జేమ్స్ కాలంలో షేక్‌స్పియర్ మేక్‌బెత్, హేమ్లెట్ వంటి సంఘర్షణాత్మక రచనలు ఎందుకు చేశాడు అనేది తెలుసుకోవాలంటే ఆనాటి రాజకీయసంక్షోభం తెలుసుకోవాలి. 1603లో ఎలిజబెత్ చనిపోయింది. ఆమెకు పిల్లలు లేరు, సోదరీసోదరుల పిల్లలు కూడా లేరు. చివరకు ఆమెకు అస్సలు పడని మేరీ ఆఫ్ స్కాట్లండ్ కొడుకుని రాజుగా చేయవలసి వచ్చింది.
అతని మరణానంతరం అతని అక్క మేరీ అధికారంలోకి వచ్చింది. 8న హెన్రీ తన భార్యకు విడాకులిచ్చి మరో ఆమెను పెళ్లి చేసుకుంటానంటే పోప్ ఒప్పుకోలేదు. దాంతో హెన్రీ పోప్ మీద, ఇంగ్లండులో అతనికి సంబంధించిన కాథలిక్కు చర్చిల మీద దాడి ప్రారంభించాడు. తనే అధిపతిగా చర్చి ఆఫ్ ఇంగ్లండ్ అని ఒకటి పెట్టించి ఆంగ్లికన్ మతం ప్రారంభించాడు. ఇది ప్రొటెస్టంట్ మతానికి దగ్గరగా వుంటుంది. కాథలిక్కులు దీన్ని వ్యతిరేకించారు. పొరుగున వున్న స్కాట్లండ్ మాత్రం కేథలిక్ రాజ్యంగానే మిగిలిపోయింది. 1547లో 8వ హెన్రీ మరణం తర్వాత, అతని పిల్లలు ఆరో ఎడ్వర్డ్, మేరీ ఆఫ్ ఇంగ్లండ్ (ఈమెను బ్లడీ మేరీ అని కూడా అంటారు), ఒకటవ ఎలిజబెత్ అధికారం కోసం పోటీ పడ్డారు. సవతి సోదరీమణులను పక్కన పెట్టి ఆరో ఎడ్వర్డ్ రాజ్యానికి వచ్చాడు. అతను తండ్రిలా ఆంగ్లికన్ మతాన్నే అనుసరించాడు. అతని తర్వాత సింహాసనానికి వచ్చిన సవతి అక్క మేరీ ఆంగ్లికన్ మతాన్ని నిషేధించి, కాథలిక్ మతాన్ని పునరుద్ధరించింది. అసంఖ్యాకంగా ప్రొటెస్టంట్లను చంపించి బ్లడీ మేరీ అని పేరుబడింది. కాథలిక్కులు, ప్రొటెస్టంట్లు, ఆంగ్లికన్లు అందరూ క్రైస్తవులే అయినా వారిలో వారు యీ ఉపమతాల పేరిట తీవ్రంగా కలహించుకున్నారు. ఎలిజబత్ ఆంగ్లికన్ మతాభిమాని కాబట్టి ఆమెకు ఆ మతస్తుల మద్దతు వుంటుందనే భయంతో బ్లడీ మేరీ ఆమెను ఏడాదిపాటు ఖైదులో పెట్టించింది. చివరకు 1558లో మేరీ మరణించింది. అప్పుడు ఎలిజబెత్ రాణి అయి 45 సం||రాల పాటు పాలించింది. ఆంగ్లికన్ మతాన్ని పునరుద్ధరించింది.
