''మెసెంజర్ ఆఫ్ గాడ్'' (దేవదూత) అనే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వివాదం కారణంగా మొత్తం సెన్సార్ బోర్డే మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఎలా వుంటుంది? దీనికి హీరో, డైరక్టర్, పాటల రచయిత, ముఖ్యగాయకుడు, ఆర్ట్ డైరక్టర్, కాస్ట్యూమ్ డైరక్టర్ అన్నీ – డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ సింగే! వయసు 47. ఆయన పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు. డేరా వర్గాల సమాచారం ప్రకారం గుర్మీత్ యిప్పటికే 102 సంగీతప్రదర్శనలు నిర్వహించారు. ఒక్కో ప్రదర్శనకు లక్షకు తక్కువ కాకుండా ప్రేక్షకులు వచ్చారు. వెయ్యి పాటలు రాసి, పాడారు. ఈ సినిమాను 67 రోజుల్లో షూట్ చేశారు. ఈ సినిమాలో చిన్నా పెద్దా నటీనటుల సంఖ్య 13 లక్షలట. ఒక సన్నివేశం కోసం 75 వేల కొవ్వొత్తులు వెలిగించారు – అంతకంటె ఎక్కువ కొవ్వొత్తులు దొరకకపోవడం వలన! ఒక సెట్టింగు వేయడానికి ముంబయి నుంచి వచ్చిన ఆర్ట్ డైరక్షన్ టీము 45 రోజులు పడుతుందని చెపితే బాబా తన బుద్ధికుశలత వుపయోగించి భక్తుల చేత మూడు రోజుల్లో దాన్ని కట్టించాడట! 300 గంటలు నడిచే సినిమా తీసి దాన్ని 3 గంటలకు కుదించారు. ఈ సినిమా విడుదల కాకుండా దీనికి సీక్వెల్ షూటింగు ప్రారంభమై పోయింది.
''దీనిలో నన్ను నేను దేవుడిగా చూపించుకోవడం లేదు. దీని ద్వారా యువతకు సందేశం యివ్వడమే నా లక్ష్యం. బాలీవుడ్ ప్రభావం దీనిపై వుండదు. ఫిబ్రవరిలో సినిమా విడుదలైనపుడు మీకే తెలుస్తుంది'' అంటున్నాడు గుర్మీత్ – దేవదూత అనిపించుకోవడంలో తప్పేమీ లేదన్నట్టు! 1948లో నెలకొల్పిన డేరా సచ్చా సౌదాకు అతను మూడో గురువు. 1967లో రాజస్థాన్‌లో జాట్ కుటుంబంలో పుట్టిన గుర్మీత్ 1990 నుండి డేరాకు అధినేత అయ్యాడు. అప్పటికి పదిలక్షల మంది భక్తులుంటే దాన్ని 50 రెట్లు పెంచాడు. అతని వేషాలు అవీ చూస్తే మనకు వింతగా తోచవచ్చు కానీ అతని భక్తులకు (5 కోట్ల మంది వున్నారట) అతను సాక్షాత్తూ దేవుడే. వాళ్లందరికీ లక్కీ నెంబర్ 7. ఎందుకంటే బాబా పేరు గుర్మీత్‌లో మొదటి అక్షరమైన 'జి' ఇంగ్లీషు అక్షరమాలలో ఏడో అక్షరం! అందువలన వాళ్ల మొబైల్ నెంబర్‌లో 7 అంకె వుండి తీరాలి.
అతనికి సిర్సాలో 700 ఎకరాల వ్యవసాయ క్షేత్రం వుంది. ఒకప్పుడు ఊసరక్షేత్రంగా వున్న దాన్ని సస్యశ్యామలంగా చేశాడు. భక్తులు అక్కడకి వచ్చి వుచితంగా పనిచేస్తారు. వాళ్లకు వసతి కల్పించి, భోజనం పెడతారంతే. లేబరు చార్జీలు తక్కువ కాబట్టి అక్కడ తయారయ్యే ఊరగాయలు, రోజ్ వాటర్, పళ్లరసాలు, అలోవియా, యితర హెర్బల్ ప్రాడక్టులు బాగా అమ్ముడుపోతాయి. వాటి మీద, బాబా మ్యూజిక్ ఆల్బమ్‌మీద, కారు డిజైన్ యూనిట్ల మీద వచ్చే ఆదాయంతోనే 104 ప్రజాసంక్షేమ సంస్థలు నడుస్తున్నాయి అంటారు వాళ్లు. నమ్మాలో లేదో భవిష్యత్తే చెపుతుంది. ఎందుకంటే ఏ ఆశ్రమం చూసినా ఆర్థిక లావాదేవీల వివాదాలలో చిక్కుకుంటోంది.