1962 లోకసభ ఎన్నికలలో కాంగ్రెసుకు 45% ఓట్లు, 361 సీట్లు రాగా, జనసంఘ్‌కు 6% ఓట్లు, 14 సీట్లు వచ్చాయి. వాటిలో ఏడు ఉత్తరప్రదేశ్ నుంచి, మూడు మధ్యప్రదేశ్ నుంచి, 3 పంజాబ్ నుంచి రాగా ఒకటి రాజస్థాన్ నుండి వచ్చింది. ఢిల్లీలో ఒక్క సీటూ రాకపోయినా పోలయిన ఓట్లలో 32% ఓట్లు వచ్చాయి. 1959లో జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో మొత్తం 60 సీట్లలో జనసంఘ్‌కు 25 సీట్లు, అంటే కాంగ్రెసు కంటె రెండే రెండు తక్కువ వచ్చాయని గమనించాలి.
రఘు వీర అనే ఇండాలజిస్టు 1963లో జనసంఘ్‌కు కొత్త అధ్యక్షుడుగా లభించాడు. అయితే ఆయన కొద్ది నెలలకే కాన్పూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పుడు మళ్లీ ఘోష్‌ను తెచ్చిపెట్టి 1964 వరకు కొనసాగించారు. 1965 వచ్చేసరికి బయటివాళ్లకు స్వస్తి చెప్పి పార్టీలో ముందునుంచీ వున్నవాళ్లకే ఆ పదవి యివ్వాలనుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయవైపే అందరూ మొగ్గారు. కానీ ఆయన దానికి సిద్ధంగా లేడు. దాంతో వత్సరాజ్ వ్యాస్ అనే విదర్భ ఎమ్మెల్సీని చేద్దామనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆ సమావేశానికి యిద్దరు ప్రముఖులు గైరుహాజరయ్యారు. ఒకరు బలరాజ్ మధోక్ కాగా, రెండోవారు వాజపేయి. 1962 ఎన్నికలలో వాజపేయి ఓడిపోయారు. తర్వాత రాజ్యసభ మెంబరై జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చాలాకాలం వున్నారు. వారిని సముదాయించడానికి బలరాజ్‌ను అధ్యక్షుడిగా చేశారు. 1967 నాటికి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం, అనుభవశూన్యురాలైన ఇందిరా గాంధీ ప్రధానమంత్రి కావడం జరిగాయి. ప్రజల్లో కాంగ్రెసు పట్ల వ్యతిరేకత బలంగా వుంది. ఆ ఏటి ఎన్నికలలో మొత్తం 520 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెసుకు 283 మాత్రమే దక్కాయి. ఓట్ల శాతం 40! జనసంఘ్‌కు 9% ఓట్లు, 35 సీట్లు వచ్చాయి. ఢిల్లీలోని 7 సీట్లలో 6 సీట్లు వాళ్లవే. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లో 78, యుపిలో 98, రాజస్థాన్‌లో 22 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ప్రతిపక్షాలు ఏర్పరచిన సంకీర్ణ ప్రభుత్వాలు అతి త్వరలోనే విచ్ఛిన్నమయ్యాయి.
బలరాజ్ మధోక్ ఒక తిక్క మనిషి. తీవ్రభావాలు కలవాడు. భారతదేశంలో ముస్లిములు నివసించాలంటే హైందవ జీవనవిధానాన్ని అవలంబించాలని ప్రకటించేవాడు. శ్యామా ప్రసాద్ అనుచరుడిగా అధ్యక్ష స్థానాన్ని పొందగలిగాడు. అతన్ని దింపకపోతే లాభం లేదని దీన్‌దయాళ్‌ను గోల్వాల్కర్ ఒప్పించి, 1967 డిసెంబరులో కాలికట్‌లో జరిగిన పార్టీ సమావేశంలో అధ్యక్షుడయ్యేట్లా చేశారు. దీన్‌దయాళ్ గొప్ప నాయకుడు. ఇప్పటికీ బిజెపి నాయకులు ఆయన పేరు స్మరిస్తూ వుంటారు. ఆయన పేరుపై పథకాలు ప్రకటిస్తూ వుంటారు. 1916లో యుపిలో మథుర వద్ద పుట్టిన దీన్‌దయాళ్ చిన్నప్పుడే తలిదండ్రులు చనిపోవడంతో రాజస్థాన్‌లో మేనమామ వద్ద పెరిగాడు. సికర్‌లో, పిలానిలో ఇంటర్ చదివి అసమాన ప్రతిభ కనబరచి కాన్పూరులో బియ్యే, ఆగ్రాలో ఎమ్మే ఇంగ్లీషులో చేరారు. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్‌లో సెలక్టయి కూడా ఉద్యోగంలో చేరకుండా ప్రజాజీవితానికే అంకితమవడానికి నిశ్చయించుకున్నారు. 1937లో కాన్పూరులో చదువుతూండగానే సంఘ్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేశారు. సాధారణ జీవితం గడుపుతూ, నిస్వార్థంగా పనిచేస్తూ అంకితభావంతో ఎందరో కార్యకర్తలను తయారుచేశారు. రాష్ట్రధర్మ అనే మాసపత్రికను, పాంచజన్య అనే వారపత్రికను, స్వదేశ్ అనే దినపత్రికను ప్రారంభించారు. వివాదరహితుడు. అందరి మన్ననలూ పొందినవాడు. రైటిస్టు భావాలున్న పార్టీ నడుపుతున్నా భూసంస్కరణలను వ్యతిరేకించలేదు. 1952 ఎన్నికలలో రాజస్థాన్ ఎసెంబ్లీకు పార్టీ తరఫున 8మంది అభ్యర్థులు గెలవగా వారిలో ఆరుగురు జమీందార్లు, భూస్వాములు. రాజస్థాన్ ఎసెంబ్లీలో జమీందారీ రద్దు బిల్లు ప్రవేశపెట్టినపుడు వారు దాన్ని వ్యతిరేకించదలచారు. శ్యామా ప్రసాద్, దీన్‌దయాళ్ ఒప్పుకోలేదు. దాంతో వారు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయినా వీళ్లు తొణకలేదు.
