జవహర్‌లాల్ నెహ్రూ మరణించి 50 వ వర్ధంతి ఈ మేలో జరుగుతోంది. ఆ సందర్భంగా అనేకమంది ప్రముఖులు ఆయనతో అనుభవాలను నెమరు వేసుకున్నారు. 'ఏ మేరే వతన్‌కే లోగోం' పాటతో నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్ ఆ రోజు ఏం జరిగిందో ఒక వ్యాసం ద్వారా తెలిపారు – 1962లో చైనాతో యుద్ధం ముగిసిన రెండు నెలలకు రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి లతాను ఆహ్వానించారు. సినిమాల నుండి దేశభక్తి గేయాలను, భజనలను ఆలపించాలని ఆమె అనుకున్నారు. అయితే చైనా యుద్ధంలో మరణించిన సైనికులకు అశ్రునివాళి అర్పిస్తూ కవి ప్రదీప్ 'ఏ మేరే వతన్ కే లోగోం' అనే పాట రాశారు. దాన్ని లతా ఆలపించాలని కోరుకుని ఆమెకు ఫోన్ చేశారు. ఆమె తను బిజీగా వున్నాననీ, కొత్త పాట నేర్చుకోవడానికి రిహార్సల్స్ చేయలేననీ, గతంలో పాడినవే మళ్లీ పాడతాననీ అన్నారు. ఆయన 'లతా, నువ్వు ఒకసారి వచ్చి పాట విని అప్పుడు చెప్పు.'' అని పట్టుబట్టాడు. గాంధేయవాది ఐన ప్రదీప్ కవి, గాయకుడు, సంగీతదర్శకుడు కూడా. ఒక కాగితంపై పాట రాసి లతాకు యిచ్చి కొన్ని లైన్లు పాడి వినిపించాడు. లతాకు విపరీతంగా నచ్చేసింది. సరే పాడతానంది. ఆ పాట మొదటి మూడు లైన్లకు ప్రదీప్ యిచ్చిన ట్యూనే వాడారు. తర్వాతి తక్కిన పాటంతా సి.రామచంద్ర కూర్చారు. ఆయన లతాకు నేర్పాడు. అప్పటికే వాళ్లిద్దరి మధ్య సఖ్యత చెడినా యీ పాట కోసం కలిసి పనిచేశారు. అసలు రామచంద్ర లతా, ఆశా యిద్దరి చేతా పాడిద్దామని ప్లాన్ చేశారని, కానీ లతా పట్టుబట్టి ఆశాను తీయించేసిందనీ అంటారు.
ఫంక్షన్‌కు నాలుగు రోజుల ముందే రామచంద్ర ఢిల్లీ వెళ్లి అక్కడ ఏర్పాట్లు చూడవలసి వచ్చింది. 'మీరు లేకుండా రిహార్సల్స్ ఎలా?' అంది లతా. ఆయన కూడా గాయకుడే కాబట్టి ఒక టేపు మీద పాట పాడి లతాకు యిచ్చి వెళ్లాడు. 1963 జనవరి 26న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో సినీ కళాకారులందరూ వెళ్లారు. దిలీప్ కుమార్, నెహ్రూ అభిమాని అయిన దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ (నెహ్రూ మరణించిన మర్నాడే యీయనా గుండెపోటుతో పోయాడు) కూడా వచ్చారు. లతా విమానంలోనే పాట ప్రాక్టీసు చేసింది. మర్నాడు సాయంత్రం వీళ్ల ఫంక్షన్ జరిగింది. లతా వేదిక ఎక్కి ''అల్లా తేరో నామ్'' (''హమ్ దోనో'' సినిమాలోది) పాడింది. తర్వాత యీ పాట పాడింది. పాట సాగుతున్నంతసేపు సూది కిందపడితే వినబడేటంత నిశ్శబ్దం. ఆ తర్వాత హోరున చప్పట్లు. వేదికపై నెహ్రూతో సహా సభాసదులంతా కన్నీళ్లు పెట్టారు. పాట పాడుతున్న లతా యీ కన్నీళ్లు గమనించలేదు. వేదిక వెనక్కి వచ్చి కాఫీ తాగుతోంది. ఇంతలో మెహబూబ్ ఖాన్ ఆమె వద్దకు వచ్చి ''పండిట్‌జీ (నెహ్రూని అలాగే పిలిచేవారు) పిలుస్తున్నారు.'' అంటూ చేయిపట్టుకుని నెహ్రూ వద్దకు తీసుకెళ్లి ''ఇదిగో మా లతా…'' అన్నాడు గర్వంగా. నెహ్రూ ఆమె కేసి చూస్తూ ''అమ్మాయ్, యివాళ నన్ను ఏడిపించేశావ్'' (లడ్కీ, తూనే ముఝే ఆజ్ రులాయా హై) అన్నాడు. కాస్సేపు పోయాక యిక వుండలేక ఫంక్షన్ పూర్తి కాకుండానే వెళ్లిపోయాడు. ఎందుకంటే చైనా యుద్ధం ఆయనను మానసికంగా కలచివేసింది. శాంతిదూతగా ప్రపంచఖ్యాతి తెచ్చుకున్న తను పాలిస్తున్న దేశంపై పొరుగున వున్న చైనా మిత్రద్రోహం చేసి దాడి చేయడం తనను నైతికంగా దెబ్బ తీసినట్లే అని భావించాడాయన. ఆ కలతతోనే మరుసటి ఏడాది కన్ను మూశాడు. ఆ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాల గురించి రాసిన ఆ పాట ఆయన్ని కదలించివేసింది.
మర్నాడు తన నివాసంలో టీకి రమ్మనమని నెహ్రూ సినీ కళాకారులందరినీ ఆహ్వానించాడు. లతా కూడా వెళ్లింది. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, శంకర్, జైకిషన్, మదన్‌మోహన్ యిత్యాదులు నెహ్రూతో మాట్లాడుతూండగా లతా ఓ మూల ఒదిగి నిలబడింది. అతిథుల బాగోగులు చూసుకుంటున్న ఇందిరా గాంధీ ఆమె వద్దకు వచ్చి ''మీరు కూడా వచ్చి కలవండి.'' అంది. ''వద్దు నాకిక్కడే బాగుంది.'' అంది లతా. ''అలా అయితే మీరు యిక్కడే నిలబడండి. మీ వీరాభిమానులు యిద్దరు మిమ్మల్ని కలవడానికి తపిస్తున్నారు.'' అంటూ వెళ్లి రాజీవ్, సంజయ్‌లను తీసుకుని వచ్చింది. కొన్ని నిమిషాలు పోయాక నెహ్రూ గట్టిగా ''లతా ఎక్కడుంది?'' అని గట్టిగా కేక వేశాడు. లతా ఆయన దగ్గరికి వెళ్లింది. ''బొంబాయి తిరిగి వెళ్లాక మళ్లీ యీ పాట పాడతావా?'' అని అడిగాడు. ''ఏమో తెలియదు'' అంది లతా. అప్పుడాయన ఒక ఫోటోగ్రాఫర్‌ను పిలిచి లతాను, తనను కలిపి తీయమన్నాడు. తర్వాత లతా నెహ్రూ సెక్రటరీతో ''ఫోటో కాపీ వచ్చాక నెహ్రూ గారి సంతకంతో నాకు పంపించండి.'' అని కోరింది. ఆ ఫోటో యిప్పటికీ లతా వద్ద వుంది.
కొన్ని నెలల తర్వాత బొంబాయిలోని బ్రేబర్న్ స్టేడియంలో ఒక చారిటీ షో జరిగితే నెహ్రూ అతిథిగా వచ్చాడు. లతా పాటల కార్యక్రమం కూడా వుంది. ఆమె వేదిక వెనక్కాల వుండగా నెహ్రూ గారి నుండి సందేశం వచ్చింది – వచ్చి 'ఏ మేరే వతన్‌కే లోగోం' పాడాలని. ఈమె రామచంద్ర వద్దకు వెళ్లి ''మీ ఆర్కెస్ట్రా దగ్గర నొటేషన్ వుందా?' అని. ఉందన్నాడు. అందరూ కలిసి త్వరగా రిహార్సల్ వేసి చూసుకున్నారు. ఓకే అనుకున్నాక లతా వెళ్లి పాడేసింది. పాట అయిపోగానే నెహ్రూ లేచి వెళ్లిపోయారు. కారులో ఎక్కాక వెళ్లబోతూ లతాను పిలిపించారు. ఆమె రాగానే కిటికీ అద్దం కిందకు దింపి, ఆమె చేతిని పట్టుకుని అదిమి, ''నీ పాట వినడానికే వచ్చాను. నువ్వు పాడి వుండకపోతే చాలా నిరాశపడేవాణ్ని.'' అన్నాడు. రసజ్ఞుడైన నెహ్రూకు అనేక లలితకళల పట్ల అవగాహన వుంది. స్పందించే హృదయం వుంది. ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి పాట విని ''ఈ సంగీత చక్రవర్తిని ముందు నేను కేవలం ఒక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే'' అన్నాడాయన. ఆయన తర్వాత వచ్చిన ప్రధానుల్లో పివి నరసింహారావు, వాజపేయిలకు కళల పట్ల అభినివేశం వుంది. కానీ నెహ్రూతో పోల్చడానికి మాత్రం సరిపోరు.
– ఎమ్బీయస్ ప్రసాద్