క్రీమీ లేయర్ వ్యాసంపై వచ్చిన విమర్శలకు నా జవాబులు – 1) మా నాన్న పోయినపుడు గోదానం బ్రాహ్మడికే ఎందుకివ్వాలి? గొల్లవాడికి యివ్వవచ్చుగా అని అడిగారు ఒకాయన. నేను ఆ విషయాన్ని చెప్పిన సందర్భం ఏమిటి? నేటి సమాజంలో ఆవులను పోషించే పరిస్థితి లేదు అని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పాను. దానిలో కులప్రస్తావన అనవసరం. ముందుగా గోదానం కాన్సెప్టు అర్థం చేసుకోవాలి. దానగ్రహీతకు నీకూ, నీ కుటుంబానికి సొంతానికి వుపయోగించుకో అని చెప్పి యిస్తారు తప్ప దీని పాలు అమ్ముకు డబ్బు చేసుకో అని యివ్వరు. అలా అయితే పాల కంపెనీలకే దానం యిచ్చేయవచ్చు. ఆ యిచ్చేది పేద బ్రాహ్మడికే ఎందుకివ్వాలి అంటే శుభాశుభాల్లో చాకలికి, మంగలికి, కంసాలికి, భోగం వారికి (యీ మధ్య మానేశారు), కొజ్జాలకు కట్నాలు (డబ్బు యిచ్చినపుడు తాంబూలాల్లో పెట్టి యిస్తారు) యిస్తారు. దాని వలన మాకు సామాజిక గౌరవం వచ్చేసిందని వాళ్లందరూ రిజర్వేషన్లు వద్దంటారా?
ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది దానం పుచ్చుకోవడం వలన బ్రాహ్మడికి సామాజిక గౌరవం పెరగదు. అర్థిగా, యాచకుడిగా వచ్చినవాడి స్థాయి ఎప్పుడూ తక్కువే. మహావిష్ణువంత వాడు బలి దగ్గర దానానికై వచ్చినపుడు కుబ్జుడై వచ్చాడనే చమత్కార శ్లోకం వుంది. ఊరికే వస్తోంది కదాని ప్రతి బ్రాహ్మడు దానాలు స్వీకరించడు. దానం పుచ్చుకోగానే సరికాదు, పుచ్చుకున్నందుకు గాను ప్రాయశ్చిత్త కర్మలుంటాయి. అవి చేసేవాళ్లే దానాలు స్వీకరిస్తారు. అందుకే చాలామంది పురోహితులు దానాలు పట్టరు. పట్టినవాళ్లు కూడా కొన్ని రకాల దానాలు పట్టరు. ఈ తలకాయనొప్పి ఎందుని చాలామంది పురోహితులు ఆ వృత్తి నుండి తప్పుకుంటున్నారు, తమ పిల్లలను కంప్యూటర్ ఆపరేటర్ వంటి వేరే వృత్తుల్లోకి పంపుతున్నారు. బ్రాహ్మల్లో పురోహితుల శాతం చాలా చాలా తక్కువ. వారికి సామాజిక గౌరవం వుందని యీ పాఠకుడు అంటున్నారు. వాళ్లేమో 'మాకు పిల్లనిచ్చేవాడు లేడు' అని టీవీల్లో వాపోతున్నారు. సాధారణ జనం పురోహితుడి కాళ్లకే మొక్కుతారు, అదీ పూజా సమయాల్లో! పుణ్యం వస్తుందనో మరో దానికో!! బ్రాహ్మణ పుటక పుట్టిన ప్రతివాడి కాళ్లకు దణ్ణాలు పెట్టరు. గోదాన ఘట్టం చూసి బ్రాహ్మలందరికీ సామాజిక గౌరవం వుందనడం పొరబాటు. గౌరవం అనేది వ్యక్తి గుణగణాల బట్టి, ఆర్థిక స్థితి బట్టి కలుగుతుంది.
తక్కువ కులం వారి యింట్లో అగ్రకులస్తులు భోజనం చేయరు అని మరొకరన్నారు. వీటన్నిటినీ నిర్ణయించేది ఆర్థికస్థాయి మాత్రమే. హరిజన ఐయేయస్ అధికారి యింటికి పేద బ్రాహ్మడు అతిథిగా వెళతానంటే రానిస్తారా? 'మా యింటికి ఎవరైనా అగ్రకులస్తులు వచ్చి భోజనం చేస్తే నాకు సామాజిక గౌరవం వచ్చేసినట్లే లెక్క, యిక నేను రిజర్వేషన్ కోరను' అని ఎవరైనా బిసి, ఎస్సీ అంటారా? ఇదేదో జగ్జీవన్ రామ్ వంట బ్రాహ్మడి వాదనలా వుంది. ఎస్సీ, బిసిలు కాని కులాల వారందరూ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని, మేం అందరి కంటె తక్కువ, మాది నీచకులం, మాకు గౌరవం లేదు అని మనసా, వాచా, కర్మణా అనుకునేదాకా రిజర్వేషన్లు కొనసాగాలన్నమాట! వాళ్లకు అంత ఖర్మేం పట్టింది? ఎవడి కులం వాడికి గొప్ప. వేరే వాళ్లతో పోల్చుకునే పనే లేదు.
