రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. మిత్రదేశాల సైన్యాలు జర్మనీని చుట్టుముట్టి, ప్రముఖుల యిళ్లు గాలించసాగాయి. హెర్‌మన్ గోరింగ్ అనే హిట్లర్ అనుయాయి అరుదైన వస్తువుల, పెయింటింగ్స్ దాచిన భూగృహాన్ని అమెరికాకు చెందిన సెవెన్త్ ఆర్మీ కనుగొంది. దానిలో వున్న కళాఖండాలను యుఎస్ ఆర్మీ ఫైన్ ఆర్ట్‌స్ డివిజన్‌కు తరలించి, వాటి విలువను అంచనా వేయమన్నారు. యూరోప్‌లోని పలు గ్యాలరీల నుంచి గోరింగ్ నయానా, భయానా సేకరించిన 1200 పెయింటింగ్స్ అసలువా, నకిలీవా తేల్చి వాటి విలువ కట్టే పని ఆ డివిజన్ చేపట్టింది.
ఇంత కళాసంపదను పోగు చేసిన గోరింగ్ తక్కువ్వాడు కాదు. మొదటి ప్రపంచయుద్ధంలో పనిచేసి, నాజీ పార్టీ ఏర్పడినపుడు దానిలో చేరి ఉన్నత స్థానాలకు ఎగబాకాడు. 1933లో హిట్లర్ పదవి చేపట్టడానికి సహకరించి అతని తర్వాత ద్వితీయస్థానం యితనిదే అనే స్థాయికి చేరాడు. నాజీ సిద్ధాంతాలను ఎదిరించేవారిని ఏరిపారేయడానికి గెస్టపో అనే గూఢచారి సంస్థను నెలకొల్పి దాని సారథ్యాన్ని హెన్రిచ్ హిమ్ల్లర్ అనే మరో హిట్లర్ అనుయాయికి అప్పగించాడు. 1935లో జర్మన్ ఎయిర్‌ఫోర్స్‌కి కమాండర్ యిన్ చీఫ్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) నడుస్తూండగా 1941లో హిట్లర్ అతన్ని తన వారసుడిగా, సెకండ్ యిన్ కమాండ్‌గా ప్రకటించాడు. అయితే 1943 ప్రారంభంలో మిత్రదళాలు (ఎలైడ్ ఆర్మీ) జర్మన్ నగరాలపై దాడి చేసినప్పుడు గోరింగ్ సేన వారిని తరిమికొట్టలేకపోయింది. అంతేకాదు, రష్యాలో యిరుక్కుపోయిన జర్మనీ సైన్యానికి జర్మన్ ఎయిర్‌ఫోర్సు తిండిపదార్థాలు అందించలేకపోయింది. దాంతో హిట్లర్ అతన్ని చులకన చేయసాగాడు. అది గ్రహించిన గోరింగ్ రాజకీయాల నుంచి, మిలటరీ ఆపరేషన్ల నుంచి తప్పుకుంటూ ఆస్తులు పెంచుకోవడంపై, కళాఖండాలు సేకరించడంపై దృష్టి పెట్టాడు. ఈ సేకరణలో కూడా తప్పుడు మార్గాలు తొక్కాడు. యూదుఖైదీలను గ్యాస్ ఛాంబర్లకు పంపేముందు వాళ్ల యిళ్లల్లో వున్న చిత్రపటాలు తను లాక్కునేవాడు. కొన్ని ఆర్టు డీలర్ల ద్వారా కొన్నాడు. ఆ విధంగా అమూల్యమైన సంపద అతని వద్ద పోగుపడింది.