ఎలిజబెత్ రాణి అవుదామనుకున్నపుడు రాజబంధువైన స్కాట్లండ్ మేరీ ఆమెతో పోటీ పడింది. 'నేను కాథలిక్‌ను కాబట్టి నాకే ఎక్కువ అర్హత వుంది' అని వాదించింది. ఇంగ్లండులో మేరీ కాలంలో బలపడిన కేథలిక్కులు ఆమెకు సాయపడతారన్న భయంతో ఎలిజబెత్ ఆమెను 18 ఏళ్ల పాటు జైల్లో పెట్టించింది. చివరకు తనను చంపడానికి కుట్ర పన్నిందన్న నేరంపై ఆమెకు మరణశిక్ష వేసింది. స్కాట్లండ్ జీవితంలో ఆటుపోట్లు చాలా వున్నాయి. నిజానికి 8 వ హెన్రీ, మొదటి ఎలిజబెత్ (శేఖర్ కపూర్ సినిమా తీశాడు), మేరీ ఆఫ్ స్కాట్లండ్ – ముగ్గురి జీవితాలూ రసవత్తరమైనవే. విపులంగా తెలుసుకోదగ్గవే. ఏ మాత్రం వీలున్నా రాబోయే రోజుల్లో వారి చరిత్రలు చెప్తాను. స్కాట్లండ్ మేరీ, స్కాట్లండ్ నేలిన ఐదవ జేమ్స్ కూతురు. ఆరు రోజుల వయసులో రాణి అయింది. తర్వాత ఫ్రాన్సు రాజుకు భార్య అయింది. 18వ ఏట భర్త చనిపోతే స్కాట్లండ్‌కు తిరిగి వచ్చి 23వ ఏట స్టువర్ట్ హెన్రీ స్టువార్ట్‌ను పెళ్లాడింది. రెండేళ్లకే అతని హత్య జరగడం, యీమె ఆ హంతకుణ్ని పెళ్లాడడం జరిగాయి. ఇదంతా చూసి ప్రజలు తిరగబడి, ఆమె చేత బలవంతంగా సింహాసనం ఖాళీ చేయించి, ఆమె స్థానంలో ఏడాది వయసున్న ఆమె కొడుకును ఆరవ జేమ్స్‌ను రాజును చేశారు. కొడుకుని దింపి తనను సింహాసనం ఎక్కించమని కోరడానికి తన కజిన్ అయిన ఇంగ్లండు రాణి ఎలిజబెత్ దగ్గరకు వెళితే ఆమె ఖైదు చేయించి, చివరకు చంపేసింది.
1603లో ఎలిజబెత్ చనిపోయాక వారసులెవరూ కనబడక చివరకు స్కాట్లండ్ మేరీ కొడుకు ఆరో జేమ్స్‌కు ఇంగ్లండు సింహాసనం అప్పగించారు. అతను తన పేరును మొదటి జేమ్స్‌గా మార్చుకుని ఇంగ్లండును పాలించాడు. అతని సమక్షంలోనే షేక్‌స్పియర్ మేక్‌బెత్ ప్రదర్శించాడు. జేమ్స్ తల్లి కాథలిక్ కాబట్టి అతను రాజు కాగానే మళ్లీ కాథలిక్ మతానికి బంగారు రోజులు వస్తాయని కాథలిక్కులు ఆశ పెట్టుకున్నారు. తల్లి కాథలిక్ అయినా జేమ్స్‌ను పెంచిన రాజప్రతినిథులు ప్రొటెస్టంట్లు కావడంతో అతను ఆ మతానికి దగ్గరగా వున్న ఆంగ్లికన్ మతాన్ని ఆదరించాడు. దానితో కోపగించిన కేథలిక్కులు అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. దీన్ని ''గన్‌పౌడర్ ప్లాట్'' అంటారు. 1605లో జేమ్స్ హాజరు కానున్న పార్లమెంటు భవనాన్ని సమూలంగా పేల్చి వేయడానికి 36 పీపాలతో మందుగుండు సామగ్రిని సేకరించి ఆ భవనంలో దాచారు. అయితే ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సంగతి తెలిసిపోయి, ఆ పీపాలను స్వాధీనం చేసుకున్నారు. కుట్రదారులు పారిపోయారు. వెతికిపట్టుకుని ప్రాణాలు తీశారు.
