‘‘తనీ ఒరువన్’’ సినిమాకు దర్శకత్వం వహించిన జయం రాజా హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించబోవడం ఖాయం అయ్యింది. తన కెరీర్ ఆరంభం నుంచి వరసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చినర రాజాకు ఈ రీమేక్ మాత్రం కచ్చితంగా ప్రత్యేకం. ఆయన ఈసారి తను రూపొందించిన సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. ఎవరో చేసిన సినిమాను రీమేక్ చేయగలడు అనిపించుకున్న దర్శకుడికి సల్మాన్‌తో చేయబోయే రీమేక్‌కు మించిన అచీవ్ మెంట్ ఉండదు. మరి ఇలాంటి సౌతిండియన్ దర్శకులు బాలీవుడ్ లో ఎంత మేరకు రాణిస్తున్నారు? అనే ఇక్కడ ప్రశ్న. దక్షిణాదిలో ఒక సూపర్ హిట్ సినిమా చేయడం.. దాంతో బాలీవుడ్ నుంచి పిలుపులు రావడం.. అదే సినిమాను అక్కడ రీమేక్ చేయడం… సౌతిండియన్ దర్శకులకు మామూలే. అయితే ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. వాళ్ల కెరీర్లు అంతగా ముందుకు సాగడం లేదు! ఇప్పుడు జయం రాజా.. మొన్నామధ్య సిద్దిక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బాడీగార్డ్’ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు. ఆ రీమేక్ వెర్షన్ కోసం సిద్ధిక్‌ను బాలీవుడ్ తీసుకెళ్లాడు సల్లూ. ఒరిజినల్‌ను తీర్చిదిద్దిన సిద్ధిక్ బాలీవుడ్ సినిమాను చేశాడు.. అక్కడ అది సూపర్ హిట్ అయ్యింది. వంద కోట్ల రూపాయల బొమ్మ అయ్యింది. అయితే సిద్ధిక్‌కు మాత్రం బాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తలేదు!
అంత భారీ హిట్‌ను తీసినా అందుకు తగ్గట్టైన ఆఫర్లు ఆయనకు వెల్లువెత్తలేదు. ఇలా బాలీవుడ్లో అదుర్స్ అనిపించేలా ఆరంగ్రేటం చేసి.. తర్వాత సైలెంట్ అయిన దర్శకులు మరికొంత మంది ఉన్నారు. మురగదాస్.. గజిని సినిమాతో దక్షిణాదిని ఊపిన మురగకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఆమిర్ ఖాన్ గజినిని రీమేక్ చేశాడు. అది కూడా సంచలన విజయం సాధించింది. మురగదాస్‌కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. అయితే.. అంతే స్థాయిలో ఆయన బాలీవుడ్లో దూసుకెళ్లలేదు. తర్వాత తమిళ సినిమాలేక ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆ దర్శకుడు. ఈ విధంగా సౌతిండియాలో సంచలన విజయాలను సాధించిన సినిమాలను రూపొందించిన దర్శకులు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి. అంతటితోనే ఆగిపోయారు. ఆ తర్వాత ఆ స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయారు.
వీళ్లు మాత్రమే కాదు.. అనేక మంది దక్షిణాది దర్శకులు పరిస్థితి అక్షరాల ఇదే. ‘‘పోకిరి’’ సినిమా హిట్టైన తీరును చూసి.. బాలీవుడ్ దాని రీమేక్ గురించి పూరీ వెంట పడ్డారు బోనీ కపూర్ వాళ్లు. అయితే అప్పుడు పూరి అంత ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఆయన ‘బుడ్డా హోగా తేరీ బాప్’’ వంటి సినిమాను డైరెక్ట్ చేసి చాలించుకున్నాడు. దక్షిణాదిలో సెక్సస్ ఫుల్ అనిపించుకున్న… సంచలన స్థాయి సినిమాలు రూపొందించిన ప్రతి దర్శకుడి కెరీర్లోనూ ఒక బాలీవుడ్ ఆఫర్ ఉండనే ఉంది. ‘‘అంతఃపురం’ సినిమా హిట్‌తో కృష్ణవంశీ అదే సినిమాను రీమేక్ చేశాడు. కరిష్మా కపూర్ , షారూక్ వంటి తారలు ఆ సినిమాలో నటించారు. అయితే కృష్ణవంశీ మెరుపులు కూడా ఆ సినిమా వరేక పరిమితం అయ్యాయి!
ఈ కాలం నుంచి మాత్రమే కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమలను కమర్షియల్ మూవీస్ కేరాఫ్‌గా మార్చిన కె.రాఘవేంద్ర రావు, ఎ.కోదండరామిరెడ్డి వంటి వాళ్ల వెంట కూడా బాలీవుడ్ పడింది. క్లాసిక్స్ తీసిన భారతి రాజాను, బాలచందర్‌ను, బాలూమహేంద్రలను కూడా వదల్లేదు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రియదర్శన్‌ను కూడా తెగ ఆదరించింది హిందీ చిత్ర పరిశ్రమ. వీరిలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిలు కూడా బాలీవుడ్లో మరీ సెక్సస్ కాలేకపోయారు. తెలుగులో వీరు రూపొందించిన సినిమాలను వీళ్లే హిందీలో రీమేక్ చేశారు. అవి బాగానే ఆడాయి. అయితే వీళ్లకు బాలీవుడ్ మానియా తక్కువ. తెలుగులో బాగుంది కదా.. ఎందుకు హిందీ వైపు వెళ్లడం అనే భావనతోనే వీళ్లు కేవలం టాలీవుడ్‌కు పరిమితం అయ్యారు. తను తెలుగులో రూపొందించిన అనేక సినిమాల హిందీ రీమేక్‌లకు కూడా దర్శకత్వం వహించాడు దర్శకుడు కె.విశ్వనాథ్. ‘స్వాతిముత్యం’ సినిమాను తెగ ఇష్టపడి ఆయన చేతే దాన్ని హిందీలో రీమేక్ చేయించుకున్నాడు అనిల్ కపూర్. తెలుగులో రాధిక చేసిన పాత్రను విజయశాంతి చేయగా.. కమల్ పాత్రను అనిల్ కపూర్ చేశాడు. ‘‘ఈశ్వర్’’ పేరుతో విడుదల అయిన ఆ సినిమా ప్లాఫ్. ఆ తర్వాత కూడా ఒకటీరెండు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడాయన.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పీక్ స్టేజీలో ఉన్నప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆయన సినిమాలను మిస్ కాకుండా చూశారు. శ్రీదేవి ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల మీద మనసు పెంచుకుని.. బోనీ చేత వాటిని రీమేక్ చేయించింది. ఎస్వీ కృష్ణారెడ్డి ‘‘శుభలగ్నం’’ బాలీవుడ్ క్లాసిక్‌గా మిగిలింది. ‘యమలీల’ సినిమా వెంకటేష్ హీరోగా రీమేక్ అయ్యింది. ఈ దశలోనే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు డబ్బింగులుగా బాలీవుడ్ లో విడుదలవ్వడం మొదలైంది. ‘ఘటోత్కజుడు’ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది. ఆ తర్వాత మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ బాలీవుడ్లో ఊపందుకోలేదు. టాలీవుడ్లో కూడా నెమ్మదించడంతో ఆయన బాలీవుడ్లో ప్రత్యేకంగా సత్తా చూపడానికి అవకాశం లేకుండాపోయింది.
అచ్చం ఎస్వీ కృష్ణారెడ్డి తరహాలోనే అంతకన్నాముందే బాలీవుడ్ పై ప్రభావం చూపిన దర్శకుడు కె.భాగ్యరాజ్. ఈ మలయాళీ హీరో కమ్ దర్శకుడిది బాలీవుడ్ పై చెరగని ముద్ర. స్వయంగా బరిలోకి దిగిన సందర్భాలు తక్కువే కానీ… భాగ్యరాజా సినిమాలు హిందీలోరీమేక్ అయ్యాయి. ఒకదశలో భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన పాతిక సినిమాల్లో 16 సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాటిలో ఒకటీ రెండు సినిమాలకు భాగ్యరాజ్ హిందీలో దర్శకత్వం వహించాడు. పెద్ద స్టార్లను పెట్టి తను డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు. అయితే ముంబై వాతావరణంపడలేదో ఏమో కానీ.. భాగ్యరాజ్ మదరాస్ చేరుకున్నాడు. తిరిగి సౌత్ సినిమా మీదే దృష్టి నిలిపాడు.
