''క్లియోపాత్రా ముక్కు కాస్త పొట్టిగా వుండి వుంటే, ప్రపంచచరిత్ర మరోలా వుండేది'' అన్నాడు 17 వ శతాబ్దం నాటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ బ్లాయిజ్ పాస్కల్. ఎందుకంటే క్లియోపాత్రా వలన ఈజిప్టు సామ్రాజ్యమే కాదు, రోమన్ సామ్రాజ్యపు రాజకీయాలు ప్రభావితమయ్యాయి. ఇద్దరు రోమన్ మహా సేనానులు, చక్రవర్తులు ఆమెకు దాసోహమన్నారు. వయసులో 31 ఏళ్లు పెద్దవాడైన జూలియస్ సీజరుతో ప్రణయం సాగించి, అతని వలన లబ్ధి పొంది, రోమ్-ఈజిప్టు రెండు దేశాలకు రాణి అవుదామని ఆమె కన్న కలలు సీజరు హత్యతో భగ్నమయ్యాయి. అతని వారసుడిగా వచ్చిన మార్క్ ఆంటోనీని ఆమె మనసారా ప్రేమించింది. అతన్ని దుస్సాహసానికి ప్రేరేపించింది. అంతిమంగా యుద్ధంలో ఓటమితో వారి జీవితాలు విషాదంగా ముగిశాయి. వీరిద్దరి కథను షేక్‌స్పియర్ ''ఆంటోనీ అండ్ క్లియోపాత్రా'' పేరుతో ''రోమియో అండ్ జూలియట్'' తరహా విషాదప్రేమ నాటకంగా మలచాడు. నాటకకారుడు కాబట్టి నాటకీయత పండడానికి క్లియోపాత్రాను శృంగారమూర్తిగా స్వతహాగా కవి కాబట్టి కవిత్వం సహాయంతో తీర్చిదిద్దాడు. బెర్నార్డ్ షా ఆ దృక్పథంతో విభేదించి, క్లియోపాత్రాలోని రాజకీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ ''సీజర్ అండ్ క్లియోపాత్రా'' వచన నాటకాన్ని రాశాడు. క్లియోపాత్రా గురించి ఈజిప్టు వెళితే ఎలాగూ తెలుస్తుంది. రోమ్‌లో కూడా ఈజిప్టు నుంచి రోమన్ చక్రవర్తులు తెచ్చిన ఒబిలిస్కులు (సూర్యారాధనలో భాగంగా గుడి వద్ద కట్టే ధ్వజస్తంభం వంటి కట్టడాలు) చాలా కనబడతాయి. పారిస్‌లో లక్సర్ ఒబిలిస్కు కనబడుతుంది. ఈజిప్టులోని లక్సర్ గుడిలో వుండే దాన్ని ఈజిప్టు రాజు 19 వ శతాబ్దంలో పారిస్‌కు బహుమతిగా యిచ్చాడు.
క్లియోపాత్రా నిజంగా అంత అందగత్తెయా? ఆమె అందమైనదే కానీ అందం కంటె యితర గుణాలతోనే ఆమె అందర్నీ ఆకట్టుకుందని ఆమె మరణించిన 75 ఏళ్లకు పుట్టిన చరిత్రకారుడు ప్లూటార్క్ అంటాడు. ఆమె చాలా తెలివైనది, మంచి మాటకారి. పలుభాషలు నేర్చి, ఏ జాతివారితో ఆ జాతి వారి భాష మాట్లాడేది. మృదువుగా మాట్లాడుతూనే, తన భావాలను దృఢంగా వ్యక్తపరచగలదు. ఆమె అందం కంటె ఆమెతో శృంగారానుభవమే సీజర్, ఆంటోనీలను కట్టిపడేసిందని ప్రతీతి. ఆనాటి రాజవంశీకులందరి మాదిరిగాగానే ఆమెకు సింహాసనంపై మక్కువ ఎక్కువ. దాన్ని చేజిక్కించుకోవడానికి, సామ్రాజ్యం విస్తరింపచేసుకోవడానికి కుయుక్తులు పన్నడంలో కూడా దిట్ట. తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఆమె అందాన్ని కూడా ఎరగా వేసినా, ప్రయోజనం వుంటుందని తెలిసినా తన కిష్టం లేనివాళ్లతో పడుక్కోలేదు. 39 ఏళ్లు మాత్రమే జీవించినా ఆమె జీవితంపై అనేక నవలలు, నాటకాలు, సినిమాలు వచ్చాయి. ఎలిజబెత్ టేలర్ క్లియోపాత్రాగా, రిచర్డ్ బర్టన్ ఆంటోనీగా, రెక్స్ హారిసన్ సీజర్‌గా నటించిన ''క్లియోపాత్రా'' సినిమా అద్భుతంగా వుండి పాత్రల స్వభావాలను చక్కగా వెలికితీసింది. భారీతనానికైనా చూడవలసిన సినిమా.
క్లియోపాత్రా క్రీ.పూ.69లో పుట్టింది. ఆమె తండ్రి పన్నెండవ టాలమీ (అసలు పేరు ఔలటీస్ టాలమీ) అలెగ్జాండర్ ద గ్రేట్ వంశీకుడు. అప్పటికి చాలా ఏళ్లగా గ్రీకు పాలకులు ఈజిప్టు ఫారోలుగా వున్నారు. వారు గ్రీక్ భాష తప్ప వేరేదీ మాట్లాడేవారు కారు. అందువలన పాలనలో ఈజిప్షియన్, గ్రీకు రెండు భాషలు వాడుకలో వుండేవి. ఈజిప్షియన్ వాళ్లతో సంబంధాలు కలుపుకోవడం కూడా వాళ్ల కిష్టం లేదు. అందువలన రాజవంశీకులు వారిలో వారే పెళ్లి చేసుకుంటూ, రక్తం 'కలుషితం' కాకుండా చూసుకునేవారు. అందువలన ఒకే తల్లి కడుపున పుట్టినవారు కూడా పెళ్లి చేసుకోవలసి వచ్చేది. క్లియోపాత్రా తల్లీ తండ్రీ జన్మతః అన్నాచెల్లెళ్లు. క్లియోపాత్రా యిద్దరు భర్తలూ (ఒకరి తర్వాత మరొకర్ని పెళ్లాడింది) ఆమె తమ్ముళ్లే. ఇలా వుండేది వారి ఆచారం. అన్నా చెల్లెళ్లని కాదని రాజులు వేరేవారిని పెళ్లాడితే అపచారం చేసినట్లు ప్రజలు భావించి, వారిపై ఆగ్రహం పెంచుకునేవారు.
ఇక రాజుగా వున్నవారు తమ దారికి కంటకంగా భావించిన వారిని తొలగించడానికి హత్యలు, విషప్రయోగాలు చేసేవారు. ఇలాటి వాతావరణంలో క్లియోపాత్రా పుట్టింది. ఈజిప్టు రాజులు అధికారాన్నంతా తమ చేతిలో పెట్టుకోవడంతో అవినీతి ప్రబలింది. వాళ్లు విలాసాలకు విపరీతంగా ఖర్చుపెడుతూ బొక్కసాన్ని ఖాళీ చేసుకున్నారు. అదను చూసి రోమ్ వాళ్లకు ఋణాలిచ్చింది. వసూలు చేసుకోవాలంటే రాజ్యాన్ని తాకట్టు పెట్టుకోవాలి, రాజవంశీకులను గుప్పిట్లో పెట్టుకోవాలి. అందుకని తన సైనికులను ఈజిప్టులో బస చేయించి, రాజులను రక్షిస్తున్నాన్న మిషపై, తనకు తాకట్టు పెట్టిన ఆస్తులను కాపాడుకునేది. సైనికుల పోషణాభారం ఈజిప్టుమీదే మోపేది. ఈస్టిండియా కంపెనీ మన సంస్థానాధీశుల విషయంలో యిలాగే చేసి, రాజరికపు వివాదాల్లో తలదూర్చి, రెండుపిల్లులకు రొట్టె పంపకం చేసిన కోతిలా ప్రవర్తించి చివరకు సంస్థానాలను స్వాహా చేసింది. సింహాసనంపై హక్కుల విషయంలో పోటీ పడే దాయాదులు చాటుగా కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుని, తాము గద్దె నెక్కగానే రాజ్యభాగాలను కంపెనీకి ధారాదత్తం చేసేవారు.