జర్మనీ ఓడిపోతున్నట్లు ముందుగా గ్రహించి వుంటే, అవన్నీ పట్టుకుని ఏ విదేశాలకో పారిపోయే వాడేమో కానీ చరమకాలంలో అతనో పొరపాటు చేశాడు. 1945 ఏప్రిల్ 22న హిట్లర్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడన్న పుకారు పుట్టినపుడు యితను తొందరపడి హిట్లర్‌కు ఒక టెలిగ్రాం పంపాడు – 'మీరు అలా చేసుకునే మాటయితే జర్మన్ రాజ్యాన్ని నా చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించండి' అని. హిట్లర్‌కు ఒళ్లు మండిపోయింది. ఆత్మహత్య ఆలోచన వాయిదా వేసుకుని గోరింగ్‌ను అన్ని పదవుల్లోంచి పీకేసి, పార్టీలోంచి బహిష్కరించి, అరెస్టు చేయించాడు. అందువలన అతను మిత్రదళాలకు చిక్కి, న్యూరెంబర్గ్ వద్ద యుద్ధనేరాలకై విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. అక్కడ ఉరిశిక్ష వేశారు కానీ యీ లోపున అతనే సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
విచారణ మొదలుపెట్టడానికి ముందే అమెరికన్లు అతని కళాసంపదను చేజిక్కించుకుని ఒక్కో చిత్రాన్ని పరీక్షించసాగారు. గోరింగు వద్ద వున్న మాస్టర్‌పీసులలో ''క్రైస్ట్ అండ్ ద అడల్టరెస్'' అనే చిత్రం వుంది. దాన్ని 17 వ శతాబ్దికి చెందిన డచ్ ఆర్టిస్టు జాన్ వెర్మీర్ వేశాడు. అమెరికన్ డివిజన్‌లో వున్న డచ్ ఎక్స్‌పర్ట్ ఒకతను ఇంత అపురూపమైన పటం యితనికి ఎలా వచ్చిందాని పరిశోధన చేశాడు. అది గోరింగ్ యూదుల నుంచి దొంగిలించినది కాదు. వాల్తర్ హాఫర్ అని గోరింగ్‌కు పెయింటింగ్స్ సేకరణలో సహకరించిన ఏజంటుకు హాలండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో వుండే ఒకతను 1943లో 6 లక్షల డాలర్లు (అప్పటి విలువ, చాలా చాలా ఎక్కువ)కు అమ్మినట్టు తెలిసింది. అది వినగానే యీ డచ్ ఎక్స్‌పర్ట్‌కు ఒళ్లు మండిపోయింది – మహానుభావుడు, జాతిరత్నం అనదగిన వెర్మీర్ వేసిన పెయింటింగును ఒక డచ్ వాడు డబ్బుకోసం ఒక నాజీ ధూర్తుడికి అమ్ముతాడా? అని. వాడెవడో వెతికి పట్టుకుందాం అని పెయింటింగు పట్టుకుని హాలండుకి వెళ్లాడు. అమ్మినవాడు పారిపోయాడు కానీ అతను ఏ ఆర్ట్ డీలరు దగ్గర్నుంచి దాన్ని సంపాదించాడో వాడు దొరికాడు. వాణ్నడిగితే రెయిన్‌స్త్రా అనే కమీషన్ ఏజంటు పేరు చెప్పాడు. రెయిన్‌స్త్రాను దొరకబుచ్చుకుంటే అతను ఆమ్‌స్టర్‌డామ్‌లో వున్న ప్రసిద్ధ చిత్రకారుడు హాన్స్ వాన్ మీగెరెన్ తనకు అమ్మేడని చెప్పాడు.
మీగెరెన్ పేరు దేశమంతా తెలుసు. స్వయంగా ఆర్టిస్టు. ప్రఖ్యాతుల చిత్రాలు కొని అమ్ముతూ వుంటాడు కూడా. ఈ వ్యాపారంలో డబ్బు బాగా గడించాడు. ఆమ్‌స్టర్‌డామ్‌లో అనేక యిళ్లున్నాయి, రెండు నైట్‌క్లబ్బు లున్నాయి. అతను అమ్మినవాటిలో వెర్మీర్ చిత్రాలు ఆరున్నాయి. హేగ్, రాటర్‌డామ్, ఆమ్‌స్టర్‌డామ్‌లలోని ఆర్ట్ కలక్టర్లకు, మ్యూజియములకు ఐదు అమ్మగా, ఆరోది చేతులు మారి గోరింగ్ చేతికి చేరింది. ఈ చిత్రాలను నీకెక్కడివి అని అడిగాడు. ''ఇటలీలో కొన్నా'' అన్నాడు మీగెరెన్. డచ్ ఎక్స్‌పర్ట్ వెళ్లి హాలండ్ పోలీసులకు చెప్పాడు – 'వీడు చూడండి, ఇటాలియన్ ఫాసిస్టుల దగ్గర కొని జర్మన్ నాజీలకు అమ్ముతున్నాడు. అదీ మరోటీమరోటీ కాదు, ఏకంగా వెర్మీర్ బొమ్మలు! శత్రువులతో చేతులు కలపడం కంటె దేశద్రోహం వుందా?' అని. వాళ్లు అగ్గీబుగ్గీ అయ్యారు. తీసుకొచ్చి జైల్లో పడేశారు. సంగతి తెలిసి ప్రజలంతా ఉద్రేకపడ్డారు – 'వెర్మీర్ బొమ్మలను మన దేశానికి ద్రోహం చేసిన నాజీలకు అమ్మడం కంటె అత్యాచారం వుంటుందా, మా బాగా అయింది. ఉరేసేయండి' అనసాగారు.
