శ్రీలంకకు రాజపక్ష అధ్యక్షుడిగా వున్న రోజుల్లో చైనాతో స్నేహంగా వుంటూ వారి సాయంతో భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేపట్టాడు. వాటిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలలో అతని ప్రత్యర్థిగా నిలబడిన మైత్రీపాల సిరిసేన తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టులు ఆపించేస్తామని, తమ దేశాన్ని చైనాకు తాకట్టు పెట్టమని గంభీరప్రకటనలు చేశాడు. అతను గెలవగానే భారత్‌లో ఆనందం వెల్లివిరిసింది. సిరిసేన చైనాను దూరంగా నెట్టేసి, తమను వాటేసుకుంటాడని, శ్రీలంకకు వ్యాపార భాగస్వామిగా చైనా స్థానంలో తాము వస్తామని భారతీయులు అనుకున్నారు. ఈ 14 నెలల్లో ఇండియాతో సిరిసేన సంబంధాల గురించి చెప్పాలంటే, అతనికి భారతదేశం పట్ల స్నేహభావం వున్నా శ్రీలంక పౌరులకు భారత్ 'పెత్తనం' పట్ల వున్న భయాల కారణంగా చాలా జాగ్రత్తగా వున్నాడు. వాళ్ల దేశంలో సర్వీసెస్ సెక్టార్‌లో భారత్ ప్రవేశించడానికి ఉద్దేశించిన సిఇపిఏ (కాంప్రెహెన్సివ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్ ఎగ్రిమెంట్) పై సంతకం పెట్టే ధైర్యం చేయలేదు. అలా అని భారత్‌ను కాదని మరీ ముందుకు వెళ్లటం లేదు. పాకిస్తాన్ తన జెఎఫ్-17 ఫైటర్ విమానాలు అమ్మచూపినపుడు, ఇండియా అభ్యంతరాలను లెక్కలోకి తీసుకుని, ఆ ఒప్పందాన్ని నిరాకరించాడు. చైనా గురించి చెప్పాలంటే మొదట్లో ఏం చెప్పినా చివరకు కొత్త పాలకులదీ రాజపక్ష బాటే అయింది. శ్రీలంక ప్రధాని రానిల్ విక్రమసింఘే పదవిలోకి వచ్చాక తొలిసారిగా మార్చి నెలాఖరులో చైనాకు వెళ్లి కొత్త ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. చైనాతో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆపకపోగా కొత్తవి మొదలు పెడతామంటున్నాడు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షానికి సీటు మారగానే మాట మారడానికి కారణం ఏమిటంటే – ధనమూలం యిదం జగత్ అనే జవాబు వస్తుంది.
రాజపక్షను ఓడించిన సిరిసేనపై తమిళులు, మైనారిటీలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏడాది పోయిన తర్వాత చూస్తే సిరిసేన తన వాగ్దానాలు చెల్లించలేక చాలా విషయాల్లో వాళ్లను నిరాశ పరిచాడు. దానికి కారణం కూడా వుంది. 2015 జనవరిలో సిరిసేన నెగ్గేనాటికి పార్లమెంటులో రాజపక్షకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పి (శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ), దాని భాగస్వామి యుపిఎఫ్‌ఏ (యనైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ ఎలయన్స్)కు మెజారిటీ వుంది. 225 మంది ఎంపీలలో సిరిసేనకు అండగా నిలిచిన యుఎన్‌పి (యునైటెడ్ నేషనల్ పార్టీ)కు 43 మంది ఎంపీలు మాత్రమే మద్దతు వున్నారు. ఆగస్టులో పార్లమెంటు ఎన్నికలు జరిగాక ఫిరాయింపులను ప్రోత్సహించి సిరిసేన ఎస్‌ఎల్‌ఎఫ్‌పి పై పెత్తనం సాధించాడు. యుపిఎఫ్‌ఏలో మెజారిటీ ఎంపీలను తనవైపు తిప్పుకున్నాడు. ఆ విధంగా సిరిసేన-విక్రమసింఘే కలిసి మూడింట రెండువంతుల మంది ఎంపీల మద్దతు సంపాదించారు కానీ పరిష్కరించబడని సమస్యలు చాలా మిగిలే వున్నాయి. రాజపక్ష అధ్యక్షుడిగా వుండగా తన పదవికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టుకున్నాడు. వాటిని కుదిస్తానని సిరిసేన ఎన్నికలలో వాగ్దానం చేశాడు. అన్న ప్రకారమే తన అధికారాలు కుదించుకుంటూ బిల్లు చేయించాడు కూడా. అయితే సుప్రీం కోర్టు దాన్ని ఆమోదించలేదు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా వున్నాయంది. అందువలన బిల్లును మార్చారు. దాని ప్రకారం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటు పదవి అలాగే వుంది కానీ అధికారాలు మాత్రం తగ్గాయి. ఇప్పుడు రాజ్యాంగాన్నే మారుద్దామని అనుకుంటున్నారు. అధ్యక్షుడి అధికారాలతో బాటు, ప్రిఫరెన్షియల్ ఓటింగ్, న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి, తమిళ ప్రాంతాలకు మరిన్ని అధికారాలు – యిటువంటివన్నీ కలిపి మారుద్దామనుకుంటున్నారు.
రాజపక్షపై ఆగ్రహంతో వున్న తమిళులు సిరిసేనకు అండగా నిలిచారు. అందువలన తమ కోర్కెలన్నీ తీరాలని ఆశిస్తున్నారు. తమిళ ప్రాంతాల్లో సైన్యాన్ని తొలగించాలని, జైల్లో వున్న ఎల్‌టిటిఇ కార్యకర్తలను వదిలేయాలని, మిలటరీ వారి అధీనంలో వున్న హై సెక్యూరిటీ జోన్స్‌ను తమకు అప్పగించాలని.. యిలాటి వారి డిమాండ్లు తీరిస్తే జనాభాలో 70% వున్న సింహళ బౌద్ధులకు కోపం వస్తుందేమోనన్న భయం వుంది సిరిసేనకు. అందుచేత వాటిని అమలు చేయకుండానే తమిళుల పట్ల ఆదరం చూపుతూ వుండడానికి చూస్తున్నాడు. 2015 డిసెంబరులో జాఫ్నాలోని తమిళ నిర్వాసితుల క్యాంపుకి వెళ్లి పరామర్శించి వచ్చాడు. మిలటరీని అక్కడ నుంచి తొలగించలేదు కానీ తమిళులకు భావప్రకటనా స్వేచ్ఛ యిచ్చాడు. ఎల్‌టిటిఇతో పోరాటసందర్భంగా శ్రీలంక సైన్యం ద్వారా జరిగిన యుద్ధనేరాలపై అంతర్జాతీయ పరిశీలకుల ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తానని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు 2015 జూన్‌లో మాట యిచ్చి సెప్టెంబరులో లిఖితపూర్వకమైన హామీ యిచ్చాడు కానీ దాన్ని అమలు చేయడం సాధ్యం కావటం లేదు. సొంత సైన్యానికి విరుద్ధంగా విచారణ జరిపించడం, అదీ విదేశీయుల చేత చేయించడం – శ్రీలంక పౌరులకు మింగుడు పడని వ్యవహారం. ప్రతిపక్షంలో వుండగా వాగ్దానాలు చేయడం వేరు, అధికారంలోకి వచ్చాక ఆచరణలో పెట్టడం వేరు.
ఇలాటిదే పాత ప్రభుత్వపు అవినీతిపై విచారణ వాగ్దానం. ప్రభుత్వ నేరపరిశోధక సంస్థల వద్ద 2 వేల కేసులున్నాయి. కొన్ని కోర్టులకు వెళ్లాయి. విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే అవినీతికి పాల్పడిన ఎంపీలందరూ యిప్పుడు సిరిసేన వైపు వున్నారు. వాళ్లకు శిక్ష పడేట్లు చేస్తే వాళ్లు రాజపక్ష పక్షానికి వెళ్లిపోతారు. అందుకని వాళ్లను అక్కున చేర్చుకోవడమే కాక మంత్రి పదవులు కూడా కట్టబెట్టాడు సిరిసేన. ఇది అతనికి మద్దతిచ్చిన జనతా విముక్తి పెరమున వంటి పార్టీలను మండిస్తోంది. అవినీతిపై అసలైన విచారణ మొదలుపెడితే చైనా వైపు కూడా వేలెత్తి చూపించాల్సి వస్తుంది. అలా అయితే ప్రభుత్వం పూర్తిగా ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతుంది. ఎందుకంటే రాజపక్ష విపరీతంగా విదేశీఋణం తీసుకున్నాడు. కొత్తగా పన్నులు విధించి వడ్డీలు చెల్లిద్దామంటే ప్రజల్లో నిరసన వచ్చింది. సంక్షేమపథకాలతో వారిని చల్లారుద్దామని చూస్తూంటే ఆర్థికసాయం చేస్తున్న ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) దానికి సమ్మతించటం లేదు. పొదుపుగా వుండాలని గట్టిగా చెప్పింది. పొదుపు చేయడానికి బజెట్‌లో పది ప్రతిపాదనలు చేస్తే ప్రజా వ్యతిరేకత కారణంగా వాటిని మార్చవలసి వచ్చింది. సిరిసేనకు మిగిలిన దారి ఒక్కటే అయింది – అది చైనాతో సఖ్యత.
