపిలో పెద్ద పార్టీ ఐన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో పుట్టిన ముసలానికి యివాళ సాయంత్రం ములాయం తెర దించడానికి రాజీ ఫార్ములా సూచించినట్లు తాజా వార్త. దీనిలో వున్న ముగ్గురు ముఖ్యపాత్రలు పైన శీర్షికలోనే వచ్చేశారు.

అఖిలేశ్‌ ఎలాటి గడ్డుపరిస్థితుల్లో యుపి ప్రభుత్వం నడుపుతున్నాడో 'సగకాలం తాపీ- సగకాలం ఆదుర్దా' అనే (లింకు)లో వివరించాను.

ఏడు నెలల్లో ఎసెంబ్లీ ఎన్నికలున్నాయి. తన తండ్రి గతంలో పాలించినట్లే పాలిస్తే ఓటమి ఖాయం అని తెలిసిన అఖిలేశ్‌ తన మార్గంలో వెళదామని చూస్తున్నాడు. దానికి ఆదరణ కూడా రాసాగింది. అది ములాయం సోదరులకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్లు ములాయం తరహా ఆటవిక పాలనకే అలవాటు పడ్డారు. ఎలాగోలా కులబలంతో, కండబలంతో ఎన్నికలు నెగ్గాలి తప్ప అభివృద్ధి, ఆనపకాయ అంటే ప్రజల తలకెక్కదని వారి ఉద్దేశం.

ములాయం మళ్లీ సిఎం అయి వుంటే వారికి హాయిగా వుండేది. కానీ అఖిలేశ్‌కు యువతలో వున్న పాప్యులారిటీ చూసి ములాయం ఆఖరి నిమిషంలో కొడుక్కి గద్దె అప్పచెప్పాడు. నిజానికి ములాయంకు అక్షరాలా వారసుడు తమ్ముడు శివపాల్‌. ములాయం ఢిల్లీలో చక్రం తిప్పుతూ వుంటే అతని నియోజకవర్గంలో క్యాడర్‌ను కాపాడుకునే పనులన్నీ శివపాలే చూస్తాడు. అతనివి పాత తరహా రాజకీయాలు కాబట్టి సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు అతని వద్దకే వెళతారు. అఖిలేశ్‌ ముఖ్యమంత్రి, సెక్యూరిటీ ఎక్కువ. పైగా ఎంత హిందీలో మాట్లాడినా విద్యావంతుడు, నాగరికుడు, హింసా రాజకీయాలను నిరసిస్తాడు, తనపై అవినీతి మచ్చరాకుండా చూసుకుందామని తాపత్రయపడతాడు. అందువలన వాళ్లకు అతను పరాయివాడిగా అనిపిస్తాడు. 

తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనందుకు శివపాల్‌ అలిగితే, ములాయం అతనికి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ యిచ్చి ఊరుకోబెట్టాడు. అఖిలేశ్‌ మంత్రివర్గంలోని చాలా శాఖలు అతని అనుయాయులతోనే నింపాడు. వీళ్లందరూ కలిసి అఖిలేశ్‌కు కాలుచేతులు ఆడకుండా చేశారు. చేసేదేమీలేక అఖిలేశ్‌ అలాగే కాలక్షేపం చేసుకుంటూ వచ్చాడు కానీ 2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో అతని కళ్లు విచ్చుకున్నాయి. ఇక మిగిలిన సగకాలం కాస్త అభివృద్ధి చూపించి పేరు తెచ్చుకుందామనుకున్నాడు.

అవినీతిని, అరాచకాన్ని క్షమించనని ప్రజలకు చూపాలని కంకణం కట్టుకున్నాడు. శివపాల్‌ తదితరులు అఖిలేశ్‌కు అడ్డుకట్ట వేయడానికి తమ పాతమిత్రుడు అమర్‌ సింగ్‌ను పార్టీలోకి మళ్లీ లాక్కుని వచ్చారు.  ములాయంతో సహా అందర్నీ తిట్టి, బయటకు వెళ్లి నానారకాల ప్రయోగాలు చేసి, ఫెయిలయి, ఆరేళ్ల తర్వాత తిరిగి వచ్చిన అమర్‌ అంటే అఖిలేశ్‌కు పడదు. పార్టీలోకి తీసుకోవద్దని చెప్పాడు, కానీ ములాయం వినలేదు. పైగా మే నెలలో అతన్ని రాజ్యసభ సభ్యుణ్ని చేశాడు.

జూన్‌ నెలలో ముఖ్తార్‌ అన్సారీ నేతృత్వంలోని 'క్వామీ ఏక్తా దళ్‌' అనే పార్టీని, తూర్పు యుపిలో ముస్లిం ఓట్లు పడతాయనే కారణం చూపి ఎస్పీలో విలీనం చేద్దామని శివపాల్‌ ప్రయత్నించాడు, ములాయం, ఆజం ఖాన్‌ ఔనన్నారు. కానీ నేరచరిత్ర వున్నవాళ్లు చాలామంది వున్న పార్టీని చేర్చుకోవడం కంటె బూత్‌ లెవెల్లో మన పార్టీ వాళ్లే కష్టపడితే మంచిదంటూ విలీనాన్ని అఖిలేశ్‌ అడ్డుకున్నాడు. రాబోయే ఎన్నికలలో టిక్కెట్లు యిచ్చే అధికారం తన దగ్గర పెట్టుకుని రికార్డు కాస్త బాగున్నవాళ్లకి యిద్దామని ఉద్దేశపడుతున్నాడు. అదే శివలాల్‌ యిత్యాది ములాయం హార్డ్‌కోర్‌ అనుచరులకు కంటగింపు అయింది.  

పార్టీలోకి వచ్చాక కొద్దికాలమైనా అణగి వుండే వుద్దేశం అమర్‌కు లేదు. ఆగస్టు 10న ఢిల్లీలో పెద్ద పార్టీ యిచ్చాడు. దాన్ని అఖిలేశ్‌ ఎగ్గొట్టాడు. అఖిలేశ్‌కు యిష్టం లేదని తెలిసి కూడా ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా వున్న దీపక్‌ సింఘాల్‌ హాజరయ్యాడు. అసలతన్ని చీఫ్‌ సెక్రటరీ చేయడమే అఖిలేశ్‌కు యిష్టం లేదు. ఎందుకంటే యిరిగేషన్‌ సెక్రటరీగా పనిచేసే రోజుల్లో అతను శివపాల్‌కు ఆప్తుడు. అతనే యితన్ని.జులైలో అఖిలేశ్‌పై రుద్దాడు. ఈ పదవిలోకి వచ్చాక కూడా దీపక్‌ శివపాల్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు తప్ప అఖిలేశ్‌ను లెక్క చేయడం లేదనడానికి యిది తాజా ఉదాహరణ. అఖిలేశ్‌ మండిపడ్డాడు, ఆగస్టు 13న దీపక్‌ సింగ్‌ను పదవిలోకి వచ్చిన రెండు నెలలు పూర్తి కాకుండానే బదిలీ చేశాడు. 

ఇది తనకు జరిగిన అవమానంగా భావించాడు శివపాల్‌. అన్నగారి దగ్గరకు వెళ్లి యిలా అయితే తన అనుచరులకు రాబోయే ఎన్నికలలో టిక్కెట్లు యిప్పించుకోవడం అసాధ్యంగా అనిపిస్తోందని ఫిర్యాదు చేశాడు. అయితే అఖిలేశ్‌ స్థానంలో పార్టీ యుపి శాఖకు అధ్యక్షుడిగా నిన్నే వేస్తున్నాను, టిక్కెట్ల పంపిణీ నీ యిష్టం అన్నాడు ములాయం. శివపాల్‌ అధ్యక్షపదవి ప్రకటనను ములాయం కజిన్‌, అఖిలేశ్‌ పక్షపాతి ఐన రాంగోపాల్‌ యాదవ్‌ చేత చేయించారు. 'పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నువ్వు యీ నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి కుండే హక్కులు వుపయోగించి నేనూ ఓ నిర్ణయం తీసుకుంటా అంటూ అఖిలేశ్‌ బాబాయి నుంచి ముఖ్యమైన శాఖలు వెనక్కి తీసేసుకున్నాడు. వీళ్లిద్దరి మధ్యనే వ్యవహారం నలుగుతూంటే ఏమయ్యేదో తెలియదు కానీ మధ్యలో యింకోటి జరిగింది. 

గాయత్రీ ప్రసాద్‌ ప్రజాపతి అనే మైనింగ్‌ మంత్రిపై అక్రమంగా గనుల తవ్వకం, అక్రమ సంపాదన ఆరోపణలు వచ్చాయి. అలహాబాదు హై కోర్టు వాటిపై విచారించి సిబిఐ విచారణకు ఆదేశించింది. అటువంటి కళంకితుడు మంత్రివర్గంలో వుంటే ప్రతిపక్షాలకు మంచి ఆయుధం అందించినట్లే అని భావించిన అఖిలేశ్‌ అతన్ని సోమవారం కాబినెట్‌లోంచి తీసేశాడు. తీసేసేముందు తండ్రికి మాట మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ములాయం రెండో భార్య  సాధనా గుప్తా కుమారుడైన ప్రతీక్‌ యాదవ్‌ది రియల్‌ ఎస్టేటు వ్యాపారమే అయినా, మైనింగ్‌ వ్యాపారం కూడా చేస్తున్నాడని వినికిడి. అతని భార్య అపర్ణ 2017 ఎన్నికలలో లఖ్‌నవ్‌ నుంచి పోటీ చేద్దామని చూస్తోంది. అతనికి ప్రజాపతికి లింకులున్నాయట. సాధనాకు సవతి కొడుకు అఖిలేశ్‌ అంటే పడదు కానీ శివపాల్‌తో సత్సంబంధాలే వున్నాయి. వాళ్ల సిఫార్సు మేరకే ఇరిగేషన్‌ శాఖ నుంచి అతన్ని మైనింగ్‌కు మార్చవలసి వచ్చింది. అతనిపై లోకాయుక్త విచారణ కూడా సాగుతోంది.

''పదేళ్లలో బిపియల్‌ (దారిద్య్రరేఖకు దిగువ వుండేవాళ్లు) నుండి బిఎండబ్ల్యుకు చేరాడతను'' అని అమర్‌ ఉజాలా పత్రిక రాసింది. ప్రజాపతితో బాటు అఖిలేశ్‌ పంచాయితీ రాజ్‌ మంత్రి ఐన రాజ్‌ కిశోర్‌ సింగ్‌ను కూడా తీసేశాడు. తన నియోజకవర్గంలో అక్రమంగా భూమి ఆక్రమించాడని అతనిపై ఆరోపణలున్నాయి. సాధన చేసిన ఫిర్యాదు మేరకు శివపాల్‌ ప్రజాపతిని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టాడు. అఖిలేశ్‌ కుదరదన్నాడు. దాంతో శివపాల్‌ రాష్ట్ర అధ్యక్షపదవికి, మంత్రి పదవికి రాజీనామాలు చేసి అన్నగారికి పంపాడు. అతనితో పాటు అతని భార్య సరళ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి, కుమారుడు ఆదిత్య యుపి కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామాలు చేసి పంపారు. 

వీటన్నిటి వెనుక అమర్‌ సింగ్‌ పన్నాగం వుందని అందరూ అనుకునే మాట. 'ఇది కుటుంబ వ్యవహారమైతే సమసిపోయేది, కానీ బయటివాళ్లు జోక్యం చేసుకుంటున్నారు' అన్నాడు అఖిలేశ్‌. ఆ బయటి వ్యక్తి మీరేనా అని అమర్‌ను అడిగితే 'అఖిలేశ్‌ నాకు పుత్రసమానుడు. నాకు వ్యతిరేకంగా యిప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు' అని చెప్పుకున్నాడతను.

'అమర్‌ సింగ్‌ హస్తమేమీ లేదు, అఖిలేశ్‌ తన తండ్రిని చూసి నేర్చుకోవలసినది చాలా వుంది, మేమంతా నేర్చుకోలేదా!?' అన్నాడు శివపాల్‌. వ్యవహారం యీ దశకు వచ్చాక ములాయం ఏదో ఒకటి చేయక తప్పదని శివపాల్‌ను, అఖిలేశ్‌ను పిలిపించి మాట్లాడాడు.  రాజీ కుదిర్చాడు. ఎందుకంటే పార్టీవ్యవస్థాపరంగా అతనికి శివపాల్‌ కావాలి, పాలనాపరంగా కొడుకు కావాలి. రాజీ ఫార్ములా ప్రకారం శివపాల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతాడు కానీ టిక్కెట్ల పంపిణీలో అఖిలేశ్‌ మాట చెల్లుతుంది. శివపాల్‌కు కాబినెట్‌లో తిరిగి చేరతాడు. అతని శాఖలన్నీ అతనికి దక్కుతాయి. ఆ విధంగా తమ్ముణ్ని, కొడుకుని చల్లార్చాడు. ప్రజాపతిని, రాజ్‌ కిశోర్‌ని అఖిలేశ్‌ మంత్రివర్గంలోకి వెనక్కి తీసుకుంటాడు కానీ పాత శాఖలు యివ్వడు, వేరే శాఖలు అప్పచెపుతాడు. ఆ విధంగా రెండో భార్య కోరిక తీర్చాడు ములాయం.

అంతా బాగానే వుంది కానీ శకుని పాత్ర పోషించిన అమర్‌ మాటేమిటి? అనడిగాడు అఖిలేశ్‌. అదుపు చేస్తా, విభేదాలు పుట్టించడానికి చూశాడని తేలితే చర్య తీసుకుంటా అని ములాయం హామీ యిచ్చాడు. 'ములాయం పార్టీకి నిధులిస్తున్నది ప్రజాపతే, నన్ను బయటపెడితే మీ అందరి అవినీతి బయటపెడతా' అని అతను బెదిరించి వుంటాడు. అందుకే ములాయం యింత హడావుడి పడ్డాడు, రాజీ ఫార్ములా గురించి బయటకు వచ్చి చెప్పేటప్పుడు అందరి కంటె ముందు ప్రజాపతి గురించి చెప్పడంలోనే అతని ఆదుర్దా తెలుస్తోంది' అంటున్నారు పాత్రికేయులు.

ఇదీ నేటి పరిస్థితి. ఇది ఆచరణలో ఏ మేరకు అమలవుతుందో వేచి చూడాల్సిందే. పాత పద్ధతుల్లో రాటుదేలిన ములాయం కుటుంబానికి, పార్టీ రూపురేఖలు మారుద్దామంటూ అఖిలేశ్‌ తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు మింగుడు పడక, మళ్లీ రోడ్డున పడవచ్చు.

ఎస్పీ బలహీనపడితే యితర పార్టీలపై ప్రభావం ఎలా పడుతుంది అనే దానిపై కూడా చర్చలు సాగుతున్నాయి. గతంలో కొన్ని వర్గాలు కొన్ని పార్టీలకు ఓట్లేస్తూ వచ్చాయి. కానీ యీసారి అందరూ ఓటు బ్యాంకుల చీలికలపై ఆధారపడుతూ వున్నారు. ముస్లింలు ఎస్పీ, బియస్పీ, కొంత మేరకు కాంగ్రెస్‌ మధ్య చీలుతున్నారు.

బ్రాహ్మణులు 2007లో బియస్పీకి, 2012లో అఖిలేశ్‌కు, 2014లో బిజెపికి వేశారు. ఇప్పుడు వాళ్లూ కాంగ్రెస్‌, బిజెపిల మధ్య చీలుతున్నారు. బియస్పీ కూడా వారిని 'బ్రాహ్మణులు శంఖం పూరిస్తారు, మదగజం ముందుకు సాగుతుంది' అనే నినాదంతో ఆకట్టుకుందామని చూస్తోంది. బిసిలలో యాదవులు ఎస్పీవైపు వున్నా బిజెపి తక్కినవారిని చీల్చి తనవైపు తిప్పుకుందామని చూస్తోంది. దళితుల్లో కూడా కొన్ని వర్గాలు 2014లో బిజెపికి వేశాయి. ఇలా బిజెపి అన్ని వర్గాలలోని చీలిక ఓట్లతో గెలుద్దామని చూస్తోంది. ముస్లిములు ఎస్పీ, బియస్పీల మధ్య చీలిపోతే వారికి లాభం. కానీ యీ అంతఃకలహాల వలన ఎస్పీ బలహీనపడిందని తోచి ముస్లిములు బిజెపిని అడ్డుకోవడానికి బియస్పీకి గంపగుత్తగా ఓటేస్తే అప్పుడు మాయావతి ఏ 35% ఓట్లతోనే గెలుస్తుందని ఒక అంచనా. దీనికి విపర్యంగా యింకో ఆలోచన కూడా సాగుతోంది. 'ములాయం  సోదరుల పాత ధోరణికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు అఖిలేశ్‌పై అభిమానం పుట్టుకుని వచ్చి పార్టీల కతీతంగా యువత, మధ్యతరగతి ఓట్లేస్తే ఎస్పీయే గెలవవచ్చు. ఈ లెక్కల్లో కాంగ్రెసును ఎక్కడా సోదిలోకి తీసుకురాకుండా వున్నారు. పోనుపోను అది బలం పుంజుకుంటే ఎవరి ఓట్లు చీల్చుకుంటుందో అదీ తెలియదు. ఈ చతుర్ముఖ పారాయణం రసవత్తరంగా సాగే సూచనలే కనబడుతున్నాయి. – ఎమ్బీయస్‌ ప్రసాద్‌