జాన్ వెర్మీర్ (1632-75) డచ్ పెయింటరు. హాలండు మధ్యతరగతి యింటి వాతావరణమే నేపథ్యంగా అద్భుతమైన చిత్రాలు గీశాడు. బతికుండగా అతనికి రావలసినంత పేరు రాకపోవడంతో అతను ఎన్ని పెయింటింగులు వేశాడో యితమిత్థంగా చెప్పడం కష్టం. కొంతమంది 66 అంటారు, 34 వాటిపై ఏకాభిప్రాయం వున్నా, తక్కిన 32 అతనివా కాదా అనే సందేహం తొలగిపోలేదు. అతను పోయిన తర్వాతే ఖ్యాతి దక్కింది. అతని పెయింటింగ్స్‌లో కలర్ స్కీము, వెలుగునీడలు, పెయింటు వుపయోగించే తీరు – యివన్నీ వినుతి కెక్కాయి. 19 వ శతాబ్దం వచ్చేసరికి అతన్ని హాలండ్ స్వర్ణయుగానికి ప్రతీకగా, జాతిచిహ్నంగా పరిగణించారు. అతని పెయింటింగ్స్‌ను జాతి సంపదగా భావించి, గౌరవించారు. అతని పెయింటింగు నకలునో, ఫోటోనో యింట్లో తగిలించుకోవడం డచ్ ప్రజలకు ఆనవాయితీ అయింది. ఎంత పూరిల్లయినా సరే అతని పెయింటింగ్ లేకుండా వుండేది కాదు. అలాటి వెర్మీర్ చిత్రాన్ని తామందరూ అసహ్యించుకునే నాజీలకు అమ్మిన మీగెరెన్‌పై ప్రజలకు పీకలదాకా కోపం రావడంలో ఆశ్చర్యం ఏముంది? పోలీసులు మీగెరెన్‌ను జైల్లో పడేసి చితకబాదారు. ''నేనేం తప్పు చేయలేదు'' అనే మాట తప్ప వేరే మాట అతని నోట్లోంచి రావటం లేదు. సొంత జాతికి యింత ద్రోహం చేసి తప్పులేదంటావా అనే కోపంతో పోలీసులు మరీ బాదారు. మీగెరెన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఆలోచనలో పడ్డాడు.
మీగెరెన్ గ్రామర్ స్కూల్లో చదివే రోజుల్లోనే డ్రాయింగు నేర్చుకున్నాడు. 1920ల నాటికి కాస్త పేరు సంపాదించుకున్నాడు. 1930లు వచ్చేసరికి వాళ్ల దేశానికి పర్యాటకులుగా వచ్చిన బ్రిటిషు, అమెరికన్ ధనికుల బొమ్మలు పెయింటు చేసి బాగా సంపాదించసాగాడు. ఆస్తులు కూడబెట్టాడు. తన పాప్యులారిటీ విస్తరించి క్లయింట్లు పెరగడానికై తరచుగా తన బొమ్మలతో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టేవాడు. హాలండులోని ఆర్ట్ క్రిటిక్స్ ఒక పెద్ద ముఠాగా వుండేవారు ఆ రోజుల్లో. ఇతని సక్సెస్ చూసి వాళ్లు కుళ్లుకున్నారు. వారిలో కొందరు అతని వద్దకు వచ్చి తమకు డబ్బిస్తే ఎగ్జిబిషన్ గురించి బాగా రాస్తామని, లేకపోతే తిట్టిపోస్తామని బెదిరించేవారు. ఇతను యివ్వను పొమ్మని చెప్పాడు. అంతేకాదు బహిరంగంగా తనను విమర్శించేవారిని వెటకరించేవాడు. మీకు బొమ్మలను అంచనా వేసే శక్తి లేదని, ఏ బొమ్మ ఎవరిదో నుక్కునే సామర్థ్యం లేదని వెక్కిరించేవాడు.
