1967 ఎన్నికలలో కాంగ్రెసు వ్యతిరేకత అనే సిద్ధాంతంతో సిపిఎం తమిళనాడులో ముస్లిం లీగుతో, డిఎంకెతో చేతులు కలిపింది. కేరళలో ముస్లిం లీగుతో చేతులు కలిపింది. బెంగాల్‌లో అజయ్ ముఖర్జీ నేతృత్వాన్న ఏర్పడిన బంగ్లా కాంగ్రెసుతో చేతులు కలిపి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పరచింది. దానితో పాటు సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పి (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) కూడా చేరాయి. 280 సీట్లున్న బెంగాల్ ఎసెంబ్లీలోఆ ఎన్నికలలో అప్పటిదాకా అధికారంలో వున్న కాంగ్రెసుకు 30 సీట్లు తగ్గి 127 తెచ్చుకుని అధికారం పోగొట్టుకుంది. సిపిఎం 135కి పోటీ చేసి 43 గెలవగా, సిపిఐ 62 పోటీ చేసి 16 తెచ్చుకుంది. గతంలో అవిభక్త కమ్యూనిస్టు పార్టీకి 50 సీట్లు రాగా, విడిపోయాక యిద్దరికీ కలిపి 59 వచ్చాయి. బంగ్లా కాంగ్రెస్ 80 స్థానాలకు పోటీ చేసి 34 తెచ్చుకుంది. ఫార్వార్డ్ బ్లాక్, పిఎస్‌పి, ఎస్‌ఎస్‌పి, ఆర్‌ఎస్‌పి, ఎస్‌యుసిఐ వంటి వామపక్షాలకు 37 వచ్చాయి. 31 మంది స్వతంత్రులు ఎన్నికయ్యారు. ఎవరికీ మెజారిటీ లేని పరిస్థితిలో బంగ్లా కాంగ్రెసు పక్షాన అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా, సిపిఎం నాయకుడు జ్యోతి బసు ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా అయ్యారు. జ్యోతి బసు అధికారాన్ని తన చేతిలోకి తీసుకుని చక్రం తిప్పుతూ సిపిఎం ప్రాబల్యాన్ని విస్తరింపచేయడంతో సిపిఐ, సిపిఎం రెండూ హద్దు మీరి కలహించుకున్నాయి. కాంగ్రెసు నుండి చీలి బంగ్లా కాంగ్రెసుగా ఏర్పడిన మాజీ కాంగ్రెసు నాయకులకు కూడా సిపిఎం ఎదుగుదల కంటగింపుగా తోచింది. కాంగ్రెసు సంగతి సరేసరి. స్వాతంత్య్రం వచ్చిన 20 ఏళ్లకే బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రం తమ చేజారిపోవడం ఇందిరా గాంధీ జీర్ణించుకోలేక బెంగాల్‌ను అస్థిరపరచింది. గవర్నర్లను తాబేదార్లగా వుపయోగించుకుని, ఫిరాయింపుదార్లను ప్రోత్సహిస్తూ సిపిఎంకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చూసింది. అజయ్ ముఖర్జీ 1967 మార్చి నుండి 8 నెలలు రాజ్యం చేయగానే ఆహారమంత్రిగా వున్న పిసి ఘోష్‌ను దువ్వింది. అతను కొందరు అనుయాయులతో సహా బంగ్లా కాంగ్రెసు నుండి బయటకు వచ్చి ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అని ఏర్పరచి కాంగ్రెసు పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచాడు. కేంద్రానికి బంటుగా వున్న గవర్నరు అజయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, పిసి ఘోష్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాడు. మూడు నెలలు తిరక్కుండా కాంగ్రెసు పార్టీ తన మద్దతు ఉపసంహరించింది. రాష్ట్రపతి పాలన విధించారు. 1969 ఫిబ్రవరి వరకు ఏడాదిపాటు అది సాగింది. మళ్లీ అజయ్ ముఖర్జీ గద్దె కెక్కి ఐదు నెలలు పాలించాడో లేదో మళ్లీ రాష్ట్రపతి పాలన విధించి 1971 మార్చిలో ఎన్నికల వరకు కొనసాగించారు. ఈలోగా నక్సలైట్లను దువ్వారు.
