వంద రోజుల్లో ఫలితాలు చూపించడం ఎవరికైనా కష్టమే. అయినా మీడియా అలాటి లెక్కలు వేస్తూ వుంటుంది, ప్రతిపక్షం ఏమీ చేయలేదని పెదవి విరుస్తూ వుంటుంది. దాన్ని తిప్పి కొట్టడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనే ఓ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి ప్రభుత్వపు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశాడు. తనకు కుడిపక్క సీనియర్ మోస్ట్ బిజెపి మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సేను, ఎడమపక్క సీనియర్ శివసేన మంత్రి దివాకర్ రౌతేను కూర్చోబెట్టుకున్నాడు. వీళ్లిద్దరినీ ఎంచుకోవడానికి కారణాలున్నాయి. ఏక్‌నాథ్ తనే ముఖ్యమంత్రి అవుదామనుకున్నాడు. అతన్ని చల్లార్చడానికి రెవెన్యూతో సహా ఏకంగా 12 శాఖలు యిచ్చారు. అయినా ముఖ్యమంత్రి తనకు తగిన గౌరవం యివ్వటం లేదనికి అతని కినుక. తనకు తెలియకుండా తన శాఖలో అధికారులను బదిలీ చేశారన్న అలకతో యిటీవల కాబినెట్ మీటింగుకు గైరుహాజరయ్యాడు. 'అబ్బే ఆయనకు అవేళ ఒంట్లో బాలేదు' అని చెప్పుకున్నాడు ఫడ్నవీస్. ఇక శివసేనకైతే చాలా ఫిర్యాదులే వున్నాయి. '1995-99 నాటి గత సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి మా జూనియర్ పార్ట్‌నర్. అయినా బాల ఠాక్రే మాతో సమానంగా వారిని చూశారు.
ఇప్పుడు మేం బిజెపి స్థానంలోకి వచ్చాం. ఆ నాటి గౌరవమర్యాదలను యిప్పుడు మేం ఆశిస్తే తప్పేమిటి?' అంటుంది నీలమ్ గోఢే అనే శివసేన ఎమ్మెల్యే. కరువు పరిస్థితిపై ప్రభుత్వ అలసత్వాన్ని శివసేన పార్టీకి చెందిన పర్యావరణ మంత్రి రామదాసు కదమ్ బాహాటంగా విమర్శించాడు. దానితో బాటు తనకు యిచ్చిన శాఖపై, కేటాయించిన ఛాంబర్‌పై కూడా అసంతృప్తి వెళ్లగక్కాడు. రవాణా మంత్రి రౌతే విదర్భకు చెందిన రైతు నాయకుడు. రైతు ఆత్మహత్యల గురించి జిల్లా కలక్టరు కంటె ముందుగానే అతనికి తెలిసిపోతుంది. తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని కాంగ్రెసు-ఎన్‌సిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు అవే విమర్శలు బిజెపి ప్రభుత్వంపై చేస్తున్నాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విదర్భలో శివసేన బాగా దెబ్బ తింది. అక్కడ పార్టీ బలం పుంజుకోవాలంటే యిలాటి యిమేజి మేన్‌టేన్ చేయడం అత్యవసరం. ఫడ్నవీస్ తనపై అలిగిన యీ యిద్దరు మంత్రులను ఎడాపెడా కూర్చోపెట్టుకుని తను ఏం సాధించాడో మీడియాకు చెప్పాడు.
కరువు పరిస్థితులను నివారించడానికి జలయుక్త శివర్ అభియాన్ అని పల్లెటూళ్లలో చెఱువులు పునరుద్ధరించే కార్యక్రమానికి రూ. వెయ్యి కోట్లు ప్రకటించాడు. ఇది కాంగ్రెసు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదలుపెట్టినదే. ఇతను దాన్ని విస్తరించి మొత్తం 5 వేల గ్రామాల్లో అమలు చేస్తాడట. పరిశ్రమలు ఆకర్షించడానికై సత్వర చర్యలు తీసుకుంటున్నానన్నాడు. షిండ్లర్ గ్రూపువారు తలపెట్టిన ఎస్కలేటర్ ప్లాంట్ చాలా సంవత్సరాలుగా ఆగిపోయింది. దాన్ని వెంటనే క్లియర్ చేసి ఇటీవల దావోస్‌లో జరిగిన ఎకనమిక్ ఫోరంకు వెళ్లినపుడు ఆ గ్రూపు మేనేజ్‌మెంట్ ఫైనల్ లెటర్ ఆఫ్ ఎప్రూవల్‌ను చేతికి అందించాడట. నాగపూర్‌లో సియట్ వాళ్లు పెడదామనుకున్న టైర్ల ఫ్యాక్టరీకి రికార్డు టైములో 23 రోజుల్లో అనుమతి యిచ్చేశాడట. ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే 75 అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని 25కి యితను కుదించాడు.
బాంద్రా-కుర్లా కాంప్లెక్సు వంటి బిజినెస్ డిస్ట్రిక్ట్సును ముంబయిలో యితర ప్రాంతాల్లోను, యితర పట్టణాల్లోనూ మొత్తం 25 అభివృద్ధి చేస్తానంటున్నాడు. వీటిపై స్పందన అడిగితే కాంగ్రెసు వాళ్లు 'ఇవన్నీ మా ప్రాజెక్టులే. మేం ప్లాన్లు వేసి అన్నీ సిద్ధం చేశాం. ఇతను వచ్చి తనే ఏదో సాధించినట్టు చెప్పుకుంటున్నాడు. ప్రతిపక్షంలో వుండగా మమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి టోల్ తీసేస్తామనీ, స్థానిక సంస్థల పన్ను తీసేస్తామనీ అన్నారు. ఇప్పుడు వాటి గురించి నోరెత్తటం లేదు. ఇక పారిశ్రామిక ప్రగతి గురించి చెప్పేదంతా అసత్యాలే. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తరలిపోతున్నాయి. పాల్‌ఘర్ నుంచి కోస్టల్ గార్డ్ హబ్ పోర్‌బందర్‌కు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ అహ్మదాబాదుకు వెళ్లిపోయాయి. జెఎన్‌పిటి రేవు వద్ద కార్గో రవాణా గుజరాత్ రేవులకు వెళ్లిపోతున్నాయి.' అన్నారు. ఎన్‌సిపి వాళ్లు 'రాష్ట్రంలో భీకరమైన కరువు పరిస్థితులున్నాయి. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు' అన్నారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)