జగన్ తన ఉపన్యాసాల్లో దేవుడి ప్రస్తావన ఎక్కువగా చేస్తారని నేను వ్యాఖ్యానిస్తే, 'చేస్తే తప్పేముంది? ప్రత్యేకంగా ఎత్తి చూపాల్సిన అవసరం ఏముంది?' అంటూ కొందరు రాశారు. నా దృష్టిలో మతవిశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ వ్యక్తిగతం. వాటిని బహిరంగంగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. మతాచారం ప్రకారం హిందువు బొట్టు పెట్టుకున్నా, శిఖ్కు గడ్డం పెట్టుకున్నా, ముస్లిం టోపీ పెట్టుకున్నా, క్రైస్తవుడు శిలువ వేసుకున్నా వాళ్లిష్టం. కానీ ప్రజలందరికీ సంబంధించిన విషయాలను మతానికి, దైవానికి ముడిపెట్టి మాట్లాడితేనే చిక్కు వస్తుంది. సైంటిస్టులకూ వ్యక్తిగత విశ్వాసాలు వుంటాయి. తాను నమ్ముకున్న దేవుడికి దణ్నం పెట్టే పరిశోధన మొదలుపెట్టవచ్చు. కానీ పరిశోధనలోకి దైవప్రస్తావన తీసుకురాడు. అలాగే నాయకుడు కూడా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయంకృషిని, భవిష్యత్తుపై నమ్మకాన్ని పురికొల్పేట్లా మాట్లాడాలి. దేవుడిపై భారం వేసి కాళ్లు బారచాచి కూర్చోండి అనే ధోరణిలో మాట్లాడకూడదు. 'మీరు చేయగలరు, నేను ముందుండి నడిపిస్తాను, మనం మంచే చేస్తున్నాం కాబట్టి దేవుడి ఆశీర్వాదం ఎలాగూ వుంటుంది' అని దేవుణ్ని కాస్త వెనక వరుసలో కూర్చోపెట్టాలి. ఆపత్తులు, అపజయాలు వచ్చినపుడు దేవుణ్ని ముందు వరుసలోకి తీసుకురావచ్చు. మొన్న హుదూద్ బీభత్సాల వంటి వాటి వలన నష్టం వాటిల్లినపుడు దేవుడు కరుణించలేదు (మర్కంటైల్ లా లో కూడా యిలాటి వాటిని 'యాక్ట్స్ ఆఫ్ గాడ్' అంటారు) అని ఆయనపై తోసేయవచ్చు. అంతేకానీ దేవుడు తలచుకుంటేనే పనులవుతాయి, కాకపోతే కావు అనే భావాన్ని పదేపదే చెప్పరాదు. అది మతాచార్యుల పని.
జగన్ అంటూంటారు – దేవుడు నాకు అవకాశం యిస్తే ముఖ్యమంత్రిని అవుతాను అని. ఆ ముక్క అందరికీ తెలుసు, పైకి చెప్పడం దేనికి? 'ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం యిచ్చాడు, సద్వినియోగం చేసుకో' అనుకుంటారు జనం. వైయస్ కొడుకు కాకుండా మామూలు వ్యాపారస్తుడే అయితే జగన్‌కు యింత ఫోకస్ వుండేదా? పాతికేళ్ల పోరాటం తర్వాత వైయస్‌కు అధికారం యిచ్చిన దేవుడే ఆరేళ్ల తర్వాత అర్ధాంతరంగా పట్టుకుపోయాడు. జగన్ జీవితంలో పెద్ద కుదుపు. అది మంచికా? చెడుకా? అంటే – చూసే ధోరణి బట్టి వుంటుంది. వైయస్ యింకో యిరవై ఏళ్లు బతికి వుంటే జగన్ తండ్రి చాటు బిడ్డగానే వుండేవాడేమో, సొంతంగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసరికి అతనికీ షష్టిపూర్తి అయ్యేదేమో! వైయస్ లేరు కాబట్టి జగన్‌కున్న ఆకర్షణ ఏమిటో, లోపాలోపాలేమిటో అన్నీ తేటతెల్లమయ్యాయి. తనను చూసే ఓట్లేయమనే పరిస్థితి వచ్చింది. ఇది కీడులో మేలుగా ఎంచాలా? మేలులో కీడుగా ఎంచాలా?
