ఉత్తర కేరళలోని కన్నూరు జిల్లాలో కొట్టియూరులో సెయింట్ సెబాస్టియన్ చర్చిలో వికార్‌గా, అనుబంధంగా వున్న ఐజెఎమ్ (ఇమ్మిగ్రేషన్ జూబిలీ మెమోరియల్ హైయర్ సెకండరీ స్కూలు) స్కూలుకి మేనేజరుగా 2014 నుంచి పని చేస్తున్న రాబిన్ వడకాంజెరీ గత నెలలో అరెస్టయ్యాడు. 48 ఏళ్ల యీ మతాధికారి ఆ స్కూలులో చదివే 16 ఏళ్ల స్టూడెంటును గర్భవతిని చేశాడు. కొన్నాళ్లకు ఆ అమ్మాయి కూతుపరంబా లోని క్రీస్తురాజ్ ఆసుపత్రిలో ఒక మగపిల్లవాణ్ని ప్రసవించింది. చిన్నపిల్లల సంక్షేమం గురించి ఏర్పడిన చైల్డ్‌లైన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ యీ అవివాహత మాతృమూర్తి గురించి పోలీసులకు తెలియపరిచింది. పోలీసులు ఆ గర్భానికి కారణం ఎవరంటూ విచారించబోయారు. అమ్మాయి చెప్పకపోతే కుటుంబాన్ని అడిగారు. ఈ రాబిన్ పైకి చాలా పెద్దమనిషిగా వుంటూ గ్రామంలో వున్న చాలామంది బీదవాళ్లకి సాయపడ్డాడు. అనేకమంది బీదబాలికలకు విదేశాల్లో ఉద్యోగాలు యిప్పించాడు. అతని గురించి చెడ్డగా చెపితే ఎవరూ నమ్మరన్న భయం ఒకటీ, చర్చి ఫాదిరీకి వ్యతిరేకంగా పోలీసులకు చెపితే చర్చి కక్ష కట్టి మతం నుంచి వెలివేస్తుందన్న భయం మరొకటి వెంటాడగా ఆ పిల్ల తండ్రి ఆ పాపం తన మీద వేసుకున్నాడు.
అతనలా చెప్పడానికి ఒప్పుకున్నందుకు రాబిన్ అతనికి రూ.10 లక్షలు రొక్కం యిచ్చాడు కూడా. పుట్టిన పది రోజులకు పిల్లవాణ్ని వైదిరి గ్రామంలోని అనాథాశ్రమంలో చేర్చి, పోలీసులు కూతుర్ని చెరిచిన నేరానికి తండ్రిని అరెస్టు చేయబోయారు. అప్పుడు ఆ పిల్ల ఉండబట్టలేక పోయింది. తన తండ్రిది ఏ తప్పూ లేదని, నేరమంతా రాబిన్దేననీ పోలీసులకు చెప్పివేసింది. అప్పుడు పోలీసులు రాబిన్‌ను వెంటాడారు. అతను యీ లోపున కెనడాకు పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 28న కోచీ ఎయిర్‌పోర్టుకి వెళుతూండగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి అదుపులో తీసుకున్నారు. మామూలుగా ఫాదిరీ జీతం నెలకు రూ.10 వేలుంటుంది. అలాటిది యితను తను చేసిన ఘోరనేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి రూ.10 లక్షలు ఎలా యివ్వగలిగాడు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం కావాలంటే అతనెంతటి ఘనుడో తెలుసుకోవాలి.
వైనాడు జిల్లాకు చెందిన రాబిన్ అక్కడ చర్చిలో పనిచేస్తూండగానే రైతుల సంక్షేమం కోసం అంటూ ఇండియన్ ఫార్మర్స్ మూవ్మెంట్ అని ఓ సంస్థ ప్రారంభించాడు. ఆ సంస్థ తరఫున మనంతవాడీలో ఇన్స్టంట్ కాఫీ కంపెనీ పెడతానంటూ రైతుల దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేశాడు. తర్వాత దాని సంగతి ఏమైందో ఎవరికీ తెలియదు. రాబిన్ ఢిల్లీలో ఓ చిన్న చర్చికు యిన్‌చార్జిగా తేలాడు. అతనికి ముందు నుంచి వాక్చాతుర్యం వుంది. దాన్ని మెరుగుపరుచుకోవడానికి ఢిల్లీలో వుండగా జర్నలిజం కోర్సు చేశాడు. చర్చి పెద్దలతో పరిచయాలు పెంచుకున్నాడు. తన చొరవతో సంఘంలో వున్న పెద్దలతో కూడా సంబంధబాంధవ్యాలు పెంచుకున్నాడు. ఇతన్ని చూసి ముచ్చటపడిన కంజీరపల్లి బిషప్‌గా పనిచేసిన మాత్యూ ఆరక్కల్ కేరళలో చర్చి నడుపుతున్న జీవన్ టీవీని, దీపికా దినపత్రిక నిర్వహణను చూసుకోమని అనడంతో మళ్లీ కేరళకు వచ్చాడు.