దేశంలో యింతటి సంక్షుభిత వాతావరణం నెలకొంది కాబట్టి షేక్‌స్పియర్ కూడా యీ దశలో గంభీరమైన రచనలు చేశాడు. రాజుకు అందరూ విధేయులై వుండాలని, రాజద్రోహులకు అంతిమంగా పతనం తప్పదని సందేశం యిచ్చేందుకు ''మేక్‌బెత్'' పాత్రను అలా మార్చాడు. జేమ్స్‌కు రాజ్యపాలనపై, ధర్మాధర్మ విచక్షణపై కొన్ని అభిప్రాయాలున్నాయి. రాజధర్మంపై ''బాసిలికోన్ డొరోన్'' అనే పుస్తకం రాశాడు. రాజు దైవానికి, దేశానికి విధేయుడై వుండాలని, మచ్చలేని వ్యక్తిత్వం కలిగి వుండాలని రాశాడు. ధర్మాన్ని తప్పి చరించిన రాజుకాని, సామంతరాజు కానీ నాశనమవుతాడని రాశాడు. ఆ సిద్ధాంతాన్ని నిరూపించడానికే అన్యాయమార్గం పట్టిన మేక్‌బెత్, అతని భార్య సర్వ విధాలా భ్రష్టులయినట్లు షేక్‌స్పియర్ కల్పించాడు. మేక్‌బెత్ 17 ఏళ్ల పాటు చక్కగా పాలించి, ప్రజలను మెప్పించిన విషయాన్ని కావాలని మరుగు పరచాడు. మేక్‌బెత్ పాత్రను మార్చడంతో బాటు బ్యాంకో స్వభావాన్ని కూడా మార్చేశాడు. నిజానికి బ్యాంకో అనేవాడు లేడని కొందరు చరిత్రకారులు అంటారు కానీ షేక్‌స్పియరుకు సమకాలీనుడైన రాఫెల్ హోలిన్‌షెడ్ అనే చరిత్రకారుడు బ్యాంకో అనే సామంతరాజు వున్నాడని, డంకన్‌ను ఓడించి చంపడంలో మేక్‌బెత్‌కు సహకరించాడని రాశాడు. అయితే మేక్‌బెత్ నాటకంలో షేక్‌స్పియర్ అతన్ని పరమ రాజభక్తుడిగా, మేక్‌బెత్ అన్యాయాన్ని ఎదిరించినవాడిగా మార్చాడు. ఎందుకంటే స్టువర్ట్ రాజులు బ్యాంకోను తమ పూర్వీకుడిగా చెప్పుకుంటారు. జేమ్స్ స్టువర్ట్ వంశానికి చెందినవాడే! తమ పూర్వీకుణ్ని రాజద్రోహిగా చూపిస్తే రాజు వూరుకుంటాడా? అందువలన మేక్‌బెత్ అతన్ని చూసి అసూయ పడే రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. మంత్రగత్తెలు, జోస్యం అంటూ కల్పించిన షేక్‌స్పియర్ యింకో ఘట్టం కూడా కల్పించాడు. మేక్‌బెత్ రెండోసారి మంత్రగత్తెల వద్దకు వెళ్లినపుడు బ్యాంకో వారసులు స్కాట్లండ్ సింహాసనాన్ని అధిష్టిస్తారని జోస్యం చెపుతూ భవిష్యద్దర్శనం చేయిస్తారు. ఒకరి తర్వాత మరొకర్ని వరుసగా అనేక మంది రాజులను చూపిస్తూ బ్యాంకో వారసులు లోకం అంతమయ్యేవరకూ పాలిస్తారని వాళ్ల చేత చెప్పించాడు షేక్‌స్పియర్. నిజానికి 1714లోనే స్టువర్ట్ రాజుల పాలన అంతమైపోయింది.
ఇదీ మేక్‌బెత్ అసలు కథ, షేక్‌స్పియర్ మార్చిన విధానం. ఈ వివరాలు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకోవాలని తోచలేదు. స్కాట్లండ్ వెళ్లినపుడు అక్కడ గైడ్ ''మేక్‌బెత్'' గురించి గుర్తు చేసి యీ విషయాలు చెప్పినప్పుడు ఉలిక్కిపడ్డాను. 'మేక్‌బెత్, కింగ్ ఆఫ్ స్కాట్లండ్' అనే గుర్తుంది కానీ చరిత్ర, దాని వక్రీకరణ కోణంలో ఎప్పుడూ చూడలేదు. గైడ్ ఒక్కసారిగా డంకన్, బ్యాంకోల గురించి చెప్పనారంభించినపుడు ఎప్పుడో చదివిన కథ, పాత్రలు గుర్తుకు రాక కాస్త తికమక పడ్డాను. మీకు అలాటి దురవస్థ రాకుండా వుండాలంటే స్కాట్లండ్ వెళ్లబోయే ముందు దీన్నో సారి తిరగేసి వెళ్లండి. స్కాట్లండ్ వెళ్లకపోయినా ఈ నాటకాన్ని రాసిన షేక్‌స్పియర్ జన్మస్థలమైన స్టాఫర్డ్ అపాన్ ఎవన్ చూసే సందర్భం రావచ్చు. అది లండన్‌కు దగ్గరలోనే వుంది. అప్పుడైనా యిది గుర్తుకు రావచ్చు. (సశేషం) (ఫోటో – స్టాఫర్డ్ అపాన్ ఎవన్‌లో షేక్‌స్పియర్ యిల్లు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)