ఎమ్బీయస్‌ : డి-కంపెనీకి డి-డే?

దావూద్‌ ఇబ్రహీం పని పడతానని మోదీ అనడం భారతీయులను ఎంతో సంతోషపెట్టింది. ఐయస్‌ఐ ఛత్రచ్ఛాయల్లో పాకిస్తాన్‌లో తిష్ట వేసి అక్కణ్నుంచి భారతదేశ విధ్వంసానికి కుట్రలు పన్నుతూన్న దావూద్‌పై భారతీయులకు పీకలదాకా కోపం వుంది. అమెరికా…

దావూద్‌ ఇబ్రహీం పని పడతానని మోదీ అనడం భారతీయులను ఎంతో సంతోషపెట్టింది. ఐయస్‌ఐ ఛత్రచ్ఛాయల్లో పాకిస్తాన్‌లో తిష్ట వేసి అక్కణ్నుంచి భారతదేశ విధ్వంసానికి కుట్రలు పన్నుతూన్న దావూద్‌పై భారతీయులకు పీకలదాకా కోపం వుంది. అమెరికా వాళ్లు హఠాత్తుగా దాడి చేసి, బిన్‌ లాడెన్‌ను చంపివేసిన రీతిలో మోదీ కూడా దావూద్‌ స్థావరంపై దాడి చేసి సజీవంగానో, నిర్జీవంగానో పట్టుకుంటే అతని ఖ్యాతి మిన్ను ముట్టుతుందనడంలో సందేహం లేదు. 'ఈ పని యిన్నాళ్లూ కాంగ్రెసు చేయకపోవడానికి కారణం, పాకిస్తాన్‌తో కుమ్మక్కవడం, ముస్లిము ఓట్లు పోతాయన్న భయం, విదేశీవనితకు భారతీయ ప్రతిష్టపై ఖాతరీ లేకపోవడం' అని బిజెపి ప్రచారం చేసిందంటే కాంగ్రెసు పరువు యింకా అధఃపాతాళంలో పడిపోతుంది. ఇదంతా వూహించుకోవడానికి బాగానే వుంది కానీ దావూద్‌ నిజంగా చిక్కుతాడా? అసలు యిప్పుడెక్కడ, ఎలా వున్నాడు?
బాబ్రీ మసీదు విధ్వంసానికి వ్యతిరేకంగా 1993లో ముంబయిలో దావూద్‌ వరుస పేలుళ్లు ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి అతని సైన్యంలో మతపరంగా చీలికలు వచ్చాయి. 

హిందువులైన సంతోశ్‌ శెట్టి, విక్కీ మల్‌హోత్రా, రోహిత్‌ వర్మ, రవి పూజారి, ఆబూ సావంత్‌ దావూద్‌ను వీడి అతని ఒకప్పటి అనుచరుడు, ప్రతికక్షి అయిన ఛోటా రాజన్‌ చెంత చేరారు. వారి సహాయంతో దావూద్‌ ఆచూకీ సంపాదించిన ముంబయి పోలీసులు అరడజను మంది సభ్యులతో ఒక టీము ఏర్పరచి రహస్యంగా కరాచీకి వెళ్లి దావూద్‌పై దాడి చేసి సజీవంగా పట్టి తెద్దామని ప్రణాళిక రచించారు. అది అనుమతి కోసం అప్పటి పివి కాబినెట్‌లోని హోం మంత్రి శంకర్‌రావు చవాన్‌ వద్దకు వెళ్లింది. ముంబయికి చెందిన చవాన్‌కు, దావూద్‌కు ఏం లింకులున్నాయో తెలియదు కానీ ఆయన ఆ ప్లాను క్లియర్‌ చేయలేదు. దావూద్‌ పోనుపోను బలం పుంజుకుని మరిన్ని ఘాతుక చర్యలకు ఒడిగట్టాడు. అతనిపై అలుపెరుగకుండా పోరాటం చేస్తూ వచ్చినది – ఛోటా రాజన్‌. అతను దావూద్‌ గ్రూపుకి చెందిన సునీల్‌ సావంత్‌, పీలూ ఖాన్‌లను దుబాయిలో చంపిన తర్వాత ఈస్ట్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్సు ఎండీ తకియుద్దీన్‌ వాహిద్‌ను 1995లో ముంబయిలో చంపేశాడు. వాహిద్‌ దావూద్‌ ఫైనాన్షియర్‌. 

అప్పుడు దావూద్‌ రాజన్‌ను చంపడానికి మున్నా జింగాడాను బ్యాంగ్‌కాక్‌ పంపాడు. రాజన్‌ గ్రూపు పార్టీ చేసుకుంటూండగా దాడి జరిగి, అతని అనుచరులు కొందరు చచ్చిపోయారు. అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇండియన్‌ సెక్యూరిటీ ఏజన్సీలే రాజన్‌ను ఆసుపత్రిలో చేర్పించి నయం చేయించారని, థాయ్‌లాండ్‌ నుండి క్షేమంగా పారిపోవడానికి సహకరించారని అంటారు. ఈ దాడి తర్వాత రాజన్‌కు భయం పట్టుకుంది. అతనికి కిడ్నీ పాడైందని అంటారు కూడా. తను బయటకు రాకుండా తన కింద చిన్న ఉద్యోగియైన ఆబూ సావంత్‌ను తన ప్రతినిథిగా నియమించాడు. సావంత్‌ యిప్పుడు ఇప్పుడు రాజన్‌ ఆస్తిపాస్తులు చక్కబెడుతూ హోటళ్లలో పెట్టుబడి పెడుతూ సామ్రాజ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు. రాజన్‌ పరిస్థితి యిలా వుంటే అటు దావూద్‌కు 2011లో రెండు సార్లు గుండెపోటు వచ్చింది. అతని మూడో తమ్ముడు అనీస్‌ అతనితోనే వుంటాడు కానీ అతనికి కోపం ఎక్కువ. దాంతో అతను తన పనుల్ని ఛోటా షకీల్‌కు అప్పగించాడు. ఇండియా ఆపరేషన్సన్నీ షకీల్‌ కరాచీ నుంచే చక్కబెడుతున్నాడు. 

దావూద్‌ యింకో తమ్ముడు ఇక్బాల్‌ కస్కర్‌ ముంబయిలో వున్నాడు. అతనిపై కేసులేవీ లేవు కాబట్టి పోలీసులు అతని జోలికి వెళ్లటం లేదు. తనకు గుండెపోటు వచ్చిన మరుసటి ఏడు దావూద్‌ తన సొంత తమ్ముళ్లయిన హుమయూన్‌, ముస్తకీన్‌లను  కరాచీ నుండి ఇండియాకు పంపి తన తరఫున వ్యవహారాలు చక్కబెట్టమన్నాడు. వాళ్లపై పెద్దగా కేసులు లేవు కదాని అతని ఆలోచన. అయితే షకీల్‌ '26/11 దాడుల తర్వాత ప్రజలు, పోలీసులు నీపై కోపంగా వున్నారు. వీళ్లని పంపితే కోర్టుల మాట ఎలాగున్నా ప్రజలు చీల్చి చెండాడతారేమో..' అని భయపెట్టాడు. దావూద్‌ యిక ఆ ఆలోచన విరమించుకుని సమస్తం షకీల్‌ చేతిలోనే పెట్టి కూర్చున్నాడు. దావూద్‌ ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ఇక్బాల్‌ మిర్చి 2013లో లండన్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత షకీల్‌ మరింత బలపడ్డాడు. షకీల్‌ చాలా తెలివైనవాడు. ముంబయిలో దంధాలన్నీ తన అనుచరుల ద్వారా నడిపిస్తాడు. రియల్‌ ఎస్టేటు తగాదాలు వంటివి పరిష్కరిస్తూ వుంటాడు. బేరాలు తెగక వ్యవహారం చెడిపోయే సమయంలోనే తను ప్రవేశిస్తాడు. విషయం తేల్చేస్తాడు. అతని వెనక దావూద్‌, ఐయస్‌ఐ వున్నాయన్న విషయం తెలిసిన క్లయింట్‌ భయంతో సరేనంటాడు. ఇవన్నీ ముంబయి పోలీసులకు తెలుసు. అయినా కంట్రోలు చేయడం లేదు. రేపు మోదీ ప్రభుత్వం ఏదైనా ఆపరేషన్‌ ప్లాన్‌ చేసినా దావూద్‌కు సన్నిహితులైన ముంబయి పోలీసు పెద్దలు అతనికి ముందుగానే సమాచారం అందిస్తారని అందరికీ సందేహం.  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]