ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 12

అకస్మాత్తుగా ఒకరోజు లాన్సెలాట్‌ మాయమయ్యాడు. రాజు, రాణి అతనికోసం ఎంతో వెతికించారు కానీ ఎక్కడా దొరకలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అందరూ అతన్ని మర్చిపోయిన సమయంలో తిరిగి వచ్చాడు. బాగా పాలిపోయి, అలసిపోయి వున్నాడు.…

అకస్మాత్తుగా ఒకరోజు లాన్సెలాట్‌ మాయమయ్యాడు. రాజు, రాణి అతనికోసం ఎంతో వెతికించారు కానీ ఎక్కడా దొరకలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అందరూ అతన్ని మర్చిపోయిన సమయంలో తిరిగి వచ్చాడు. బాగా పాలిపోయి, అలసిపోయి వున్నాడు. ఏమైంది అని రాజు అడిగితే తన కథ చెప్పుకు వచ్చాడు – లాన్సెలాట్‌ దేశాలన్నీ పట్టి తిరుగుతూ పెల్లెస్‌ అనే రాజు పాలించే కోర్బెనిక్‌ రాజ్యానికి చేరాడు. అతనక్కడ వుండగానే నిప్పులుమిసే పెద్ద రాకాసి వూరు మీద పడింది. లాన్సెలాట్‌ దాన్ని ఎదుర్కొని చంపడంతో రాజు సంతోషించి పెద్ద విందు ఏర్పరచాడు. ఆ విందులో 'నువ్వెన్నడూ చూడని వింత చూపిస్తాను చూడు.' అంటూ ఒక పానపాత్ర తెప్పించాడు. 'జీసస్‌ క్రైస్తు తన శిష్యులతో చేసిన ఆఖరి విందులో యీ పాత్రతోనే తాగాడు. ఆయనను శిలువ వేశాక ఆయన రక్తాన్ని యీ పాత్రలోనే పట్టారు. ఇది మాకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది.' అని చూపించాడు. 

''పాత్ర విషయం నిజమా? లేక కట్టుకథా?'' అని అడిగాడు కథ వింటున్న ఆర్థర్‌.

''నిజమే, దాని గురించి అంతకుముందే విన్నాను'' 

''మరి నీకు దాన్ని బహుమతిగా యిచ్చాడా?''

''ఇచ్చేవాడే, నాకు దాన్ని తీసుకునే అర్హత లేని కారణంగా దక్కలేదు.''

''అదేమిటి? నాకు తెలిసి నువ్వే పాపమూ చేయలేదు.''

''పైకి నేను పవిత్రుడనే, కానీ మనసుల్లో మరొకరి భార్యను వాంఛింఛాను. అదే నేను చేసిన పాపం.''

''..ఎవరి భార్య?''

''నీ భార్యే. అవును గ్యునెవెరేను నేను గాఢంగా ప్రేమించాను, కానీ  ఆ భావాన్ని మనసులోనే దాచుకున్నాను. ఇక్కడే వుంటే క్షణికోద్రేకంలో నా వలన ఏదైనా పొరపాటు జరుగుతుందేమోనన్న భయంతో దేశం విడిచి తిరిగాను. ఆ పర్యటనలోనే ఆ దేశానికి చేరాను.'' నిజాయితీగా చెప్పాడు లాన్సెలెట్‌. 

ఆర్థర్‌కు ఏమనాలో తోచలేదు. ''తర్వాత ఏం జరిగింది?'' 

''నన్ను ఎలా సత్కరించాలో తెలియని రాజు నేను వద్దంటున్నా తన కూతురు ఎలైన్‌ను యిచ్చి పెళ్లి చేశాడు. కానీ గ్యునెవెరే నా మనస్సులో మెదలుతూండడం వలన ఆమెతో కాపురం చేయలేకపోయాను. నా భార్య అది గుర్తించింది. ఒక మంత్రగాడి సహాయంతో నాకు వశీకరణం మందు పెట్టింది. మా కలయిక ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. అతనికి గెలాహెడ్‌ అని పేరు పెట్టాం. కొన్ని రోజులకు నాకు మత్తు విడింది. నా భార్య చేసిన మోసాన్ని గుర్తించి, ఆమెపై ఏవగింపుతో ఆ రాజ్యాన్ని విడిచి పిచ్చివాడిలా వూరూరూ తిరిగాను. ఇకముందు జీవితం ఎటు తీసుకుని వెళుతుందో తెలియదు. అందుకే ఆప్తమిత్రులైన మీ ముందుకు వచ్చి నా గాథ చెప్పి మనోభారం తగ్గించుకున్నాను.'' అన్నాడు లాన్సెలాట్‌. 

ఆర్థర్‌కు ఎలా స్పందించాలో, ఏం చేయాలో పాలుపోలేదు. లాన్సెలాట్‌ చెపుతూండగానే ఎవరో పరిగెట్టుకుని వచ్చి నదిలో స్త్రీ శవం కొట్టుకుని వచ్చిందని చెప్పారు. వెళ్లి చూడబోతే అది ఎలైన్‌దే. భర్త నిరాదరణ భరించలేక ఆమె నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. లాన్సెలాట్‌ పశ్చాత్తాపంలో మునిగిపోయాడు. ఇదంతా చూసిన ఆర్థర్‌ లాన్సెలాట్‌ను తన కొలువులోనే వుండమన్నాడు. అతనికి రాణిపై ప్రేమ వున్నా, రాణికి తనపై ప్రేమ చావనంతకాలం ఏ ప్రమాదమూ లేదని నమ్మాడు. 

