ఎమ్బీయస్‌: సినీమూలం- నిన్నే పెళ్లాడుతా- 2

తెలుగుసినిమాలో పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే శోభనం రాత్రి హీరోయిన్‌ ఆడి, పాడి హీరోని రెచ్చగొట్టింది. హీరో చేరువ కాబోయే సమయానికి పంతంకొద్దీ నిన్ను పెళ్లాడాను తప్ప కాపురం చేయడానికి కాదంది హీరో ఏమీ…

తెలుగుసినిమాలో పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే శోభనం రాత్రి హీరోయిన్‌ ఆడి, పాడి హీరోని రెచ్చగొట్టింది. హీరో చేరువ కాబోయే సమయానికి పంతంకొద్దీ నిన్ను పెళ్లాడాను తప్ప కాపురం చేయడానికి కాదంది హీరో ఏమీ చేయలేక యోగివేషం కట్టాడు కానీ ఆమె చలించలేదు. తండ్రి తిడితే ఆయన్నే ఎదిరించింది. దాంతో హీరో ఓ ప్లాను వేసి మావగార్ని మాయమై పొమ్మన్నాడు. మావగారు మాయం కావడం, దాని పర్యవసానాలు యివన్నీ తెలుగులో కల్పించినవే. ఒరిజినల్‌ షేక్‌స్పియర్‌ నాటకంలో పెళ్లి కాగానే హీరో హీరోయిన్‌ను తీసుకుని హనీమూన్‌కి బయలుదేరాడు. ఆమె దారిలో గుఱ్ఱంమీదనుండి పడింది. మరో గుఱ్ఱం ఆమెను తొక్కేసింది. హీరో ఆమెకు సహాయపడలేదు, జాలి చూపించలేదు. ఆమెను బాధించి, వేధించి, గర్వాన్ని అణచాడు. ఈ కాలంలో గుఱ్ఱాలు లేవు కాబట్టి బిబిసి వారి సినిమాలో విమానాలతో, కార్లతో ఎలా ఏడిపించాడో చూపించారు. 

పెళ్లిలో హీరో చేష్టలకు హీరోయిన్‌ మండిపడింది. టిక్కెట్లు ఆల్‌రెడీ బుక్‌ చేసింది కాబట్టి హనీమూన్‌కి బయలుదేరింది. విమానంలో తన పక్క సీటులో మొగుడు కూచోడానికి వీల్లేదంది. విమానం దిగాక కారు టైరు పంక్చరయితే తనే మార్చవలసి వచ్చింది. హీరో సాయం చేయలేదు. ఫైనల్‌గా యిల్లు చేరాక సామాన్లేవీ అని హీరోయిన్‌ అడిగితే 'ఎయిర్‌పోర్టులో నీ పెట్టె పోగొట్టేశాను, మొబైల్‌ మర్చిపోయాను' అన్నాడు హీరో. 'ఇక్కడ నీకు బట్టలు లేవు, తిండి లేదు. ఊళ్లోకి వెళదామంటే కారు టైర్లు పంక్చర్‌' అన్నాడు. కోపం కొద్దీ హీరోయిన్‌ నడిచి ఊరు వెళ్లబోయింది. లిఫ్ట్‌ యిచ్చే నాథుడు లేడు. తిరిగి వచ్చింది. ఒరిజినల్‌ నాటకంలో యిక్కడో సీను వుంది. ఆమె ఆకలితో నకనకలాడుతూ వుంటే హీరో లేని కోపాన్ని నటించి, నౌకర్లను తిట్టేసి, వంటకాలను వెనక్కి పంపేసి ఆమెకు తిండి లేకుండా చేస్తాడు. దెబ్బకు ఆమెకు బుద్ధి వస్తుంది. వీడికి తనకంటె కోపంలా వుంది, ఇలా వుంటే తిండిలేక చావాలనుకుని, కొంచెం శాంతంగా వుండండి అని బతిమాలుతుంది. ఇలా రివర్స్‌ గేమ్‌లో అతను ఆమెకు బుద్ధి చెపుతాడు. ఈ సీనుని శివాజీ గణేశన్‌, భానుమతి నటించిన ఓ తమిళ సినిమా 'అరివాళి'లో యథాతథంగా వాడుకున్నారు. ఆ సినిమా కథ కూడా కొంతవరకు యీ నాటకాన్ని పోలి వుంటుంది. తెలుగులో కథ వేరే రకంగా వెళుతుంది. 

ఒరిజినల్‌ నాటకంలో హీరోయిన్‌కు చెల్లెలుంటుంది కదా, తెలుగులో ఆ పాత్ర తీసేసి, అన్నగార్ని పెట్టారు. పాత్రధారి కాకరాల. అతను కాస్త వాజమ్మ. రమణారెడ్డి విజయలలిత సంబంధం తెచ్చాడు. అమ్మాయి కాకరాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తల్లి పాతిక వేలు కట్నం అడిగితే తమ యినప్పెట్టెలోంచే కొట్టేసి వాళ్లిచ్చినట్టు చెప్పి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లయాక ఆ విషయం తల్లికి చెప్పేశాడు కూడా. దాంతో అప్పటిదాకా బాగా చూసుకుంటున్న కోడల్ని హింసించడం మొదలెట్టింది సూర్యకాంతం. కూతురి కాపురం ఒకలా, కొడుకు కాపురం మరోలా అఘోరించడం చూసి విసిగిన రావి కొండలరావు అల్లుడి సలహా మేరకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయాడు. ఇంటిమీద రెండు లక్షల అప్పు వుంది, మార్వాడీ స్వాధీనం చేసుకుంటాడని చెప్పి మరీ పోయాడు. మావగారు పోవడంతో కొడుక్కి, కోడలికి అధికారం చేతికి వచ్చేసింది. కోడలు అత్తగారిని అడబిడ్డను ఏడిపించుకుని తింది. ఇక్కడెందుకు యీ అవస్థలు మన యింటికి వెళ్లిపోదాం అని హీరో అన్నా హీరోయిన్‌ వినలేదు. తల్లీకూతుళ్లకు స్వంత యింట్లోనే తిండికోసం దొంగతనం చేయవలసి వచ్చింది. పాచి అన్నం తినవలసి వచ్చింది. ఇంతలో రావి కొండలరావు మార్వాడీ వేషంలో వచ్చి యిల్లు ఖాళీ చేయించాడు. కాకరాల అత్తారింటికి వెళ్లిపోగా, హీరోయిన్‌ తల్ల్లి రోడ్డుమీద పడ్డారు. 

ఈ పరిస్థితుల్లో కూడా హీరోయిన్‌ లొంగలేదు. పెళ్లయాక పుట్టింట్లో నీకేం పని అని వదినగారు యీసడించినా భర్త యింటికి వెళ్లడానికి యిష్టపడలేదు. రోడ్డు మీద తిరుగుతూంటే పోలీసులు అరెస్టు చేయబోయి భర్త యింటికి చేర్చారు. హీరో ఆమెను వంట చెయ్యమంటే యింటిని తిట్టిపోసింది.  హీరో అత్తగారికి బుద్ధి చెప్పాడు – రెక్కాడితేగానీ డొక్కాడదు. నీ కూతురికి పనిపాటలు నేర్పు అని.  కానీ హీరోయిన్‌లో మార్పు లేదు. ఇంకోడి సొమ్ము నేను తినను అంటూ అన్నం ముట్టలేదు. ఇక హీరో నిస్పృహ చెందాడు. ఈ మొండిఘటాన్ని వదిలేస్తానన్నాడు. రమణారెడ్డి ఆమెను బడితెతో కొట్టమన్నాడు. ఇష్టం లేకపోయినా హీరో ఆ పనీ చేశాడు. కానీ దానివలన జరిగిందేమిటంటే హీరోయిన్‌ యిల్లు విడిచి వెళ్లిపోయింది. 

తెలుగు కథను యిక్కడితో ఆపి ఒరిజినల్‌ నాటకంలో ఏం జరిగిందో చూదాం. హీరోయిన్‌ సౌమ్యురాలై పోయింది. తక్కినవారందరి భార్యలలో కంటె ఆమె వినయవంతురాలిగా ఓ పోటీలో నెగ్గింది కూడా. తన కూతుర్ని అంత చక్కగా మార్చినందుకు హీరోయిన్‌ తండ్రి హీరోకి పెద్ద కట్నం యిచ్చాడు. హీరోయిన్‌ చెల్లెల్ని ప్రేమించిన హీరో ఫ్రెండు ఆమె తన ప్రేమ నిరాకరించి మరొకణ్ని పెళ్లాడడంతో ఆమెను వదిలేసి ధనికురాలైన ఓ వితంతువును పెళ్లాడాడు. 

ఇక బిబిసి వాళ్లు తీసిన సినిమాలో ఘట్టాలు ఎలా వున్నాయో చూదాం. హనీమూన్‌కి వచ్చిన హీరో హీరోయిన్‌ వద్దంటున్నా ఆమె వద్దకు చేరి వూరించి వూరించి చివరకు 'నీ కిష్టం అయినపుడే చూదాం లే' అని ప్రయత్నాన్ని విరమించుకుని, హీరోయిన్‌ను వుసూరుమనిపించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు హ్యారీని తన యింటికి రప్పించాడు. హ్యారీ ప్రేమించిన హీరోయిన్‌ చెల్లెలు అతన్ని కాదంది. ఇటాలియన్‌ కుర్రాణ్ని పెళ్లి చేసుకుంటానంది. ఇక అతను ఆశ విడిచాడు. ఎవరైనా డబ్బున్న వితంతువును పెళ్లి చేసుకుంటానన్నాడు. తన జీవితం గురించి సమీక్షించుకుంటూన్న హీరోయిన్‌ అతనితో ముచ్చటించింది. హ్యారీ ఆమెతో 'నువ్వు హీరోను నీ కెరియర్‌ కోసం చేసుకున్నావా, లేక ప్రేమకోసం చేసుకున్నావా?' అని అడిగాడు. 'కెరియార్‌ కోసం కాదు, ప్రేమకోసమే' అంది ఆమె. ''ప్రేమకోసం చేసుకుంటే మరి 'యిమేజ్‌ దెబ్బతింది, కెరియర్‌ పోయింది' అని ఏడవడం దేనికి?'' అని నిలదీశాడు. 

ఆమెకు జ్ఞానోదయం కలిగింది. హీరో ప్రేమనైనా దక్కించుకోవాలనుకుంది. అతని మాట వింటానంది. ఎంతలా అంటే హీరో 'నేను సూర్యుణ్ని చూపించి చంద్రుడంటే అవును చంద్రుడే అనాలి నువ్వు' అని చెప్తే 'అలాగే అంటాను' అనేటంత! హీరో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కాపురం చక్కబడింది. దానితో చెల్లెలి పెళ్లిపై దృష్టి సారించింది. ఆ చెల్లెలు తను పెళ్లి చేసుకోబోయే ఇటాలియన్‌ కుర్రాడితో పెళ్లి తర్వాత నా కెరియర్‌కు అడ్డురానని అగ్రిమెంటు రాయాలని షరతు పెట్టింది. 'పెళ్లిలో యిలాటి షరతులు వుండవు. భర్త అడుగుజాడల్లో నడిస్తే నడు, లేకపోతే పెళ్లి మానేయ్‌' అని ఆమెకు హితోపదేశం చేస్తుంది హీరోయిన్‌. హీరోయిన్‌ భర్త ఆమెకు రాజకీయాల్లో సహకరించాడు. ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా, ప్రధానమంత్రిగా ఎదిగింది. గృహిణిగా కూడా చక్కగా మెలగింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. జీవితం హాయిగా సాగిపోయింది. ఈ బిబిసి వారి సినిమాకు డైరక్టర్‌ డేవిడ్‌ రిచర్డ్స్‌. 

