ఎవరూ ఊహించని విధంగా బ్రెగ్జిట్‌కు ఓటేసిన బ్రిటన్లు యూరోప్ యూనియన్‌లోంచి బయట పడడానికి మరీ ఉబలాటంగా ఏమీ లేరు. బ్రిటన్‌కు ప్రధానిగా ఎన్నికైన థెరెసా మే ‘రిమైన్’ వర్గానికి చెందినది. కానీ ప్రధాని అవుతూనే ‘బ్రెగ్జిట్టంటే బ్రెగ్జిట్టే. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఇయుతో చర్చలు ఈ శిశిరానికల్లా మొదలుపెట్టేస్తాం’ అని ప్రకటించింది. అంది కానీ అడుగు ముందు పడటం లేదు. ఎందుకంటే బ్రెగ్జిట్ అంటూ రంకెలు వేసినవారెవరూ ఈయు లోంచి బయటపడే మార్గం గురించి, ప్రత్యామ్నాయాలు వెతకడానికి ఎంత కష్టపడాలి, ఎన్నేళ్లు పడుతుంది అన్న విషయంపై లోతుగా ఆలోచించలేదు. ‘లీవ్’ అంటే చాలు ఈ శరణార్థుల పీడ వదులుతుంది, ఉద్యోగాలన్నీ మనవే, బ్రస్సెల్స్ మాట మనం వినక్కరలేదు అనుకున్నారంతే. వెళ్లిపోతానన్నారుగా, ఇంకా వెళ్లరేం? అని ఇయు ఓ వైపు నుంచి వెక్కిరిస్తోంది. అసలు ఇయుతో చర్చలు ఎలా మొదలుపెట్టాలి, ఏ ప్రశ్నలడగాలి అనే విషయంలోనే బ్రిటన్‌కు స్పష్టత లేదు. అందువలన చర్చలు వచ్చే ఏడాది శిశిరం దాకా ప్రారంభమయ్యే సూచనలు కనబడటం లేదు.
ఇయులోంచి బయటపడడం మాట సరే, మరి ప్రపంచ వాణిజ్య సంస్థ (వ(ర)ల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లోని 163 దేశాలతో విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే ఓ పట్టాన అయ్యే పని కాదు. ధరవరల టారిఫ్‌లు, కోటాలు, రాయితీలు, పన్నులు, ఎలాంటి వస్తువులు అనుమతించాలన్న దానిపై ఆంక్షలు వంటి అనేక విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి ఒప్పందాలు చేసుకోవాలి. వీటిని హ్యేండిల్ నిపుణులను ట్రేడ్ నెగోషియేటర్స్ అంటారు. వారి చార్జీలు కూడా భారీగానే వుంటాయి. ఇయులోని ట్రేడ్ డిపార్టుమెంటులో 600 మంది ఇలాంటి నిపుణులున్నారు. బ్రిటన్ వద్ద ప్రస్తుతం 25 మంది వున్నారు. కనీసం 500 మంది వుంటే కానీ కథ ముందుకు నడవదని ఇంటర్నేషనల్ ట్రేడ్ లాయర్లు అంటున్నారు. ఈ ఏడాది చివరకు 300 మందినైనా నియమించాలని బ్రిటన్ సంకల్పించింది. వీరు రంగంలోకి దిగి చర్చలు మొదలుపెట్టి, అవతలి దేశపు నిపుణులతో తలపడడం, ఉభయతారకమైన ఒప్పందాలపై సంతకాలు పెట్టడం ఎన్నాళ్లు పడుతుందో ఎవరికీ తెలియదు.
ఈ వాణిజ్య చర్చలు ప్రారంభం కావాలంటే ఇయు ఒప్పందంలోని ఆర్టికల్ 50 కింద బ్రిటన్ ఫలానా తేదీ లోపున తను వైదొలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించాలి. ఆ ఫలానా తేదీ ఎప్పుడో థెరిసా తేల్చుకోలేక పోతోంది. ఆలస్యం చేసిన కొద్దీ వచ్చే ఏడాదిలో ఫ్రాన్సు, జర్మనీల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు వస్తే సమస్య మరింత జటిలం కావచ్చు. (బ్రిటన్ ప్రధాని – థెరెసా మే)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)