ఆర్ట్ ప్రపంచంలో అతి పెద్ద బెడద డూప్లికేట్లు. ప్రఖ్యాతి చెందిన చిత్రకారుల పెయింటింగులను అనుకరించి పెయింటు చేయగల సమర్థులు కొందరుంటారు. అదే ఒరిజినల్ అని చెప్పి అమ్మేస్తూ వుంటారు. మరి కొంతమంది ఆ ఆర్టిస్టు శైలి సొంతం చేసుకుని, అదే తీరులో యింకో బొమ్మ గీసేసి, 'ఇప్పటిదాకా వెలుగులోకి రాని.. ఫలానావారి పెయింటింగ్' అని చెప్పి మార్కెట్లో పెట్టేస్తారు. వీటిని వేలాల ద్వారా కళ్లు తిరిగే ధరలకు విక్రయించే వ్యాపారులు ఏది అసలు, ఏది నకలు అని కనిపెట్టడానికి విమర్శకులను, నిపుణులను పిలుస్తారు. ఆర్ట్ డిటెక్టివ్‌లను పెడతారు. వారు బొమ్మల మీద ఎక్స్‌రే కిరణాలు.ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలు ప్రసరింపచేస్తారు, ఆల్కహాలు పూస్తారు, హైపోడెర్మిక్ సూదులు గుచ్చి పెయింటులోని రసాయనాలు నిర్ధారిస్తారు, క్వార్ట్‌జ్ ల్యాంపులు వుపయోగించి పెయింటు పొరలు తొలిచి చూస్తారు. ఈ పరీక్షల ద్వారా ఆ పెయింటు కొత్తదా, పాతదా తేలుస్తారు. దానితో బాటు ఆ చిత్రకారుడు యిలాటి రంగు వాడడు, ఆనాటి కాలంలో యిలాటి బట్టలు ధరించేవారు కారు – వంటి పరిశీలనలు చేసి, నిగ్గు తేలుస్తారు. అలా చేసినా ఎన్నో మోసాలు జరుగుతూంటాయంటాడు ఒక ఆర్ట్ డిటెక్టివ్. ''రెంబ్రాంట్ పేరు మీదే చలామణీ అయ్యే పెయింటింగులలో పదో శాతం మాత్రమే అతను నిజంగా వేసినవి. వాన్ డైక్ గీసినవి 70 వుంటాయి. కానీ రెండు వేల పెయింటింగులపై అతని పేరు కనబడుతోంది. కొరోట్ 2500 పెయింటింగులు వేస్తే కేవలం అమెరికాలోనే అతని పేర 7800 కనబడుతున్నాయి!'' అంటాడతను.
ఆర్టిస్టుల కంటె తమకే ఎక్కువ తెలుసని అనుకుంటున్న విమర్శకులకు తలాతోకా ఏమీ తెలియదని సోదాహరణంగా నిరూపించి వాళ్ల భరతం పట్టాలని మీగెరెన్ 1936లో ఒక పథకం రచించాడు. ఓల్డ్ మాస్టర్స్ పెయింటింగు కాపీ కొట్టి మార్కెట్లోకి వదిలి, అది ఒరిజినల్ అని విమర్శకులు సర్టిఫై చేశాక, 'వెర్రిపీనుగుల్లారా, అది డూప్లికేట్‌రా, మీ తెలివి యిలా తెల్లారింది. తగుదునమ్మా అని నా బొమ్మలను విమర్శించడమొకటి' అందామనుకున్నాడు. ఓల్డ్ మాస్టర్లలో ఎవర్ని కాపీ కొడదామా అని దీర్ఘంగా ఆలోచించి వెర్మీర్‌ను ఎంచుకున్నాడు. ఎందుకంటే అతని జీవితం ఓ మిస్టరీ, అతని ఎన్ని బొమ్మలు వేశాడో కచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే మోసం చేయడం కూడా అంత సులభం కాదు. పైన చెప్పిన పరీక్షలన్నీ తట్టుకోవాలి. 300 ఏళ్ల క్రితం నాటి పెయింటింగని నిరూపించగలగాలి.
