భారత రాజ్యాంగం రాసినపుడు ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల ఎసెంబ్లీలలో కొన్ని సీట్లు కేటాయించారు. ఆర్టికల్ 334 ప్రకారం పదేళ్లలో యీ రిజర్వేషన్ ముగిసిపోవాలి. కానీ 1960లో మళ్లీ పదేళ్లపాటు పొడిగించారు. పదేళ్ల తర్వాత మళ్లీ పదేళ్లకు, ఆ తర్వాత యింకో పదేళ్లకు… యిలా పొడిగిస్తూనే పోతున్నారు. అర్ధశతాబ్దిలో ఆ యా వర్గాల స్థితిగతులు మెరుగుపడ్డాయా, రిజర్వేషన్ కేటగిరీని యింకా కొనసాగించవలసిన అవసరం వుందా అన్న అధ్యయనం ఏమీ జరగకుండా యాంత్రికంగా పొడిగిస్తూ పోతున్నారు. ప్రస్తుతం 120 పార్లమెంటు సీట్లకు, 1080 అసెంబ్లీ సీట్లకు 2020 సం||రం వరకు రిజర్వేషన్లు వున్నాయి. ఈ పొడిగింపు శాస్త్రీయంగా లేదని, 1950ల నుంచి సమాజంలో మార్పు రాలేదనో, ఎస్సీఎస్టీల స్థితిగతులు మెరుగుపడలేదనో భావిస్తూండడం సరి కాదనీ, ఒకవేళ మెరుగుపడకపోతే దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి తప్ప గుడ్డిగా అదే బాట అనుసరిస్తూ పోవడం పొరపాటని వాదిస్తూ 2000 సం||రం నుండి కొందరు కేసులు వేస్తూ వస్తున్నారు. ఆ పిటిషన్లన్నీ గుదిగుచ్చి ''అశోక్ కుమార్ జైన్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా'' అనే కేసు పేర సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల కానిస్టిట్యూషన్ బెంచ్‌కు విచారణకు అప్పగించింది.
తన చర్యను సమర్థించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 46 ప్రకారం సమాజంలో వెనుకబడిన వర్గాల, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యాపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత వుందని చెప్పుకుంది. ఈ నియోజకవర్గాల రిజర్వేషన్ రాజకీయపరమైన సమానత్వం కాపాడే ప్రయత్నమని వాదించింది. 'కర్ణాటక ప్రభుత్వం వెర్సస్ కెసి వసంతకుమార్ (1985)' కేసులో తీర్పు చెపుతూ కోర్టు 'వెయ్యేళ్ల నాటి వివక్షత ఒక తరంలో పోదు' అని వ్యాఖ్యానించిన విషయం గుర్తు చేసింది. ఒక తరం అంటే ఎన్నేళ్లో ఎవరికి వారే లెక్క వేసుకోవాలి. ఒక తరం చాలదు, యింకొన్ని తరాలు కావాలి అనే వాదన కూడా రావచ్చు. ప్రభుత్వం ఆలోచించే తీరు స్పష్టంగా తెలుస్తోంది. పిటిషను వేసిన వారి వాదనలో కూడా బలం వుంది. కోర్టు ఏ రీతిగా ఆలోచిస్తుందో వేచి చూడాలి.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన మరో అంశంపై మార్చి నెలలోనే సుప్రీం కోర్టు సురేశ్ చంద్ గౌతమ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ కేసులో యిచ్చిన తీర్పుకి చాలా ప్రాముఖ్యత వుంది.
రాజ్యాంగంలో 1995లో చేర్చిన ఆర్టికల్ 16 (4ఎ) ప్రకారం ప్రభుత్వ సర్వీసెస్‌లలో ఎస్సీ, ఎస్టీలు తగినంతగా లేకపోతే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించే అవకాశం వుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దొరకక కొన్ని సంవత్సరాలుగా వేకెన్సీలుండిపోతే వాటిని ఒకేసారి పూరించబోయినపుడు రిజర్వేషన్లకు విధించిన 50% పరిమితి దాటి పోయినా ఫర్వాలేదని 16 (4బి) చెప్తోంది. అయితే 2006 నాటి ఎం.నాగరాజ్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు సభ్యులున్న సుప్రీం కోర్టు బెంచ్ ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలంటే ప్రభుత్వం దానికి తగిన కారణాలు చూపించాలని తీర్పు యిచ్చింది. ఫలానా ఫలానా క్యాడర్‌లో తమ కోటాకు తగినంత నిష్పత్తిలో ఎస్సీ, ఎస్టీలు లేరు కాబట్టి కింది క్యాడర్‌లో వున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్ కల్పించి, వారిని నియమించవలసి వస్తోంది అని గణాంకాలు చూపాలి. అంతేకాదు, వారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి వున్నారని, వారి ప్రమోషన్ల వలన ప్రభుత్వసామర్థ్యం కుంటుపడదని అంకెల ద్వారా రుజువు చేయాలి. ఆ కేసులో తీర్పు చెపుతూ సుప్రీం కోర్టు 16 (4ఎ) ఎనేబ్లింగ్ ప్రొవిజనే తప్ప విధాయకమైనది కాదని స్పష్టం చేసింది.
ప్రభుత్వ సర్వీసెస్‌లో ప్రమోషన్లు యిచ్చినపుడు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలంటే ఏ యే క్యాడర్‌లో ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు వున్నారో సమాచారం అత్యవసరం కాబట్టి దాన్ని సేకరించమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని సురేశ్ చంద్ సుప్రీం కోర్టును కోరారు. నాగరాజు కేసు జరిగి తొమ్మిదేళ్లయినా యుపి ప్రభుత్వం అటువంటి డేటా సేకరణకై ఏ ప్రయత్నమూ చేయలేదని అతను విన్నవించుకున్నాడు. డేటా లేదన్న కారణంగా సుప్రీం కోర్టు తీర్పు వుటంకిస్తూ గతంలో ప్రమోషన్లిచ్చిన ఎస్సీ, ఎస్టీ వారికి రివర్షన్ యిచ్చి, పాత పదవులకు పంపించేశారని వాపోయాడు. ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ యిచ్చి తీరవలసిన అగత్యం రాష్ట్రప్రభుత్వానికి లేదని, కానీ కొన్ని పరిస్థితులలో అలా కల్పించాలా వద్దా అని తేల్చుకోవలసినది రాష్ట్రప్రభుత్వమే అని కోర్టు చెప్పింది. అందువలన ప్రభుత్వానికి సమాచార సేకరణ చేసి తీరాలని కోర్టు ఆదేశం యివ్వజాలదని చెప్పింది. అలా యిస్తే లెజిస్లేటివ్ అధికారాల్లో కోర్టు కలగజేసుకున్నట్లు అవుతుందని అభిప్రాయపడింది.
దీని ప్రకారం చూస్తే రాష్ట్రప్రభుత్వం సొంతంగా తలచుకుంటే తప్ప సమాచారం సేకరించదు, సేకరించకపోయినా దాన్ని అడగగలిగేవాళ్లు లేరు, సమాచార సేకరణ జరగకపోతే ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు దక్కవు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల విషయంలో చూస్తే యిలా వుంది, అదే కులస్తుల ప్రజాప్రతినిథుల విషయంలో చూడబోతే తరతరాలు రిజర్వేషన్ సాగేట్టు వుంది. అదీ తమాషా!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)