బాపుగారు నిష్క్రమించిన రోజు నేను గుజరాత్‌లోని ద్వారకలో వున్నాను. సాయంత్రం 5.15కు వరప్రసాద్ నుండి 'బాపుగారిని దేవుడు పిలిచాడు. 10 నిమిషాల క్రితం వెళ్లిపోయారు' అని మెసేజ్ వచ్చింది. ఇంకో అరగంటకు టీవీల్లో స్క్రోలింగ్ వచ్చినట్టుంది. అందరూ ఫోన్ చేయసాగారు. బాపు, రమణ కుటుంబసభ్యులు బయటవారికి పెద్దగా తెలియరు కాబట్టి, నాకు తెలిసిన బాపురమణల అభిమానులందరూ నాకే ఫోన్ చేయసాగారు. ఆ ఫోన్లు అలా వరసగా వారం రోజులపాటు వస్తూనే వున్నాయి -'బాపుగారు పోగానే మిమ్మల్నే తలచుకున్నామండీ' అంటూ! నేను గుజరాత్, రాజస్థాన్‌లలో తిరుగుతున్నాను. సిగ్నల్స్ సరిగ్గా అందటం లేదు. పైగా రోమింగ్. కానీ అందరితోనూ మాట్లాడాను. బాపురమణలంటే మధ్యతరగతికి ఆరాధ్యులు. ఇద్దరూ వెళ్లిపోయారంటే అనాథల్లా అయిపోయారు అభిమానులు. ఎవరితోనైనా దుఃఖం పంచుకోవాలి. నాకు తెలిసున్నవాళ్లందరూ నాతో మాట్లాడారు. బాపుగారి గురించి ఏమైనా రాయలేదేం? అంటూ యింకా అడుగుతున్నారు. నిజానికి కొసరు కొమ్మచ్చిలో 'అభిమాని ప్రస్థానం'లోనే రమణగారి గురించి రాస్తూనే బాపుగారితో నా పరిచయం గురించి కూడా చాలా రాశాను. 'చాలా చాప్టర్లు రాశారు. ఇలా అయితే ఆ పుస్తకం ఎవరూ కొనరేమో చూడండి' అని ఒక పాఠకుడు హెచ్చరించాడు. '277 పేజీల పుస్తకంలో 33 పేజీల మేటరది. అది చదివి పుస్తకంలో యింతకంటె ఏముంది అనుకుంటారా!? అయినా ఏమౌతుందో చూదాం' అని జవాబిచ్చాను. పుస్తకం విడుదలైన మూడు వారాలకే పునర్ముద్రణకు వచ్చింది. ఆ వ్యాసంలో నేను ప్రస్తావించని విషయాలతో యీ సీరీస్ రాస్తున్నాను.
బాపుగారి మృత్యువు ఆకస్మికం కాదు. గత ఆర్నెల్లుగా ఆయనకు సుస్తీగానే వుంది. తిండి బాగా తగ్గించేశారు, నీరసించారు, రోజులో చాలాసేపు నిద్రపోతూండేవారు. మంచానపట్టి ఎవరిచేతా చేయించుకునే అవసరం పడలేదు కానీ, ఆయన కదలికలు బాగా తగ్గిపోయాయి. ఒక్కో రోజు హుషారుగా వున్నా, మర్నాటికి డీలా పడేవారు. పని చేయలేకపోయేవారు. అది ఆయనను మరింత కృంగదీసింది. ఎన్నో ఏళ్లగా రోజుకి 16 గంటలు పనిచేసే అలవాటు ఆయనది. ఆయన నిస్సత్తువకు కారణం, జీవితేచ్ఛ నశించడం. రమణగారు పోయాక బెంగ పెట్టుకున్నారు. తర్వాత వారి భార్య కూడా కాలం చేశారు. ఇంట్లో పిల్లలున్నా, మానసికంగా ఒంటరి అయిపోయారు. రమణగారు పోయాక అందరూ శ్రీదేవి గారి గురించి వర్రీ అవడం కంటె బాపుగారి గురించే ఎక్కువ వర్రీ అయ్యారు – ఈయనేమై పోతాడో అని. చివరకు అదే నిజమైంది. భార్య పోతే భర్త బెంగపెట్టుకోవడం, భర్త పోతే భార్య బెంగపెట్టుకోవడం, తల్లిపోతే పిల్లలు బెంగపెట్టుకోవడం.. యిలాటివి చూస్తూ వుంటాం. కానీ యిద్దరు స్నేహితుల మధ్య యిలాటి బంధం నాకు తెలిసి ఎక్కడా, ఏ కథలోను, ఏ పురాణంలోను ప్రస్తావించబడలేదు. రమణ లేని లోకంలో వుండాలని లేదండి అని బాపుగారు తరచుగా అంటూ వుండడంతో అందరికీ భయంగానే వుంది. ఆ భయాలు నిజం చేస్తూ బాపు వెళ్లిపోయారు.
ఎందుకలా? ఆయనేమీ, అజ్ఞాని కాడు, సహజమైన జననమరణాలను అర్థం చేసుకోలేని అమాయకుడు కాడు, పురాణాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టి, సర్వదేవీదేవతా లక్షణాలను ఆకళింపు చేసుకుని గీతల్లో ప్రతిఫలింపచేసిన గీతాకారుడు. రమణగారి మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం చిత్రంగా లేదా? బాపు పని రాక్షసుడు. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా తైలం రాసుకుని పొద్దున్నే ఎండలో గంటసేపు నిలబడాలి అంటే తుచ తప్పకుండా చేసే వ్యక్తి. రమణగారైతే అలా చేస్తారనుకోను. బద్ధకించేస్తారు. ఆయన సినిమాలు తీస్తూ, రాస్తూ వున్నంత కాలం ఆరోగ్యంగానే వున్నారు. పని తగ్గి, స్థిమితపడినప్పుడే బిపి, సుగర్, కొలెస్ట్రాల్ మొదలయ్యాయి. ఇబ్బందుల్లో వున్నపుడు ధైర్యంతో ఎదుర్కొనే క్రమంలో అనారోగ్యాన్ని కూడా అదుపులో పెట్టారు. పరిస్థితులు చక్కబడి, తీరిక పెరిగేటప్పటికి శరీరంలో దాగివున్న అనారోగ్యం బయటకు వచ్చింది. నిస్త్రాణగా వుంటోంది అనేవారు కానీ మానసికంగా చురుగ్గా వుండేవారు. జోక్స్ వేసేవారు, ప్లాన్లు వేసేవారు, కొత్తకొత్త మాటలు పుట్టిస్తూ వుండేవారు, లైవ్లీగా వుండేవారు. చివరిలో మృత్యువు అనాయాసంగా వచ్చింది. అది ఆయనకు మేలు చేసిందేమో కానీ, ఇంకా రెండు, మూడేళ్లు చులాగ్గా లాగించేస్తారనుకుంటూన్న మనబోటి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
బాపుగారి విషయంలో ఆయన చేసిన విపరీతమైన పని ఆయన శరీరాన్ని అరగదీసేసింది. అనేక గ్రాఫిక్స్ వున్న శ్రీరామరాజ్యం వంటి సినిమా ఆ వయసులో ఆయన కాబట్టి చేయగలిగారు. రమణ రాసిన స్క్రిప్టు, ఆయన ఆఖరి సినిమా అనుకుంటూ బాపు ఎంతో కష్టపడి దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత మరో సినిమా ఏదైనా వచ్చి వుంటే మళ్లీ పనిలో పడేవారేమో, కానీ అలా జరగలేదు. ఆయన పోయిన తర్వాత ఘననివాళులు అర్పించిన చిత్రప్రముఖు లెవ్వరూ ఆయనకి చిన్నదో, పెద్దదో ఏ సినిమా యివ్వలేదు. బాపుగారు తన ముత్యపుచిప్పలోకి ముడుచుకుపోయారు. రమణగారి తల్లి – కక్కిగారంటారు అందరూ – బాపు గురించి అనేవారట 'వాడు ఋషిరా, తపస్సు చేసుకున్నట్టు పని చేసుకుంటూ కూర్చుంటాడు' అని. ఆయన చుట్టూ వల్మీకం కట్టి, ప్రశాంతతకు, పనికి భంగం కలగకుండా చూసుకున్నది – ఆయన భార్య, అంతకంటె ఎక్కువగా రమణగారు. ఎల్‌ఐసి వారి ఎంబ్లమ్‌లోలా 'యోగక్షేమం వహామ్యహం' అన్నట్టు రమణ బయటి ఒత్తిళ్లనుండి బాపును కాపాడుతూనే వచ్చారు. ఆ చేతులు మాయమై పోవడంతో, ఆ గొడుగు ఎగిరిపోవడంతో బాపు ఎగ్జిబిషన్‌లో తప్పిపోయిన కుర్రాడిలా అయిపోయారు. 80 ఏళ్ల వయసున్న పెద్దమనిషి అలా అయిపోతాడా అనిపిస్తుంది కానీ జరిగింది అదే! బాపుగారే ముందు పోయి వుంటే రమణగారి పరిస్థితి ఎలా వుండేది అని వూహిస్తే… యిలా వుండేది కాదు అని నాకు అనిపిస్తుంది. ఇది వ్యక్తిగత అభిప్రాయం. వారిద్దరి మధ్య సమీకరణం దగ్గర్నుండి చూసినవారే సరైన సమాధానం వూహించగలరు. నేను వారిని ఎరిగినది గత 20 ఏళ్లుగా మాత్రమే! అయినా వారి జీవితాలు స్టడీ చేశాను కాబట్టి కొన్ని పరిశీలనలు చేస్తున్నాను. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)