ఈ ఏడాది మేలో ఫిలిప్పీన్స్‌లో ఎన్నికలు జరిగి రోడ్రిగో డ్యూటెర్టె అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దావో నగరానికి మేయరుగా వున్నప్పుడు అతను నేరస్తులను దడదడలాడించి పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరుప్రతిష్ఠలతోనే 38% ఓట్లతో నెగ్గాడు. ఇక యిప్పుడు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్ వ్యాపారాన్ని తుదముట్టించడానికి కంకణం కట్టుకుని మాదకద్రవ్యాలు వాడేవాళ్లని, అమ్మేవాళ్లని అందర్నీ తన అనుచరుల చేత, పోలీసుల చేత చంపిపారేయిస్తున్నాడు. అతను పదవి చేపట్టిన జూన్ 30 నుంచి యిప్పటివరకు సగటున రోజుకు 36 మంది చంపబడ్డారని అంచనా. ముసుగు వేసుకున్న కార్యకర్తల చేతిలో కొందరు హతులైతే, మరి కొందరు పోలీసుల చేతిలో చచ్చిపోతున్నారు. ఇంకొందరిని ఎవరు చంపారో తెలియటం లేదు. శవాలుగా తేలుతున్నారు. చట్టాన్ని చేతిలో తీసుకున్నందుకు పోలీసులపై చర్యలు తీసుకోనని రోడ్రిగో ప్రకటించాడు. మీరేం చేసినా నేనేమీ అననన్నాడు. ఈ మరణాలతో గడగడ వణికిన డ్రగ్ వాడకందార్లు, డీలర్లు లక్షలాది మంది చట్టానికి లొంగిపోతున్నారు. కానీ కోర్టుకి యీ వరస నచ్చలేదు. చీఫ్ జస్టిస్ యీ పోకడను విమర్శించాడు. 'నా చర్యలకు అడ్డు వస్తే పార్లమెంటును రద్దు చేసి పారేస్తా, మార్షల్ లా పెట్టేస్తా' అని రోడ్రిగో బెదిరించాడు. 'మానవహక్కులు హరించిపోతున్నాయి, యిదెక్కడి ప్రభుత్వం' అని పాశ్చాత్య మీడియా గగ్గోలు పెడుతోంది కానీ ఫిలిప్పీన్స్ ప్రజలు ఫిర్యాదు చేయడం లేదు. సర్వే చేస్తే 91% మంది అతని చర్యలను ఆమోదిస్తాం అన్నారు. అతని మిత్రులు, శత్రువులు అందరూ చెప్పేది ఒకటే – 'చెప్పింది చేసి తీరగలడు' అని. ఫిలిప్పీన్స్‌ను క్షాళన చేస్తానని ఎన్నికలలో వాగ్దానం చేశాడుగా, చేసి చూపిస్తున్నాడు అంటున్నారు.
ఫిలిప్పీన్స్ ప్రజలు వారి అధ్యక్షుల చేష్టలతో విసిగిపోతూ వచ్చారు. అవినీతిపరుడైన ఫెర్డినాండ్ మార్కోస్ అమెరికా మద్దతుతో నియంతగా 1966 నుంచి 20 ఏళ్లపాటు ఏలాడు. అతని భార్య ఇమెల్డా విలాసాలకు జగత్ప్రసిద్ధం. ప్రజలు తిరగబడితే 1972లో మార్షల్ లా పెట్టాడు. 1986లో ప్రజాగ్రహం తట్టుకోలేక అమెరికా సలహాతో డబ్బు తీసుకుని దేశం విడిచి పారిపోయాడు. అతని తర్వాత వచ్చిన అధ్యక్షుల్లో కొందరు అమెరికా కనుసన్నల్లోనే నడిచారు. సినిమా యాక్టరైన జోసెఫ్ ఎస్ట్రాడా 1998-2001 మధ్య అధ్యక్షుడిగా వుండి 80 మిలియన్ డాలర్ల అవినీతి కేసుల్లో యిరుక్కుంటే యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని తర్వాత వచ్చిన గ్లోరియా అరోయో అతన్ని క్షమించేసింది. తన తొమ్మిదేళ్ల (2001-10) పాలనలో ఆమె కూడా అవినీతికి పాల్పడిందని గృహనిర్బంధంలో వుంది. అయితే సుప్రీం కోర్టు ఆమెను క్షమించేసింది. ఎందుకంటే ఆ జడ్జీలు ఆమె నియమించినవారే! ఆమె తర్వాత వచ్చి బినైనో ఏక్వినో (2010-16) అమెరికాకు సన్నిహితుడు.
ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించడానికి అమెరికా మార్కోస్ హయాంలో ఫిలిప్పీన్స్‌లో మిలటరీ స్థావరాలు ఏర్పరచుకుంది. మార్కోస్ తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన కోరజాన్ ఆక్వినో ఆ స్థావరాల నుంచి 1992లో అమెరికాను సాగనంపింది. ఆమె కుమారుడైన బినైనో అధ్యక్షుడయ్యాక మళ్లీ అమెరికావాళ్లను పిలుచుకుని వచ్చి వాటిని అప్పగించాడు. అంతేకాదు, 2015లో ఎన్‌హాన్స్‌డ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఎగ్రిమెంట్ (ఇడిసిఎ) అనే ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం అమెరికాకు తన స్థావరాలలోనే కాదు యితర మిలటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ బేస్‌లలో కూడా ప్రవేశించే అధికారం కట్టపెట్టాడు. ఈ క్రమంలో చైనాతో వైరం పెంచుకున్నాడు. సౌత్ సీ ప్రాంతంలో తన ఆధిక్యత వుండాలని కోరుకునే చైనాకు ముకుతాడు వేయడానికి అమెరికా ఆక్వినోను మచ్చిక చేసుకుని తన మిలటరీ బేస్‌లను పటిష్టం చేసుకుంది. అతని తర్వాత వచ్చేవాళ్లు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని సకల ప్రయత్నాలు చేసింది. వారికి ఆప్తుడైన ఆక్వినో ఎన్నికల సమయంలో రోడ్రిగోకు ఓటేయవద్దని, వేస్తే మార్కోస్ పాలన తిరిగి వచ్చేస్తుందని ఓటర్లను భయపెట్టాడు. అతనితో పోటీ పడిన రోక్సాస్‌కు మద్దతిచ్చాడు. ప్రతిపక్షాలన్నీ ఏకమై రోడ్రిగోకు అధికారం దక్కకుండా చేయాలని పిలుపు నిచ్చాడు. ఇంత చేసినా రోక్సాస్‌కు ద్వితీయ స్థానమే దక్కింది.
అమెరికాకు రోడ్రిగో అంటే ఎందుకు పడదు అంటే దానికి చరిత్ర వుంది. 1980లలో దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ (సిపిపి), తన సాయుధదళం న్యూ పీపుల్స్ ఆర్మీ (ఎన్‌పిఏ) ద్వారా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. ఆ పార్టీని స్థాపించిన జోస్ సిసాన్ రోడ్రిగోకు మనీలా యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఆయనంటే రోడ్రిగోకు గౌరవం వుంది. తిరుగుబాటు కారణంగా 30 వేల మంది హతులయ్యారు. జోస్ నెదర్లాండ్స్‌లో తలదాచుకున్నాడు. రోడ్రిగో దావో నగరానికి మేయరయ్యాక శాంతిభద్రతలు పరిరక్షించడానికి పూనుకుని, అరాచక శక్తులను అణచివేయడానికి చట్టానికి అతీతంగా కూడా వ్యవహరించాడు. డెత్ స్క్వాడ్స్‌ను తయారుచేసి, వీధుల్లో వదిలాడు. మానవహక్కుల సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ఫిలిప్పీన్స్‌లో కల్లా అత్యంత నేరపూరితమైన నగరంగా పేరు బడిన ఆ వూరు రోడ్రిగో కారణంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకదానిగా మారింది. మహిళా బాధితుల కోసం క్రైసిస్ సెంటరు నెలకొల్పి వారి అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇది వారి వరకు బాగానే వుందేమో కానీ అమెరికాకు మాత్రం బాగా లేదు. ఎందుకంటే వారి ప్లాన్లు వాళ్లకున్నాయి. ఫిలిప్పీన్స్‌లో కల్లోలాలు సృష్టించి, ప్రజల దృష్టిలో రక్షకుడిగా నటిస్తూ తన సైనిక దళాలను అక్కడ దింపాలని వారి పథకం. దానికి గాను వారు ఎంచుకున్న వ్యక్తి అబూ సయ్యఫ్. అఫ్గనిస్తాన్‌లో రష్యా దళాలను తరిమికొట్టడానికి తాలిబన్లతో బాటు ఫిలిప్పీన్స్ ముస్లిములు కొందరిని సయ్యఫ్ నేతృత్వంలో మిల్ఫ్ (మోరో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్) పేర టెర్రరిస్టు దళంగా తయారుచేశారు. (రాజకీయావసరాల కోసం అమెరికా తయారుచేసిన అనేక భూతాల్లాగానే యిప్పుడు మిల్ఫ్ కూడా పెనుభూతమై ఐసిస్‌తో లింకులు పెట్టుకుని మానవాళికి ముప్పుగా పరిణమించింది) ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్లకు ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా కొన్ని అరాచక కార్యకలాపాలు, విధ్వంసచర్యలు వారి పేర తామే నిర్వహించారు. దీన్ని ఫాల్స్ ఫ్లాగ్ టెర్రర్ (తెలుగులో మారు జండా ఉగ్రవాదం అనవచ్చేమో) అంటారు. అంటే సినిమాల్లో రాబిన్ హుడ్ వంటి హీరోను అప్రతిష్ఠపాలు చేయడానికి విలన్లే అకృత్యాలు చేసి పట్టుబడిన తమ అనుయాయుల చేత 'మేం కొండవీటి దొంగ మనుషులం' అని చెప్పిస్తారు చూడండి, అలాటిదన్నమాట. ఇక్కడ లక్ష్యం ఏమిటంటే కొండవీటి దొంగను పట్టుకోవడం కాదు, అతని దుర్మార్గాలు అరికడతామంటూ తాము వచ్చి సాయుధదళాలతో తిష్ట వేయడం.
దురదృష్టవశాత్తూ దీనికి అప్పటి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం, సైన్యం మద్దతు కూడా వుంది. అప్పటి అధ్యక్షురాలు ఆరోయో (అవినీతిపరుడైన పూర్వాధ్యక్షుడు ఎస్ట్రాడాకు క్షమాభిక్ష ప్రసాదించి, తనూ అవినీతి పాలన సాగించి, అరెస్టయి, తను నియమించిన జడ్జిల కారణంగా కేసుల్లోంచి విముక్తురాలైన మహిళ) అమెరికాకు సహకరించి తన సైనిక విభాగమైన ఎఎఫ్‌పి (ఆర్మ్‌డ్ ఫోర్స్ ఆఫ్ ఫిలిప్పైన్స్) ద్వారా సంధానం చేసింది. పథకంలో భాగంగా అమెరికా 2002లో మైకేల్ టెర్రెన్స్ మెయిరింగ్ అనే సిఐఏ ఏజంటును మారణాయుధాలతో, బాంబులతో ఫిలిప్పీన్స్‌లో దింపింది. అతను ఆపరేట్ చేద్దామనుకున్న ప్రాంతాలు దావో నగరానికి దగ్గరగా వుండడంతో అక్కడి ఎవర్‌గ్రీన్ హోటల్లో దిగాడు. దావో నగరానికి మేయరుగా వున్న రోడ్రిగో తమ కుట్రలో భాగం పంచుకోడన్న అనుమానంతో అమెరికా అతనికి ఏమీ చెప్పలేదు. హోటల్లోకి పెద్ద పెట్టెతో వచ్చిన మైకేల్ హోటల్ సిబ్బందిని దాన్ని ముట్టుకోనిచ్చేవాడు కాదు. తెచ్చిన పేలుడు సామగ్రిని, మిల్ఫ్‌తో బాటు కమ్యూనిస్టు సేన అయిన ఎన్‌పిఏకు కూడా అందించాడట. ఇక్కడ సిద్ధాంతాలతో పని లేదు. ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఏ శక్తి అయినా తమకు ఆత్మీయులే.
అక్కడక్కడ పేలుళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా కొెన్ని వారాలు పోయాక మే 16 న హోటల్ గదిలోనే బాంబు పేలి మైకేల్ గాయపడ్డాడు. హోటల్ యాజమాన్యం పోలీసులను పిలిచారు. బాంబుల పెట్టెతో పాటు, కొన్ని డాక్యుమెంట్లు కనబడ్డాయి. మైకేల్‌ను మోరో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫీసరుగా పేర్కొంటూ ఐడెంటిటీ కార్డు కూడా కనబడింది. అతన్ని మకాటీ మెడికల్ సెంటరుకు తరలించారు. ఈ లోపునే ఎఎఫ్‌పి ద్వారా అమెరికాకు ఉప్పందింది. అంతే, అమెరికా మనీలాలోని అమెరికన్ ఎంబసీ ద్వారా ప్రత్యేక జెట్ విమానాన్ని చార్టర్ చేయించి యిద్దరు ఎఫ్‌బిఐ ఏజంట్లను పంపింది. వాళ్లు తమ ఐడెంటిటీ కార్డు చూపిస్తూ ఆసుపత్రిలోని వైద్యులను, పోలీసులను హడలగొట్టి మైకేల్‌ను తీసుకుని ఆ విమానంలో మనీలాకు తీసుకుని వచ్చారు. అక్కణ్నుంచి అమెరికాకు తీసుకుని వెళ్లిపోయారు. భోపాల్ గ్యాస్ కేసులో ఆండర్సన్ విషయంలో మన ప్రభుత్వం వ్యవహరించినట్లుగానే ఆనాటి ఫిలిప్పీన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆదేశాలిస్తూ యీ తరలింపు సాధ్యపడేట్లు చేసింది.
దీన్ని రోడ్రిగో చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అమెరికాను నిందిస్తూ ప్రకటనలు గుప్పించాడు. గత్యంతరం లేక ఫిలిప్పీన్స్ మైకేల్‌ను అప్పగించమని అమెరికాను అడగవలసి వచ్చింది. ఆ పేరుతో ఎవరూ లేరంది అమెరికా. ఎందుకంటే ఈలోగా అతను తన యింటిపేరు వాన్ ద మీర్ అని మార్చేసుకున్నాడు. హ్యూస్టన్ టీవీ స్టేషన్ రిపోర్టరు ఒకతను అతని ఆనుపానులు కూపీ లాగి, ఫిలిప్పీన్స్‌కు తెలియపరిచాడు. కొత్త పేరుతో డిమాండ్ రాగానే అయితే అమెరికా 'మీరు అతని ఫోటోను మాకు పంపలేదు' అనే సాకుతో ఆ కోరిక తిరస్కరించింది. ఫిలిప్పీన్ ప్రభుత్వం కూడా కుమ్మక్కయింది కాబట్టి అమెరికా చెప్పినది ఒప్పేసుకుని వూరుకుంది. ఈ లోగా అమెరికా మైకేల్ గురించి రకరకాల కథనాలను మీడియాలో ప్రవేశపెట్టింది. అతను నిధుల వేటగాడని, నాజీలు ఫిలిప్పైన్స్‌లో దాచిన బంగారం వెతకడానికి వచ్చాడని, క్రీస్తు పునరుజ్జీవనాన్ని నమ్మే మతసంస్థ సభ్యుడని, తనంతట తానే బాంబులు సప్లయి చేశాడని, అమెరికాతో ప్రమేయం లేదని.. యిలా!
మైకేల్ పంచిపెట్టిన తుపాకులు, బాంబులను అతను వెళ్లిపోయిన తర్వాత ఏడాది దాకా ఉగ్రవాదులు వాడారు. దావో ఎయిర్‌పోర్టులో, సాసా రేవులో అవి పేలాయి. చాలామంది చచ్చిపోయారు, మరింతమంది గాయపడ్డారు. దాని తర్వాత కూడా మిల్ఫ్‌ను అదుపు చేయాలనే పేరుతో అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లను రోడ్రిగోతో చెప్పకుండా దావో నగరానికి పంపిస్తూనే వుంది. దొంగతనంగా ముద్రించిన అమెరికన్ డాలర్లను చలామణీలో పెట్టింది. ఆ తర్వాత యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అంటూ 6 వేల మంది సైన్యాన్ని దింపింది. తన నగరంలో అమెరికా సృష్టించిన విధ్వంసాన్ని రోడ్రిగో యిప్పటికీ క్షమించలేకున్నాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో కలిసి అమెరికా ఏర్పరచిన సైనిక కార్యకలాపాల వలన శాంతి ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని, క్రైస్తవులకు, ముస్లిములకు మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయని రోడ్రిగో వాదన.
అందుకే యిప్పుడు మిల్ఫ్‌తో, ఎన్‌పిఏతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. అంతేకాదు, చైనాతో శత్రుత్వం మాని, వారి భాగస్వామ్యం కోరుతున్నాడు. మీరు ఆఫ్రికాలో కట్టినట్లే మా వద్దా రైల్వే మార్గం కట్టండి అంటున్నాడు. మా వద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి చైనా కంపెనీలను ఆహ్వానిస్తానంటున్నాడు. సౌత్ చైనా సీపై చైనాకు అధికారాలు లేవని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ యిచ్చిన తీర్పును మన్నించనంటున్నాడు. చైనా కూడా అదే చెపుతోంది 'మేం సంబంధిత దేశాలతో కూర్చుని చర్చించుకుని ఒప్పందాలకు వస్తాం. మధ్యలో యీ ట్రైబ్యునల్ పెత్తనం ఏమిటి?' అని. ఆ ప్రాంతంలో చైనాతో కలిసి ఆయిలు, నేచురల్ గ్యాస్ నిక్షేపాలను వెలికితీసే ప్రతిపాదన చేస్తున్న రోడ్రిగో నిజంగా స్నేహహస్తం అందిస్తే అందుకోవడానికి చైనా సిద్ధంగా వుంది. దీన్ని అమెరికా మద్దతుదారులు అంగీకరించటం లేదు. ఒకప్పుడు రైట్ వింగ్ సైనిక తిరుగుబాటు చేసి విఫలమైన సెనేటర్ ఆంటోనియో ''కమ్యూనిస్టు చైనాతో నీ స్నేహాన్ని సైన్యం అనుమానంగా చూస్తోంది.'' అని బహిరంగంగా ప్రకటించాడు. ''కమ్యూనిస్టు పార్టీతో కలిసి యితను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు'' అని కొందరు ఆర్మీ ఆఫీసర్లు, రైటిస్టు రాజకీయనాయకులు ఆరోపిస్తున్నారు. తమ సైనిక స్థావరాలు వున్న యింత కీలకమైన దేశాన్ని అమెరికా వదులుకోవడానికి సిద్ధంగా వుండదు కాబట్టి రోడ్రిగోకు ఎసరు పెడుతుందేమో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)