ఇలా ముఖ్యమంత్రులకు చెప్పి ఏర్పాట్లు చేసే పని గతంలో యశ్‌పాల్ కపూర్ చేసేవాడు. అయితే తీర్పు తర్వాత ఇందిర అభిమానుల్లో యీ కష్టాలన్నిటికీ యశ్‌పాలే కారణమనే ఆగ్రహం పెల్లుబికి అతనిపై దాడి చేశారు. అందువలన అతన్ని కొంతకాలం తగ్గి వుండమన్నారు. అందువలన ధవన్ యీ భారం నెత్తిన వేసుకున్నాడు. ముఖ్యమంత్రులు బస్సుల్లో జనాలను ఇందిర యింటికి తరలించేవారు. కాంగ్రెసు విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యుఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) ''పేదలకోసం, పీడితుల కోసం అహరహం శ్రమించే ఇందిరా గాంధీ సోషలిస్టు సమాజం ఏర్పడ్డానికి చేస్తున్న కృషి ఆగడానికి వీల్లేదు'' అని ప్రకటన చేసింది. కాంగ్రెసు పార్టీ మొత్తం యిదే లైన్ తీసుకుంది – ఇందిర సోషలిస్టు. సోషలిస్టు పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ రియాక్షనరీ (తిరోగమనవాది), ఇందిరకు వ్యతిరేకంగా తీర్పు యిచ్చిన జడ్జి ఆధారపడిన చట్టం బూజు పట్టిన పాతకాలపు భావాలకు ఉదాహరణ! ముఖ్యమంత్రులు నిర్వహిస్తున్న యీ ప్రదర్శనలు పెద్ద మనుషులైన కొందరు కాంగ్రెసు ఎంపీలకు కూడా యిబ్బందికరంగా తయారయ్యాయి. కానీ సంజయ్ ముఠా వాళ్ల అభ్యంతరాలను తోసి పారేసింది – 'వాళ్లంతట వాళ్లే వచ్చి చేస్తున్నారు, మనం ఆపలేం' అంటూ.
దేశంలో వున్న ఐదు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా ఇందిరకు సమర్థన తెలిపినవారిలో వున్నాయి. సోషలిజం గురించి మాట్లాడుతున్నా ఆమె విధానాలు వాళ్లకు అనుకూలంగా వున్నాయి. ప్రతిపక్షాల్లో వున్న కొందరి సిద్ధాంతాలు వారికి గొంతు దిగవు. వాళ్ల కంటె యీవిడే బెటరు. జామియా మిలియా ఇస్లామియా, భారతీయ డిప్రిసెడ్ క్లాసెస్ లీగ్ వంటి సంస్థలు కూడా ఇందిరకు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాల్లో జనసంఘ్ వుండడం వలన వాళ్లు యిటు మొగ్గారు. రాజకీయ పార్టీల్లో సిపిఐ ఇందిరకు అండగా నిలిచింది. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసుకు మద్దతు యివ్వడమేమిటని ఆశ్చర్యపడేవాళ్లకు వాళ్ల పాలసీ గురించి క్లుప్తంగా చెపుతాను. సిపిఎం ఆవిర్భావం సీరీస్‌లో విపులంగా వస్తుంది. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం తొలిమెట్టుగా సోషలిస్టు సమాజం స్థాపించడం. స్వాతంత్య్ర పోరాటంలో జనాలందరూ కాంగ్రెసు వైపే వుండడంతో, కాంగ్రెసును వ్యతిరేకించే తమను ఎక్కువగా ఆదరించడం లేదని గమనించిన కమ్యూనిస్టులు కొందరు తమ లక్ష్యసాధనకు అడ్డదారి వెతికారు. కాంగ్రెసు పెద్ద సంస్థ కాబట్టి తాము ఆ పార్టీలో చేరి దాని విధానాలను సోషలిజం వైపు మళ్లిస్తే తామనుకున్న సమాజం ఏర్పడుతుందని అనుకున్నారు. కాంగ్రెసులో పూర్తి రైటిస్టు భావాల నుంచి, సోషలిస్టు భావాలు వున్నవారి వరకు అన్ని రకాల సిద్ధాంతాల వారూ వున్నారు. నాయకుడు నెహ్రూకు సామ్యవాది అయినా అతని భావాలను వ్యతిరేకిస్తూ అడ్డు తగిలేవారు అనేకమంది వున్నారు కాబట్టి, తమ ప్రవేశం వలన సోషలిస్టు భావాల వారికి బలం సమకూర్చి, సమసమాజ స్థాపన సాధ్యమయ్యేట్లు చేద్దామనుకున్నారు.
ఆ విధంగా మోహన కుమారమంగళం, రజనీ పటేల్ అనేకమంది కమ్యూనిస్టులు కాంగ్రెసులో ప్రవేశించి రైటిస్టు విధానాలను సమర్థించే మొరార్జీ దేశాయి, నిజలింగప్ప వంటి సిండికేటు నాయకులను వ్యతిరేకిస్తూ వుండేవారు. నెహ్రూ మరణం తర్వాత నాయకత్వం సిండికేటు చేతిలోకి వెళ్లడంతో వీళ్లు కంగారు పడ్డారు. సిండికేటు కీలుబొమ్మగా రాజకీయాల్లోకి వచ్చిన ఇందిరా గాంధీ సొంతంగా బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసి వీరికి ఆశ పుట్టింది. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి తమ విధానాలను అమలు చేస్తానంటే తాము మద్దతు యిస్తామని ముందుకు వచ్చారు. వీళ్లకు తోడుగా చంద్రశేఖర్ (ప్రధాని అయ్యారు), మోహన్ ధారియా, కృష్ణకాంత్ (మనకు గవర్నరుగా చేశారు) సోషలిస్టు భావాలున్న యువకులు 'యంగ్ టర్క్‌స్' పేరుతో బృందంగా ఏర్పడి మద్దతు యివ్వసాగారు. నువ్వొకందుకు పోస్తే, నేను ఇంకో అందుకు తాగాను అన్నట్టు ఇందిర వీళ్ల మద్దతు తీసుకుని ఆ పథకాలు అమలు చేస్తూ, పేదల్లో తన యిమేజి పెంచుకోసాగింది. ప్రజావ్యతిరేకులుగా, పెట్టుబడిదారుల తొత్తులుగా ముద్ర వేసి సిండికేటును అనామకులుగా చేసింది. దీనితో ప్రతిపక్షాలన్నీ వాళ్లకు అండగా నిలబడ్డాయి. అందర్నీ ఎదిరించడానికి ఆమెకు బలం చాలటం లేదు.
ఈ దశలో బయట వున్న కమ్యూనిస్టు నాయకుల్లో ఎస్‌ఏ (శ్రీపాద్ అమృత్) డాంగే వంటి వారు ఇందిరకు మద్దతుగా నిలవకపోతే 'తిరోగమనవాదు'లైన స్వతంత్ర, జనసంఘ్, క్రాంతి దళ్ వంటి పార్టీలు దేశాన్ని తమ చేతిలోకి తీసుకుంటాయని వాదించసాగారు. ఆ మేరకు రష్యా నుంచి వారికి ఆదేశాలు వచ్చాయని అంటారు. కమ్యూనిస్టుల్లో సుందరయ్య, బసవపున్నయ్య వంటి నాయకులు దీన్ని వ్యతిరేకించారు. ఇలా అడ్డదారులు పనికి రావని, ప్రతిపక్షంలో వుండే పోరాడాలని వాదించారు. ఇందిరను సమర్థించేవాళ్లు సిపిఐగా, వ్యతిరేకించిన వాళ్లు సిపిఎంగా విడిపోయారు. డాంగే ఇందిరకు పరమ భక్తుడిగా మారి, ఆమె ఏం చేసినా ఆహాఓహో అనసాగాడు. ఎమర్జన్సీని కూడా సమర్థించాడు. అలా చేయడం వలన ప్రజల దృష్టిలో అది పలుచనై పోయింది. ప్రతిపక్షంలో వుండి పోరాడిన సిపిఎంపై ప్రజల ఆదరణ పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ విభజన సమయంలో సిపిఐ పెద్దది, సిపిఎం చిన్నది. కాలక్రమేణా సిపిఎం బలపడి, పెద్దదైంది. సిపిఐ చిక్కిపోయింది. బెంగాల్, కేరళలో,త్రిపురలో వామఫ్రంట్‌లలో సిపిఎంకు తోకగా మిగిలింది. సిపిఐ ఇందిరకు మద్దతుగా నిలిచినా కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన సంజయ్ వాళ్లను అసహ్యించుకున్నాడు, దూరంగా పెట్టాడు. 1942లో కమ్యూనిస్టులు దేశద్రోహం చేశారంటూ ప్రచారం చేశాడు. సిపిఐవాళ్లు ఇందిర వద్ద ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. ఆమె పట్టించుకోలేదు. సంజయ్ చీదరించుకుంటున్నా సిపిఐ కాంగ్రెసును పట్టుకుని వేళ్లాడి, 1977 ఎన్నికలలో వాళ్లను సమర్థించింది. సిపిఎం వ్యతిరేకించింది. 1977 ఎన్నికల్లో కేరళలో తప్ప సిపిఐ చావుదెబ్బ తింది. సిపిఎం బెంగాల్‌లో ఘనవిజయం సాధించింది. అలహాబాదు తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 13 న సిపిఐ ఒక తీర్మానం ఆమోదించింది – ''నైతిక కారణాల చేత ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు తమ రాజకీయ దురుద్దేశాలను. తిరోగమన విధానాలను మరుగు పరచలేకపోతున్నాయి.'' అని.
ఎవరీ ప్రతిపక్షాలు? ఏమిటి వాటి చరిత్ర? ఆనాటికి వాళ్ల బలం ఎంత? వాళ్లను చూసి ఇందిర ఎందుకు భయపడుతోంది? (సశేషం)(ఫోటో – సిపిఐ అధ్యక్షుడు డాంగే)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)