ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 19

ఇప్పుడు రాబర్ట్‌ ద బ్రూస్‌ కథ చెప్పబోతున్నాను. ఇతని కథ మాకు చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో వచ్చింది. రాబర్ట్‌ బ్రూస్‌ అనే వీరుడు యుద్ధంలో  మాటిమాటికి ఓడిపోయి ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయి ఒక గుహలో కూర్చుంటాడు. అక్కడ…

ఇప్పుడు రాబర్ట్‌ ద బ్రూస్‌ కథ చెప్పబోతున్నాను. ఇతని కథ మాకు చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో వచ్చింది. రాబర్ట్‌ బ్రూస్‌ అనే వీరుడు యుద్ధంలో  మాటిమాటికి ఓడిపోయి ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయి ఒక గుహలో కూర్చుంటాడు. అక్కడ ఒక సాలీడు గూడు కట్టడానికి తంటాలు పడుతూంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కింద పడిపోతూ వుంటుంది. అయినా ఓర్పుగా మళ్లీ మొదలుపెడుతుంది. ఇలా ఏడుసార్లు అయ్యాక విజయం సాధిస్తుంది. దాన్ని చూశాక బ్రూస్‌కి స్ఫూర్తి కలుగుతుంది. సాలీడుకున్న పట్టుదల మనకుండకపోతే ఎలా అనుకుని మళ్లీ యుద్ధానికి వెళతాడు. మార్చిలో పరీక్ష పోతే మళ్లీ సెప్టెంబరుకు వెళ్లు అని సాటి విద్యార్థులు ప్రోత్సహించడానికి బ్రూస్‌ కథ చెప్తూంటారు. ముళ్లపూడి రమణగారు కథలో ఓ పాత్ర 'వాడెవడో బ్రూసును చూడు ఏడుసార్లు సాలెగూడు కట్టాడు..' అంటాడు – బ్రూసే గూడు కట్టేసేడని కన్‌ఫ్యూజ్‌ అయిపోయి. ఈ కథాంశం గుర్తుంది కానీ అతనెక్కడివాడో గుర్తు లేదు. మొన్న స్కాట్లండ్‌ వెళ్లినపుడు గైడ్‌ చెప్పగానే గుర్తు వచ్చాడు. అయితే యిక్కడ అతన్ని రాబర్డ్‌ 'ద' బ్రూస్‌ అంటున్నారు. చిన్నప్పటి కథలో ఏం రాశారో గుర్తు లేదు కానీ సాలీడును చూసి తెచ్చుకున్న ఉత్సాహంతో మళ్లీ దండెత్తగానే బ్రూస్‌ గెలిచేయలేదు. నిజానికి అతని కథ చదివితే రాణా ప్రతాప్‌, శివాజీ అందరూ గుర్తుకు వస్తారు. వాలెస్‌ కథలోనే యితని పరిచయం అయిపోయింది కాబట్టి అతని సంగతి కొంతవరకు మీకు అర్థమై పోయి వుంటుంది. మొదట్లో ఇంగ్లండుకు భక్తుడిగా వుండి, తర్వాత ఎదురు తిరిగి, రాజ్యభ్రష్టుడై తిరుగుబాటుదారు డవుతాడు. స్కాట్లండ్‌ కథలన్నీ యిలాటి వీరుల గాథలే. ఇంగ్లండుకు, వారికి మధ్య నడిచిన వైరం గాథలే. రాజకీయ కుట్రలతో నడిచిన మేరీ గాథ కొంత ఆసక్తికరంగా వుంటుంది. కొంత విరామం యిచ్చాక మళ్లీ ఆమె కథకు వద్దాం. ప్రస్తుతం బ్రూస్‌ కథ తెలుసుకుందాం.

