మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ సహచరుల వలన యిబ్బందులు పడుతున్నారు. మంత్రుల విద్యార్హతల గురించి చాలా రాష్ట్రాలలో వివాదం చెలరేగుతోంది. దొంగ డిగ్రీ కేసులో ఢిల్లీ మంత్రిని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో వుండే పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఫడ్నవీస్ కాబినెట్‌లో వాటర్ సప్లయి మినిస్టర్ బాబన్‌రావ్ లోనికర్ ఎంతవరకు చదివారన్నదానిపై యిప్పుడు చర్చ జరుగుతోంది. 2004 ఎన్నికల సమయంలో యిచ్చిన అఫిడవిట్‌లో తను బిఎ (ఫస్ట్ ఇయర్) అని రాసుకున్నాడు. 2014 వచ్చేసరికి తను అయిదో క్లాసు వరకే చదివానని రాసుకున్నాడు. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపడుతూండగానే యింకో విషయాన్ని కాంగ్రెసు అధికార ప్రతినిథి సచిన్ సావంత్ బయటపెట్టారు. తన వెబ్‌సైట్‌లో బియ్యే చదివానని రాసుకున్నాడని! కాంగ్రెసు నిలదీసేటప్పటికి లోనికర్ ''నేను ఐదవ క్లాసు వరకే చదివాను. కానీ 2004లో యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో బిఏకు పేరు నమోదు చేసుకున్నాను. అందుకని అప్పుడలా రాశాను.
బియ్యే పరీక్ష ఫెయిలయ్యాను కాబట్టి 2014 నాటికి 5 వ క్లాసే రాసుకున్నాను. తప్పేముంది?'' అని జవాబిచ్చారు. ఐదో క్లాసు వాళ్లు కూడా డిగ్రీ పరీక్షకు కూర్చోనిచ్చే యూనివర్శిటీలున్నాయేమో తెలియదు. విద్యామంత్రి వినోద్ తావ్‌డేకు వున్న బిఇ (ఎలక్ట్రానిక్స్) కూడా యిలాటిదే అని ఒక మరాఠీ టీవీ ఛానెల్ బయటపెట్టాక ఆయన సమాధానం – ''1980లో నేను ధ్యానేశ్వర్ విద్యాపీఠ్‌లో నాలుగేళ్ల యింజనీరింగు కోర్సులో చేరినప్పుడు రెండేళ్లపాటు థియరీ చెప్తామని, యింకో రెండేళ్లు ప్రాక్టికల్ ట్రైనింగ్ వుంటుందని, తమ యూనివర్శిటీకి గుర్తింపు లేదని చెప్పారు. నాకు అభ్యంతరం లేదు కాబట్టి అలాగే చదివి డిగ్రీ తెచ్చుకున్నాను.'' గుర్తింపు లేని యూనివర్శిటీ యిచ్చిన డిగ్రీని విద్యార్హతగా ఎలా చూపుకుంటారో విద్యామంత్రి కాబట్టి ఆయనే చెప్పాలి.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిణి పంకజా ముండేపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆహారంగా యివ్వడానికి చికి (వేరుశెనగ, బెల్లం అచ్చు), పుస్తకాలు, పరుపులు, వాటర్ ఫిల్టర్లు కొనడానికి ఈ-టెండర్లు పిలవకుండానే, బిడ్డింగ్ పద్ధతి అవలంబించకుండా రూ. 206 కోట్లు శాంక్షన్ చేసిందని ఆమెపై అభియోగం. ఫిబ్రవరి 13 న 24 ప్రభుత్వ తీర్మానాలు జారీ చేసి, మూడు రోజుల్లో తనకు కావలసివారికి రేటు కాంట్రాక్టులు కట్టబెట్టేసిందామె. అదేమిటంటే, ''కేంద్ర నిధులు మార్చి 31 లోగా మురిగిపోతాయి. అవి వృథాగా పోకుండా త్వరగా చేసేశా'' అంది. కాంట్రాక్టులు దక్కించుకున్నవారిలో 2013లో బ్లాక్ లిస్టు కాబడిన ఎన్‌జిఓకూడా వుందని కాంగ్రెసు అంటోంది. ఇదంతా బయట పెట్టినది పంకజ కజిన్, ఎన్‌సిపి నాయకుడు ధనంజయ్ ముండే. అతను ముఖ్యమంత్రికి లేఖ రాసి చర్య తీసుకోమని కోరాడు. పంకజను సమర్థిస్తూ బిజెపి అధికార ప్రతినిథి మాధవ్ భండారి ''రేటు కాంట్రాక్టులు మానేసి ఈ టెండరింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్ 17 న తీర్మానించింది.