కొటాయం నుంచి నడిచే ''దీపికా'' కేరళలో అతి పురాతనమైన దినపత్రిక. 1887లో చర్చి చేత ప్రారంభింపబడిన యీ పత్రిక మతపరమైన విషయాలనే కాక, సామాజికపరమైన రాజకీయపరమైన విషయాలను కూడా చర్చిస్తూ వచ్చింది. 1958-59లో కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని రద్దు చేయాలని కాంగ్రెసువారు విమోచన సమరం నిర్వహించినప్పుడు చర్చి, దానితో బాటు యీ పత్రిక ఆ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాయి. చివరకు కేంద్రంలో నెహ్రూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కాలక్రమంలో పత్రికకు ఆదరణ తగ్గి నష్టాలు పెరిగి, దాని నిర్వహణ పోనుపోను చర్చి మిషనరీలకు భారంగా తోచసాగింది. 1989లో రాష్ట్ర దీపిక ప్రై. లి. అనే పేర లిమిటెడ్ కంపెనీ ఏర్పరచి, దానిలో డైరక్టర్లుగా కేథలిక్కులు కాని వారిని కూడా తీసుకున్నారు. కొత్తగా నిధులు వచ్చినా పత్రిక స్థితి మెరుగుపడలేదు. ఆ పరిస్థితుల్లో మాత్యూ ఆరక్కల్ 2004లో రాబిన్‌కు దీన్ని అప్పగించాడు. రాబిన్ తమిళనాడుకు చెందిన ఫారిస్ అబూబకర్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ. 2 కోట్లు ఋణం ఏర్పాటు చేశాడు. దానికి గాను ఆబూబకర్ను ఎడిటోరియల్ బోర్డులోకి తెచ్చాడు.
ఆ తర్వాత అతను రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి, ఆ కంపెనీకి చైర్మన్ అయిపోయాడు. ఆ విధంగా దీపికకు తొలిసారిగా నాన్-కాథలిక్, నాన్-క్రిస్టియన్ చైర్మన్-ఎడిటరు వచ్చాడు. ఆబూబకర్ చైర్మనే కానీ సమావేశాలకు పెద్దగా వచ్చేవాడు కాదు. రాబిన్ అతని తరఫున అతని ఆదేశాలను తుచ తప్పకుండా పాటించేవాడు. ఈ క్రమంలో దీపిక పత్రిక తన స్వభావాన్నే మార్చుకుంది. చర్చి, దీపిక పత్రిక ఎప్పుడూ కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవి. అలాటిది, ఆబూబకర్ వచ్చాక అది సిపిఎంలో పినరాయ్ విజయన్ వర్గానికి కొమ్ము కాయడం మొదలుపెట్టింది. అప్పట్లో ఎల్డిఎఫ్ ముఖ్యమంత్రిగా వున్న విఎస్ అచ్యుతానందన్ కూడా సిపిఎం వాడే. అతనికి విజయన్‌కు పడదు కాబట్టి, అచ్యుతానందన్ విధానాలను విమర్శిస్తూ దీపిక పత్రిక వారానికి రెండు, మూడు సంపాదకీయాలు వేసేది.