ఆర్థర్‌ ధర్మవీరులందరూ కూర్చునే రౌండ్‌ టేబుల్‌ వద్ద మళ్లీ లాన్సెలాట్‌  కూర్చోసాగాడు. ఒకరోజు ఒక ధర్మవీరుడు తను కొత్తగా ధర్మవీరుణ్ని చేసిన ఒక యువకుణ్ని వెంటపెట్టుకుని వచ్చాడు. అతను లాన్సెలాట్‌కు, ఎలైన్‌కు పుట్టిన గెలాహెడ్‌. పరాక్రమవంతుడు. అతను యిప్పటివరకు ఖాళీగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. అతనికి ఆ అర్హత వుందా లేదా అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ అతని ఎదురుగా బల్లపై ఏసుక్రీస్తు పానపాత్ర గోచరించింది. ఇక అప్పణ్నుంచి ఆర్థర్‌ వద్ద వున్న ధర్మవీరులందరూ ఒకరి తర్వాత మరొకరు పానపాత్ర గురించి ప్రయత్నించి విఫలురై గాయాలతో తిరిగి వచ్చారు. అప్పుడు ముగ్గురు ధర్మవీరులు – బోర్స్‌, పెర్సివల్‌, గెలాహెడ్‌ దాని గురించి బయలుదేరి పెల్లెస్‌ రాజు వద్దకు వెళ్లారు. మనుమడు గెలాహెడ్‌ను చూసి, పెల్లెస్‌ మూడు ముక్కలైన కత్తిని అతని చేతికి యిచ్చాడు. గెలాహెడ్‌ చేతిలోకి రాగానే ముక్కలన్నీ ఏకమై అది ఒకే కత్తిగా మారింది. అతను తన తండ్రి వలె వీరుడు కావడంతో బాటు స్వచ్ఛమైన హృదయం కలవాడని పెల్లెస్‌కు అర్థమై పాత్రను అతనికి యిచ్చివేశాడు. ''అయితే ఆ పాత్రను వుంచుకోవడానికి మీ రాజ్యానికి పాత్రత లేదు. మధ్య ప్రాచ్యంలో వున్న సారాస్‌ పుణ్యక్షేత్రానికి ఆ పాత్రను చేర్చాలని భగవదాదేశం.'' అని చెప్పాడు. ముగ్గురు ధర్మవీరులు సారాస్‌కు చేరగానే ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసి ఆ పాత్ర వాళ్ల చేతుల్లోంచి ఎగిరిపోయి స్వర్గానికి చేరిపోయింది. అది చూడగానే తన జన్మ ధన్యమైందని తలచిన పెర్సెవల్‌ ఆయుధాలను విడిచిపెట్టి సన్యాసి అయిపోయి, సారాస్‌ అడవుల్లోనే వుండసాగాడు. గెలాహెడ్‌ కూడా తన జన్మ పునీతమైందని తలపోసి తనువు చాలించాడు. ఇక బోర్స్‌ ఒక్కడే రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన విషయాలు చెప్పాడు. 

ఆర్థర్‌ వద్ద వున్న ధర్మవీరులు చాలామంది పానపాత్ర సాధించేయత్నంలో నిహతులయ్యారు. ఉన్నవాళ్లలో అందరికంటె పరాక్రమవంతుడుగా లాన్సెలాట్‌ వున్నాడు. అతనికి తన భార్య పట్ల వున్న ప్రేమ గురించి తెలిసికూడా ఆర్థర్‌ తమ మధ్య వున్న స్నేహం కారణంగా అతను హద్దు మీరడని నమ్మాడు. ఒక రోజు ఆర్థర్‌ మేనల్లుడు (ఒకరకంగా కొడుకు) అయిన మోర్‌డ్రెడ్‌ వచ్చి 'లాన్సెలాట్‌, రాణి కలిసి వుండగా తాను చూశాన'ని చెప్పాడు. ఆర్థర్‌ అది నిజమో కాదో నిర్ధారించుకోవాలనుకున్నాడు. మర్నాడు గ్యునెవెరె భర్తతో విహారానికి వెళుతున్నానని చెప్పి అడవిలోకి వెళ్లినపుడు ఆమె వెంట మోర్‌డ్రెడ్‌ను, మరి కొంతమంది సైనికులను పంపాడు. అడవిలో ఆమెను రహస్యంగా కలవడానికి లాన్సెలాట్‌ వచ్చినపుడు వీళ్లు అతనిపై దాడి చేశారు. లాన్సెలాట్‌ సాహసంతో పోరాడి పారిపోయాడు. సైనికులు రాణిని బంధించి తేగా ఆర్థర్‌ సజీవదహనం శిక్ష విధించాడు. మర్నాడు ఆమెను గుంజకు కట్టి కాల్చివేయబోతూండగా లాన్సెలాట్‌ తన మనుషులతో వచ్చి రక్షించాడు. ఇద్దరూ కలిసి పారిపోయారు. 