తెలుగు సినిమా ఎలా సాగిందో చూసేముందు కొన్ని వివరాలు. తెలుగు సినిమాకు రచన జి కె మూర్తి. కథ, స్క్రీన్‌ప్లే నిర్వహణ విఠలాచార్య. దర్శకుడు, నిర్మాత ఆయన కుమారుడు బి. శ్రీనివాస్‌. ఈ సినిమాకు ఆధారమైన ''వద్దంటే పెళ్లి'' సినిమాకు దర్శకుడు విఠలాచార్య. రచన రామచంద్‌, జికె మూర్తి. హీరో చలం. రమణారెడ్డిది అదే కారెక్టర్‌. ఆ సినిమాలో హీరోయిన్‌ కృష్ణకుమారితో బాటు మరి రెండు స్త్రీపాత్రల్ని పెట్టారు. శ్రీరంజని భర్త ఏం చేసినా పడి వుండే కారెక్టరయితే, గిరిజది స్వేచ్ఛగా తిరిగే కారెక్టరు. ''వద్దంటే పెళ్లి''ని ''నిన్నే పెళ్లాడుతా''గా మళ్లీ తీసినపుడు ఈ రెండు పాత్రలూ తీసేసి అన్నగారి పాత్రను, వదినగారి పాత్రను పెట్టారు. సరే తెలుగు సినిమా ఎలా ముగిసిందో చూద్దాం.

ఇంట్లోంచి వెళ్లిపోయిన హీరోయిన్‌ తన ఫ్రెండ్‌ వద్దకు వెళ్లి వుద్యోగం చూపమంది. ఓ డబ్బున్నాయన యింట్లో బర్త్‌డే పార్టీకి యీవెంట్‌ మేనేజర్‌గా వెళ్లమంది ఆమె. ఆ డబ్బున్నాయన హీరోయే. మారువేషంలో వున్నాడు. పార్టీ అయ్యాక హీరోయిన్‌తో మిస్‌బిహేవ్‌ చేస్తే ఆమె అసహ్యించుకుంది. ఇతను ఎత్తుకుపోయాడు. ఆమె తాలూకువాళ్లు వెంటపడ్డారు. కాస్సేపు ఫైటింగ్‌ జరిగింది. మారువేషం హీరో పారిపోయాక అందరూ కలిసి హీరోయిన్‌కు బుద్ధి చెప్పారు. రక్షణ లేని ఆడదాని బతుకు కష్టమని. ఆడా మగా కలిసివుండడమే ప్రకృతిధర్మమనీ, ఎక్కువ తక్కువ తేడాలు లేవనీ అందరూ చెప్పడంతో హీరోయిన్‌కు బుద్ధి వచ్చింది. భర్త దగ్గరకు వెళదామనుకుంది. కానీ హీరోయిన్‌ బతిమాలినా హీరో మెత్తబడనట్టు నటించి కత్తితో పొడుచుకున్నట్టు యాక్షన్‌ చేశాడు. రమణారెడ్డి సహకరించాడు. హీరోయిన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో హీరో నటన విరమించాడు. రావి కొండలరావు కూడా మార్వాడీ మారువేషం విప్పేసి తను బతికే వున్నానని చెప్పి అందర్నీ సంతోషపెట్టాడు. కథ సుఖాంతం. ఈ సినిమా చూస్తే యిది విదేశీ కథ అని ఏ కోశానా అనిపించదు. ఇక్కడ పుట్టినదే అనిపిస్తుంది. కథను యిలా మలచుకోవడంలోనే వుంది మనవాళ్ల ప్రజ్ఞ. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Part-1