వెర్మీర్ కాలం నాటి పురాతన గ్రంథాలు తిరగేసి అతను పసుపు పిగ్మెంటుకై గమ్ రెజీన్ వాడేవాడనీ, నీలం రంగుకై రాళ్ల పొడిని వాడేవాడనీ, తెల్ల సీససం బదులు తెల్ల తుత్తునాగం (జింక్) వాడేవాడనీ మీగెరెన్ కనిపెట్టాడు. ఆధునికులు లిన్‌సీడ్ ఆయిల్ వాడుతూండగా, వెర్మీర్ వేరే నూనె వాడేవాడని కూడా ఆ పాతపుస్తకంలో దొరికింది. వెర్మీర్ పెయింటింగ్స్‌ను దగ్గర పెట్టుకుని, ఆ శైలిని, కలర్ స్కీమును అనుకరిస్తూ ఏసుక్రీస్తు తన శిష్యులతో కలిసి రొట్టె తింటున్న థీమ్‌పై ఏడు నెలల పాటు అతి రహస్యంగా, భార్యకు కూడా చెప్పకుండా, శ్రమించి పూర్తి చేశాడు. పాత పెయింటింగులో పెయింటు ఎలా చీలుతుందో అలాటి చీలికలు వచ్చేట్లా చేయడానికి కాన్వాస్‌ను ఒక్కో చోట సాగదీసి, మరో చోట కిచెన్ స్టవ్ మీద వేడి చేసి అది కూడా సాధించాడు. వెర్మీర్ తన జీవితకాలంలో ఇటాలియన్ ఆర్ట్ స్టూడెంట్లతో కలిసి పనిచేశాడని తెలిసి ప్రతీతి వుంది. వారితో కలిసి వెర్మీర్ ఇటలీ వెళ్లాడని, అక్కడ వుండగానే యీ పెయింటింగు పూర్తి చేసి అక్కడే అమ్మివేశాడని, ఆ సంగతి స్నేహితుల ద్వారా విని తను ఇటలీ వెళ్లి కొన్నాననీ కథ అల్లాడు. వెర్మీర్ బతికుండగా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి, ఏ ఏడాది అతను ఎక్కడున్నాడో ఎవరూ రికార్డు చేయలేదు. ఇటలీ వెళ్లాడంటే కాబోలు అనుకున్నారు.
ఈ కథను, పెయింటింగును చంకన పెట్టుకుని మీగెరెన్ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఆర్ట్ ఎక్స్‌పర్ట్ అయిన డా|| అబ్రహాం బ్రెడియస్ వద్దకు వెళ్లి దీన్ని చూపించాడు. ఆయనకు అప్పటికే 80 ఏళ్లు. ఈ వయసులో తనకు, తన అభిప్రాయానికి గౌరవం యిచ్చి ఎవరో వచ్చినందుకు ఆయన మురిసి ముక్కలై 'ఇది వెర్మీర్‌దే' అని రాతపూర్వకంగా సర్టిఫికెట్టు యిచ్చేశాడు. అది పట్టుకుని 1937 ఆగస్టులో రాటర్‌డామ్‌లోని బాయ్‌మన్స్ మ్యూజియానికి అమ్మచూపాడు. వాళ్లు నానా రకాల పరీక్షలకు గురి చేసి, 2 లక్షల డాలర్లు యిచ్చి దాన్ని కొన్నారు. ఏడాది పోయిన తర్వాత రాణిగారి పట్టాభిషేక రజతోత్సవోత్సవ సందర్భంగా 450 మాస్టర్‌పీస్‌ల మధ్య దీన్ని పెట్టి ప్రదర్శించారు. హేగ్, లండన్, పారిస్‌ల నుంచి విమర్శకులు, నిపుణులు దీన్ని చూడడానికి విరగబడ్డారు. ఒక్కరూ యిది నకిలీదని కనిపెట్టలేదు. వెర్మీర్ వేసిన చిత్రాల్లో కల్లా బెస్ట్ యిదే అని తీర్మానించారు. ఇదంతా చూసి మీగెరెన్ పడిపడి నవ్వుకున్నాడు. విమర్శకులు గాడిదలని నిరూపించానని చంకలు గుద్దుకున్నాడు. అంతటితో ఆగలేదు.