విలియం వాలెస్‌ మరణంతో స్కాట్‌ ప్రజలు కృంగిపోయారు. 1298లో వాలెస్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన దగ్గర్నుంచి బ్రిటన్‌ దమనకాండ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు వాలెస్‌ను చంపివేసిన తర్వాత వారి అక్రమాలు పెచ్చుమీరాయి. వాటిని అడ్డుకోవాలంటూ స్కాట్లండ్‌కు రాజంటూ వుండి తీరాలని అనుకుని జాన్‌ బలియోల్‌ స్థానంలో ఎవరో ఒక సమర్థుణ్ని రాజుగా చేయాలనుకున్నాడు. జాన్‌ మేనల్లుడు రెడ్‌ కొమైన్‌, రాబర్ట్‌ ద బ్రూస్‌ (ఇకపై బ్రూస్‌ అనే రాస్తాను) ఆ పదవికి పోటీ పడ్డారు. కొమైన్‌ అంటే వ్యక్తిగతంగా పడకపోయినా తమ కలహాలతో స్కాట్లండ్‌ బలహీనపడకూడదనే ఏకైక ఆకాంక్షతో కొమైన్‌తో చేతులు కలుపుదామనుకున్నాడు. ''మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. మనలో ఎవరు రాజు కావాలనుకుంటే వాళ్లు నష్టపరిహారంగా ఎదుటివారికి తన భూములు యిచ్చేయాలి.'' అని ప్రతిపాదించాడు. కొమైన్‌ ''నాకు రాజు కావాలని లేదు, నాకు నీ భూములిచ్చేస్తే నీకు సాయపడతాను.'' అన్నాడు. ఇద్దరూ అంగీకారపత్రంపై సంతకాలు చేసుకుని చెరొక ప్రతి తమ వద్ద పెట్టుకున్నారు. 

అప్పుడు బ్రూస్‌ ఇంగ్లండు రాజు ఎడ్వర్డ్‌ దగ్గరకు వెళ్లి తనను రాజును చేయమని మర్యాదగా అడుగుదామనుకున్నాడు. ఎందుకంటే అతనింకా సైన్యసమీకరణ మొదలుపెట్టలేదు. ముందే మొదలుపెడితే ఎడ్వర్డ్‌కు అనుమానం వచ్చి తన ప్రణాళికలు భగ్నం చేస్తాడు. అందుకని అతన్ని జోకొట్టే ప్రయత్నంగా లండన్‌ వెళ్లాడు.  దాన్ని దెబ్బ తీయడానికి కొమైన్‌ తమ మధ్య చేసుకున్న ఒప్పందపు ప్రతిని ఎడ్వర్డ్‌కు రహస్యంగా పంపాడు. అది చూసి ఎడ్వర్డు బ్రూస్‌ను శిక్షించి, తనను రాజును చేస్తాడని, ఆ విధంగా తనకు రాజ్యం, బ్రూసు భూములు రెండూ దక్కుతాయనీ అతని ప్లాను. ఆ ఒప్పందాన్ని చూడగానే ఎడ్వర్డుకి కోపం వచ్చింది. ఎంత ధిక్కారం అనుకుని, తన వద్దకు రాగానే బ్రూసును, అతనికి మద్దతిస్తున్న యితర సామంతులను పట్టి బంధించి చంపించాలని నిశ్చయించుకున్నాడు. పైకి మాత్రం వారిని సాదరంగా ఆహ్వానించాడు. బ్రూసు అతన్ని నమ్మి ఏమరుపాటుగా వున్నాడు. కానీ అతని సహచరుల్లో ఒకడికి జరిగినదేమిటో తెలిసిపోయింది. లేఖ రాసి బ్రూసును హెచ్చరిస్తే ఎడ్వర్డుకు ఉప్పందుతుందని భయపడి, రెండు పదునైన యీటెలకు పన్నెండు వెండి నాణాలు కట్టి బ్రూసుకు పంపాడు. 