దానికి రెండు నెలల క్రితమే పంకజ యీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆమె తప్పు చేయలేదు.'' అన్నారు. కానీ పంకజపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ ''నేను అధికారంలోకి వచ్చేముందు రూ.50 లక్షలకు మించిన టెండర్లన్నింటికి ఈ బిడ్డింగ్ జరగాలనే నియమం వుండేది. నేను దాని పరిమితిని రూ. 10 లక్షలకు తగ్గించాను. బిజెపి ఇంకా తగ్గించి రూ. 3 లక్షలు చేసింది.'' అంటున్నారు. ఆయన వాదన ప్రకారం పంకజ రూ. 206 కోట్ల ఆర్డరు యిచ్చేనాటికి రూ. 10 లక్షలకు మించిన కొనుగోళ్లను ఈ – టెండరు ద్వారా పిలవాలన్న రూలు వుండివుండాలి. కానీ పంకజ – 'నేను కొత్తగా టెండర్లను పిలవలేదు. అమలులో వున్న టెండర్లకు కొనసాగింపుగానే యివి యిచ్చాను. ఆ కాంట్ట్రార్లు కూడా కాంగ్రెసు-ఎన్‌సిపి హయాంలో రూ.114 కోట్ల కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్లే' అని వాదిస్తోంది. పాత హయామంతా అవినీతిమయమని ఎన్నికలలో ప్రచారం చేసిన బిజెపి నాయకులే యిప్పుడిలా మాట్లాడుతున్నారు. దీనిపై కాంగ్రెసు పార్టీ జూన్ 24న ఎసిబి వద్దకు ఫిర్యాదు చేసింది కాబట్టి వారు విచారణ చేస్తే వాస్తవమేమిటో తేలుతుంది.
వీరందరి కంటె ఎక్కువ తలనొప్పి కలిగిస్తున్నది ఏకనాథ్ ఖాడ్సే. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి ఆపై నిరాశపడిన వారిలో అతను ప్రథముడు. రెవెన్యూ, అగ్రికల్చర్ వంటి అనేక ముఖ్యమైన శాఖలు అతని చేతిలో వున్నాయి. అతను తన రెవెన్యూ శాఖలో వందలాది అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తే ఫడ్నవీస్‌కు నచ్చలేదు. ఈ బదిలీలన్నీ తనకు చెప్పి చేయాలని ఆదేశం జారీ చేస్తూ, అతని శాఖలో కొంతమంది అధికారులను అతనికి చెప్పకుండా బదిలీ చేశాడు. దాంతో చిర్రెత్తిన ఖాడ్సే తన గది బయట ''బదిలీలకు సంబంధించిన పని మీదైతే నా వద్దకు రాకండి'' అని బోర్డు పెట్టించాడు. అంతేకాదు, ఈ మధ్య మాల్వానీలో నకిలీ మద్యం తాగి కొంతమంది చనిపోతే ముఖ్యమంత్రి చూస్తున్న హోం శాఖదే బాధ్యత అని ప్రకటన చేశాడు. ముఖ్యమంత్రి పదవి అంటే ముళ్ల కిరీటమని ఫడ్నవీస్‌కు అర్థమవుతూ వుంటుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)