ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అడియో ఫంక్షన్ ప్రశాంతంగా ముగిసింది. జై బాలయ్య స్లోగన్ లు అక్కడక్కడ చిన్న చిన్నగా వినిపించాయి తప్ప, పెద్దగా హడావుడి లేదు. దీని వెనుక చాలా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారని వినికిడి. పాస్ ల పంపిణీ దగ్గరే ఈ జాగ్రత్తలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. విఐపి పాస్ ల సంగతి అలా వుంచితే జనరల్ పాస్ ల పంపిణీ అంతా కళ్యాణ్ రామ్ కనుసన్నలలో జరిగినట్లు వినికిడి.
పక్కాగా జూనియర్ అభిమానులు అనుకునేవారికి ఎంచి మరీ పాస్ లు పంపిణీ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కొద్దిమందిని కేవలం ఎన్టీఆర్ నినాదాలు చేసేందుకు వినియోగించి, వారికి బల్క్ గా పాస్ లు ఇచ్చి పంపారని కూడా తెలుస్తోంది. మీడియాకు కూడా పాస్ లు ముందుగా ఇవ్వుకుండా వెన్యూ దగ్గరే వచ్చిన వారి మొహాలు చూసి మరీ ఇచ్చి లోపలకు పంపారట.
మొత్తం మీద ఈసారి జై బాలయ్య నినాదాలు వినపడకుండా వీలయినన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వినికిడి. నటులతో సంబంధం లేకుండా, నందమూరి హీరోలు అందరినీ అభిమానించేవారికి చాలా మందికి ఈ సారి పాస్ లు అందక, నిరుత్సాహ పడ్డారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.