మద్యనిషేధంపై జయలలిత ప్రభుత్వం చాలా వూగిసలాడింది. తమిళనాడులో మద్యనిషేధం అమల్లో వుండే రోజుల్లో 1971లో కరుణానిధి ఎత్తేశాడు. కానీ 1973లో మళ్లీ పెట్టాడు. ఎమ్జీయార్ అదే విధానాన్ని కొనసాగించాడు. కరుణానిధి మళ్లీ అధికారంలోకి వచ్చాక 1990లో సారా దుకాణాలు తెరిపించాడు. జయలలిత ముఖ్యమంత్రి కాగానే 1991 జులైలో వాటిని మూయించేసింది. దానివల్ల ప్రభుత్వాదాయానికి రూ. 322 కోట్ల గండి పడింది. ఆ నష్టాన్ని ఎలా పూరిస్తుందా అని చూస్తూండగానే దాదాపు 4 వేల వైన్ షాపులు అనుబంధంగా బార్ పెట్టుకోవచ్చు అని అనుమతి యిచ్చింది. మళ్లీ ఆ బార్లను 1993 జూన్ 1 కల్లా మూసేయాలని మార్చిలో ఆదేశించింది. బార్ లైసెన్సు కోసం కట్టిన డబ్బంతా వృథా అయిందని బారు యజమానులు కత్తికట్టారు. ఆమె తన విధానాలను యింత తరచుగా మార్చుకోవడానికి కారణాలు ఏమిటో తెలియక, తగినంత లంచం యివ్వకపోవడం చేతనే నిషేధించిందని అనుకోసాగారు.
తాన్సి (తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్) నుంచి జయా పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్ (జయలలిత, శశికళ భాగస్వాములు) భూమి కేటాయింపు కేసులో చాలా జయలలిత అప్రతిష్ఠపాలైంది. టిడ్కో ద్వారా స్పిక్‌లో డిస్ఇన్వెస్టిమెంట్ వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు (టిడ్కో) కమిషనర్‌గా వున్న ఐయేయస్ అధికారిణి వియస్ చంద్రలేఖ స్పిక్‌లో తక్కువ రేటుకి పెట్టుబడి ఉపసంహరించడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. నిజాయితీపరురాలను కాబట్టి ఎమ్జీయార్ ఎంతో ఆదరించారని, తను చెప్పిన మాట వినలేదన్న కారణంగా జయలలిత యాసిడ్ దాడి చేయించిందని ఆమె ఆరోపించి, ఉద్యోగానికి రాజీనామా చేసి, తనకు అండగా నిలిచిన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి సూచన మేరకు జనతాపార్టీలో చేరి తమిళనాడు యూనిట్‌కు అధ్యక్షురాలైంది. కానీ రాజకీయంగా పెద్దగా ముందుకు సాగలేదు. 1996లో మద్రాసు మేయరు ఎన్నికలలో డిఎంకె తరఫున స్టాలిన్ నిలబడగా, ఈమె అతనికి వ్యతిరేకంగా నిలబడింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న ఎడిఎంకె ఆమెకు మద్దతిచ్చినా ఓడిపోయింది. 2006లో అసెంబ్లీ ఎన్నికలలో నిలబడితే 3 వేల ఓట్లు కూడా రాలేదు.
టిడ్కోలో ఆమె నిర్ణయానికి, యాసిడ్ దాడికి సంబంధం లేదని, ఆమెనుంచి విడిపోయిన బెంగాలీ ఐయేయస్ అధికారి భర్త పిల్లవాడి కస్టడీ విషయంలో కక్ష పూని ఆ దాడి చేయించాడని జయలలిత అభిమానులు వాదించారు. జయలలిత ఒక యింటర్వ్యూలో ''ఆమె అంత నిజాయితీపరురాలు కాదు, అందుకే ఎమ్జీయార్ ఆమెను జిల్లా పోస్టింగు నుంచి ఆర్కయివ్స్ శాఖకు బదిలీ చేశారు. నిజానికి ఆమె, ఆమె స్నేహితులు డీల్‌లో డబ్బు పంచుకుందామని చూశారు. నేను సాగనీయలేదు.'' అని చెప్పింది. యాసిడ్ దాడి గురించి అడిగితే 'ఆ టైముకి నేను ఊటీలో వున్నాను. సంఘటన గురించి వినగానే నేనునా సీనియర్ మోస్ట్ ఐయేయస్ అధికారి ద్వారా పూలగుచ్ఛాన్ని పంపించాను. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదంటే, ఎమ్జీయార్ అస్వస్థుడిగా అక్కడ వున్నపుడు అక్కడకు నన్ను రానీయలేదు. అది తప్ప వేరే కారణం లేదు.' అని జవాబిచ్చింది. కానీ చంద్రలేఖపై యాసిడ్ దాడిలో 1992 నవంబరులో నిందితుడిగా అరెస్టయినవాడు ఎడిఎంకె సభ్యుడే! అతనిపై రెండేళ్ల దాకా చార్జిషీటు దాఖలు కాలేదు.
నిజానికి చంద్రలేఖ, జయలలిత స్నేహితులు. ఎమ్జీయార్ ముఖ్యమంత్రిగా వుండగా 1977లో చంద్రలేఖను రాష్ట్రంలో తొలి మహిళా కలక్టరుగా కడలూరులో నియమించాడు. ఆమె లౌక్యం తెలిసినది. తనకంటూ ఒక పిఆర్ఓను నియమించుకుని, అతని ద్వారా తను చేస్తున్న పనికి మీడియాలో బాగా కవరేజి వచ్చేట్లు చూసుకుంది. ఆ పిఆర్ఓ వేరెవరో కాదు, తర్వాతి రోజుల్లో జయలలితకు ఆత్మీయురాలై పోయిన శశికళ భర్త నటరాజన్. అతను చురుకైన వాడు. పాత్రికేయులను మచ్చిక చేసుకుని చంద్రలేఖకు ఖ్యాతి వచ్చేట్లు చేశాడు. అది చూసి ఎమ్జీయార్ ఆమెకు మధురైకు కలక్టరుగా వేశాడు. ఈమె నటరాజన్ అక్కడకు కూడా తీసుకెళ్లింది. 1982లో ఎమ్జీయార్ జయలలితను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాడానికి మధురైలో మహిళా ర్యాలీను వేదికగా నిర్ణయించి, ఆ ర్యాలీ విజయవంతం అయ్యేట్లు చూడమని చంద్రలేఖకు అప్పగించాడు. ఆమె తన అధికారం, శక్తియుక్తులు వుపయోగించి దాన్ని దిగ్విజయం చేసి ఎమ్జీయార్, జయలలితల అభిమానాన్ని చూరగొంది. ఎమ్జీయార్ ఆమెను మద్రాసులోని అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా వేసినప్పుడు, జయలలితతో స్నేహం మరీ పెరిగింది. ఆవిడ తనతో బాటు మద్రాసుకు సైతం తెచ్చుకున్న సెక్రటరీ నటరాజన్కూడా జయలలితకు చేరువయ్యాడు. చంద్రలేఖ కొడుకు అభిజిత్ చంద్రలేఖ వద్దే వుండేవాడు. నటరాజన్, శశికళలకు పిల్లల్లేరు. అందువలన గృహిణిగా వున్న శశికళను తన కొడుకు సంరక్షణ భారం వహించమని చంద్రలేఖ అడిగింది. ఆ విధంగా నటరాజన్‌తో బాటు శశికళ కూడా ఆమెకు సన్నిహితురాలైంది.
మద్రాసు వచ్చాక సింగిల్ బెడ్రూమ్ యింట్లో కాపురం శశికళను బాధించింది. డబ్బు సంపాదించే మార్గం ఎలాగా అని ఆలోచించి, జయలలిత మీద ఒక వీడియో తీసి అమ్ముకుంటే డబ్బు వస్తుందని ప్లాను వేసింది. చంద్రలేఖ ద్వారా జయలలితను ఒప్పించమని భర్తను వేధించింది. చంద్రలేఖ జయలలితను ఒప్పించడమే కాక, శశికళకు ఒక వీడియో కెమెరా బహుమతిగా కూడా యిచ్చింది. ఆ వీడియో తీసే సందర్భంలోనే జయలలితకు శశికళ చాలా దగ్గరైంది. ఆమె యింట్లోనే కాపురం వుంటూ, ఇంటి వ్యవహారాలు చక్కబెడుతూండేది. జయలలిత మొదట్లో యిలాటి విషయాలకు తల్లిపై ఆధారపడేది. ఇప్పుడు ఆమె స్థానంలో యీమె వచ్చింది. ఎమ్జీయార్ మరణం తర్వాత, నటరాజన్ జయలలితకు తోడుగా వుంటూ సలహాలు యిస్తూ సాయపడ్డాడు. తర్వాత 1991 ఎసెంబ్లీ ఎన్నికల సమయంలో అతను మరీ అతిగా ప్రవర్తించి టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలియగానే జయలలిత అతన్ని దూరం పెట్టినా శశికళను మాత్రం దూరం చేసుకోలేదు. ఇది 1992 నాటి సంగతి. తర్వాతి రోజుల్లో వాళ్ల బంధం అనేక మలుపులు తిరిగింది. చెప్పవచ్చేదేమిటంటే చంద్రలేఖ, జయలలితకు సన్నిహితురాలే కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకోగాని గొడవలు వచ్చాయి. – (సశేషం)
(ఫోటో – సుబ్రహ్మణ్యంస్వామితో, చంద్రలేఖ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)