ఎమ్బీయస్‌ : యూరోప్‌ గాథలు 30

ఇంకో ఏడాది గడిచేసరికి టాలమీకి రక్షణగా ఔలస్‌ గాబినియస్‌ అనే రోమన్‌ సేనాని ఈజిప్టులో నిలిపి వుంచిన సైన్యంతో ఆమెకు ఘర్షణ వచ్చింది. రోమ్‌ అధీనంలో వున్న సిరియాపై పార్థియన్లు దండెత్తి వచ్చినపుడు అక్కడున్న…

ఇంకో ఏడాది గడిచేసరికి టాలమీకి రక్షణగా ఔలస్‌ గాబినియస్‌ అనే రోమన్‌ సేనాని ఈజిప్టులో నిలిపి వుంచిన సైన్యంతో ఆమెకు ఘర్షణ వచ్చింది. రోమ్‌ అధీనంలో వున్న సిరియాపై పార్థియన్లు దండెత్తి వచ్చినపుడు అక్కడున్న రోమన్‌ సైన్యం సరిపోలేదు. సిరియాలో రోమ్‌ తరఫున గవర్నరుగా వున్న బిబ్యులస్‌ ఈజిప్టులోని రోమన్‌ సైన్యదళాలు తనకు సహాయంగా రావాలని కబురు పంపాడు. అయితే ఈజిప్టులోని రోమన్‌ సైనికులు ఏళ్ల తరబడి ఉత్తిన జీతాలు తీసుకుంటూ, ఖాళీగా వుంటూ, ఈజిప్టు వనితలను పెళ్లాడి, కాపురాలు చేసుకుంటూ కడుపులో చల్ల కదలకుండా వున్నారు. ఇప్పుడు యుద్ధం అంటే ఎవడెళతాడు రాము పొమ్మన్నారు. అప్పుడు బిబ్యులస్‌ తన కుమారులను పంపి 'మీరు రావాల్సిందే' అని ఆజ్ఞాపించే ధోరణిలో అడిగించాడు. దాంతో సైనికులకు ఒండిమండి వాళ్లని చంపివేశారు. అలా చంపిన సైనికులను బిబ్యులస్‌కు అప్పగిస్తే రోమన్లు సంతోషిస్తారని అంచనా వేసిన క్లియోపాత్రా వారిని గొలుసులతో బంధించి బిబ్యులస్‌కు పంపింది. కానీ రోమన్ల అహంకారం ఎంతటిదంటే – రోమన్లు తప్పు చేస్తే రోమన్లే శిక్షించాలి తప్ప మధ్యలో యీ ఈజిప్టువాళ్లకు వారిని బంధించే అధికారం ఎవడిచ్చాడు అనుకున్నారు. రోమ్‌ క్లియపాత్రాకు అండగా నిలవలేదు. తన సైనికులను అప్పగించినందుకు గాబినియస్‌ క్లియోపాత్రాపై కక్ష కట్టేశాడు. ఆమెను గద్దె నించి దించేయమని రాజరక్షకుడు పోథినస్‌, సేనాని ఏకిలాస్‌లను ప్రోత్సహించాడు. క్రీ.పూ.48 నాటికి టాలమీ ఏకైక ప్రభువు అయిపోయాడు. క్లియోపాత్రా తిరుగుబాటు చేయబోతే అది విఫలమైంది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె పారిపోయి సిరియాలో తలదాచుకుంది.

క్లియోపాత్రా యిలా కష్టాల్లో కొట్టుమిట్టులాడుతున్న సమయంలోనే రోమ్‌లో అంతర్యుద్ధం వచ్చింది. సీజరు, పాంపే తలపడ్డారు. పాంపే ఓడిపోయి ఈజిప్టు పారిపోయి వచ్చాడు. సీజరుకి బలవంతుడిగా తోస్తున్నాడు కాబట్టి అతని శత్రువైన పాంపేని వధిస్తే అతను సంతోషిస్తాడని టాలమీ అంచనా వేశాడు. అలగ్జాండ్రియాలో సముద్రపు ఒడ్డున సింహాసనం వేసుకుని కూర్చుని పాంపే ఓడ దిగగానే అతని భార్యబిడ్డల కళ్లెదురుగానే అతని మాజీ సేవకుడి చేతే తల నరికించాడు. రెండు రోజుల తర్వాత సీజరు ఓడ దిగగానే ఆ తల చూపించి అతన్ని సంతోషపెట్టాననుకున్నాడు. కానీ సీజరు ఆగ్రహంతో వూగిపోయాడు. ఎందుకంటే పాంపే తన ఒకప్పటి స్నేహితుడు, కూతురు చనిపోయినా అల్లుడు. అంతటి వీరుణ్ని, రోమన్‌ కాన్సల్‌ను యింత దుర్మార్గంగా వధించే సాహసం చేస్తాడా ఈజిప్టు రాజు అని మండిపడ్డాడు. ఈ టాలమీ పని పడదామని నిశ్చయించుకుని 'నీకూ, క్లియోపాత్రాకు వున్న తగవు నేను తీరుస్తాను' అంటూ అడక్కుండానే మధ్యవర్తిత్వం చేపట్టి రాజప్రాసాదంలో నివాసం ఏర్పరచుకున్నాడు. 

