ఎమ్బీయస్‌ : బాలకార్మిక వ్యవస్థ – 2

నాకేదో దూరదృష్టి వుందని, యిలాగే జరుగుతుందని ముందే వూహించానని నేను అనటం లేదు. నేను జ్ఞానార్థిని కాబట్టి, రాజకీయాలు చాలాకాలంగా చూస్తూ వస్తున్నాను కాబట్టి సందేహాలు ఎక్కువ. ఆ పాటి సందేహాలను కూడా వెలిబుచ్చకూడదనడం…

నాకేదో దూరదృష్టి వుందని, యిలాగే జరుగుతుందని ముందే వూహించానని నేను అనటం లేదు. నేను జ్ఞానార్థిని కాబట్టి, రాజకీయాలు చాలాకాలంగా చూస్తూ వస్తున్నాను కాబట్టి సందేహాలు ఎక్కువ. ఆ పాటి సందేహాలను కూడా వెలిబుచ్చకూడదనడం భావనియంతృత్వం. నా వ్యాసాల్లో గత చరిత్ర స్పష్టంగా రాస్తాను కానీ వర్తమానం గురించి, భవిష్యత్తు గురించీ ఏదీ యితమిత్థంగా వుండదు. ఇలా కావచ్చేమో, అలా కావచ్చేమో, తెలియదు, వేచి చూడాలి అనే రాస్తూంటాను. పాఠకుల ఆలోచనాపరిధిని పెంచడమే నా లక్ష్యం. 'సహనా భవతు..' శ్లోకం నాకు చాలా యిష్టం. ఈ కాలమ్‌ మొదలుపెట్టినపుడు దాన్ని కోట్‌ చేస్తూ విద్వేషాలు లేకుండా అందరం కలిసి నేర్చుకుందాం అనే చెప్పాను. చలసాని నరేంద్ర తన వ్యాసంలో యిలా రాశారు అని రాస్తూ 'ట' తెగ ప్రయోగించాను. ఎందుకంటే నాకూ వాస్తవాలు తెలియవు కనక. పాఠకుల్లో ఎవరైనా ఆ విషయాలపై పరిశోధించి నరేంద్ర రాసినది తప్పు అని రాసి వుంటే ఓహో అనుకునేవాణ్ని. ఆ పరిశోధనేదో నేనే చేయాలట. నేను చేసి వుంటే ఆ ముక్క రాసేవాణ్నిగా – సింగపూర్‌ పేపర్లలో ఆంధ్ర రాజధాని గురించి జి-టు-జి గురించి లేదు అని రాసినట్లు! నరేంద్ర చెప్పిన విషయాలపై లోతుగా అన్వేషించకపోగా ఆయన్ని నిందించారు కొందరు. ఆయన సమర్థత తెలియదు అన్నారు, ఆయనవి చవట ఆలోచనలు అన్నారు. 

నిజానికి నాకూ ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆంధ్రభూమిలో ఆయన వ్యాసాలు చదువుతూ వుంటాను. కాస్త రైటిస్టు భావాలున్నా విషయం వుంటుంది. ఆయనను తీసిపారేసేవాళ్లు మొదట ఆయన గురించి కక్షుణ్ణంగా తెలుసుకోవాలి కదా. మనకు నచ్చని అభిప్రాయం చెప్పాడు కదాని తిట్టేస్తే ఎలా? ఆయన రాసినది పరిపూర్ణ సత్యమని నేను ఎక్కడా రాయలేదు. అసలు సత్యాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో రాయడానికే వ్యాసంలో మొదటి పేరా వెచ్చించాను. నరేంద్ర వ్యాసం చదివాక నాకు సత్యార్థిపై ఆసక్తి నశించిందని రాశాను తప్ప ఆయనను తప్పుబట్టలేదు. పాఠకుల్లో ఒకాయన 'ఆయన పట్ల నీకు గౌరవం పోయిందని (లాస్ట్‌ రెస్పెక్ట్‌ ఫర్‌ హిమ్‌) రాశావు అని రాశారు. ఆసక్తికి, గౌరవానికి తేడా తెలియకుండానే యీయన వ్యాసాలు చదువుతున్నారా? సత్యార్థిని ఏమనడానికి నోరు రాక 'ప్రస్తుతానికి అభినందించడం లేదు, అందుకే అభినందించాలని తోచటం లేదు. ఆయన నిజంగా మంచివాడుగా తేలితే అప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి ఫింగర్స్‌ క్రాస్‌డ్‌.' అని నా మానసిక సందిగ్ధతను రాసినా యిలా పెడర్థాలు తీయడమేమిటో! సత్యార్థి బహుమతిప్రదానం ఫంక్షన్‌ చూడకపోతే, చప్పట్లు కొట్టకపోతే నేను థర్డ్‌ రేట్‌ క్రిమినల్‌ అయిపోతానా? అసలు మలాలాకు గాని, సత్యార్థికి గాని 'శాంతి' బహుమతి ఎందుకిచ్చారో నాకు అర్థం కాలేదు. మలాలాకు సాహసవంతురాలు అవార్డు యివ్వాలి, సత్యార్థికి సామాజిక కార్యకర్త అవార్డు యివ్వాలి. అంతేగాని శాంతి అవార్డు ఏమిటో? ఏమో! 

పాఠకులు లేవనెత్తిన అభ్యంతరాల గురించి రెండు ముక్కలు – సామాజిక సంస్థలన్నీ (ఎన్‌జిఓ) పులుకడిగిన ముత్యాలని అనుకోవద్దు. మోదీ ప్రభుత్వం వాటిపై ఆంక్షలు విధించబోయినప్పుడు చాలా పత్రికలు కవర్‌ స్టోరీలు రాశాయి. వాటితో సీరీస్‌ రాద్దామని భద్రపరచాను. అప్పుడు చాలా విషయాలు చెప్తాను. ఇవాళ పేపర్లో వచ్చిన ఒక విషయం రాస్తున్నాను చూడండి – సాలీనా కోటి రూపాయల కంటె ఎక్కువ విదేశీ సాయం పొందే స్వచ్ఛంద సేవా సంస్థలు ఎఫ్‌సిఆర్‌ఏ (2010) చట్టం క్రింద తప్పకుండా హోం శాఖకు తమ రిటర్న్‌స్‌ పంపాలి. తెలుగు రాష్ట్రాలలో రిజస్టరైన 5200 సంస్థల్లో 2012-13 సంవత్సరానికి కేవలం 1800 సంస్థలు మాత్రమే పంపాయి. అవి తమకు వెయ్యి కోట్లు విరాళాలు వచ్చాయని చెప్పాయట. రిటర్న్‌స్‌ ఫైల్‌ చేయని మిగతా వాటికి ఎంత వచ్చాయో ఏమో!  దేశవ్యాప్తంగా 2011-12 సం||రానికి యీ రిటర్న్‌స్‌ ఫైల్‌ చేయని 4139 ఎన్‌జిఓల గుర్తింపు రద్దు చేశారు. వాటిలో 670 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వున్నాయి. విదేశీ సాయం అందుకునే ఎన్‌జిఓలు దేశం మొత్తం మీద ఎన్నో తెలుసా? 42,529! వీరిలో ప్రతి ఒక్కరూ సమాజాన్ని ఉద్ధరించేస్తున్నారనే అనుకోవాలా? వీరిపై ప్రశ్నలు లేవనెత్తడం పాపమా? సందేహం వ్యక్తపరిస్తే 'నువ్వేం చేశావ్‌?' అని దబాయించడం సరి కాదు. పైకి ఉదాత్తమైన ఆశయం కనబరుస్తూనే వెనుక వేరే రకమైన ఆలోచనలు వుండడం యీ ఎన్‌జిఓలకు వింతేమీ కాదు. సేవాసంస్థల ముసుగులో మతమార్పిడులు జరుగుతున్నాయని గమనిస్తూనే వున్నాం.  పైకి ఉదాత్తమైన ఆశయం కనబరుస్తూనే వెనుక వేరే రకమైన ఆలోచనలు వుండడం వింతేమీ కాదు. సేవాసంస్థల ముసుగులో మతమార్పిడులు జరుగుతున్నాయని గమనిస్తూనే వుంటాం. 

రెండోది – సత్యార్థి సంస్థకు అమెరికా, యూరోప్‌ దేశాల మద్దతు వుందని, పాశ్చాత్య కంపెనీలకు మేలు చేస్తున్నాడన్న ఆరోపణ వుందని నేను రాశాను. అమెరికాకు ఆ అవసరం లేదని ఒకాయన, అమెరికా మాన్యుఫేక్చరింగ్‌ యిండస్ట్రీ ఎప్పుడో చచ్చిపోయిందని మరొకాయన రాశారు. మరి యూరోప్‌ సంగతేమిటి? దాని గురించి రాయలేదేం? ఫార్మా రంగంలో భారత కంపెనీల పోటీ తట్టుకోలేక పాశ్చాత్య దేశాలు ఆడే నాటకాల గురించి నాకు బాగానే పరిజ్ఞానం వుంది. అలాటివి తక్కిన రంగాల్లో కూడా వుండడానికి అవకాశం వుంది. ఇరాక్‌ పై దాడి చేయడానికి  అణ్వాయుధాలు వున్నాయన్న ఆరోపణ చేసి ఆ దేశాన్ని దుంపనాశనం చేశాక లేవని ఒప్పుకున్నారు. బ్రిక్‌ దేశాల్లో ఒకటైన భారత్‌ పురోగతిని అడ్డుకోవడానికి వాళ్లు ఏ మార్గమైనా తొక్కగలరన్న అవగాహన మనకు లేకపోతే ఎలా? లేని అణ్వాయుధాలనే దివ్యదృష్టితో కాంచగలిగినవారు భారత కర్మాగారాల్లో ప్రత్యక్షంగా కనబడుతున్న బాలకార్మికులను కనుగొనలేరా? దాన్ని తమకు అనువుగా మలచుకోలేరా? బాలకార్మికులున్న పరిశ్రమలకు ఉదాహరణగా బాణసంచా, తివాచీ అని రాస్తే వాటి ఎగుమతులెంత అన్నారొకాయన. బీడీ పరిశ్రమలో లేరా? గనుల్లో లేరా? నిర్మాణరంగంలో లేరా? ఎక్కడ పడితే అక్కడే వున్నారు వాళ్లు. 

ఇక బాలకార్మిక వ్యవస్థ గురించి నా అభిప్రాయాలు – 'జీవనప్రమాణాలు పెరిగితే తప్ప ఆ దుర్మార్గపు వ్యవస్థ పోదు.' అని నేను వ్యాసంలోనే రాసినా నేను దాన్ని సమర్థిస్తున్నానని అర్థం తీస్తే ఏమనాలి? మా యింట్లో ఎప్పుడూ బాలకార్మికులు పనిచేయలేదు. నేను ఉద్యోగాలు యిచ్చినపుడు కూడా బాలకార్మికులకు యివ్వలేదు. ఆ వ్యవస్థపై నా అభిప్రాయాలు తెలిపే సందర్భం ఒకసారి వచ్చింది. 2003లోనో, 2004లోనో నేను ''హాసం'' పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌గా వుండగా మఱ్ఱి చెన్నారెడ్డి ఎచ్‌ఆర్‌డి సంస్థలో బాలకార్మిక సమస్యపై జరిగే సదస్సుకు ఆహ్వానం వచ్చింది. మా పత్రికకు, ఆ అంశానికి సంబంధం లేదు కాబట్టి రానన్నాను. 'సమాజంలో యితరులను ప్రభావితం చేసేవారందరినీ పిలుస్తున్నాం. మిమ్మల్ని సెన్సిటివైజ్‌ చేయడమే మా లక్ష్యం' అన్నారు. 'నాహం కర్తా..' రచయిత పివిఆర్‌కె ప్రసాద్‌గారు ఆ సంస్థకు అధిపతిగా వున్నారు కాబట్టి వారిని కలిసే ఉద్దేశంతోనే వెళ్లాను. రోజంతా సదస్సు జరిగింది. 40 మంది దాకా సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నన్నూ మాట్లాడమన్నారు. ఆ పెద్దల మధ్య నోరు విప్పడానికి జంకుతూనే కొన్ని అంశాలు చెప్పాను. ఈ కోణం బాగుందని వారు ప్రశంసించారు. నాకు ధైర్యం వచ్చి ఆ కోణంలో వ్యాసం రాసి బాలకార్మిక వ్యవస్థపై వారిచ్చిన గణాంకాలు చేర్చి కొన్ని పత్రికలకు పంపాను. 'ఇది పాత సమస్య. దీనిపై ఎంత రాసినా, వేసినా వేస్టు. వ్యవస్థ ఏమీ మారదు' అని వారు నోరు చప్పరించేశారు. ఆ వ్యాసం మూలపడింది. దాన్ని వెలికితీద్దామని చూశాను, కానీ అది పాత సాఫ్ట్‌వేర్‌లో రాశాను. ఫైల్‌ ఓపెన్‌ కాలేదు. దానిలో కొన్ని ముఖ్యాంశాలు రాస్తాను.

బాలకార్మిక వ్యవస్థ వలన జరిగే అనర్థాలు – 1) సమాజంలో అన్‌స్కిల్‌డ్‌ లేబర్‌ పెరగడం. మెకానిక్‌ వద్ద చిన్న పిల్లలు చేరతారు. మన వాహనాలపై ప్రయోగాలు చేస్తూ పని నేర్చుకుంటారు తప్ప, బడికి వెళ్లి చదువుకుని యంత్రం పని చేసే తీరుని అధ్యయనం చేయడు. అరకొర జ్ఞానంతోనే కాస్త పెద్దవాడవగానే సొంతంగా షాపు పెట్టుకుంటాడు. మీ పది లక్షల కారు, పాతిక లక్షల కారు అతని చేతిలో ధ్వంసమవుతుంది. అతను మరిందరు అన్‌స్కిల్‌డ్‌ లేబరును తయారు చేస్తాడు. క్వాలిఫైడ్‌ లేబరు లేకపోవడం సమాజంలోని మధ్య, ఉన్నత వర్గాలకు నష్టదాయకం. భవిష్యత్తులో తమకు కలగబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఉన్నతవర్గాలు బాలకార్మికులున్న ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను ప్రోత్సహించకూడదు. 

2) శాంతిభద్రతలకు విఘాతం – పైన చెప్పిన మెకానిక్‌ షాపులో మెకానిక్‌ తన కింద పనిచేసే పిల్లల పట్ల అనవసరంగా కౄరత్వం ప్రదర్శిస్తూ వుంటాడు. అలాటి హింసకు గురైనవారు పెరిగి పెద్దయి, తమ కింద పనిచేసే పనివాళ్ల పట్ల మరింత కౄరంగా వుంటారు. వారి ప్రవృత్తి యిలా మారడం చేత సమాజంలో అశాంతికి దారి తీస్తుంది. చిన్న పిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల బలాత్కారం జరిపే లక్షణాలు పొందుతారు (తాజా కలం – నిర్భయ కేసు నిందితుల్లో మైనర్‌ది యిలాటి నేపథ్యమే). 

3) సమాజంలో ఆరోగ్యసమస్యలు – బడికి వెళ్లవలసిన పిల్లవాడు పనిలోకి వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నపుడు అతని తల్లీతండ్రి ఆ పిల్లవాడి దురభ్యాసాలను చూసీ చూడనట్లు వూరుకుంటారు. తన ఆదాయంలో కొంత వుంచేసుకుని చిరుతిళ్లు తిన్నా, బీడీలు కాల్చినా, మద్యం తీసుకున్నా గట్టిగా ఏమీ అనరు. ఇవి వారి ఆరోగ్యాన్ని చెడగొడతాయి. వయసు వచ్చాక చెడుతిరుగుళ్లు తిరిగి వ్యభిచారం వైపు కూడా ఆకర్షితులవుతారు. ఇవి వారికే కాక, మొత్తం సమాజానికి హానికరంగా మారతాయి. ఇలా ఏ విధంగా చూసినా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం వారిని ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించడానికి చేపట్టవలసిన కర్తవ్యంగా అధికారంలో వున్న ఉన్నత వర్గాలు గ్రహించాలి. ప్రస్తుతం యిస్తున్న నిధులు సరిపోవడం లేదు. దీన్ని మొగ్గ థలో వున్న శాంతిభద్రతల సమస్యగా, కార్మికసమస్యగా, ప్రజారోగ్య సమస్యగా గుర్తించి ఆ యా శాఖల నుండి నిధులు కేటాయించాలి. వ్యాధి నిరోధకాలైన టీకాలపై ఖర్చు పెడుతున్నట్లే యిదీనూ..!

అని యిలాటి సూచనలు చేశాను. ఆ వ్యాసం మరుగున పడిపోయింది. ఇప్పటికైనా ఎవరైనా ఏదైనా చేయగలిగితే సంతోషిస్తాను. బాలకార్మిక వ్యవస్థ తప్పకుండా పోవాలి. దానికోసం సమాజం యొక్క దృక్కోణం మారాలి. ఇప్పుడు సత్యార్థికి వచ్చిన బహుమతి ఆ మార్పుకు దోహదపడుతుందో లేదో వేచి చూడాలి. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1