పూర్తిగా ఉత్తరాదిలోనే పెరగడం చేత దీన్‌దయాళ్‌కు దక్షిణాది ప్రజల మనోభావాలపై అవగాహన లేదు. భాష విషయంలో పార్టీ చాలా పొరపాట్లు చేయడానికి ఆయన కూడా బాధ్యుడు. ఇండియన్ రిపబ్లిక్ ఏర్పడిన 15 ఏళ్ల కల్లా అంటే 1965 నాటికి దేశం మొత్తం మీద ఇంగ్లీషును తొలగించివేసి దాని స్థానంలో హిందీ అమలు చేయాలని పార్టీ ఉద్యమాలు చేసింది. తమిళనాడులో, యితర దక్షిణ రాష్ట్రాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగితే పార్టీ 'అవి ముస్లిము మతనాయకులు ప్రేరేపించినవి' అనేసింది. హిందువైతే హిందీని కాదనకూడదని జనసంఘ్ నాయకుల భావన. 1967 ఎన్నికల మ్యానిఫెస్టోలో సంస్కృతాన్ని జాతీయభాషగా ప్రకటించాలని, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. దేశమంతా హిందీ చదువును కంపల్సరీ చేయాలని, రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల వాడకం పెరగాలని, కేంద్రం రాష్ట్రాలతో హిందీలో కానీ, ప్రాంతీయ భాషలో కానీ ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాలని వాదించారు. ఇంగ్లీషు ప్రస్తావనే లేదు. హిందీ వాడకం పెరిగిన కొద్దీ హిందీ మాతృభాషగా కలవారికి అవకాశాలు పెరిగి, యితర భాషలవారికి నష్టం కలుగుతుందని అందరికీ తెలుసు. ఈ వాదం వలన పార్టీ దక్షిణాదిన విస్తరించలేదని భయపడిన అక్కడి నాయకులు యీ విధానానికి అభ్యంతరం తెలిపారు. చివరకు 1967లో కేరళలోని కాలికట్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ''యుపిఎస్‌సి పరీక్షలు ప్రాంతీయభాషల్లో కూడా జరగాలని, ఏ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన వుండకూడదనీ' తీర్మానం చేశారు.
దీన్‌దయాళ్ పార్టీ పగ్గాలు చేతపట్టి దాన్ని ఒక దారిలో పెట్టేలోగా 41 రోజుల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. 1968 ఫిబ్రవరిలో తెల్లవారుఝామున యుపిలోని ముఘల్‌సరాయ్ స్టేషన్ పట్టాలపై ఆయన శవం పడి వుంది. కాంగ్రెసు పార్టీయే ఆయన్ను చంపించి వేసిందని జనసంఘ్ ఆరోపించింది. సిబిఐ చేత విచారణ జరిపించారు. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ఎంక్వయిరీ కమిషన్ వేశారు. ఢిల్లీ హౌడా ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తున్న దీన్‌దయాళ్‌ను ఓ యిద్దరు చిల్లర దొంగలు దోచుకోబోయి, వీలుపడక బోగీలోంచి తోసేశారని సిబిఐ అంది. ఆయన సూట్‌కేస్, వాచీ భద్రంగా వుండడం, గుప్పిట్లో రూ.5 ల నోటు వుండడం, ఆ సమయంలో ఆయన తలుపు దగ్గర ఎందుకు నిలబడి వున్నాడో చెప్పలేకపోవడం – వీటివలన యీ కథనాన్ని ఎక్కువమంది నమ్మలేకపోయారు. నమ్మశక్యంగా తోచకున్నా హత్య చేయడానికి రాజకీయకారణాలు ఏమీ కనబడటం లేదని, మామూలు నేరస్తులు చేసిన పనే కావచ్చనీ చంద్రచూడ్ అన్నారు. ఎటువైపు వాదనకూ ఏ ఆధారాలు లేవు. జనసంఘ్ అప్పటికి పెద్ద పార్టీ ఏమీ కాదు, దీన్‌దయాళ్ దేశపాలకులను యిబ్బంది పెట్టే కార్యక్రమం ఏదీ చేపట్టలేదు. పైగా ఆయన సౌమ్యుడు. ఇప్పటికీ బిజెపి నాయకులు అది కాంగ్రెసు చేసిన హత్యే అంటారు. బలరాజ్ మధోక్ తన ఆత్మకథలో వాజపేయికి హస్తం వుందని ఆరోపించాడు. ఉపాధ్యాయ తర్వాత వాజపేయి అధ్యక్షుడు అయ్యారు. తనకా పదవి రావడానికి గాను వాజపేయి ఏదో చేశాడనీ, అందుకే యాక్సిడెంటు థియరీని తను వ్యతిరేకించినందుకు తనను పార్టీలోంచి బయటకు పంపించాడనీ బలరాజ్ ఆరోపణ. బలరాజ్ ఆత్మకథ నిండా అభూత విషయాలు చాలా వుండడం వలన ఆయన్నెవరూ సీరియస్‌గా పట్టించుకోరు. (సశేషం) (ఫోటో – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)