ఇలా నడుస్తూ వుండగా 2006 జూన్‌లో సింగపూర్‌లో వుండే ఒక హెల్త్ ఆర్గనైజేషన్ ఆబూబకర్పై రూ. 35 కోట్లకు కేసు వేస్తోందన్న వార్త వచ్చింది. భారతదేశంలో వున్న నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు ఆ ఆర్గనైజేషన్ నిధులు యిచ్చేది. ఆ సంస్థ సిఇఓ టిటి దురై నిధుల దుర్వినియోగం చేశాడని, ఆబూబకర్ మిత్రుడు కాబట్టి ఉత్తుత్తి ప్రాజెక్టుల పేరు చెప్పి ఆబూబకర్ ఆ సంస్థ నుంచి డబ్బులు తీసుకున్నాడని అభియోగం. ఇది బయటకు రాగానే చర్చికి దిగులు పట్టుకుంది. ఇలాటివాడు తమ పత్రికకు చైర్మన్‌గా వుంటే తమ పరువు ఏం కాను అనుకుంది. అతన్ని ఎలాగైనా ఒప్పించి బయటకు పంపాలని రాబిన్‌ను కోరింది. అప్పుడతను ఆబూబకర్‌తో చర్చలు జరిపి పత్రికను మళ్లీ చర్చికి అప్పగించమన్నాడు. అతను అడిగినంత యివ్వడానికి చర్చి దగ్గర డబ్బు లేకపోవడం చేత కొచ్చిన్‌లోని భూమి, 8 అంతస్తుల బిల్డింగు అమ్మవలసి వచ్చింది. ఈ విధంగా 2010లో చర్చికి పేపరు తిరిగి వచ్చింది. వాళ్లు రాబిన్‌ను మేనేజింగ్ డైరక్టరు పదవి నుంచి తప్పించి మనంతవాడీకి మతాధికారిగా పంపారు. 2014లో అతను ప్రస్తుతం వున్న చర్చికి వచ్చాడు. ఆబూబకర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసినందుకు అతనికి రూ. 2 కోట్లు దక్కాయని వినికిడి. అందుకే అతను అమ్మాయి కుటుంబం నోరు నొక్కడానికి రూ.10 లక్షలు యివ్వగలిగాడు.
ఈ నేరాన్ని కామాపు చేయడంలో అతనికి సహకరించినవారు కూడా వున్నారు. వైనాడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్‌గా వున్న ఫాదర్ జోసెఫ్ తెరకమ్, అదే కమిటీలో సభ్యురాలిగా వున్న సిస్టర్ బెట్టీ, హోలీ ఇన్ఫాంట్ మేరీ ఆర్ఫనేజ్‌లో పనిచేసే సిస్టర్ ఒఫీలియా, మదర్స్ ఫోరమ్‌లో పనిచేసే తంగమ్మ వీరందరూ బాధితురాలు మేజరు అని నమోదు చేసి కేసు లేకుండా చేద్దామని చూశారు. మైనరు బాలికతో రతికలాపం నేరమవుతుంది కానీ బాలిక మేజరైతే ఆమె యిష్టప్రకారం పాల్గొంది అనవచ్చు. వీళ్లందరూ ఆమె కుటుంబం ఆమెకు 18 ఏళ్లని చెప్పిందని, దాన్ని తాము నమ్మామని చెప్పుకున్నారు. కానీ పోలీసులు వీళ్ల మాట విశ్వసించలేదు, కేసు పెట్టారు. వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. వాళ్లని లొంగిపోమని కోర్టు సలహా యిచ్చింది. వాళ్లు బెయిలు అడిగితే యిమ్మనమని దిగువ కోర్టుకి సలహా యిచ్చింది.
ఇంత ఘోరం జరిగినా కాథలిక్ సభ బాధితురాలిదే తప్పన్నట్లు ప్రవర్తిస్తోంది. వారు ప్రచురించే ఒక ''సండే షాలోమ్'' అనే మ్యాగజైన్ ''ఆమెకు 15 ఏళ్లు దాటాయి. మతాధికారి తన స్థానాన్ని మర్చి ప్రవర్తించబోయినా, ఆమె అతన్ని ఆపి వుండవచ్చు, అతని ప్రవర్తనను సరిదిద్ది వుండవచ్చు.'' అని వ్యాసం ప్రచురించింది. బిషప్స్ కౌన్సిల్‌కు చెందిన ఫాదర్ పాల్ తెలికాట్ 'ఇలాటి నేరాలకు కారణం – కన్స్యూమరిజం (వస్తువ్యామోహం), భోగలాలసత. అన్ని రకాల యాడ్స్‌లో స్త్రీని భోగ్యవస్తువుగా చూపిస్తున్నారు. దాంతో బ్రహ్మచర్యం పాటించే పూజారులు కూడా చలిస్తున్నారు. కానీ అందరు పూజారులు రాబిన్ వంటి వారు కారు. ఈ దేశంలో 19,946 కాథలిక్ మతాధికారులున్నారు. కేరళలో 9033 మంది వున్నారు. వీరిలో కొందరే యిలా భ్రష్టులవుతున్నారు. కొంతమందే చేసినా నేరం నేరం కాకపోదు.' అన్నారు.
ఈయన యిలా అన్నా కేరళ చర్చి యిలాటి పతితుల నెందరినో వెనకేసుకుని వచ్చింది. ప్రపంచంలో అనేక చర్చిల్లో యిదే తంతు సాగడంతో సాక్షాత్తూ పోప్యే వీటి గురించి ప్రస్తావించవలసి వచ్చింది. రాబిన్ వంటి మరికొందరి గురించి మరో వ్యాసంలో…
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]