హిందీ సినిమాలో కూడా వాచీ పోయాక హీరోకి పిచ్చెక్కింది. అయితే సురయ్యా తెచ్చి యిచ్చింది. దీనికో కథ వుందన్నాడు. కానీ అంతకంటె వివరాలు చెప్పలేదు. ఆమె హీరోయిన్ వద్దకు వచ్చి 'అతని పేరు చందర్ ఆ గడియారం అంటే అతనికి ప్రాణం' అని చెప్పింది. అదే సమయంలో హీరోవద్దనుండి ఉత్తరం రావడంతో హీరోయిన్‌కు రూఢి అయిపోయింది – యితనే తన బాల్యస్నేహితుడు చందర్ అని. అతన్ని తన యింటికి రమ్మనమంది. ఇక్కడనుండి కథ చాలా సింపుల్‌గా ముగుస్తుంది. అయితే సినిమా అంత సూపర్ హిట్ కావడానికి కారణం నూర్జహాన్ పాటలు.
తెలుగు సినిమాలో హీరో చెల్లెలు హీరోయిన్ ఫ్యాన్ కదా. ఆ విధంగా వారికి చేరువై హీరోని బాగా అటపట్టించింది. కానీ హీరో మనసులో తన బాల్యస్నేహితురాలికే చోటిచ్చాడు కాబట్టి అంతగా స్పందించడం లేదు. ఈ దశలో హీరోయిన్ తండ్రి ఓ ఎంపీ కొడుకుతో ఆమె పెళ్లి ఏర్పాటు చేశాడు. ఆ ఎంపీ కొడుకు వెధవే అయినా వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేద్దామనుకున్నాడు. కానీ హీరోయిన్ చేసుకోనంది. తన బాల్యస్నేహితుడు చంటి వూళ్లోనే వున్నాడని అతన్నే చేసుకుంటానని చెప్పింది. సరేనన్నాడు తండ్రి. అన్నాడే కానీ కుట్ర పన్నాడు.
హిందీలో క్రైసిస్ యింకోలా వచ్చింది. హీరోయిన్ తండ్రి హీరోయిన్ పెళ్లి ఓ డబ్బున్నవాడితో ఫిక్స్ చేశాడు. అతను వేరెవరో కాదు హీరోకి అప్తమిత్రుడు వుద్యోగం యిచ్చి ఆదుకున్నవాడూ అయిన మురాద్. హీరోయిన్‌ను కలవడానికి హీరో వెళ్లిన సమయంలోనే అతను వాళ్లింట్లో డిన్నర్ చేస్తున్నాడు. ఈ తతంగం ఎప్పుడు ముగుస్తుందా హీరోని ఎప్పుడు కలుద్దామా అని చూస్తోంది హీరోయిన్. పెళ్లిచూపులకు వచ్చినవాడు తన ఫ్రెండని హీరోకి తెలియదు. అతను హీరో ఫ్రెండని హీరోయిన్‌కు తెలియదు. పెళ్లి వాళ్లు వెళ్లాక హీరోహీరోయిన్లు తోటలో కలిశారు. వాళ్లిద్దరినీ చూసిన సురయ్యాకు అంతా అర్థమైంది. 'నేను చందర్‌ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. చందర్ ఫలానా అని నీకు తెలుసు. అయినా నా దగ్గర నీ ప్రేమ దాచావ్. ఇదేనా దోస్తీ? నీ ప్రేమకు అడ్డు రానులే' అని ఏడ్చింది. ఈ సారి మగపెళ్లివారు తమ యింట్లో పార్టీ ఏర్పాటు చేసి కాబోయే కోడల్ని రమ్మనమన్నారు. హీరోను కూడా రమ్మన్నారు. తన ఫ్రెండు హీరోయిన్‌ను తనకు కాబోయే భార్యగా పరిచయం చేయగానే హీరో కంగు తిన్నాడు. హీరోయిన్ మూర్ఛపోయింది.
తెలుగులో హీరోకు ఉపద్రవం స్నేహితుడినుండి రాలేదు. చెల్లెలినుండి వచ్చింది. హీరోయిన్ తండ్రి పెద్ద ప్లాన్ వేసి అతన్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు తెలిసున్నవాళ్ల ద్వారా చెల్లెలి పెళ్లి కుదిర్చాడు. తన మాట విని హీరోయిన్‌ను వదిలేయకపోతే ఆ పెళ్లి చెడగొడతానని బెదిరించాడు. తనకు ఆశ్రయం యిచ్చినవాళ్ల పట్ల కృతజ్ఞతతో హీరో నోరెత్తలేదు. అప్పటికే అతనికి హీరోయినే తన ప్రేయసి అని తెలిసిపోయింది. సైడ్ హీరోయిన్ తనూ రాయ్ ఓ సారి అనుకోకుండా స్వాతిలో సీరియల్ చదివింది. వెంటనే హీరోకి చెప్పింది – నువ్వు వెతికే అనూ యీమేనని. అతనూ సీరియల్ చదివి నిర్ధారించుకున్నాడు. సరిగ్గా ఆ పాటికి హీరోయిన్ వేరే వూళ్లో వుంది. వచ్చీ రాగానే సర్‌ప్రైజ్ యిస్తానని చెప్పాడు హీరో. నువ్వు వెతుకుతున్న చంటిని నేనే అని చెప్దామనుకున్నాడు.
కానీ యీలోగా హీరోయిన్ తండ్రి తెచ్చిపెట్టిన ఉపద్రవం వలన హీరోయిన్ తనను అసహ్యించుకునేట్టు ఎలా చేయాలా అనుకున్నాడు. ఆమె అన్న ప్రకారం బీచ్‌కి వచ్చింది. 'ఆ అనూకోసం వెతకడం వేస్టు. ఆ గడియారం పారేస్తున్నాను. ఆమెను మర్చిపోతున్నాను. నువ్వే నాకు కావలసినదానివి. రా పెళ్లి చేసుకుందాం' అన్నాడు. ఆమె మండిపడింది. 'నిన్నటిదాకా అనూ అన్నావు. ఇవాళ నన్ను అంటున్నావు. రేపు ఎవర్నంటావో ఫో' అంది. తండ్రి చేసుకోమన్న పెళ్లికి సరేనంది. హీరో స్నేహితుడు సునీల్ అతన్ని మందలించి పారేసిన గడియారాన్ని అతని జేబులో పెట్టాడు.
హిందీ సినిమాలో హీరోగానీ హీరోయిన్ గానీ పెద్దల నెదిరించలేదు. హీరో తన ఫ్రెండుకి కూడా తన ప్రేమగాథ చెప్పలేదు. బొంబాయి విడిచి వెళ్లిపోతూండగానే అతని తల్లి పోయింది. హీరో రాకపోతే పెళ్లే చేసుకోనన్నాడు అతని స్నేహితుడు. పెళ్లి జరిగింది. హీరో వచ్చి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. పెళ్లయ్యాక 'ఇప్పుడు నీకు తృప్తేనా?' అని అడిగింది నూర్జహాన్ తన స్నేహితురాలు సురయ్యాతో కసిగా. హీరో పెళ్లి కానుకగా ప్రేయసికి గడియారం యిచ్చేశాడు. ఒంటరిగా వెళ్లిపోయాడు. కానీ సురయ్యా అతని వెంట పరిగెట్టింది. ఇక్కడితో హిందీ సినిమా అయిపోయింది.
తెలుగు సినిమాకు వస్తే – హీరోయిన్ తండ్రి మాట విని పెళ్లి చేసుకునే రోజున సైడ్ హీరోయిన్ ఆమెకు అసలు విషయం చెప్పేసింది. నువ్వు అనూ అని తెలిసే హీరో కావాలని నాటకం ఆడాడని. అది చెల్లికోసం చేస్తున్న త్యాగమనీ మధ్యలో విలన్ నీ తండ్రేననీ చెప్పింది. హీరోయిన్ తండ్రి బలవంతంగా పెళ్లిమంటపం వద్దకు తీసుకెళుతూంటే ఆమె తప్పించుకుని పారిపోయింది. తండ్రి వెంటనే హీరో చెల్లి పెళ్లి పందిరికి వచ్చి ఆ పెళ్లి ఆపించబోయాడు. అప్పుడు హీరో చేసిన త్యాగమేమిటో పెంపుడుతండ్రికి తెలిసింది. పెళ్లి కొడుకు మంచివాడు కావడంతో పెళ్లి జరిగిపోయింది కానీ హీరోయిన్ తండ్రి వెంట వచ్చిన రౌడీ హీరోని పొట్టలో పొడిచేశాడు. ఆపరేషన్ జరిగింది. ఆశ విడిచివేసిన సమయంలో ఓ చిత్రం జరిగింది. జేబులోంచి జారిన గడియారం సౌండ్‌తో హీరో కళ్లు తెరిచాడు.
ఇలా సుఖాంతంగా ముగిసింది తెలుగు సినిమా. సునీల్ ద్వారా చంద్రమోహన్ కుటుంబం ద్వారా ఎంతో మంచి హాస్యం పెట్టారు. పాటలతో బాటు సినిమా కూడా చాలా హిట్ అయింది. మొదటే చెప్పినట్టు 55 యేళ్ల క్రితం నాటి హిందీ సినిమాలోని కాస్త పాయింటును పట్టుకుని తెలుగులో చాలా విస్తరింపజేశారు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)