ఏది ఏమైనా దేవుడి స్క్రీన్‌ప్లే ఎవరికీ అర్థం కాదు. అర్థం కాని విషయం గురించి బుఱ్ఱ బద్దలు కొట్టుకోవడం కంటె పరిస్థితిని తనకు అనువుగా మలచుకుని పోవడమే వివేకవంతులు చేయవలసినది. కనబడని దేవుడి గురించి మాట్లాడడం కంటె తన క్లయింట్లనే దేవుళ్లంటే మంచిది కదా అనుకుంటున్నారు వ్యాపారస్తులు. అందుకే పత్రికకు పాఠకులు దేవుళ్లు, సినిమాలకు ప్రేక్షకులు దేవుళ్లు, గుళ్లకు భక్తులు దేవుళ్లు (కరక్టే, భక్తులు రాకపోతే గుడికి ఆదాయం ఎక్కడ?) రాజకీయనాయకులకు ఓటర్లు దేవుళ్లు. 'మీరే ప్రత్యక్షదైవాలు, వరమిచ్చినా, శాపమిచ్చినా దానికి సమర్థులు మీరే' అంటే ఓట్లు రాలతాయి తప్ప 'దేవుడి దయ వుంటే చాలు..' అనే ధోరణిలో మాట్లాడితే వాళ్లకు మండదా? ఓ సామెత వుంది. మధ్యవయసుకు ముందు దేవుణ్ని నమ్మినవాణ్ని, మధ్యవయసు తర్వాత దేవుణ్ని నమ్మనివాణ్ని వింతగా చూస్తారని! యవ్వనంలో వుండగా స్వశక్తిపై నమ్మకం చాలా వుంటుంది. 'దేవుడిదేముంది, కనబడనే కనబడడు. నేనే అన్నీ చేయగలను' అనే ధీమా వున్నంతకాలం గుడికి వెళ్లడు, మొక్కులు మొక్కడు, దేవుడంటే ఖాతరు లేడంటాడు.
అయితే మధ్యవయసు వచ్చేసరికి చాలా విషయాలు బోధపడతాయి. ప్రపంచం సూత్రాలపై, లాజిక్‌పై ఆధారపడి నడవటం లేదని, మంచివాడికి అపకారం, చెడ్డవాడికి ఉపకారం జరుగుతోందని, శ్రమకు, ఫలితాలకు పొంతన లేదని, అకారణంగా ఒకడికి మేలు జరుగుతోందని, మరొకడికి నష్టం జరుగుతోందని గ్రహిస్తాం. ఈ చర్యల వెనుక కారణం కనబడక 'అదృష్టం' (అ-దృష్టం, (కారణం) కనబడనది) అనేది వుందనే అనుమానం మొదలవుతుంది. మంచివాడికి కష్టాలు కలగడానికి లాజిక్ అర్థం కాక 'పూర్వజన్మ పాపం లేదా కర్మ' అయి వుంటుందన్న సందేహం పొటమరిల్లుతుంది. ఏది కాకతాళీయమో, ఏది ప్రి-డిస్టయిన్‌డ్‌యో తోచక ఎందుకైనా మంచిదని దేవుడికి ఓ దణ్ణం పెట్టడంతో ప్రారంభమవుతుంది. పోనుపోను అది ముదురుతుంది. లోకమంతా యిదే తీరు కాబట్టే ఆ సామెత పుట్టింది. ముసలివాడి నోట నాస్తికత్వం, యువకుడి నోట ఆస్తికత్వం ఎబ్బెట్టుగా తోస్తాయి. చదువుకోవాల్సిన విద్యార్థి, ఉద్యోగం కోసం వెతకాల్సిన యువకుడు 'ప్రాప్తం లేదు' అంటే ఏడిశావులే అంటాం. పిల్లకు పెళ్లి చేయాల్సిన మధ్యవయస్కుడి నోట 'ఘటన', 'రాసి పెట్టి వుండాలి' లాటి మాటలు వినబడితే 'ఔనౌను' అంటూ తల వూపుతాం.
యువ రాజకీయనేత నోట ఆస్తికత్వం, దైవప్రశంస రాణించవు. జగన్ యువకులను ఆకర్షించే దశలోనే వున్నారు కాబట్టి తన ప్రసంగాల్లో దేవుడి గురించి కాకుండా, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం గురించి ఎక్కువ మాట్లాడాలని నా ఉద్దేశం. జగనే కాదు, లోకేశ్ అయినా, మరో యువనాయకుడైనా యిలాగే వుండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. ఈ ఉద్దేశంతో నేను ఆ వాక్యాలు రాశాను. విమర్శ వచ్చింది వివరణ యిద్దామనుకుంటూండగానే జగన్ యింకో అడుగు ముందుకేసి జాతకాల గురించి మాట్లాడారు. 'ఇంకో రెండేళ్లలో బాబు ప్రభుత్వం పతనమై పోతుందని జోస్యులు చెప్పారు' అని జగన్ ప్రకటించారు. చెప్పిన జోస్యుల పేరు చెప్పలేదు. ప్రతీ ఉగాదికి పార్టీ ఆఫీసుల్లో పంచాంగశ్రవణం అనేది ఫార్సు అయిపోయింది. ఆ సందర్భంగా రాశిఫలాలు చెప్పే పండితులు వెన్యూ చూసుకుని చెపుతున్నారు. టిడిపి ఆఫీసైతే ఒకలా, తెరాస ఆఫీసైతే మరోలా, కాంగ్రెసుదైతే యింకోలా…! అదే పంచాంగం, అవే గ్రహాలు, ఒక్కోరు ఒక్కోలా చెప్తారు. మరి జగన్‌కు యీ రెండేళ్ల విషయం ఏ జోస్యుడు చెప్పాడో!? ''సాక్షి''లో వారఫలాలు రాసే ఆయనా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)