మార్స్‌పై అడుగేసెయ్యడానికి మనిషి సిద్ధమైపోతున్నాడు. ఇంకొద్ది సంవత్సరాల్లోనే ఆ ఘనతని దక్కించేసుకోబోతున్నాం. ఏమో.. భారతదేశమే తొలి అడుగు వేసేస్తుందేమో. ప్రస్తుతానికైతే అది అత్యాశేగానీ, అసాధ్యమైనదేమీ కాదని ‘మామ్’ నిరూపించింది. మార్స్ మీదకి ఉపగ్రహాన్ని పంపడమంటే చిన్న విషయం కాదు. ఇప్పటిదాకా కేవలం మూడు దేశాలకే అది సాధ్యమైంది. ఆ ఘనతను ఇప్పుడు భారతదేశం సొంతం చేసుకుంది.. అదీ తొలి ప్రయోగంతోనే.
డబ్బు దండగ వ్యవహారమిది.. వందల కోట్లు అంతరిక్ష ప్రయోగాల కోసం వెచ్చించడం అనవసరం.. ఆ సొమ్ముతో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.. ఏడాది సమయం పట్టే మిషన్ కోసం ఖర్చు చేయడం వృధా.. ఏ క్షణాన అయినా మిషన్ ఫెయిల్ అయ్యే అవకాశముంటుంది… ఇలా కుప్పలు తెప్పలుగా వెటకారాలు, విమర్శలు.. ఎవరేమనుకున్నాసరే, ‘ఇస్రో’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మామ్’ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. విమర్శలకు సక్సెస్‌తో సమాధానం చెప్పాలన్న ‘ఇస్రో’ వ్యూహమే ఫలించింది. ‘మామ్’ ప్రయోగం విజయవతమైంది. విజయవంతంగా అరుణ గ్రహ కక్షలోకి చేరింది.
సుమారు ఏడాది క్రితం శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ ద్వారా నింగికి ఎగిసింది ‘మామ్’. అప్పటినుంచీ అనేకానేక క్లిష్ట దశల్ని విజయవంతంగా దాటుకుని.. ఈ రోజు ఉదయం అత్యంత క్లిష్టమైన అరుణగ్రహ కక్షలోకి చేరుకుంది. గత మూడొందల రోజుల శ్రమ ఒక ఎత్తయితే.. ఈ వారం రోజులు పడ్డ శ్రమ ఇంకో ఎత్తు. వారం రోజులుగా ఇస్రో శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
ఏ క్షణాన పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించడమే కష్టం. అయినా అత్యంత జాగ్రత్తగా ‘ఆపరేషన్’ చేపట్టారు. మిల్లీ సెకెన్ కూడా తేడా లేకుండా ముందు అనుకున్న ప్రకారం రాకెట్లను మండించారు..పది నెలలు నిద్రాణంగా వున్న రాకెట్లు పనిచేయడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. అయినా ఎక్కడా పొరపాటు జరగలేదు. భూమ్మీదనుంచి పంపిన సంకేతాల్ని అనుసరించి, రాకెట్లు మండాయి. అరుణగ్రహ కక్షలోకి శాటిలైట్ చేరుకుంది. దాంతో, ‘మామ్’ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లయ్యింది.
మామ్, మార్స్ కక్షలోకి చేరుకునే క్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తల బృందంతో కలిసి వీక్షించారు. ‘మామ్’ సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని ధృవీకరించుకున్నాక ఇస్రో శాస్త్రవేత్తలు చిన్న పిల్లల్లా మారిపోయారు.. సంతోషంతో ఉప్పొంగిపోయారు.. ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు.. ఆలింగనం చేసుకున్నారు.. వారితో కలిసిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమ్మ మనల్ని విజయతీరాలకు చేర్చినట్లు.. మామ్ మనల్ని అంగారక గ్రహానికి చేర్చింది.. అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధాని.
విజయం సాధించాక ఉప్పొంగిపోతాం.. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు విజయాన్నీ సవాల్‌గా స్వీకరించి.. ఇంకో అద్భుతమైన ప్రాజెక్ట్ వైపు దృష్టిపెడ్తారంటూ నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. హాలీవుడ్లో అత్యంత ఖరీదైన టెక్నాలజీతో సినిమాలు తీస్తారు.. మనం తక్కువ ఖర్చుతో టెక్నాలజీని ప్రజలకు ఉపయోగపడేలా అద్భుతమైన ప్రాజెక్టులు చేపడ్తాం.. అందులో అంతరిక్ష ప్రయోగాలూ వుంటాయి.. అని మోడీ అన్నారు.
ఏదిఏమైనా.. దేశ చరిత్రలో సెప్టెంబర్ 24 అత్యంత కీలకమైన రోజు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఎప్పటికీ సెప్టెంబర్ 24 చిరస్థాయిగా నిలిచిపోతుంది. మార్స్‌పై మన సంతకం చేసిన రోజు ఇదే మరి. ఇప్పుడిక ఎదురు చూడాల్సింది మార్స్‌పై మన తొలి అడుగు పడేది ఎప్పుడా.? అని. ఆ రోజు కూడా అతి త్వరలోనే రావాలని.. ఆ ప్రాజెక్ట్‌ని ఇస్రో సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆశిద్దాం. ఇస్రో వెంట వంద కోట్లమంది భారతీయులున్నారు.. గో ఎహెడ్ ఇస్రో.!