శ్రీలంకలో వున్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో 70% వాటికి చైనాయే డబ్బిస్తోంది. గత ఐదేళ్లలో వారి కివ్వాల్సిన బాకీ మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వాదాయంలో చాలా భాగం వాటి వడ్డీలకే పోతోంది. జిడిపిలో విదేశీ ఋణం 2010 నాటికి 36% వుండేది, 2013కి 65% అయింది, 2015కు వచ్చేసరికి 95% అయింది. సిరిసేన అధికారానికి వచ్చిన మొదట్లో అవినీతి ఆరోపణలతో మల్టీ బిలియన్ డాలర్ల చైనా ప్రాజెక్టులను ఆపేశాడు. చైనా తన ప్రతినిథులను శ్రీలంకకు పంపి మాట్లాడించింది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తప్ప తాము శ్రీలంకలో పెట్టుబడులు పెట్టమని, అప్పులివ్వమనీ కచ్చితంగా చెప్పింది. పోనుపోను సిరిసేనకు తత్వం బోధపడింది. చైనా తప్ప వేరే ఏ దేశమూ యీ దశలో రక్షించలేదని గ్రహించాడు. శ్రీలంక తీరాల్లో తమ ఓడలను లంగరు వేసేందుకు అనుమతి యివ్వాలని చైనా కోరినప్పుడు, ఇండియా అది తమ భద్రతకు భంగం కలిగిస్తుందంటూ అభ్యంతరం తెలిపింది. అయినా రాజపక్ష అనుమతి యిచ్చాడు. సిరిసేన అధికారంలోకి వస్తూనే దాన్ని నిలిపి వుంచాడు. తర్వాతి రోజుల్లో దాని గురించి పునరాలోచిస్తామన్నాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధాని మార్చి నెలాఖరులో నాలుగు రోజుల పర్యటనకై చైనా వెళ్లాడు. ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. తను శ్రీలంకకు యిచ్చిన 8 బిలియన్ డాలర్ల ఋణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తానని చైనా హామీ యిచ్చింది. కానీ దానికి అనుగుణంగా మీ చట్టాలు మార్చండి అని శ్రీలంకకు చెప్పింది. రాజపక్ష ప్రారంభించిన డీప్ సీ పోర్టు, రెండో యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను కొనసాగిస్తామని శ్రీలంక హామీ యిచ్చింది. చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెయ్యి ఎకరాల సెజ్ నిర్మిస్తున్నామంది. సముద్రం నుంచి భూమిని రిక్లెయిమ్ చేసి, అధునాతన నగరాన్ని నిర్మించే 1.4 బిలియన్ డాలర్ల పోర్టు సిటీ ప్రాజక్టును చైనా సాయంతో రాజపక్ష మొదలుపెడితే సిరిసేన ఆపించివేశాడు. మధ్యలో ఆపినందుకు చైనా 125 మిలియన్ డాలర్ల పరిహారం యిమ్మనమంది. 'ఇప్పుడు ఆ ప్రాజెక్టు సంగతేమైంది?' అని మీడియా అడిగినప్పుడు విక్రమసింఘే సమాధానం దాటవేశాడు – అది చర్చకు రాలేదు అంటూ. ఆ పోర్టు సిటీ కడితే చైనావాళ్లు దాన్ని సైనిక శిబిరంగా మారుస్తారని ఇండియా భయం. అలాటి భయాలెవరూ పెట్టుకోనక్కరలేదు అన్నాడు విక్రమసింఘే. అంటే దాన్నీ కొనసాగిస్తారన్నమాట. అధికారంలో రానంతసేపు అవినీతి గురించి, విదేశీయులకు బుద్ధి చెప్పడం గురించి ఎన్నయినా లెక్చర్లు చెప్పవచ్చు. సీట్లోకి వచ్చాక తెలుస్తుంది అసలు సంగతి!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)