ఎమ్బీయస్: రియో – బానిస వ్యాపారానికి కూడలి

ఒలింపిక్స్ కారణంగా రియో పై అందరి దృష్టి పడింది. ఈ సందర్భంగానే అది ఒకప్పుడు ముమ్మరంగా జరిగిన బానిస వ్యాపారానికి కూడలి అనే విషయాన్ని చరిత్రకారులు తవ్వి తీశారు. ఒలింపిక్స్ జరిగిన స్థలానికి అతి…

ఒలింపిక్స్ కారణంగా రియో పై అందరి దృష్టి పడింది. ఈ సందర్భంగానే అది ఒకప్పుడు ముమ్మరంగా జరిగిన బానిస వ్యాపారానికి కూడలి అనే విషయాన్ని చరిత్రకారులు తవ్వి తీశారు. ఒలింపిక్స్ జరిగిన స్థలానికి అతి సమీపంలోనే ఆఫ్రికా నుంచి బానిసలను తెచ్చి వివిధ దేశాలకు అమ్మిన మార్కెట్ వుంది. 16-19 శతాబ్దాల మధ్య పోర్చుగల్‌కు బ్రెజిల్ వలసదేశంగా వుండే ఆ రోజుల్లో చెఱుకు, కాఫీ పొలాల్లో పనిచేయించడానికి పోర్చుగల్ వారు 55 లక్షల మంది ఆఫ్రికా పౌరులను బ్రెజిల్ దేశానికి బానిసలుగా తీసుకుని రావాలని చూశారు. 

మార్గమధ్యంలో ఎదురైన దుర్భర పరిస్థితుల వలన చనిపోయినవారు 6 లక్షల మంది! ప్రాణాలతో బ్రెజిల్‌కు చేరిన 49 లక్షల్లో 20 లక్షల మంది రియో మార్కెట్టు కే వచ్చారు. పోల్చి చూడాలంటే ఉత్తర అమెరికాలోకి అడుగు పెట్టిన మొత్తం బానిసలు 4 లక్షల మంది! ‘‘ఇన్నాళ్లూ అట్లాంటిక్ సముద్రంపై బానిస వ్యాపారులు అనగానే బ్రిటన్ వాళ్లే గుర్తుకు వచ్చేవారు. వాళ్లు బానిసలను తీసుకుని వచ్చిన కరిబియన్ సముద్రం గుర్తుకు వచ్చేది. అసలైన బానిస వ్యాపారులు పోర్చుగీసు వాళ్లని ఇప్పుడు తేటతెల్లమౌతోంది. బానిసలను అధికంగా వచ్చి చేరింది బ్రెజిల్‌కే!’’ అని పరిశీలకుడొకడు వ్యాఖ్యానించాడు. 

రియోలోని వలోంగో వార్ఫ్‌ను 1811లో కట్టారు. లక్షలాది ఆఫ్రికన్లను సంకెళ్లలో అక్కడకు తెచ్చి అమ్మివేశారు. ఓడ ప్రయాణంలో చనిపోయినవారిని దగ్గర్లో వున్న ‘సెమిటరీ ఆఫ్ న్యూ బ్లాక్స్’లో కప్పిపెట్టేవారు. అలా 40 వేల మందిని అక్కడ ఖననం చేశారు. ఖననం చేసిన కొన్నాళ్లకు బయటకు తీసి ఎముకలను పిండిపిండి చేసి, అక్కడ మరొకరిని కప్పిపెట్టేవారు. బానిసలను ఎంత పెద్ద సంఖ్యలో తెచ్చారంటే రియో పట్టణంలోని జనాభాలో సగం మంది వారే వుండేవారు. అయితే వారికి హక్కులు వుండేవి కావు. చిన్న తప్పుకి సైతం రహదారుల్లో నిలబెట్టి కొరడాలతో కొట్టేవారు. 

చివరకు 1850లో బానిస వ్యాపారాన్ని నిషేధించారు. కానీ అప్పటికే తెచ్చేసిన బానిసల చేత పని చేయించుకోవడం బానిసత్వాన్ని అధికారికంగా నిర్మూలించిన 1888 సం॥ వరకు సాగింది. ఆ మరుసటి ఏడాదే బ్రెజిల్ రిపబ్లిక్‌గా అవతరించింది. వలోంగో వార్ఫ్ పేరు తుడిచి వేయడానికి దాన్ని పడగొట్టి దాని స్థానంలో మరో పేరుతో ఇంకా పెద్ద రేవు కట్టారు. 1891లో బ్రెజిల్ ప్రభుత్వం తమపై వున్న మచ్చ పోగొట్టుకోవడానికి తమ దేశంలో బానిస వ్యాపారం సాగిందని నిరూపించే దస్తావేజులన్నీ తగలబెట్టమని ఆదేశాలిచ్చింది. అందువలన వలోంగో పేరు కూడా చరిత్ర పుటల్లో మాసిపోయింది. 

2016 ఒలింపిక్స్ జరపడానికి వేదికగా రియోను 2009లో ప్రకటించాక అక్కడ 2 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఇంకా పెద్ద రేవు కట్టారు. ఇంత చేసినా గతకాలపు చిహ్నాలు మాసిపోలేదు. రేవు వైపు వున్న పట్టణంలో నల్లవారు ఎక్కువగా కనబడతారు. పేదరికం తాండవిస్తూ వుంటుంది. అందుచేత పనివారి శ్రమను దోపిడీ చేసుకోవడమూ జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన ఇన్‌స్పెక్టర్లు వ్యాపారస్థలాలపై దాడులు చేసి దుర్భర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులను రక్షించి, యజమానులపై కేసులు పెడుతూంటారు. 2003 నుంచి అలా పెట్టిన కేసులు 45 వేలు! అంత తక్కువ వేతనానికి పనిచేయవలసిన అవసరం పడుతోందంటేనే ఇది ఆధునిక బానిసత్వం అనాలి. (ఫోటో – 125 ఏళ్ల క్రితం వలోంగో రేవు వున్న చోటు యిదే)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)

[email protected]