అది చూస్తూనే అర్థమైంది – తన ప్రాణాలు దక్కించుకోవడానికి వెంటనే యీటెలు తీసుకుని పారిపోవాలని, దారి ఖర్చులకు ఆ డబ్బు వుపయోగించాలనీ. తన సహచరులతో పారిపోవాలనుకున్నాడు. అయితే శీతాకాలం కావడంతో మంచు విపరీతంగా పడుతోంది. తమ గుఱ్ఱాల పాదముద్రలు మంచులో పడి ఎటు వెళ్లామో రాజుకి తెలిసిపోతుంది. అందువలన యిద్దరు సేవకులను కమ్మరి వాళ్ల దగ్గరకు పంపించి, గుఱ్ఱపు నాడాలను తిరగేసి కొట్టించాడు. దాంతో వాళ్లు లండన్‌ నుంచి పారిపోతూ వుంటే, మంచులో అడుగుజాడలు చూసినవాళ్లకు లండన్‌ వైపు వచ్చినట్లు తోస్తుంది. కానీ యీ జాగ్రత్త కూడా అక్కరలేక పోయింది. అర్ధరాత్రి వాళ్లు పారిపోయిన తర్వాత విపరీతంగా మంచుపడి ఆ జాడలన్నీ కనబడకుండా పోయాయి. వీళ్లు పారిపోయిన కబురు వింటూనే ఎడ్వర్డు నాలుగు వైపులకూ సైనికులను పంపాడు కానీ బ్రూసు దొరకలేదు. అతను అయిదురోజుల పాటు ఏకధాటీగా ప్రయాణించి, సరిహద్దులు చేరాడు. అక్కడ ఎడ్వర్డు వద్దకు కొమైన్‌ సైనికుల్లో ఒకడు చిక్కాడు. అతని దగ్గర కొమైన్‌ ఎడ్వర్డును ఉద్దేశించి రాసిన ఒక లేఖ దొరికింది. 'మీరు బ్రూసును చంపడం ఆలస్యమైతే స్కాట్లండ్‌లో పరిస్థితులు అదుపు తప్పుతాయి' అని రాసి వుంది. అది చూస్తూనే మహాగ్రహంతో బ్రూసు కొమైన్‌ వున్న డంఫ్రీస్‌కు వైపు గుఱ్ఱాన్ని దౌడు తీయించాడు. 

కొద్దిసేపటికి కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. స్కాట్లండ్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతనికి నచ్చచెప్పి తన మార్గానికి తిప్పుకుందామనుకున్నాడు. ఇద్దరూ ఒక చర్చిలో కలిశారు. వారి మధ్య చర్చలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కానీ కొమైన్‌ తను మోసం చేయలేదని మొండిగా వాదించడంతో పట్టరాని కోపంతో బ్రూసు బాకు తీసి కొమైన్‌ను పొడిచేశాడు. సరిగ్గా ఆ పాటికి వాళ్లు చర్చి బలిపీఠం దగ్గరకు వచ్చివుండడంతో బలిపీఠం కాళ్ల వద్ద కొమైన్‌ చాపచుట్టుగా పడ్డాడు. పవిత్ర స్థలంలో తన చేతుల మీదుగా యిలాటి ఘాతుకం జరగడంతో పశ్చాత్తాపంతో దహించుకుని పోతూ బయటకు వచ్చిన బ్రూసును అతని సహచరులు ఏమైందని అడిగారు. 'చచ్చిపోయాడేమోనని అనుమానంగా వుంది' అన్నాడితను. కిర్క్‌పాట్రిక్‌ అనే సహచరుడు 'సంగతేదో సరిగ్గా తేల్చుకోక పోతే ఎలా?' అంటూ లోపలకి వెళ్లి కొసప్రాణంతో వున్న కొమైన్‌ను పొడిచిపొడిచి కడతేర్చాడు. కొమైన్‌ హత్యాపాతకం బ్రూసు నెత్తికి చుట్టుకుంది. అతని స్నేహితులు బ్రూసుపై పగబట్టారు. (సశేషం) (చిత్రాలు  – బ్రూసు, మొదటి ఎడ్వర్డు)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives