ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 10

కొన్నేళ్లు పోయాక నా చావు గురించి చెప్పు అని అడిగాడు రాజు. 'ఒకప్పటి నీ యజమాని కుమారులైన ఆరిలియస్‌ ఏంబ్రోసిస్‌, ఊథర్‌ రోమన్‌ సామ్రాజ్యం నుంచి నీపై కోపంతో వస్తున్నారు. తమ తండ్రి బ్రిటన్‌ను…

కొన్నేళ్లు పోయాక నా చావు గురించి చెప్పు అని అడిగాడు రాజు. 'ఒకప్పటి నీ యజమాని కుమారులైన ఆరిలియస్‌ ఏంబ్రోసిస్‌, ఊథర్‌ రోమన్‌ సామ్రాజ్యం నుంచి నీపై కోపంతో వస్తున్నారు. తమ తండ్రి బ్రిటన్‌ను నీకు అప్పగిస్తే నువ్వు నీ స్వార్థం కోసం దేశంలోకి శాగ్జన్లను తెచ్చిపెట్టావని అమిత ఆగ్రహంతో వున్నారు. వారి చేతిలో నీ చావు తప్పదు' అని చెప్పాడు మెర్లిన్‌. అన్నట్టుగానే వాళ్లిద్దరూ వచ్చారు. ఆరిలియస్‌ రాజై, ఊథర్‌ సేనానియై వోర్టిజెర్న్‌ను అతని స్తూపంతో సహా కాల్చి చంపేశారు. ఆ తర్వాత జర్మనీపై దండెత్తి శాగ్జన్‌ రాజైన హెంగిస్ట్‌ను మట్టుపెట్టారు. బ్రిటన్‌లో శాంతి నెలకొల్పి, శాగ్జన్ల చేతిలో నాశనమైన చర్చిలను పునర్నిర్మించారు. ఆ తర్వాత ఆరిలియస్‌కు హెంగిస్ట్‌ చేతిలో మోసానికి అనేకమంది బ్రిటిషు యోధులు మరణించిన కేయర్‌ కారాడాక్‌ (ఇప్పటి శాలిస్‌బరీ) వద్ద వారికై స్మారకచిహ్నం కట్టాలని ఆలోచన వచ్చింది. ఎలా కట్టాలాని ఆర్చిబిషప్‌ను సంప్రదిస్తే ఆయన 'పాతరాజైన వోర్టిజెర్న్‌కు మార్గదర్శనం చేసిన ఐంద్రజాలికుడు మెర్లిన్‌కోసం వెతికించి, అతని సలహా మేరకు కట్టు' అని చెప్పాడు. మెర్లిన్‌ కోసం వెతగ్గా ఒక వూళ్లో దొరికాడు. ఆరిలియస్‌ అతన్ని ఆస్థానానికి రప్పించి తన వూహ చెపితే మెర్లిన్‌ ''ఐర్లండ్‌లో వున్న కిల్లారౌస్‌ పర్వతం వద్ద జయింట్స్‌ డాన్స్‌ అనే రాతికట్టడం వుంది.  వాటిని అక్కణ్నుంచి భద్రంగా తెప్పించి, అదే తీరుగా యిక్కడ ఏర్పాటు చేయించు.'' అని చెప్పాడు. ఆరిలియస్‌ నవ్వాడు – ''బ్రిటన్‌లో లేని రాళ్లు పొరుగుదేశమైన ఐర్లండ్‌లో వున్నాయా? అక్కడికి ఎందుకు వెళ్లాలి?'' అని.

అప్పుడు మెర్లిన్‌ విశదీకరించాడు. ''ఒకప్పుడు యీ ప్రాంతమంతటిలో నివసించిన మహాకాయులు ఆఫ్రికా తీరాల నుంచి ఆ ఓషధీశిలలను తెచ్చి వర్తులాకారంలో అక్కడ ఏర్పరచారు. వాటి మీద పడే నీరు మధ్యలో చేరి మడుగులా ఏర్పడేది. యుద్ధంలో గాయపడినవారిని, అనారోగ్యపీడితులను  ఆ నీటిలో స్నానం చేయిస్తే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతు లయ్యేవారు. అందుకే వాటికి తెప్పించమంటున్నాను.'' అన్నాడు. ''సరే నా తమ్ముడు ఊథర్‌ను సైన్యంతో సహా ఐర్లండ్‌కి పంపిస్తున్నాను. స్నేహపూర్వకంగా అడిగి చూసి, అవసరమైతే యుద్ధం చేస్తాడు. నువ్వు కూడా అతనితోనే వుండి మార్గదర్శనం చేయి.'' అన్నాడు రాజు. ఐర్లండ్‌ రాజు రాళ్ల జోలికి వస్తే వూరుకోనన్నాడు. దాంతో యుద్ధం జరిగింది. ఊథర్‌ జయించాడు. కానీ రాళ్లను కదల్చడం అతని సైనికుల వలన కాలేదు. అప్పుడు మెర్లిన్‌ ఒక మాయాయంత్రాన్ని సృష్టించి దాని సహాయంతో సునాయాసంగా రాళ్లను కదిల్చాడు. బ్రిటన్‌ తీసుకుని వచ్చి అక్కడ వాటిని గుండ్రంగా ఏర్పరచాడు. కాలక్రమంలో వాటిలో చాలా భాగం పోయి, యిప్పుడు కొన్ని రాళ్లే మిగిలాయి. రెండు నిలువురాళ్లు, పైన అడ్డ రాయిగా ఏర్పరచిన ఆ రాళ్ల సమూహాన్ని యిప్పుడు 'స్టోన్‌ హెంజ్‌' పేరుతో శాలిస్‌బరీలో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేశారు. ఇంగ్లండు టూరిజం అనగానే పోస్టర్లపై వాటి బొమ్మలే కనబడతాయి. లండన్‌ కేంద్రంగా ఒక రోజులో పరిసరాలు చూపించే ట్రిప్‌ లో స్టోన్‌హెంజ్‌ కూడా వుంటుంది. అవి క్రీ.పూ. 5000 నాటివని చెప్తారు. ఆ రాళ్లలో ఒక విలక్షణత వుందని ఒప్పుకుంటూనే వాటిని ఆ విధంగా అక్కడ ఎందుకు పేర్చారో సరైన సమాధానం యిప్పటికీ చెప్పటంలేదు. గ్రహాంతరవాసుల ప్రమేయాన్ని కూడా వూహిస్తారు కొందరు. 

వోర్టిజెర్న్‌ కొడుకైన పాసెంటియస్‌ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆరిలియస్‌పై దండెత్తి ఓసారి ఓడిపోయాడు. పరాజితుడై పరాభవం భారంతో వున్న ఐర్లండ్‌ రాజుతో చేతులు కలిపి మళ్లీ దండెత్తాడు. వాళ్లను ఎదుర్కోవడానికి ఊథర్‌, మెర్లిన్‌ను వెంటపెట్టుకుని కాంబియా వెళ్లాడు. అనారోగ్యం సోకడంతో ఆరిలియస్‌ రాజధాని వించెస్టర్‌లోనే వుండిపోయాడు. ఈ విషయం తెలిసి పాసెంటియస్‌ కుట్రతో రాజును చంపాలనుకున్నాడు. బ్రిటిషు భాష నేర్చుకుని, క్రైస్తవుడిగా నటించగల ఇయోపా అనే శాగ్జన్‌కు లంచమిచ్చి వశపరుచుకున్నాడు. ఇయోపా క్రైస్తవ ఫాదిరీ వేషంలో రాజు వద్దకు వెళ్లి తనకు వైద్యం తెలుసునని చెప్పుకున్నాడు. రాజు నమ్మాడు. అతనిచ్చిన ఔషధాన్ని సేవించాడు. దానిలో ఇయోపా నెమ్మదిగా పనిచేసే విషం కలిపాడు. 'మీరు కదలకుండా చాలాసేపు నిద్రపోవాలి, అప్పుడే మందు పనిచేస్తుంది' అన్నాడు. ఇయోపా బయటకు జారుకున్న కొద్ది గంటల్లో విషం శరీరమంతా వ్యాపించి, రాజు మరణించాడు. అప్పుడు ఆకాశంలో తోకచుక్క కనిపించింది. ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న ఒక నక్షత్రం, దాని చివర డ్రాగన్‌ రూపంలో వున్న అగ్నిగోళం కనబడ్డాయి. ఆ డ్రాగన్‌కు రెండు నాలుకలున్నాయి. ఒక నాలిక గాల్‌ దేశం వైపు, మరొకటి ఐరిష్‌ సముద్రం వైపు వ్యాపించాయి. 

కాంబియాలో యుద్ధభూమిలో చూసిన ఊథర్‌ మెర్లిన్‌ను ఇది దేనికి సంకేతం అని అడిగాడు. అతను లెక్కలు కట్టి 'రాజు మరణించాడు. నువ్వే యిప్పుడు రాజువి. వెంటనే రాజధానికి బయలుదేరు' అన్నాడు. ఊథర్‌ బ్రిటన్‌కు రాజై తన అన్నను చంపినవారిపై పగ సాధించాడు. అంతేకాదు, తనపై దండెత్తిన హెంగిస్ట్‌ కొడుకుని కూడా ఓడించి ఖైదు చేశాడు. అ తర్వాత ఆ నాడు ఆకాశంలో తనకు కనబడిన డ్రాగన్‌ రూపంలో రెండు బంగారు ప్రతిమలు చేయించి ఒకటి వించెస్టర్‌ చర్చిలో కానుకగా యిచ్చాడు. మరొకటి తన వద్దే వుంచుకుని యుద్ధాలకు తీసుకుని వెళ్లేవాడు. అందుచేత అతని పేరుకి చివర పెన్‌డ్రాగన్‌ (డ్రాగన్‌ శిరస్సు) అని వచ్చి చేరింది. ఊథర్‌ మెర్లిన్‌ను తన సలహాదారుగా పెట్టుకుని రాజ్యం చేయసాగాడు. 

ఒకసారి ఈస్టర్‌ సందర్భంగా ఊథర్‌ లండన్‌లో పెద్ద విందు ఏర్పాటు చేసి సామంతరాజులను కుటుంబాలతో సహా ఆహ్వానించాడు. అలా వచ్చినవారిలో కార్న్‌వాల్‌ డ్యూక్‌ అయిన గొర్లోయిస్‌ కూడా వున్నాడు. అతని భార్య ఐజెర్నా అద్భుత సౌందర్యవతి. ఆమెను చూడగానే ఊథర్‌ తలమునకలా ప్రేమలో పడిపోయి దాన్ని బహిరంగంగా విందులోనే ప్రదర్శించసాగాడు. ఆమె వైపే చూడడం, బహుమతులు పంపడం, వంటకాలు రుచిగా వున్నాయా అంటూ మాటిమాటికీ అడగడం – యివన్నీ చూడడంతో ఆమె భర్త గొర్లోయిస్‌ మండిపడ్డాడు. విందు మధ్యలోనే భార్యతో సహా లేచి వెళ్లిపోయాడు. రాజుకి కోపం వచ్చింది. 'నా సెలవు తీసుకోకుండా అలా వెళ్లిపోవడం అవమానం చేసినట్లే. వెంటనే తిరిగి రా' అని కబురంపాడు. కానీ గొర్లోయిస్‌ వినలేదు. భార్యను తీసుకుని తన రాజ్యానికి వెళ్లిపోయాడు. 

రాజు మహాకోపంతో తన సైన్యంతో బయలుదేరి కార్న్‌వాల్‌లోని గ్రామాలను తగలబెట్టసాగాడు. కానీ గొర్లోయిస్‌ యుద్ధానికి దిగలేదు. తన సైన్యం తక్కువ కాబట్టి ఐర్లండ్‌ రాజు సహాయం కోరి, ఆ సైన్యం వచ్చేదాకా ఆగుదామనుకుని డిమిలియాక్‌ కోటలో దాగున్నాడు. తన భార్యను రక్షించుకోవాల్సిన అవసరం వుంది కాబట్టి ఆమెను చుట్టూ సముద్రం వున్న టింటాజెల్‌ ఊరులో భవనంలో దాచి వుంచి సైనికులను రక్షణగా పెట్టాడు. కాపలాదారుల కన్నుగప్పి ఆ భవనంలోకి వెళ్లడం అసాధ్యం. రాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. తన అనుచరుడు ఉల్ఫిన్‌ను సలహా అడిగితే మెర్లిన్‌ను శరణు వేడమన్నాడు. రాజు ప్రేమలో తీవ్రత గమనించిన మెర్లిన్‌ తన ఔషధాలతో, లేపనాలతో రాజుకి ప్లాస్టిక్‌ సర్జరీ వంటిది చేసి గొర్లోయిస్‌ రూపురేఖలు వచ్చేట్లు చేశాడు. ఉల్ఫిన్‌ను, తనను కూడా గొర్లోయిస్‌ స్నేహితుల పోలికలలోకి మార్చాడు. ముగ్గురూ మునిమాపు వేళ వెళ్లి భవనం తలుపు తీయమంటే కాపలాదారులకు అనుమానం రాలేదు. రాజు ఐజెర్నా వద్దకు వెళ్లి 'నీ క్షేమం కోసమే, నీ ఆనందం కోసమే శత్రుసైన్యాల మధ్యలోంచి వచ్చాను' అని కబుర్లు చెప్పాడు. ఆమె నమ్మి, అతనితో శయనించింది. దాని ఫలితంగానే మన కథానాయకుడు ఆర్థర్‌ పుట్టాడు. ఇంత గొప్ప ఖ్యాతి తెచ్చుకున్న ఆర్థర్‌ పుట్టుక యీ రకంగా వుండడం వింతగా తోచవచ్చు. కానీ మన స్వారోచిష మనువు జన్మ కూడా యిలాటి మోసంతోనే సంభవిస్తుంది కదా. మనుష్య జాతికి చెందిన ప్రవరుడు అనే బ్రాహ్మణుణ్ని వరూధిని అనే అప్సరస వలచి, మీద పడితే అతను తను వివాహితుడనని చెప్పి తిరస్కరించి వెళ్లిపోతాడు. ఎప్పటినుండో ఆమెపై మనసు పడిన ఒక గంధర్వుడు యిది గమనించి ప్రవరుడి వేషంలో ఆమెను అనుభవిస్తాడు. ఫలితంగా స్వారోచిష మనువు ఉద్భవిస్తాడు. రెండవ మన్వంతరాన్ని (ఇప్పుడు నడుస్తున్నది ఏడవదైన వైవస్వంత మన్వంతరం) పాలించి మానవజాతి చేత ఆరాధింపబడతాడు. (సశేషం)  (చిత్రం – స్టోన్‌హెంజ్‌ శిలాతోరణాలు)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Archives