క్రీమీ లేయర్ భూస్వాముల విషయంలో, రాజకీయవేత్తల విషయంలో అప్లయి కానప్పుడు బిసిలకు మాత్రం ఎందుకు చేయాలని మరొకరు అడిగారు. ఆ భూస్వాములు, నాయకులు కూడా ప్రతిభావంతుల నుంచి అవకాశం లాక్కుని మా కియ్యండి అని డిమాండ్ చేసినప్పుడు వాళ్లకీ యిది తప్పక అప్లయి చేయాలి. రిజర్వేషన్ అనుభవించేవారిని అడగ వలసిన ప్రశ్న – '90 మార్కులు వచ్చినవాణ్ని కాదని 70 మార్కులు వచ్చినా నీకిస్తోంది సమాజం. దాన్ని జస్టిఫై చేసుకోవలసిన అగత్యం నీది. నాకు కుప్పలుతిప్పలుగా డబ్బున్నా సామాజిక గౌరవం లేదు అనే సాకు చూపించి నువ్వు పుచ్చుకుంటున్నావు. మరి నీ కులంలోనే పుట్టి నీలా డబ్బు కూడా లేనివాడి మాటేమిటి? వాడి పట్ల నీకు బాధ్యత లేదా? తక్కిన సమాజం నీ పట్ల చూపిన ఆదరం కూడా నువ్వు అతని పట్ల చూపవా? గ్యాస్ సబ్సిడీ వదులుకున్నవాళ్లలా నువ్వు రిజర్వేషన్ వదులుకోలేవా?' అని.
ఇది ఆర్థికపరమైన వెనకబాటుతనం సమస్య కాదు, సామాజిక వెనకబాటుతనం అని వాదించారొకాయన. నేననేది – సామాజిక వెనకబాటుతనం, ఆర్థిక వెనకబాటుతనం రెండూ వున్నవారి గురించి పట్టించుకోండి మహాప్రభో అని. ఇప్పటికిప్పుడు బిసి రిజర్వేషన్లు ఎత్తివేయమని నేననలేదు. అది సాధ్యం కాదనీ తెలుసు. ఎస్సీ రిజర్వేషన్ల మాట చెప్పనే అక్కరలేదు. ఇంతకంటె పెరక్కుండా వుంటే అంతే చాలురా బాబూ అన్నట్టున్నారు మామూలు ప్రజలు. బిసిలలోనే కడుపునిండిన వారు నిండనివారిపై కనికరం చూపాలని చెప్తున్నాను. తక్కిన కులాల వారిచ్చే గౌరవం గురించి రెచ్చిపోయి మాట్లాడే యీ బిసి నాయకులకు తమ కులానికే చెందిన పేదల పట్ల సహానుభూతి, సానుభూతి కూడా లేకపోవడం శోచనీయం. వాళ్లింట్లో వీళ్లు విస్తరి వేస్తారా?
నిజానికి క్రీమీ లేయరు షరతు విధించాలని యితర కులాల వాళ్లు కాదు, బిసి, ఎస్సీలలో పేదలు పోరాడాలి. 'మీరు యిప్పటిదాకా మా పేరు చెప్పిన అనుభవించినది చాలు, యికపై ఆ ఫలాలు మాకు పంచండి' అని ఆ కులాల యువత వాళ్ల నాయకులకు గట్టిగా చెప్పాలి. బిసిలలో పేద యువత మార్గం చూపితే, ఎస్సీ పేద యువత కూడా అనుసరించవచ్చు. మొదటి మెట్టుగా ప్రస్తుతం వున్న క్లాజ్ వ్యాపారస్తులకు ప్రతికూలంగా, ఉద్యోగులకు, పెద్దరైతులకు అనుకూలంగా వుంది. ఎందుకంటే జీతం రూపేణా వచ్చేది, వ్యవసాయ భూములపై వచ్చే ఆదాయం రెండు పరిగణనలోకి తీసుకోవడం లేదు. వ్యాపారంలో వచ్చే లాభం మాత్రం తీసుకుంటున్నారు. తీసుకుంటే అన్నీ తీసుకోవాలి అని వ్యాపారస్తుల పిల్లలు అడగాలి. ఉన్నతోద్యోగుల్లో వున్న బిసిలు తమకు, తమ కుటుంబీకులకు అనువుగా ఏర్పరచుకున్న రూలు యిది. దీని హేతుబద్ధతను ప్రశ్నించవలసినది నష్టపోతున్నవారే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)