ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు – 27

ఇప్పుడు సీజర్‌ గురించి కాస్త విపులంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రోమ్‌ అనగానే సీజర్‌ ప్రథమంగా గుర్తుకు వస్తాడు. అతనికి సంబంధించిన ఆనవాళ్లు రోమ్‌లో చాలా కనబడతాయి. క్లియోపాత్రాతో అతని ప్రణయం, అతని హత్య.. యివన్నీ…

ఇప్పుడు సీజర్‌ గురించి కాస్త విపులంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రోమ్‌ అనగానే సీజర్‌ ప్రథమంగా గుర్తుకు వస్తాడు. అతనికి సంబంధించిన ఆనవాళ్లు రోమ్‌లో చాలా కనబడతాయి. క్లియోపాత్రాతో అతని ప్రణయం, అతని హత్య.. యివన్నీ చదవడానికి చాలా ఆసక్తికరంగా వుంటాయి. సీజర్‌ క్రీ.పూ. 100లో జులై 12 న రోమ్‌లో పుట్టాడు. అతని మేనత్త భర్త, శూరుడు అయిన మారియస్‌ స్థాపించిన ప్రజల పార్టీ అయిన పాప్యులారెస్‌లో సభ్యుడిగా చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. జూపిటర్‌ ఆలయంలో పూజారిగా నియమించబడ్డాడు. 17 వ యేట అతను సిన్నా అనే సెనేటర్‌ కూతురైన కార్నీలియాను పెళ్లాడి రాజకీయంగా బలపడ్డాడు. మారియస్‌కు, మరో సేనాని, కాన్సల్‌ అయిన శూలాకు పడేది కాదు. 

శూలా రోమ్‌ను నియంతలాగే పాలించాడు. అతను గొప్ప శూరుడు, అనేక రాజ్యాలు జయించాడు. మద్యపానంతో ఆరోగ్యం దెబ్బ తిని తనంతట తానే అధికారం నుంచి తప్పుకున్నాడు. తన క్రూరపరిపాలనలో అనేకమంది శత్రువులను చంపివేశాడు. మారియస్‌ శిష్యుడు కదాని సీజర్‌పై పడ్డాడు.  పెళ్లయిన ఏడాదికే కార్నీలియాకు విడాకులు యిమ్మనమని సీజర్‌ను ఆదేశించాడు. సీజర్‌ నిరాకరించాడు. దాంతో శూలా పగబట్టాడు. సీజర్‌ను చంపేద్దామనుకున్నాడు కానీ అతని తల్లి వైపు బంధువులు శూలా అనుయాయులు కావడంతో బతికిపోయాడు. అయినా రోమ్‌లో వుంటే ప్రమాదమని భావించారు. చిన్నప్పుడు కూడా యిలాటి భయంతోనే పై చదువులకు గ్రీసు పంపించివేశారు. ఇప్పుడు అతను క్రీ.పూ. 81లో ఆసియా మైనర్‌కు పారిపోయాడు.

రోమ్‌ సైన్యపు తూర్పు మధ్యధరా దళంలో చిన్న అధికారిగా చేరిన సీజర్‌ సిసిలియాలో మిత్రిడేట్స్‌కు వ్యతిరేకంగా తన యుద్ధపాటవాన్ని ప్రదర్శించి, పేరుప్రఖ్యాతులు సంపాదించి, క్రీ.పూ. 78లో శూలా మరణం తర్వాత రోమ్‌కు తిరిగి వచ్చాడు. అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని వింతగా దుస్తులు ధరిస్తూ రాజకీయ భావాల్లో తీవ్రంగా వ్యక్తం చేసేవాడు. మేజిస్ట్రేటుగా డోలబెల్లా అవినీతి ఆరోపణలపై విచారించి శిక్షలు విధించాడు. ప్రజాజీవితంలో పైకి రావాలంటే వక్తృత్వం వుండాలని భావించి క్రీ.పూ. 76లో రోడ్స్‌ వెళ్లి వక్తగా శిక్షణ పొందాడు. ఆ ప్రయాణంలో అతన్ని సముద్రపు దొంగలు పట్టుకున్నారు. 20 టాలెంట్లు యిచ్చి విడిపించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నౌకలు అద్దెకు తీసుకుని పైరేట్స్‌ స్థావరంపై దాడి చేసి, పట్టుకుని వారందరినీ ఉరి తీశాడు. ఇది అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది. పదిమందీ అతన్ని గుర్తించసాగారు. సీజరుకు తన పబ్లిక్‌ యిమేజి ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. అతనికి చిన్నతనంలోనే బట్టతల వచ్చేసింది, మైగ్రేన్‌ తలనొప్పి వచ్చేది, మూర్ఛలు వచ్చేవి. అవన్నీ బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. 