సిపిఎంలోని యువకార్యకర్తలు తమ పార్టీ ప్రభుత్వంలో భాగమై పోయి కాంగ్రెసు లాగే రివిజనిస్టు మార్గాన పడిపోతోందని అనుకోసాగారు. చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం వారికి స్ఫూర్తి నిచ్చింది. పార్టీ తక్షణం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విడిచిపెట్టి సాయుధపోరాటం చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినాయకత్వం దానికి అంగీకరించకపోవడంతో వాళ్లు తిరుగుబాటు చేసి నక్సల్‌బరీ అనే గ్రామంలో రైతు విముక్తి పోరాటం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి నక్సల్‌బరీ పేర నక్సలైట్ ఉద్యమంగా పేరు వచ్చింది. అది దేశంలోని యితర ప్రాంతాలకు కూడా వ్యాపించసాగింది. ముఖ్యంగా వ్యాపారస్తుల దోపిడీకి గురవుతున్న గిరిజనులలో యిది బాగా పాప్యులర్ అయింది. 1969లో సిపిఎంఎల్ (కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్-లెనినిస్టు) చారు మజుందార్ నాయకత్వంలో ఏర్పడింది. విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు దీనికి మద్దతు యిచ్చారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కేరళలలో దీనికి యూనిట్లు ఏర్పడ్డాయి. వీరు తమ ప్రధాన శత్రువుగా సిపిఎంను పరిగణించసాగారు. ప్రజాస్వామ్యం ఒక బూటకమని, తుపాకీ గొట్టం ద్వారానే అధికారం సిద్ధిస్తుందని వీరు తమ అనుయాయులకు నూరిపోసి, తమ ప్రత్యర్థులను హింసాయుత మార్గాలలో మట్టుపెట్టారు. తక్కిన రాష్ట్రాలలో ప్రభుత్వాలు అదే హింసాయుత మార్గాలలో ఉద్యమాన్ని అణచివేసి, దాని ప్రభావాన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. బెంగాల్‌లో మాత్రం కాంగ్రెసు సిపిఎంను కట్టడి చేయడానికి, కార్యకర్తలను చంపి బలహీనపరచడానికి నక్సలైట్లను ఉపయోగించుకుంది. జ్యోతి బసుపై 1970లో హత్యాప్రయత్నం కూడా జరిగింది. ఇలా సిపిఎంను అణచివేసిన తర్వాత రాష్ట్రపతిపాలన సమయంలో, 1972లో తను అధికారంలోకి వచ్చాక నక్సలైట్లను మట్టుపెట్టింది. సిద్ధార్థ శంకర్ రాయ్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే చారు మజుందార్‌ను 1972 జులైలో పట్టుకున్నారు. 12 రోజుల తర్వాత పోలీసు కస్టడీలోనే అతను చనిపోయాడు. ఇంకో నాయకుడు కనూ సన్యాల్‌ను 1970 ఆగస్టులో పట్టుకుని వైజాగ్ జైల్లో పెట్టారు. ఏడేళ్లపాటు జైల్లో వుంచారు. హింసామార్గం తప్పని అతను ప్రకటించిన తర్వాత వదిలిపెట్టారు. అతని అనుచరులందరూ అతన్ని విడిచారు. ఆ విధంగా నక్సలైట్ ఉద్యమానికి పుట్టిల్లయిన బెంగాల్‌లోనే ఆ ఉద్యమం చల్లారింది.
1971 అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం 113 స్థానాలు పొంది ప్రధాన పార్టీగా అవతరించింది. కాంగ్రెసుకు దాని కంటె తక్కువగా 105 వచ్చాయి. సిపిఐకు 13, బంగ్లా కాంగ్రెసుకు 5 వచ్చాయి. గవర్నరు సిపిఎంకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం యివ్వలేదు. అజయ్ ముఖర్జీని 84 రోజులు ముఖ్యమంత్రిగా పెట్టి ఆ తర్వాత రద్దు చేసేశారు. 1971 జూన్ నుంచి 1972 మార్చి వరకు రాష్ట్రపతి పాలన పెట్టి 1972 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు పోలీసులు, గూండాలు కలిసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేట్లా ఘోరమైన రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. జ్యోతి బసును సొంత నియోజకవర్గంలోనే ఓడించేశారు. దెబ్బకు కాంగ్రెసుకు 216 సీట్లు (దాదాపు 90%) వచ్చేశాయి. సిపిఐకు 35. సిపిఎంకు 14! ఈ ఎసెంబ్లీని సిపిఎం బహిష్కరించింది. ఈ ఎన్నికల ప్రహసనాన్ని నిర్వహించినది సిద్ధార్థ శంకర్ రాయ్. దేశబంధు చిత్తరంజన్ దాస్ దౌహిత్రుడు. అతని కుటుంబంలో అందరూ న్యాయవాదులు, న్యాయమూర్తులు. కానీ అతను అత్యంత అన్యాయంగా ప్రవర్తించి అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడు. ఎమర్జన్సీ విధించమని ఇందిరకు సలహా యిచ్చినది అతనే. 1969 నుండి 77 వరకు బెంగాల్‌లో జరిగిన రాజకీయ సంక్షోభం అనేక నవలలకు, సినిమాలకు, నాటకాలకు ముడిసరుకుగా పనికి వచ్చింది. ఆ సంక్షోభానికి కారకులు ఇందిర, ఆమెకు కుడిభుజంగా వ్యవహరించిన సిద్ధార్థ రాయ్. దాని ఫలితంగా 1977 తర్వాత కాంగ్రెసు బెంగాల్‌లో దెబ్బ తింది. ఇప్పటికీ అధికారంలోకి రాలేక విలవిలలాడుతోంది. ఎమర్జన్సీ విధించిన 1975 నాటికి సిపిఎం పరిస్థితి చాలా దీనంగా వుందనే చెప్పుకోవాలి. బెంగాల్‌లో అధికారం పోగొట్టుకుని, ఒక పక్క కాంగ్రెసు చేత, మరొక పక్క నక్సలైట్ల చేత పీడింపబడుతోంది. ఎమర్జన్సీ కాలంలో వాళ్లు చేసిన పోరాటం వాళ్లకు లాభం చేకూర్చింది. ఎమర్జన్సీ ఎత్తివేసిన తర్వాత బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పరచి దాదాపు మూడు దశాబ్దాలు పాలించింది.
తర్వాత మనం చర్చించబోయే పార్టీ భారతీయ జనసంఘ్. ఆ పార్టీ యిప్పుడు లేదు కానీ దాని కొత్త అవతారం బిజెపియే మనల్ని ప్రస్తుతం పాలిస్తోంది. అందువలన ఆ పార్టీ ఆవిర్భావం, తొలిదశ, ఎమర్జన్సీకు ముందు దాని స్థితి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా వుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)