ఎమ్బీయస్ : బిజెపి తరువాతి లక్ష్యం – కశ్మీర్

ప్రస్తుత జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం గడువు 2014 జనవరి 19తో ముగుస్తోంది కాబట్టి డిసెంబరులోగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం సంపాదించి ఒక హిందూ ముఖ్యమంత్రిని అక్కడ కూర్చోపెట్టాలనేది బిజెపి లక్ష్యం. వినగానే అసాధ్యం…

ప్రస్తుత జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం గడువు 2014 జనవరి 19తో ముగుస్తోంది కాబట్టి డిసెంబరులోగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం సంపాదించి ఒక హిందూ ముఖ్యమంత్రిని అక్కడ కూర్చోపెట్టాలనేది బిజెపి లక్ష్యం. వినగానే అసాధ్యం అనిపించే ఈ గమ్యాన్ని సాధించి దేశపౌరుల్లో చాలామంది జేజేలు అందాలనే ఆశతో అమిత్ షా ‘‘ఢిల్లీ హుయీ హమారీ, అబ్ కశ్మీర్ కీ బారీ’’ అనే నినాదం చేపట్టాడు. 87 సీట్లున్న ఆ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 44 సీట్లు వుండాలి. హిందువులు అత్యధిక సంఖ్యలో వున్న జమ్మూ లోని 37 సీట్లలో 200 ఎన్నికలలో బిజెపి 11  గెలిచింది. ఇప్పుడు 25 గెలవాలన్న లక్ష్యం పెట్టుకుంది. దానికి గాను జమ్మూలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే పనిలో పడింది. ఆగస్టు 25న అమిత్ షా జమ్మూలో మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు అనేక కశ్మీర్ ప్రభుత్వాలు జమ్మూపై సవతితల్లి ప్రేమ చూపించాయి. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.’’ అన్నాడు. జమ్మూ, కశ్మీర్ రెండూ ఒకే రాష్ట్రంలో భాగాలైనా మతం, భాష, జాతి విషయంలో రెండూ భిన్నమైనవి. రెండిటి మధ్య అంతగా సయోధ్య లేదు. కశ్మీర్‌కు వ్యతిరేకంగా మాట్లాడి జమ్మూలో పాగా వేయడానికి బిజెపి ఎప్పణ్నుంచో చూస్తోంది. కశ్మీర్ లోయలోని ముస్లిములు తమకు ఓటేయరన్న భయం వుంది కాబట్టి అక్కణ్నుంచి తరమబడిన పండితులను వెనక్కి రప్పించి, వాళ్ల ఓట్లు సంపాదించాలని ఆలోచిస్తోంది. ఏ ప్రాంతంలో వున్న పండితులకు కశ్మీర్‌లో ఓటు హక్కు వుంది. అందుకని జమ్మూ, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుడ్‌గావ్ ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలు, ఆరెస్సెస్ ప్రచారకులు ఇల్లిల్లూ తిరిగి కశ్మీరీ పండితులను గుర్తు పట్టి, వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ఆల్ ఇండియా కశ్మీరీ సమాజ్ అధ్యక్షుడు మోతీ కౌల్ ఇటీవలే  అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరుతూ చేసిన ప్రసంగంలో ‘‘దేశం మొత్తంలో 4 లక్షల మంది పండితులున్నారు. వారిలో 1,26,000 మంది మాత్రమే కశ్మీరులో ఓటర్లుగా రిజిస్టరయి వున్నారు. తక్కినవారిలో కనీసం 30 వేల మందినైనా కొత్త ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అన్నారు. 

కశ్మీర్ లోయలో 5 సీట్లయినా గెలవాలని బిజెపి స్థానికంగా వున్న తన నాయకులను కోరింది. 5 కాకపోయినా కనీసం మూడు – హబ్బా కడల్, అమీరా కడల్, సోపోర్ నియోజకవర్గాలు గెలిచి తీరాలని చూస్తోంది. హబ్బా కడల్‌లో శ్రీనగర్ శివార్లలో వుంది. వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లు 24 వేల మంది వుంటారు. వీరిలో 5 వేల మంది గట్టిగా నిలబడినా ఫర్వాలేదు. ఎన్నికలలో పాల్గొనవద్దని గతంలో టెర్రరిస్టులు చేసిన బెదిరింపులకు భయపడి ముస్లిం ఓటర్లు ఓట్లు వేయలేదు. అదే మళ్లీ జరిగితే ఈ 5 వేల ఓట్లతో సీటు గెలిచేయవచ్చు. ఇలాంటి వలస ఓటర్లు అమీరా కడల్‌లో 12 వేల మంది, సోపోర్‌లో 6 వేల మంది వున్నారు. ఎన్నికల రంగంలో నిలబడమని అనేకమంది స్వతంత్రులను, చిన్న పార్టీల వాళ్లను బిజెపి ప్రోత్సహిస్తోంది. వీళ్లు వందల సంఖ్యలోనే ఓట్లు తెచ్చుకున్నా, బిజెపి వ్యతిరేక ఓటు చీల్చడానికి పనికి వస్తారు. బిజెపికి ఓట్లు వేసే అవకాశం వున్న ఇతర మైనారిటీలలో శిఖ్కులు కూడా వున్నారు. బిజెపికి సాలిడ్‌గా పడే ఓట్లు దానికే పడతాయి. బిజెపి వ్యతిరేకులు తలా కాస్తా తెచ్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ మార్జిన్‌తో నైనా బిజెపి గెలుస్తుంది. ఇలా లోయలో 3-5 తెచ్చుకుని లడాఖ్‌లో వున్న 4లో ఓ రెండు తెచ్చుకుంటే కశ్మీర్ గద్దెపై ఎవరు కూర్చోవాలో శాసించే స్థితికి బిజెపి చేరుకుంటుంది. రాజకీయపటాన్ని మార్చివేయవచ్చని అనుకుంటున్నారు. కశ్మీర్‌లో తన పాప్యులారిటీ పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే కాబోలు మోడీ అక్కడ వరదలు రాగానే వెంటనే వెళ్లారు, (ఆంధ్రకూ వచ్చారనుకోండి) సహాయకార్యక్రమాలు ముందెన్నడూ జరగనంత భారీ ఎత్తున జరిపించారు. అంతేకాదు, దీపావళి రోజున కశ్మీర్‌లోనే భారతీయసైన్యంతో గడిపారు. ఎన్నికల నిర్వహణలో సైన్యానిది ముఖ్యపాత్ర అని మరువకూడదు. 

ఇది కశ్మీర్ మీడియాను, పరిశీలకులను కలవర పరుస్తోంది. కశ్మీర్ ఎన్నికలు స్వేచ్ఛగా జరగనీయకుండా కేంద్రం జోక్యం చేసుకోవడం అనేకసార్లు జరిగింది. ఇప్పుడు బిజెపి అదే పని చేస్తుందని సంపాదకీయాలు రాస్తున్నారు. ఆ మధ్య గుజరాత్ నుండి ఇవిఎం (ఓటింగు యంత్రాలు) పంపిస్తున్నారని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని వాటిని ఆపేయించింది. బిజెపి వ్యతిరేకులు కొందరు అంతర్జాతీయ కుట్ర కూడా వుందని ఆరోపిస్తున్నారు. ‘అమెరికా, ఇజ్రాయేలు కలిసి బిజెపి సహాయంతో కశ్మీర్‌ను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకే బిజెపి పాలస్తీనాకు సాయపడడం మానేసింది.’ అంటున్నారు. కొన్నేళ్ల క్రితమైతే కశ్మీర్‌ను హిందూ ముఖ్యమంత్రి పాలించడం అనేది అసాధ్యమైన విషయంగా భావించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి రెండూ ప్రజల చేత ఛీత్కరించుకోబడుతున్నాయి. రెండూ పరస్పరం ‘ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేసుకుంటూంటాయి. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అవినీతి, అసమర్థతకు పేరుబడింది. ప్రతిపక్షమైన పిడిపి నాయకుల పాలించినపుడూ ఇదే పరిస్థితి. ఇక కాంగ్రెస్ అయితే ఒకప్పుడు అధికారంలో వున్నా ప్రస్తుతం చావ చచ్చి, నిరుత్సాహంతో కూలబడి వుంది. వీరందరితో విసిగిపోయిన ఓటర్లు ఈసారి బిజెపికి ఛాన్సిచ్చి చూదాం అనుకుంటారేమోనని పరిశీలకులేక కాదు, ఒమార్‌కు కూడా భయం. ‘‘బిజెపికి మెజారిటీ వస్తే నేను రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటా’’ అని ప్రకటించాడు. తథాస్తు!
 
ఎమ్బీయస్‌ ప్రసాద్ 

[email protected]