మరో రెండేళ్లకు మిలటరీ ట్రైబ్యూన్‌లో ప్రవేశించాడు. శూలా తయారుచేసిన రాజ్యాంగాన్ని తిరగరాయడంలో సహాయపడ్డాడు. మరో ఆరేళ్లకు క్రీ.పూ. 68లో స్పెయిన్‌లో పబ్లిక్‌ ట్రెజరర్‌ (క్వాయిస్టర్‌)గా నియమితుడయ్యాడు. ఆ పై ఏడాది అతని భార్య కార్నీలియా చనిపోయింది. పాంపేకు వరుసకు సోదరి, శూలాకు మనుమరాలు అయిన పాంపియాను పెళ్లాడాడు. శూలా సైన్యంలో పనిచేస్తూ పాంపే చిన్నవయసులోనే గొప్ప సేనానిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతన్ని ఆరాధించేవారు. క్రీ.పూ. 70లో క్రాసస్‌, పాంపే యిద్దరూ కాన్సల్స్‌గా పని చేశారు. శూలా సేనానిగా స్పార్టకస్‌ విప్లవాన్ని అణచివేసిన క్రాసస్‌, బానిస వ్యాపారం చేసి, గనులు కొని పుష్కలంగా డబ్బు ఆర్జించాడు. అతనికి ఆవేశం ఎక్కువ. తన కోపతాపాలతో శూలాకు కూడా దూరమయ్యాడు. క్రాసస్‌కు పాంపే అంటే అసూయ. తర్వాతి కాలంలో పాంపే రోమన్‌ సైన్యం తరఫున విదేశీ దండయాత్రల్లో పాలు పంచుకున్నాడు. సముద్రపు దొంగలు రోమన్‌ మేజిస్ట్రేట్లను అపహరించినప్పుడు పాంపే మధ్యధరా సముద్రంలోని దీవులపై దాడి చేసి వాళ్లను విడిపించాడు. దానికి మూడేళ్లు పట్టింది. అతనికి కమాండర్‌ -యిన్‌- చీఫ్‌ పదవి దక్కింది. 

క్రీ.పూ. 65 వచ్చేసరికి సీజర్‌కు రోమ్‌లో నిర్మాణాలు పర్యవేక్షించే మేజిస్ట్రేటు పదవికి ఎన్నిక వచ్చింది. దానికి యితను పోటీ పడ్డాడు. క్రాసస్‌ నుండి డబ్బు అప్పు తెచ్చి ధారాళంగా ఖర్చు పెట్టేడు. నెగ్గాడు. అతని మేనత్త భర్త, తన రాజకీయ గురువు అయిన మారియస్‌ జర్మనీపై యుద్ధం చేసిన పతాకాలను శూలా గతంలో స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు పదవిలో వచ్చాక సీజర్‌ ఆ పతాకాలను వారి కుటుంబానికి తిరిగి యిచ్చేయడమే కాక, మేనత్త చచ్చిపోతే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాడు. తనను తాను మారియస్‌ వారసుడిగా ప్రకటించుకుని రాజకీయంగా అనుయాయులను పెంచుకున్నాడు. శూలా వ్యతిరేకులందరూ తన చుట్టూ తిరిగేట్లు చేసుకున్నాడు. ఈ ప్రయత్నాల వలన రెండేళ్ల తర్వాత క్రీ.పూ. 63 నాటికి సీజర్‌ పాంటిఫిక్స్‌ మాగ్జిమస్‌ పదవికి ఎన్నికయ్యాడు. అది కాన్సల్‌ పదవికి ఒక మెట్టు మాత్రమే తక్కువ. (మూడేళ్ల తర్వాత కాన్సల్‌ కూడా అయిపోయాడు) ఈ పదవి మతవ్యవహారాలను పర్యవేక్షించే పదవి. రోమ్‌లోని అధికారమతం ఎలా అవలంబించబడుతోందో గమనించడానికి అనేకమంది పూజారులుంటారు. వారందరిపై అజమాయిషీ సీజర్‌ది.

ఈ పదవి వచ్చినందుకు క్రీ.పూ. 62లో సీజర్‌ భార్య పాంపియా వాళ్ల యింట్లో 'బోనా దియా' (మంచి దేవత) పేర ఒక రహస్య పూజ నిర్వహించింది.  దానిలో స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. అయితే పూబ్లియస్‌ క్లోడియస్‌ పుల్చర్‌ అనే ఒక యువకుడు ఆడదానిలా వేషం వేసుకుని ఆ పూజలో చొరబడ్డాడు. అందరూ మద్యం సేవించిన వేళ పాంపియాను అనుభవిద్దామని అతని ప్లాను. కానీ అతను పట్టుబడ్డాడు. అతను పాంపియాకు ప్రియుడని, ఆమెయే అతన్ని పిలిపించుకుందనీ పుకార్లు వచ్చాయి. పూజకు భంగం కలిగించినందుకు అతనిపై విచారణ జరిగింది. సీజర్‌ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఏమీ చెప్పకపోవడంతో అతన్ని విడిచిపెట్టేశారు. అయితే సీజర్‌ కూడా తన భార్యను విడిచిపెట్టేశాడు. అదేం? అంటే ''సీజర్‌ భార్య అంటే ఆమెపై ఎవరూ సందేహం లేవనెత్తే స్థితిలో వుండకూడదు.'' (సీజర్స్‌ వైఫ్‌ మస్ట్‌ బి ఎబవ్‌ సస్పిషన్‌) అని జవాబిచ్చాడు. రాజనీతిలో అది ఒక సిద్ధాంతంగా ఉదహరిస్తారు.  రామాయణంలో లేకపోయినా జనశ్రుతంగా వస్తున్న రాముడి సీతాపరిత్యాగం కథలో రాముడూ యిలాగే అంటాడు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Archives