ఎమ్బీయస్‌: ఉపయెన్నిక బరిలో జయలలిత

స్పెషల్‌ కోర్టు తీర్పు కారణంగా శ్రీరంగం నియోజకవర్గం సీటు వదులుకోవలసిన జయలలిత కర్ణాటక హై కోర్టు తాజా తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావడానికై ఉత్తర చెన్నయ్‌లోని…

స్పెషల్‌ కోర్టు తీర్పు కారణంగా శ్రీరంగం నియోజకవర్గం సీటు వదులుకోవలసిన జయలలిత కర్ణాటక హై కోర్టు తాజా తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావడానికై ఉత్తర చెన్నయ్‌లోని రాధాకృష్ణ నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. తన పార్టీ శాసనసభ్యుడు పి వెట్రివేలు చేత మే 17 న రాజీనామా చేయించి జూన్‌ 27 న జరిగే ఉపయెన్నికలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఆమెకు సహకరిస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం ఉపయెన్నిక గురించి ప్రకటించడానికి 75 రోజులు తీసుకున్న కమిషన్‌ యీ సారి ప్రకటనకు కేవలం పది రోజులు తీసుకుంది. తనపై వున్న అవినీతి ఆరోపణలు, కేసులు నగరవాసులను కూడా ప్రభావితం చేయలేదని నిరూపించుకోవడానికి జయలలిత తొలిసారిగా రాజధాని నుంచి పోటీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో గెలవడానికి 50 మందితో పోల్‌ కమిటీ వేసి దాని నేతృత్వాన్ని పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. ఈ హంగామా అంతా చూసి ప్రతిపక్షాలు బెదిరిపోయి, ఆమెతో తలపడమనేశాయి. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ముందుకు వచ్చి తమ ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐకు చెందిన సి మహేంద్రన్‌ను నిలబెట్టాయి. ఇంకా 26 మంది అభ్యర్థులు వున్నారు కానీ కమ్యూనిస్టు అభ్యర్థి మాత్రమే కొద్దో గొప్పో జయలలితకు వ్యతిరేకంగా ఓట్లు కూడగట్టుకోవాలి.

తమిళనాడుకు 2016లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఏడాది భాగ్యానికి నిలబడడం దేనికి, పైగా అధికారపక్షం డబ్బు కుమ్మరిస్తుంది, పోటీ పడడం అనవసరం అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. నిజానికి మే 24 న మధురైలో స్టాలిన్‌ నిర్వహించిన సభ విజయవంతమైంది. అయినా డిఎంకెకు ధైర్యం చాలలేదు. తక్కిన పార్టీలు కలిసి వస్తే ఏమైనా చేసేదేమో! కాంగ్రెసు నుండి బయటకు వచ్చి 2014 నవంబరులో తమిళ మానిల కాంగ్రెసు (టిఎంసి) పార్టీని పునరుద్ధరించి 45 లక్షల మంది సభ్యులను చేర్చించగలిగిన జి కె వాసన్‌ (మూపనార్‌ కుమారుడు) తనతో కలిసి వస్తే లెఫ్ట్‌ పార్టీలను, వీలైతే విజయకాంత్‌ను లాక్కుని రావచ్చని డిఎంకె అనుకుంది. అయితే కాంగ్రెసు నుండి మూకుమ్మడిగా టిఎంసిలోకి వచ్చిన క్యాడర్‌ ఎడిఎంకెతో పొత్తు అయితే ఫర్వాలేదు కానీ డిఎంకెతో కలవవద్దని చెప్పడంతో వాసన్‌ అడుగు ముందుకు పడలేదు. అందుకే జయలలితపై వచ్చిన కోర్టు తీర్పుపై కూడా అతను వ్యాఖ్యానించకుండా మౌనంగా వున్నాడు. 

రాష్ట్ర బిజెపి తరఫున కేంద్రమంత్రిగా వున్న పొన్‌ రాధాకృష్ణన్‌ జూన్‌ 2 న ఒక ప్రకటన చేస్తూ కూటమిలో తమ భాగస్వాములైన డా|| రామదాసు  (పిఎంకె) విజయకాంత్‌ (డిఎండికె)లను సంప్రదించి బిజెపి తన అభ్యర్థిని నిలుపుతుందని ప్రకటించారు. కానీ అదే రోజు రాష్ట్ర బిజెపి అధ్యకక్షుడు తమిళిశై సౌందరరాజన్‌ డిఎండికె అభ్యర్థిని నిలిపితే తాము బలపరుస్తామని చెప్పారు. డిఎండికె పార్టీ తరఫున అభ్యర్థిని నిలబడితే బలపరుద్దామని డిఎంకె కూడా అనుకుంది. తన పార్టీ ద్వారా ఎన్నికైనవారు ఎడిఎంకెలో చేరిపోవడంతో నీరసించి వున్న విజయకాంత్‌ ఎటూ తేల్చకుండా వున్నాడు. అతనితో పొత్తులో చిక్కు ఏమిటంటే తనే ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నాడు. డిఎంకె తరఫున స్టాలిన్‌, పిఎంకె తరఫున అన్బుమణి రాందాస్‌ కూడా అదే ఆశతో వున్నారు. పిఎంకె తను 2016 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకెతో కాని, ఎడిఎంకెతో కాని పొత్తు పెట్టుకోనని స్పష్టం చేస్తోంది. బిజెపి కూడా అదే పంథాలో ఆలోచిస్తోందని అరుణ్‌ జైట్లే ప్రకటించారు. 

మొత్తానికి కమ్యూనిస్టులు తప్ప తక్కిన పార్టీలన్నీ ఉపయెన్నిక యిచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నాయి. జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు చాలా వింతగా వుంది. జయలలిత కున్న అప్పులు రూ.10.67 కోట్లు అని ట్రయల్‌ కోర్టు అంటే, కాదు, కాదు రూ.24.17 కోట్లు అనేశారు, హై కోర్టు జడ్జి! మొదటి అంకె కరక్టయితే ఆమె అక్రమాస్తులు వుండవలసిన దాని కంటె 76.76% ఎక్కువ వున్నట్టు తేలుతుంది, రెండోది తీసుకుంటే 8.12% మాత్రమే అవుతుంది. హైకోర్టు జడ్జి రెండోది లెక్కలోకి తీసుకుని, ఓస్‌ యింతేగా అని వదిలేశాడు. శశికళ, సుధాకరన్‌, ఇళవరసిలకు ఆదాయం వచ్చే మార్గాలేమీ లేవు కాబట్టి, అవన్నీ మొదటి ముద్దాయి జయలలితవే అంటూ ట్రయల్‌ కోర్టు జడ్జి లెక్కేస్తే, అబ్బే వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుని కొన్న స్థిరాస్తులు అన్నారు హైకోర్టు జడ్జి. సుధాకరన్‌ పెళ్లి ఖఱ్చు రూ. 6.45 కోట్లు అని ప్రాసిక్యూషన్‌ అంది. రూ.98 లక్షలు అని జయలలిత యిన్‌కమ్‌టాక్స్‌ వారికి చెప్పింది. అబ్బే మేమే భరించాం, దాని కోసం రూ.92 లక్షలు బ్యాంకులో వేశాం అంటూ పెళ్లికూతురు అన్నగారు బ్యాంకు పాస్‌బ్యుక్‌ పట్టుకుని వచ్చాడు. దానిపై బ్రాంచ్‌ పేరు, స్టాంపు లేవు. 'పెళ్లి ఖర్చుల కోసం సేవింగ్స్‌ ఖాతా తెరవడం విడ్డూరంగా వుంది, పైగా జయలలిత సప్లయిర్సకు తన చెక్కులు యిచ్చింది. పెళ్లికి రూ. 3 కోట్లు ఖఱ్చయిందని నా అంచనా' అన్నారు ట్రయల్‌ కోర్టు జడ్జి. 'అబ్బే 29 లక్షల రూ.ల లోపే ఖఱ్చయింది' అని తేల్చేశాడు హైకోర్టు జడ్జి. జయలలిత కొత్తగా కట్టించిన బిల్డింగులపై రూ.21 కోట్లు ఖర్చయిందని ట్రయల్‌ జడ్జి అంటే అబ్బే  రూ.5 కోట్లే అన్నారు హైకోర్టు జడ్జి. '900 ఎకరాల కాఫీ ప్లాంటేషన్‌ రూ.7.50 కోట్లకు కొనడం, పంట భూములను ఎకరా 10 వేలకు కొనడం నమ్మశక్యంగా లేవు' అని ట్రయల్‌ జడ్జి అంటే వాటి విలువ రూ.6.24 కోట్ల కంటె ఎక్కువ వుండదు అన్నారు హైకోర్టు జడ్జి.

ఇలాటి వింత పోకడలన్నీ ఏకరువు పెట్టి జనాలను ఎడ్యుకేట్‌ చేయడానికి ఎన్నికల సభలే సరైన వేదిక. మామూలు సమయాల్లో జనాలు సరిగ్గా వినరు, తలకెక్కించుకోరు. అలాటి అవకాశాన్ని తమిళనాడు ప్రతిపక్షాలు జారవిడుచుకుంటున్నాయి. మరో పక్క జయలలిత దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఫుల్‌ స్వింగ్‌లో ముందుకు వెళుతోంది. పన్నీర్‌ సెల్వం హయాంలో కుంటుపడిన ఎడ్మినిస్ట్రేషన్‌ను పరుగులెత్తిస్తోంది. పెండింగులో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తోంది, సెప్టెంబరులో గ్లోబల్‌ యిన్వెస్టర్స్‌ మీట్‌ పెట్టి తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించబోతున్నానని చెప్పుకుంటోంది. ఎన్నిక ఫలితం ఎలా వుంటుందో వేరే చెప్పనక్కరలేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]