లతా మంగేష్కర్ సినిమాల్లోకి కొత్తగా వచ్చిన రోజులవి. అనిల్ బిశ్వాస్ వద్ద పాడడానికి ఆమెకు ఛాన్సు వచ్చింది. పాట పాడుతూ మధ్యలో ఊపిరి పీల్చుకోవలసి వచ్చినపుడు, గానప్రవాహానికి అడ్డు రాకుండా ఊపిరి ఎలా పీల్చుకోవాలో ఆయనే నేర్పాడామెకు. లతా దాన్ని సాధన చేసిన తీరు చూసి చాలా ముచ్చటేసింది ఆయనకు. ఓ రోజు యిద్దరూ కలిసి గోరేగావ్‌లో వున్న ఫిల్మిస్తాన్ స్టూడియోకి లోకల్ ట్రెయిన్లో వెళుతున్నారు. అప్పట్లో బొంబాయిలో స్టూడియోలన్నీ ఊరవతల వుండేవి. వీళ్లు ఊళ్లో వుండేవారు. స్వంతకార్లు వుండేవి కావు. అందువల్ల యీ కళాకారులందరూ ఉపయోగించేది లోకల్ ట్రెయిన్లే. ట్రెయిన్లో వెళుతూండగానే ఏదైనా ట్యూన్ తడితే సిగరెట్టు పెట్టిమీద కొడుతూ అది గాయకులకు నేర్పించడం, వాళ్లు పాడి వినిపించడం కూడా జరుగుతూండేది.
అనిల్ బిశ్వాస్, లతా వెళుతున్న ట్రెయిన్ కంపార్టుమెంటులోనే బాంద్రా స్టేషన్లో దిలీప్ కుమార్ ఎక్కాడు. అతనూ స్టూడియోకే వెళుతున్నాడు. అప్పటికే హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ బిశ్వాస్‌ను పలకరించాడు. అనిల్ లతాను కొత్త గాయనిగా పరిచయం చేస్తూ 'చాలా ప్రతిభావంతురాలు. గొప్పగా పాడుతుంది.' అంటూ చెప్పుకొచ్చాడు. దిలీప్ కుమార్ లతాకేసి ఎగాదిగా చూశాడు. సన్నటి, నల్లటి పిల్ల. చూడగానే మహారాష్ట్రియన్ అని తెలుస్తోంది. 'ఈమె హిందీ పాటలు పాడడమేమిటి?' అనుకున్నాడు.
ఇక్కడొకటి చెప్పాలి. అప్పటిదాకా హిందీ సీమలో గాయనీగాయకులుగా వెలుగొందుతున్నవారు పంజాబ్, సింధు ప్రాంతాలకు చెందిన ముస్లిములు. పాటల్లోనూ, మాటల్లోనూ ఉర్దూ పాలు చాలా ఎక్కువగా వుండేది. వీళ్ల ఉర్దూ ఉచ్చారణ స్వచ్ఛంగా, నిర్దుష్టంగా వుండేది. పైగా అప్పట్లో మగైనా, ఆడైనా సరే ఫుల్థ్రోటెడ్ (బండగా అనవచ్చేమో) పాడడం అలవాటుగా వుండేది. తర్వాత తర్వాత సినిమాపాటల్లో కనబడిన లాలిత్యం అప్పట్లో వుండేది కాదు. నూర్జహాన్, షంషాద్ బేగం, సురయ్యా వీళ్లంతా పుష్టిగా, కండపట్టి వుండేవారు. ఖయ్‌మని పాట ఎత్తుకునేవారు.
హిందీ గాయని అంటే యిలా వుండాలి అనుకునే ఈ నేపథ్యంలో యీ బక్కపిల్ల ఏం పాడుతుంది అని దిలీప్ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆమె మహారాష్ట్ర అమ్మాయి. వాళ్ల ఉర్దూ ఉచ్చారణ అంతంత మాత్రమే. దాన్ని గుర్తు చేస్తూ దిలీప్ కుమార్ 'అంతా బాగానే వుందిలే కానీ, వీళ్ల ఉర్దూ పప్పన్నం వాసన కొడుతుంది' అన్నాడు. మహారాష్ట్రవాళ్లు మన దక్షిణాది వాళ్లలాగానే అన్నం ఎక్కువ తింటారు. పప్పు వేసి కిచిడీ అని చాలా యిష్టంగా తింటారు. మన హీరో గారు పఠాన్. చపాతీలు, తందూరీలు, కక్కా ముక్కా తినే రకం. తింటే గింటే కాస్త బాసుమతీ బియ్యం ఎంగిలి పడతాడేమో! అందుకని నిత్యం అన్నం తినేవాళ్లంటే చిన్నచూపు. మనం కూడా చూడండి, సినిమాలో ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తూంటే 'సాంబారు వాసనేస్తున్నాడురా' అంటాం. అరవ్వాళ్లలా ఓవరాక్షన్ చేస్తున్నాడని మన అర్థం. అలాటి అర్థంలోనే దిలీప్ ఆ వ్యాఖ్య చేశాడు.
ఇది విన్న లతా కాస్సేపు ఏడ్చుకుని ఊరుకుంటే ఆమె లతా మంగేష్కర్ కాకపోయేది. తక్షణం ఓ మౌల్వీ గారిని ట్యూషన్ పెట్టించుకుని చక్కగా ఉర్దూ నేర్చుకుంది. నౌషాద్ వద్ద శిష్యరికం చేసి చక్కటి ఉర్దూ పాటలు పాడి ఆయన చేత శభాష్ అనిపించుకుంది. ఆ పాటలు విన్న తర్వాత దిలీప్ లతాకు వీరాభిమాని అయిపోయాడు! తెలిసీ తెలియకుండా తను చేసిన వ్యాఖ్యలకు లెంపలేసుకున్నాడు.
**********
దిలీప్ కుమార్ వేషాలు తిరస్కరించడంలో మొనగాడు. అతను వేయడానికి నిరాకరించిన పాత్రల్లో ''సంగమ్''లో రాజేంద్ర కుమార్ పాత్ర ఒకటి. నిజానికి ఆ కథ సినిమాగా తయారవ్వడానికి పదిహేనేళ్లు పట్టింది. దిలీప్, నర్గీస్, రాజ్ ముగ్గురూ నటించిన లవ్ ట్రయాంగిల్ కథ ''అందాజ్'' (1949) సినిమా! దీనిలో నర్గీస్ దిలీప్‌కే దక్కుతుంది. అదే సమయంలో తనూ నర్గీస్ నాయికా నాయకులుగా ''బర్సాత్'' సినిమా తీసి హిట్ చవి చూసిన రాజ్ కపూర్ ''అందాజ్'' టీముతో యింకో సినిమా తీస్తే హిట్ అవుతుందని ప్లాను వేశాడు. అతని కథారచయిత ఇందర్ రాజ్ ఆనంద్ ''ఘరోండా'' అనే కథ రాసి తెచ్చాడు. దిలీప్, నర్గీస్లకు కూడా కథ నచ్చింది. సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతూండగా దిలీప్‌కు అనుమానం వచ్చింది. రాజ్ కపూర్ తన సాటి నటుడే కాక, దర్శకనిర్మాత కూడా! స్వంత పాత్రను హైలైట్ చేసుకుని తన పాత్రను దెబ్బ తీస్తే!?
అలాటిదేమీ జరగదన్నాడు రాజ్ కపూర్. 'చిన్ననాటి మిత్రులం. స్కూల్లో కలిసి ఫుట్‌బాల్ అడుకున్నవాళ్లం. నీ పాత్ర దెబ్బ తీస్తే అది అల్టిమేట్‌గా సినిమాకే దెబ్బ కదా! ఇంత పెట్టుబడి పెడుతూ అలాటి పని చేస్తానా?' అని నచ్చచెప్పబోయాడు. కానీ దిలీప్ వినలేదు – 'నువ్వు డైరక్టరుగానైనా వుండు, లేదా పాత్రధారిగానైనా వుండు, అంతే గానీ రెండూ చేస్తానంటే కుదరదు' అన్నాడు దిలీప్. ఈ మాటలకు రాజ్ కపూర్‌కు కష్టం తోచింది. దిలీప్ తప్పుకున్నాడు. ఇంత పవర్ఫుల్ ట్రయాంగిల్ లేకుండా సినిమా పండదని అనుకుని రాజ్ కపూర్ ఆ కథను అటకెక్కించాడు.
ఒక పుష్కరం గడిచింది. తొలిసారి కలర్లో, విదేశాలలో భారీ బజెట్‌తో సినిమా తీద్దామనుకున్నాడు. మంచి కథకోసం వెతుకుతూండగా ''ఘరోండా'' కథ గుర్తుకు వచ్చింది. ''సంగమ్'' పేరుతో సినిమా తీద్దామనుకున్నాడు. మొదట అనుకున్న ట్రయాంగిల్ ఎలాగూ లేదు. దిలీప్ వేయనంటున్నాడు. ''జాగ్తే రహో'' తర్వాత నర్గీస్‌తో విడిపోవడం కూడా జరిగింది. అప్పుడు దిలీప్ స్థానంలో రాజేంద్ర కుమార్‌ను తెచ్చాడు. నర్గీస్ స్థానంలో వైజయంతిమాలను తెచ్చాడు. రెండేళ్లు కష్టపడి ''సంగమ్'' (1964) నిర్మించాడు. అది కాసులవర్షం కురిపించింది. (సశేషం)
(ఫోటో- దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, లతా, దిలీప్)
-ఎమ్బీయస్ ప్రసాద్