క్లియోపాత్రా తండ్రి ఔలటీస్ కూడా రోమ్‌లో ఏళ్లపాటు తిష్ట వేసి పాతికేళ్లకు పైగా కుప్పపడిన ఋణాలు మాఫీ చేయించుకోవడానికి రోమ్ సెనేట్ సభ్యులతో మంతనాలు ఆడుతూండేవాడు. ఈజిప్టు రాజ్యంలో భాగమైన సైప్రస్‌ను అతని తమ్ముడు పాలిస్తూండేవాడు. ఓ రోజు హత్యకు గురయ్యాడు. కాపలాగా వున్న రోమన్లే చేశారేమో తెలియదు కానీ అది రోమ్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. సిరినైకా కూడా చేజారింది. తన గతి ఏమవుతుందో తెలియక రోమ్‌లోనే వుంటూ తన సాయం పొందిన పాంపేను మద్దతివ్వమని వేడుకుంటున్నాడు. అతను లేని సమయంలో అతని భార్య (భార్యా కాదా అన్న విషయంలో స్పష్టత లేదు) సింహాసనాన్ని ఆక్రమించింది. ఆమెపై విషప్రయోగం జరిగి, చనిపోగా ఔలటీస్ పెద్దకూతురు బెరినైస్ రాజ్యం చేపట్టింది. బెరినైసే ఆ విషప్రయోగం చేయించిందని చెప్పుకుంటారు. తన చెల్లెలు 14 ఏళ్ల క్లియోపాత్రా తనకు పోటీగా తయారవుతుందన్న భయంతో ఆమెను రాజమందిరం నుంచి బయటకు ఎక్కడికీ వెళ్లనిచ్చేది కాదు. రోమన్లకు యిదంతా తెలిసినా, ఈజిప్టులో అనిశ్చితి కొనసాగించారు. ఎందుకంటే వాళ్ల దోపిడీ నిరాఘంటంగా సాగాలంటే రోమ్‌లో బలమైన రాజు వుండకూడదు. క్లియోపాత్రాను వాళ్ల అక్క ఒక కంటితో కనిపెడుతూ మరో కంటితో కాపాడుతూ వుంది కూడా. ఎందుకంటే ఏ కారణంగానైనా ఆమె హత్య చేయబడితే, ఆ అపవాదు తనపై వస్తుంది. ప్రజలు అప్పటికే అసంతృప్తితో రగులుతున్నారు. రాజమందిరంలో బందీగా వుంటూనే క్లియోపాత్రా విషయాలన్నీ తెలుసుకుంటోంది. తనకు అవకాశం వస్తుందా రాదా అని లెక్కలు వేసుకుంటోంది.
రెండేళ్ల తర్వాత ఔలటీస్ రోమ్ నుంచి రోమన్ సైనికులతో, సైన్యాధిపతితో సహా దిగాడు. వెంట వున్న వారిని చూసి ఈజిప్టు సైనికాధికారులు అతన్ని మన్నించారు. అతను గద్దె ఎక్కుతూనే బెరినైస్‌కు మరణదండన విధించాడు. క్లియోపాత్రకు తనతో పాటు అధికారం యిచ్చాడు. అతను క్రీ.పూ.51 మార్చిలో మరణించాడు. అతని వీలునామా ప్రకారం 18 ఏళ్ల కూతురు క్లియోపాత్రా, 10 ఏళ్ల కొడుకు పదమూడవ టాలమీ (ఇకపై టాలమీ అందాం) భార్యాభర్తలై, ఈజిప్టు సింహాసనాన్ని కలిసి ఏలాలి. పెళ్లి కాదంటే రాజ్యార్హత పోతుందన్న భయంతో క్లియోపాత్రా తమ్ముణ్ని పెళ్లాడింది కానీ అతనితో పక్క పంచుకోవడానికి సిద్ధపడలేదు. టాలమీకి రక్షకుడిగా వుండే పోథినస్ నపుంసకుడు. అతని మాట టాలమీకి వేదవాక్కు. రాజ్యపాలనంతా అతనే చేసేవాడు. అతని మాట ఎత్తితేనేే క్లియోపాత్రా మండిపడేది. భర్తతో విభేదాలు ముదరడంతో దస్తావేజుల్లో తన పేరులోంచి టాలెమీ తీసిపారేసి, తన ఒక్కదాని చిత్రంతోనే నాణాలు విడుదల చేసింది. ఈజిప్టు చరిత్రలో యిలా ఎప్పుడూ జరగలేదు. (ఫోటో – ఈజిప్టు నుంచి తెచ్చి వాటికన్‌లో నెలకొల్పిన ఒబిలిక్స్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)