చో రామస్వామి రాసిన ''మహమ్మద్ బీన్ తుగ్లక్'' నాటకం (తమిళంలో, తెలుగులో సినిమాగా కూడా వచ్చింది) దేశభక్తులిద్దరు యీ ప్రజాస్వామ్యం ఎంత బూటకంగా వుందో నిరూపించడానికి ఒక నాటకమాడతారు. తుగ్లక్, అతని అనుచరుడు తవ్వకాల్లో దొరికినట్లు సృష్టిస్తారు. తుగ్లక్ సజీవంగా తిరిగి వచ్చాడనగానే అందరూ అతన్ని ఆహ్వానిస్తారు. రాజకీయపు టెత్తులతో అతను దేశప్రధాని కూడా అయిపోతాడు. ఇలా ఏడాది పాటు నాటకమాడాక, గడువు పూర్తి కాగానే మారువేషం విప్పేసి, తామెవరో జనాలకు చెప్పి, ప్రజల కళ్లు తెరిపించాలని ఒరిజినల్ ప్లాను. అయితే రాజకీయక్రీడకు, పదవీభోగానికి అలవాటు పడిన తుగ్లక్ పాత్రధారి తన గుట్టు బయటపెట్టడానికి నిరాకరిస్తాడు. నీ సంగతి చెప్పేస్తా అని బెదిరించిన సహచరుడికి మతి చలించిందని ప్రచారం చేసి ప్రజల చేత రాళ్లేసి కొట్టించి చంపిస్తాడు. అలాగే విమర్శకులను ఆటపట్టించడానికి ఆట మొదలుపెట్టిన మీగెరెన్ తన దొంగ పెయింటింగుకి యింత ఖ్యాతి రావడంతో అసలు లక్ష్యం మరిచాడు. అది నకిలీదని చెప్పకుండా, యింకా అటువంటివి యింకో ఐదు వేస్తూ పోయి, 1943 వరకు బోల్డంత డబ్బు (30 లక్షల డాలర్లు) సంపాదించాడు. మొనగాళ్లమని మీసాలు తిప్పే విమర్శకుడొక్కడూ కనిపెట్టలేదు. సాగినంతకాలం బాగానే సాగింది కానీ అతని కర్మ కాలి, ఓ పెయింటింగు గోరింగు దగ్గరకు చేరడంతో తీగ లాగారు, డొంక కదిలింది. ఇప్పుడు జైల్లో పడ్డాడు. ఈ విషయమంతా చెపితే మోసం చేశావని మరో కేసు అవుతుంది. ఎలా?
మూడు వారాల పాటు జైల్లో కుళ్లబొడవడంతో మీగెరెన్ సహనం కోల్పోయాడు – ''వెర్రివెధవల్లారా, నేను మన దేశసంపదను అమ్మలేదర్రా. ఓ ఫోర్జరీ అమ్మేనంతే..'' అని కక్కాడు. అందరూ తెల్లబోయారు. మేం నమ్మం అన్నారు. అప్పుడతను జరిగినదంతా విపులంగా చెప్పాడు. ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. దేశవిదేశాలలోని ఆర్ట్ క్రిటిక్స్, సైంటిస్టులను, మ్యూజియం అధికారులను అడిగితే అబద్ధాలు చెప్తున్నాడన్నారు. అతనిది నిజమని ఒప్పుకుంటే తామంతా గాడిదలైనట్లే మరి! వాళ్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. అందుచేత అందరూ కలిసికట్టుగా ఒక్క మాటపై నిలబడి అవి ఒరిజినల్సే, వీడి మాటలే ఫేక్ అనసాగారు. ఈ వివాదం పెరిగి పెద్దదైంది. హాలండులోనే కాదు, లండన్‌లో, రోమ్‌లో, పారిస్‌లో, న్యూయార్కులో ఎక్కడ చూసినా యిదే చర్చ. ఇంతమంది మాట నమ్మాలా? మోసం చేశాను మహాప్రభో అంటూన్న మీగెరెన్ మాట నమ్మాలా?