ఈ విధంగా చెప్పకుంటే అనేక మంది దక్షిణాది స్టార్ దర్శకులు బాలీవుడ్ పై ప్రభావం చూపి కూడా అక్కడ పూర్తి కాలం కొనసాగలేకపోయారు. కొందరికి అవకాశాలు కలిసిరాక రాణించలేకపోతే.. మరికొందరికి సొంత ఇండస్ట్రీలే సేఫ్ అనిపించాయి. అవకాశాలు ఉన్నా.. వాటిని వదిలేసుకుని సౌతిండియాకే పరిమితం అయ్యారు. పై వాళ్లుఎవరూ ముంబైలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అందరిదీ గెస్ట్ అప్పీరియన్సే! అయితే సూపర్ సెక్సస్ అయిన వాళ్లూ ఉన్నారు. ముంబైలో సెటిలైన వాళ్లూ ఉన్నారు. ఆ పేర్లలో ముందుగా వినిపించేది ఆర్జీవీ, ప్రియదర్శన్‌ల పేర్లు. ‘శివ’ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించడంతో వర్మ దాన్నే హిందీలో రీమేక్ చేసి సత్తా చాటాడు. అక్కడ నుంచి బాలీవుడ్ మొదలైన వర్మ శకం ‘సత్య’ సినిమాతో పీక్స్‌కు వెళ్లింది. రామ్ గోపాల్ వర్మను బాలీవుడ్ రామూగా మార్చుకుంది. దాదాపు తెలుగువాడు అనే విషయం మరిచిపోయేంతలా వర్మ బాలీవుడ్లో పాతుకుపోయాడు. ఒక ‘కంపెనీ’నే ఏర్పాటు చేసుకున్నాడు. బాలీవుడ్ రాజకీయాల్లో కూడా వర్మ భాగమయ్యాడు. అక్కడ శిష్యులను తయారు చేసుకున్నాడు.. తన వివాదాస్పద తీరుతో శత్రువులను కూడా తయారు చేసుకున్నాడు. ఓవరాల్‌గా ముంబైకి లోకల్ అయిపోయాడు. ఈ మధ్య మళ్లీ సౌంతిడియా వైపు వచ్చేశాడనుకోండి.
అలాగే మణిరత్నంను కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ‘‘నాయకుడు’’ సినిమాతో మణి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. అంతకు ముందు అగ్నినక్షత్రం, గీతాంజలి వంటి సినిమాల హిట్స్‌తో మణి సౌతిండియాలో ఫేమస్ అయితే.. నాయకుడు సినిమాను హిందీలో రీమేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ‘‘రోజా’’ ‘బొంబాయి’’ వంటి సినిమాలు సౌతిండియాలో ఎంతటి క్లాసిక్సో.. బాలీవుడ్లో కూడా వాటికి అదే స్థాయి స్థానం ఉంది. వాటి తర్వాత మణి చేసిన ప్రతి సినిమా హిందీలో రీమేక్ లేదా.. డబ్బింగ్ కావడం జరుగుతూ వస్తోంది. అయితే ‘‘సఖి’’ ‘యువ’ వంటి సినిమాలు హిందీలో అంత సెక్సస్ కాలేదు. ఇక ‘రావణ్’ డిజాస్టర్ కావడంతో ‘కడలి’ ‘‘ఓకే బంగారం’ సినిమాలు బాలీవుడ్ వైపు వెళ్లనే లేదు.
ఒక సినిమా సుల్తాన్‌గా కాకుండా… బాలీవుడ్లో సెక్సస్ అయిన దర్శకుల జాబితాలో నిలుస్తాడు ప్రియదర్శన్. మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లో విజయాలు సాధించిన పాత సినిమాలన్నింటినీరీమేక్ చేసుకుంటూ బండిలాగిస్తున్నాడు ప్రియన్. ఇప్పుడన్నీ అలా రీమేక్‌లే చేస్తున్నా.. తను రూపొందించిన ‘‘కాలాపానీ’’ సినిమానే ప్రియన్‌ను బాలీవుడ్ వరకూ తీసుకెళ్లింది. స్వతంత్రపోరాటం నాటిపరిస్థితులను కళ్లకు కట్టిన ఆ సినిమానే ఈయనను చాంఫియన్‌గా నిలిపింది. అలాగే రీమేక్‌ల రాజా ప్రభుదేవా. పోకిరి, విక్రమార్కుడు వంటి సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేసి.. అక్కడ కుదురుకున్నాడు ప్రభు. బాలీవుడ్లో సత్తా చాటిన సౌతిండియన్స్ జాబితాలో నిలుస్తాడితను.