లాన్సెలాట్‌ రాణిని వెంటపెట్టుకుని తన వేల్స్‌ కోటకు వెళ్లిపోతే ఆర్థర్‌ తన సైనికులతో దాన్ని ముట్టడించాడు. నెలల తరబడి ముట్టడి సాగినా ఎవరూ జయించలేకపోయారు. చివరకు రాజీ కుదిరింది. గ్యునెవెరెను ఆర్థర్‌కు అప్పగించేసి, లాన్సెలాట్‌ తన ప్రాణాలు దక్కించుకుని ఫ్రాన్సు పారిపోయాడు. గ్యునెవెరె తన వద్దకు వచ్చేశాక ఆర్థర్‌ లాన్సెలాట్‌ చేసిన మిత్రద్రోహానికి శిక్ష విధించడానికి నిశ్చయించుకుని, కోటను, రాణిని తన మేనల్లుడు మోర్‌డ్రెడ్‌ సంరక్షణలో వదిలి ఫ్రాన్సుకు బయలుదేరాడు. అక్కడ లాన్సెలాట్‌ గురించి వెతుకుతూండగానే అతనికి తెలియవచ్చింది – మోర్‌డ్రెడ్‌ తనను తాను రాజుగా ప్రకటించుకుని గ్యునెవెరాను తన రాణిగా చేపట్టాడని. ఇప్పుడు ఆర్థర్‌కు తన రాజ్యాన్ని రక్షించుకోవలసిన పని పడింది. వెంటనే తిరుగు ప్రయాణం కట్టాడు. 

మార్గమధ్యంలో ఆర్థర్‌కు కల వచ్చింది. కలలో ఎవరో కనబడి మోర్‌డ్రెడ్‌ను సంహరించవద్దు, సంహరిస్తే ప్రాణాపాయం అని హెచ్చరించారు. అందువలన ఆర్థర్‌ యుద్ధం జరగకుండా నివారిద్దామని మోర్‌డ్రెడ్‌ను సంధిచర్చల కోసం ఆహ్వానించాడు. ఒక గుడారంలో చర్చలు సాగుతూండగానే మోర్‌డ్రెడ్‌ మనుషుల్లో ఒకతన్ని పాము కరిచింది. అతను ఒరలోంచి కత్తి తీసి దాన్ని ముక్కలు చేశాడు. సూర్యకిరణం ఆ కత్తిమొనపై పడి ప్రతిఫలించి గుడారం బయట వున్నవారికి లోపల కత్తి యుద్ధం జరుగుతున్నట్లు తోచింది. సంధి విఫలమైందనే భావంతో యిరుపక్షాలు యుద్ధానికి తలపడ్డాయి. ఆర్థర్‌, మోర్‌డ్రెడ్‌ యిద్దరూ యుద్ధరంగంలో పోరాడసాగారు. సూర్యాస్తమయం తర్వాత కూడా పోరు కొనసాగింది. చీకట్లో, గలభాలో ఆర్థర్‌ చేతి నుండి అతని ఎక్సాలిబర్‌ కత్తి, దాని ఒర జారిపడ్డాయి. అంతలో మోర్‌డ్రెడ్‌ అతని కంటపడ్డాడు. అతను చేసిన నమ్మకద్రోహం గుర్తుకు వచ్చి ఒళ్లు మరిచి గొడ్డలితో అతనిపై పడ్డాడు. అదే సమయంలో మోర్‌డ్రెడ్‌ కత్తితో ఆర్థర్‌ తలపై కొట్టాడు. ఇటు ఆర్థర్‌, అటు మోర్‌డ్రెడ్‌ యిద్దరూ నేలకు వాలారు. 

ఆర్థర్‌ చివరి కోరికను మన్నిస్తూ అతని కత్తిని, దాని ఒరనూ అవి ఉద్భవించిన సరస్సులో పడివేశారు. అతని శవాన్ని దుంగపై పెట్టి సరస్సులో వదిలివేయగానే ముగ్గురు అప్సరసలు ప్రత్యక్షమై అతని గాయాలను నయం చేసి, శరీరాన్ని పొగమంచు కమ్మిన సరస్సులో దూరతీరాలకు తరలించుకుని పోయారు. రసవత్తరమైన ఆర్థర్‌ కథ యీ విధంగా ముగిసింది. ఇది జానపద కథ లాటిదే తప్ప చరిత్ర కాదు. దీనిపై ఆధారపడి అనేక నవలలు, సినిమాలు, టీవీ సీరియల్స్‌ వచ్చాయి. ఇప్పుడు మన దృష్టిని స్కాట్లండ్‌ వైపుకి మరలిద్దాం. ( (సశేషం) (చిత్రం – ఏసుక్రీస్తు పానపాత్రతో గెలాహెడ్‌ – ఎడ్విన్‌ ఆస్టిన్‌ ఏబీ వేసిన 1895 నాటి పెయింటింగ్‌)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives