కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైలులో హర్‌ప్రీత్ సింగ్ (హేపీ సింగ్ అని కూడా అంటారు) అనే జీవితఖైదు అనుభవిస్తున్న 43 ఏళ్ల ఖైదీ వున్నాడు. అతను అఫ్తాబ్ అన్సారీ అనే అండర్‌వరల్డ్ డాన్‌కు అనుచరుడు. అతను మే 5 ఉదయం యోగాసనాలు వేసుకుంటూ వుండగా తోటి ఖైదీ మొహమ్మద్ నిజాముద్దీన్ అతని తలమీద ఒక యిటిక పెట్టి దెబ్బలు కొట్టి చంపేశాడు. నిజాముద్దీన్ కూడా యావజ్జీవశిక్ష అనుభవిస్తున్నవాడే. అతనికి మతిస్థిమితం లేదని, అప్పుడప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాడనీ జైలర్లు చెపుతున్నారు. మొద్దు శీను కథలా లేదూ!?
బెంగాల్‌లో ఖదీమ్స్ అనే చెప్పుల కంపెనీ యజమాని, ధనికుడు పార్థా ప్రతీమ్ రాయ్ బర్మన్‌ను 2001 జులై 23 న ఫ్యాక్టరీకి వెళుతూండగా కొందరు కిడ్నాప్ చేశారు. అతన్ని ఒక యింట్లో బందీగా వుంచి 3.75 కోట్ల రూ.ల డబ్బు పుచ్చుకున్న తర్వాతనే విడుదల చేశారు. దీనికి సూత్రధారి అఫ్తాబ్ అన్సారీ, పాత్రధారులు హేపీ సింగ్‌తో సహా మరో యింకో ముగ్గురు. ఈ డబ్బు అమెరికాలో 9/11 దాడులకు ఉపయోగపడిందని విచారణలో తెలిసింది. దాంతో పోలీసులు గట్టిగా ప్రయత్నించి వీళ్లను వెంటాడారు. హేపీ సింగ్ 2011 చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లో పట్టుబడ్డాడు. తక్కిన వాళ్లు కూడా. అయితే విచారణ సులభంగా సాగలేదు. రాయ్ బర్మన్ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించాడు. అతని భయాలు అతనివి. కోర్టు విచారణ ఎనిమిదేళ్లపాటు సాగి 2009లో తీర్పు వెలువడింది. అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే అన్సారీ మరో కేసులో కూడా యిరుక్కున్నాడు. 2002లో కలకత్తాలోని అమెరికన్ సెంటర్‌పై జరిగిన దాడి జరిపి 5గురు పోలీసులను చంపి, 18 మందిని గాయపరచిన కేసులో అతని పాత్రకు 2005లో ఉరిశిక్ష విధించారు.
హేపీ సింగ్ అప్పణ్నుంచి జైల్లోనే వున్నాడు. మంచి ప్రవర్తన కనబరుస్తూ పెయింటింగ్‌ను హాబీగా చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో యీ హత్య జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. హంతకుడు నిజాముద్దీన్‌ను పిచ్చివాళ్ల సెల్‌లో కాకుండా యితని సెల్‌కు ఎందుకు పంపించారో జైలు అధికారులు చెప్పాలంటూ ప్రజాహక్కుల నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వం జైలు అధికారులను సస్పెండ్ చేసింది. విచారణకు ఆదేశించింది.
– ఎమ్బీయస్ ప్రసాద్