చివరకు ఓ పోలీసు అధికారికి ఓ ఐడియా వచ్చింది – ఇక్కడే జైల్లోనే అతనడిగిన సామగ్రి అంతా యిచ్చి, మన ఎదురుగానే మరో వెర్మీర్ ఫోర్జరీ బొమ్మ వేయమంటే సరికదా! అని. ''నిజానికి అది చాలా కష్టం. నేను గతంలో వేసినవి ఒక్కణ్నీ కూర్చుని స్వేచ్ఛగా వేసినవి. ఇంతమంది చుట్టూ మూగి, సరిగ్గా వేయకపోతే శత్రువులతో చేతులు కలిపిన దేశద్రోహి ముద్ర పడుతుందనే టెన్షన్‌లో పెట్టి బొమ్మ వేయమనడం అన్యాయం. పైగా నేను అడిగినవన్నీ వాళ్లు తెచ్చి యివ్వలేదు.'' అని వాపోయాడతను. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. జైల్లోనే ఓ పెద్ద స్టూడియో ఏర్పాటు చేసి కాన్వాస్, ఆయిల్సు సమకూర్చి వేయమన్నారు. కొన్ని నెలల శ్రమతో అతను చిత్రం పూర్తి చేశాడు. పోలీసు వారు దాన్ని స్వాధీనపరుచుకుని అతను గతంలో మొదటి బొమ్మ అమ్మిన మ్యూజియంలోనే ప్రదర్శనకు పెట్టి జాతీయ, అంతర్జాతీయ నిపుణులను పిలిచి పరీక్షించమన్నారు. వాళ్లు దీనితో బాటు పాతవాటిని కూడా పరిశోధించి, శల్యపరీక్షలకు గురి చేసి అవి ఫోర్జరీలే అని తేల్చారు. అది విని మీగెరెన్ నవ్వాడు – ''దానికి యింత టైము పట్టిందా మీకు? నేను వేసిన పెయింటింగులలో రెండింటిలో క్రీస్తు కూర్చున్న కుర్చీలు చూడండి. మా స్టూడియోలో నేను వాడే కుర్చీలే, పాతకాలం నాటివి కావు. పైగా వెర్మీర్ బొమ్మల్లో క్రీస్తు చేతులు చూడండి, నేను వేసినవాటిలోవి చూడండి, తేడా కనబడుతుంది. నా చేతినే మోడలుగా పెట్టుకుని నేను గీశాను.'' అన్నాడు.
విమర్శకులకు ఏమీ తెలియదని నిర్ద్వంద్వంగా రుజువు చేశాడు కానీ చేసినది మోసం కాబట్టి అతనికి శిక్ష వేశారు. అతని ఆరోగ్యం బాగా లేదు కాబట్టి కేవలం ఒక ఏడాది జైలు శిక్ష పడింది. నాజీలతో చేతులు కలిపిన ద్రోహిగా అతన్ని అసహ్యించుకున్న ప్రజలు విచారణలో గోరింగుకే శఠగోపం పెట్టిన గండరగండడని తెలియగానే ఆనందంతో పొంగిపోయి, అతనిపై ప్రశంసలు కురిపించారు. ఓ మాదిరిగా చెప్పాలంటే అతను హీరో అయిపోయాడు. అయినా విచారణ కలిగించిన ఒత్తిడి వలన, కారాగారవాసం వలన మీగెరెన్ నలిగిపోయాడు. 1947 డిసెంబరులో తన 58 వ యేట మరణించాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)