ఎంత విచిత్రం? కన్న కూతుని పాశవికంగా హత్య చేసిన కుమార్తె తల్లి మరణవార్త విని తల్లడిల్లిందట. జైల్లోనే కుప్పకూలిపోయిందట. ఆ ఆవేదనే అనారోగ్యంగా మారి ఆసుపత్రి పాలు జేసిందట…
గుండెపోటు, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం… వగైరా వదంతుల మధ్య బైకుల్లా జైలు నుంచి జెజె ఆసుపత్రికి తరలిన షీనాబోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ మంగళవారం సాయంత్రం తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో జైలుకి మళ్లీ తిరిగొచ్చింది. ఈ సందర్భంగా జైలు అధికారులు ఆమెను రకరకాలుగా ప్రశ్నించారు. దాదాపు 3గంటల సేపు ఆమె స్టేట్‌మెంట్ ను రికార్డ్ చేశారు.
అధికారులు ధృవీకరించనప్పటికీ, దీని సారాంశంగా తెలుస్తున్నదేమిటంటే… తన తల్లి మరణ వార్త తనను బాగా కృంగదీసిందని ఇంద్రాణి జైలు అధికారులకు చెప్పింది. ఇంద్రాణి తల్లి చనిపోయి కొన్ని రోజులైనప్పటికీ ఆమెకు ఆలస్యంగా, గత గురువారం సాయంత్రం మాత్రమే పోలీసులు తెలియజేశారు. ఈ విషయం విన్న వెంటనే ఇంద్రాణి కుప్పకూలిపోయి రోదించిందట. ఆ రాత్రి కూడా ఆమె ఏమీ ఆహారం తీసుకోలేదు.
మరుసటి రోజు యదావిధిగా ఉదయం 5గంటలకే లేచి స్నానం అవీ కానించి, భగవద్గీత చదువుకుంటూ కాసేపటికే తనకు తీవ్రమైన అస్వస్థతగా ఉందని ఇంద్రాణి చెప్పడంతో ఆమెకు అప్పటికప్పుడు జైలు డాక్టర్లు ప్రాధమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో జెజె ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె వేగంగా కోలుకుంది. రిపోర్ట్‌లలో సైతం ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం చేసిందనేందుకు ఎటువంటి దాఖలాలు కనపడలేదని తెలిసింది. తల్లి మరణవార్త విని తట్టుకోలేకపోయానే తప్ప తాను అనధికారిక మోతాదులో మందులు వేసుకోలేదని ఇంద్రాణి స్పష్టం చేసిందట. బైకుల్లా జైలు నుంచి ఇంద్రాణిని మరోచోటికి తరలిస్తారనే వార్తలను ధృవీకరించని జైలు అధికారులు ప్రస్తుతానికి జైల్లో ఆమెకు కేటాయించిన బ్యారక్‌ను మాత్రం మార్చనున్నారట.