మహాయోధుడైన సీజరు తన ప్రత్యర్థి ఐన టాలమీ పట్ల ద్వేషంతో వున్నాడని విన్న క్లియోపాత్రా సీజరును మంచి చేసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ బహిరంగంగా వెళితే లోపలకి రానివ్వరు. అందుకని తనను తాను ఒక పర్షియన్‌ తివాచీలో చుట్టుకుని ఒక బానిసను సీజరు గదిలోకి తీసుకెళ్లమంది. తనను అడ్డగించిన ద్వారపాలకులతో బానిస ''క్లియోపాత్రా పంపిన బహుమతి యిది. సీజరు మాత్రమే చూడాలని చెప్పి పంపారు.'' అన్నాడు. వాళ్లు వెళ్లనిచ్చారు. గదిలోకి వెళ్లి, బానిస తివాచీ నేలపై దొర్లించాడు. దానిలోంచి దొర్లుతూ క్లియోపాత్రా బయటపడింది. సీజరు కంగారుపడి కత్తి చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే క్లియోపాత్రా అందాన్ని చూసి ముగ్ధుడై పోయి నిలిచిపోయాడు. ఆమె అతని చెంత చేరింది. (ఈ ఘట్టం ''క్లియోపాత్రా'' సినిమాలో చూసి తీరాలి). అప్పటికి క్లియోపాత్రాకు 21 ఏళ్లు, సీజరుకు 52. అయినా వాళ్ల మధ్య ప్రణయం యించుమించుగా ఏడాదిపాటు (క్రీ.పూ.48, 47) సాగింది. వీళ్లిద్దరి మధ్య వయసు తేడా యింత వున్నా యింత గట్టి బంధం ఎలా ఏర్పడింది అనేది చర్చనీయాంశమైంది.

సీజరుకు అందగత్తెలు కొత్తకాదు. ఆనాటి రోమన్లలో స్త్రీలోలుడు కానివారు ఎవరూ లేరు. భార్యకు (సీజరు కూతురు) మాత్రమే అంకితమైన పాంపేను అందరూ ఆడంగి వాడు (సిస్సీ) అని హేళన చేసేవారు. క్లియోపాత్రా ఎంత అందగత్తె అయినా సీజరు అందాన్ని చూసే దాసోహమన్నాడన్న వాదన తర్కానికి నిలవదు. క్లియోపాత్రా మేధస్సు, బహుభాషాజ్ఞానం, విషయగ్రహణాచాతుర్యం, రాజకీయ కౌటిల్యం యివన్నీ అతన్ని మెప్పించాయని అనుకోవాలి. ఆమె అతన్ని ముగ్గులోకి దింపిందని అనుకోవడం కంటె అతను ఆమెను ఒక రాజకీయవేత్తగా, రాణిగా తీర్చిదిద్దడంలో ఆనందం పొందాడని భావించాలి. క్లియోపాత్రా పాత్రను షేక్‌స్పియర్‌ తీర్చిదిద్దిన తీరు వేరు, బెర్నార్డ్‌ షా తీర్చిన తీరు వేరు. క్లియోపాత్రాకు వున్న యిద్దరు ప్రేమికులలో మార్క్‌ ఆంటోనీ ఆమె పట్ల వ్యామోహం పెంచుకుని, వినాశనాన్ని తెచ్చుకున్నాడు. (తర్వాతి భాగాల్లో అతని కథ చెప్తాను). క్లియోపాత్రా కూడా అతనంటె తలమునకలా ప్రేమలో పడింది. సీజరు విషయానికి వస్తే ముసలి మూర్ఖుడులా క్లియోపాత్రా చెప్పినట్లు ఆడాడని అనుకునే ప్రమాదం వుంది. కానీ సీజరు ఒక స్టేట్స్‌మన్‌లా, ఒక గురువులా ప్రవర్తిస్తూ క్లియోపాత్రాను తన ప్రయోజనాలకు వాడుకున్నాడని గ్రహించాలి. తమ రెండేళ్ల సాహచర్యం వలన ఆమె గర్భవతి అయి, కొడుక్కి సీజరియన్‌ (చిన్న సీజర్‌) అని పేరు పెట్టి, వాణ్ని రోమ్‌కు తీసుకుని వచ్చి 'వీడు నీ కొడుకే కాబట్టి నీ వారసుడిగా రోమ్‌-ఈజిప్టు రెండు రాజ్యాలకు అధిపతిగా ప్రకటించు' అని అడిగినా సీజరు ఆమె మాట మన్నించకుండా తన మేనల్లుడు ఆక్టేవియన్‌ను తన వారసుడిగా ప్రకటించాడు!

క్లియోపాత్రా తన చెప్పుచేతల్లో వుంటుందన్న నమ్మకం కుదిరాక సీజరు ఈజిప్టును రోము సామ్రాజ్యంలో కలిపే ఆలోచన విరమించుకుని, క్లియోపాత్రాను ఈజిప్టు రాణిగా చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇది గ్రహించిన  పోథినస్‌, ఏకిలాస్‌ అలెగ్జాండ్రియాలో సీజరుపై యుద్ధం ప్రకటించారు. సీజరు వాళ్లని ఓడించాడు. ఈ యుద్ధసందర్భంగా అలెగ్జాండ్రియాలోని పెద్ద గ్రంథాలయం తగలబడిపోవడం మానవచరిత్రలోనే పెద్ద విషాదంగా వర్ణిస్తారు. అనేక శతాబ్దాలుగా అరుదైన పుస్తకాలను తనలో దాచుకున్న ఆ లైబ్రరీ ప్రపంచ వింతల్లో ఒకటిగా వుండేది. తెలివితక్కువ రోమన్‌ సైనికులు దానికి మంటపెట్టడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అతి కొద్ది భాగం మాత్రమే రక్షింపబడింది. ఆ దుర్ఘటనకు క్లియోపాత్రాతో బాటు సీజరు కూడా ఎంతో బాధపడ్డాడు. యుద్ధసమయంలోనే టాలమీ నైల్‌ నదిలో మునిగి చచ్చిపోయాడంటారు, లేదు క్లియోపాత్రాయే విషప్రయోగం చేసి చంపేసిందంటారు. ఏమైతేనేం, సీజరు 22 ఏళ్ల క్లియోపాత్రాను 13 ఏళ్ల ఆమె మరో తమ్ముడు (14 వ టాలమీ)కి యిచ్చి పెళ్లి చేసి యిద్దర్నీ కలిపి ఈజిప్టు సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఆమెకు రక్షణగా రఫియో అనే సేనాని ఆధిపత్యంలో రోమన్‌ సేనను వుంచాడు. అక్కడ వుండగానే తన ఆసియా మైనర్‌లో పాంటస్‌ను గెలిచిన సందర్భంలోనే 'వెని, విడి, విసి' (ఐ కేమ్‌, ఐ సా, ఐ కాన్‌కర్డ్‌ – వచ్చా, చూశా, గెలిచా) అనే అతని ఫేమస్‌ కొటేషన్‌ ఉద్భవించింది. ఆ ఏడాదే అతను రోమ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కారణం – రోమ్‌లో అతను తన ప్రతినిథిగా నిలబెట్టిన మార్క్‌ ఆంటీనీ ప్రవర్తన కారణంగా  యిబ్బందులు రావడం! 

మార్క్‌ ఆంటోనీ అనగానే సీజర్‌ హత్య తర్వాత అతను యిచ్చిన ప్రఖ్యాత ఉపన్యాసం గుర్తుకు వస్తుంది అందరికీ. తన కంటె 14 ఏళ్లు చిన్నదైన క్లియోపాత్రా ప్రేమపాశంలో పడి సర్వభ్రష్టుడైన కథా గుర్తుకు వస్తుంది. అతను క్రీ.పూ.83లో పుట్టాడు. రోమన్‌ పేరు మార్కస్‌ ఆంటోనియస్‌. ఇంగ్లీషువాళ్లు మార్క్‌ ఆంటోనీ అన్నారు కాబట్టి మనమూ అలాగే పిలుద్దాం. అతను చిన్నప్పుడు అల్లరిచిల్లరగా తిరిగేవాడు. స్నేహితులతో విందువిలాసాలతో మునుగుతూ అప్పులపాలయ్యాడు. బాకీవాళ్లను తప్పించుకోవడానికి గ్రీసు పారిపోయినపుడు వక్తృత్వకళలో తర్ఫీదు పొందాడు. తిరిగి వచ్చి సైన్యంలో చేరి, సీజరు దళంలో ముఖ్యనాయకుడిగా ఎదిగాడు. గాల్‌పై యుద్ధంలో చేదోడువాదోడుగా వుండి అతనికి కుడిభుజంగా మారాడు. సీజరు, పాంపే, క్రాసస్‌లతో మొదటి 'త్రయం' ఏర్పడి  రోమ్‌ను పాలించేటప్పుడు సీజరు తరఫున వ్యవహారాలు చక్కబెట్టేవాడు. ఆ త్రయం విచ్ఛిన్నమై దేశం అంతర్యుద్ధంలో మునిగినపుడు సీజరునే అంటిపెట్టుకుని వున్నాడు. పాంపేతో యుద్ధాలు సలుపుతూ విదేశాల్లో వుంటూన్నపుడు  సీజరు ఆంటోనీని ఇటలీ గవర్నరుగా నియమించాడు. క్రీ.పూ. 47లో సీజరు రోమ్‌కు వచ్చి రెండోసారి కాన్సల్‌ అయ్యాడు. సెనేట్‌ అతన్ని నియంతగా వుండమంది. ఆ పదవిలో 11 రోజులు వున్నాక దానికి రాజీనామా చేశాడు. ఆంటోనీని ద్వితీయస్థానంలో నిలిపాడు. 

సీజరు ఈజిప్టులో వుండిపోవడం చేత ఆంటోనీకి మార్గదర్శకత్వం చేసేవాళ్లు లేక చాలా పొరపాట్లు చేశాడు. పాంపే అనుచరులు అతనిపై కత్తి కట్టారు. డోలబెల్లా అనే పాంపే అనుయాయి రోమన్‌ ప్రజల ఋణాలన్నీ మాఫీ చేస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించాడు. అలా చేస్తే ఆర్థికంగా దేశం దెబ్బ తింటుందని సీజరు భావిస్తాడని తలచిన ఆంటోని దాన్ని నిరాకరించాడు. దీనికి తోడు మరో కారణం కూడా వుంది డోలబెల్లా తన భార్యకు రహస్యప్రియుడన్న సందేహం కూడా ఆంటోనికి వుంది. ప్రజల మద్దతు కూడగట్టడానికి యిదే అవకాశం అనుకున్న డోలబెల్లా జనాల్ని వెంటేసుకుని రోమన్‌ ఫోరమ్‌ను ముట్టడించాడు. ఆంటోనీ ఆ ప్రదర్శకులపై సైన్యాన్ని ప్రయోగించాడు. అప్పులు మాఫీ చేస్తే బాగుండేది కదాన్న భావం సీజరు సైనికుల్లో సైతం వుంది. ఆంటోనీ ప్రవర్తనతో వాళ్లకూ కోపం వచ్చింది. కొద్దికొద్దిగా తిరగబడసాగారు. అరాచకం ప్రబలసాగింది. 

ఈజిప్టులో తిష్టవేస్తే రోమ్‌ చేజారేట్లు వుందని అనుకున్న సీజరు క్రీ.పూ.47 అక్టోబరులో రోముకి తిరిగి వచ్చేశాడు. ఆంటోనీ విధానాలను నిరసించి, డోలబెల్లాను మచ్చిక చేసుకుందామని చూశాడు. క్రీ.పూ. 46లో మూడోసారి కాన్సల్‌షిప్‌కు ఎంపికై, కాన్సల్‌షిప్‌ను డోలబెల్లాకు బదిలీ చేస్తానని, దానికి అనుమతించాలని సెనేట్‌ను అడిగాడు. ఆంటోనీ దీన్ని ప్రతిఘటించాడు. దాంతో సీజరు నియంతగా  తనకున్న అధికారాలను వినియోగించుకుని డోసబెల్లాను కాన్సల్‌గా నియమించాడు. దీనికి కూడా ఆంటోనీ అడ్డు చెప్పాడు. చివరకు సీజరు డోలబెల్లాను కాన్సల్‌గా తీసేసి తన సైన్యంలో జనరల్‌గా చేసి, రోమ్‌కు దూరంగా పంపేశాడు. ఆంటోనీకి క్రీ.పూ. 45 వరకు ఏ పదవీ యివ్వలేదు. అతని స్థానంలో లెపిడస్‌ అనే అతన్ని సహ కాన్సల్‌గా వేసుకున్నాడు. సీజరు ఉత్తర ఆఫ్రికాలో యుద్ధాలు గెలుస్తూ వుండగా, ఆంటోనీ రోమ్‌లో సాధారణ పౌరుడిగా వుండిపోయాడు. యుద్ధాలు గెలిచి వచ్చిన సీజరును సెనేట్‌ ఏకంగా పదేళ్లపాటు నియంతగా ఎన్నుకుంది.  ఈ పదవే సీజరు హత్యకు దారి తీసింది.  (ఫోటో – ''క్లియోపాత్రా'' సినిమాలో హీరోయిన్‌గా ఎలిజిబెత్‌ టేలర్‌, సీజరుగా రెక్స్‌ హారిసన్‌) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives