గాంధీని ఎందుకు కలవాలి? ఆయన మంత్రికాడు, అధికారి కాడు, ఈయనకు సీనియర్ అయిన న్యాయాధీశుడు కాడు, యిలాటి వ్యవహారాల హేండిల్ చేయడంలో అనుభవజ్ఞుడు కాడు (అసలు యిలాటి సమస్యే అప్పటిదాకా రాలేదు), ఖోస్లాగారికి పరిచయస్తుడు, బంధువు, ఆధ్మాత్మిక గురువు ఏమీ కాడు. ఇలా యిలా చేయి అని గాంధీ ఆర్డర్లు యివ్వడం కానీ, ఈయన వాటిని తుచ తప్పకుండా అమలు చేయడం కానీ జరగదని తెలుసు. మరెందుకు కలవడం అంటే ఏదైనా ధర్మసంకటం వచ్చినపుడు, మనోవైక్లబ్యం కలిగినపుడు గాంధీని కలిస్తే మార్గం తోస్తుందేమోనని ఒక జడ్జిగారు సైతం అనుకున్నాడని గమనించాలి. ప్రస్తుత సమాజంలో అలా మార్గదర్శనం చేసే నాయకులే కరువయ్యారు. సైకియాట్రిస్టు మీ సమస్యలకు పరిష్కారం చెప్పడు, పరిష్కారం కనుగొనే శక్తి మీలోనే నిబిడంగా వుంటే దాన్ని జాగృతం చేస్తాడు. ఇప్పటి మన నాయకులు ఆ పని చేసినా చాలు.
ఖోస్లాగారు గాంధీగారి సెక్రటరీకి ఫోన్ చేసి తనెవరో చెప్పి అపాయింట్‌మెంట్ కోరారు. మర్నాడు ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. లోపలికి వెళ్లబోయే ముందు ఆయనతో ఎలా మాట్లాడాలి అని సెక్రటరీని సలహా అడిగాడు. ''ఎవరైనా తనను మహాత్మా అని సంబోధిస్తే ఆయనకు నచ్చదు, బాపూజీ అంటే చాలు. ఇంగ్లీషులో కంటె హిందీలో మాట్లాడితే ఆనందిస్తారు.'' అని చెప్పాడతను. ఖోస్లాగారికి హిందీ కంటె ఇంగ్లీషే బాగా వచ్చు. అందువలన తను చెప్పదలచిన మాటలను హిందీలో ఒకసారి అనుకుని చూసుకుంటూ రిహార్సల్ వేసుకుంటూ వుండగా సరిగ్గా 11 గంటలకు పిలుపు వచ్చింది. గాంధీ నేలమీద పరిచిన తివాచీపై కూర్చుని రాసుకుంటున్నాడు. బాగా సన్నగా వున్నా నీరసంగా ఏమీ లేడు. నవ్వినప్పుడు తప్ప మొహం మీద ముడతలు లేవు. ఖోస్లాను చూడగానే చేతులు జోడించి నమస్కారం పెట్టి పక్కన కూర్చోమన్నాడు. గాంధీతో ఎవరైనా మాట్లాడితే ఆయన వర్చస్సును చూసి, మాటల మాయలో పడిపోతారని, ఆ భయంతోనే వ్యక్తిగతంగా కలవడానికి ఇంగ్లీషువారు కూడా యిష్టపడేవారు కాదనీ ఖోస్లా వినివున్నాడు. అలాటిది తన విషయంలో ఏదీ జరగకూడదని మనసును దృఢపరచుకుని మరీ వెళ్లాడు. అయితే గాంధీ అలాటి మ్యాజిక్ ఏమీ చేయలేదని, తను చెప్పినది మధ్యలో అడ్డు తగలకుండా శ్రద్ధగా విని ఓపిగ్గా సమాధానం యిచ్చాడని ఆయన రాసుకున్నాడు. దాదాపు పావుగంట చెప్పేసరికి ఖోస్లాగారికే తన మనస్సులో ఒక క్లారిటీ రాసాగింది. ఆ థలోనే ''ఓల్డ్ ఫోర్ట్ క్యాంప్‌లో వున్న ముస్లిములు తమకు యీ దేశంలో వుండాలన్న కోరిక లేదని, సాధ్యమైనంత త్వరలో పాకిస్తాన్ వెళ్లిపోతామని నాతో చెప్పారు. ఇటు చూస్తే మనవాళ్లు యిల్లూ వాకిలీ లేకుండా అఘోరిస్తున్నారు. ఈ చలిలో వాళ్లు పడే అవస్థలు చూస్తూంటే నా గుండె తరుక్కుపోతోంది. నేనేం చెయ్యాలో చెప్పండి, బాపూ'' అని అడిగాడు.
గాంధీ మెల్లగా, వాస్తవిక ధోరణిలోనే అన్నాడు – ''మరి నేను వెళ్లినపుడు నాతో అలా చెప్పలేదే! 'మా యిళ్లల్లో మేం సురక్షితంగా వుండే పరిస్థితి మీరు కల్పించలేనప్పుడు మమ్మల్ని అఫ్గనిస్తాన్, ఇరాన్, అరేబియా.. ఎక్కడికైనా పంపేయండి, పాకిస్తాన్‌కు మాత్రం పంపకండి' అన్నారు. ఈ శిబిరాల్లో వున్నవారు కూడా 'మనవాళ్లే' (ఖోస్లా హిందూ, శిఖ్కు శరణార్థులను మాత్రమే మనవాళ్లుగా పేర్కొన్న విషయం గాంధీ దృష్టిని దాటిపోలేదు)! వాళ్లను వాళ్ల యిళ్లకు చేర్చి రక్షించడం మీ బాధ్యత.'' ఈ మాటలను ఒక ఆదేశంగా కాకుండా, వినయంతో, నిజాయితీతో పలికే హితవుగా గాంధీ పలికారని ఖోస్లా రాశారు. ''అది మీరు చెప్పినంత సులభం కాదు.'' అంటూ ఆ ప్రక్రియలో వున్న యిబ్బందులు ఏకరువు పెట్టానని, కానీ గాంధీ తన వాదనలో వున్న లోపాలను ఎత్తి చూపారని, ఆయన చెప్పిన పరిష్కారం నేలవిడిచి సాము చేసినట్లు కాకుండా ఆచరణాత్మకంగా వుందని ఖోస్లా రాశారు. 'ఆ తర్వాత గాంధీ మాట్లాడుతూ వుంటే నాకు ఒక విషయం స్పష్టమైంది. ఈ మనిషికి ఒకటే సెంటిమెంటు, ఒకటే అనుభూతి – అందరి పట్లా ప్రేమ. ఈయన బలానికి మూలం అదే. హిందువులు, ముస్లిములు, శిఖ్కులు, క్రైస్తవులు, మనల్ని తరతరాలుగా అణిచివేసిన బ్రిటన్, లక్షలాది మంది హిందువులను తరిమివేసిన పాకిస్తాన్ – అందరూ యీయనకు సమానమే. అందరి పట్ల సమానమైన వాత్సల్యం. ఒక్కసారి కూడా ప్రేమ, అభిమానం వంటి మాటలు ఉచ్చరించలేదు. కానీ ఆయన చూపులోని మెత్తదనం, పెదాలపై చిరునవ్వు ఛాయ అవే చాటి చెప్పాయి. ఆ కోణంలో ఆలోచించలేనందుకు నేను సిగ్గుపడ్డాను.' అని ఖోస్లా తన పుస్తకంలో రాశారు.
దీని తర్వాత ఆ సమస్య ఎలా పరిష్కారమైందో, ఎంతమందికి యిళ్లు యిచ్చారో, ఎంతమంది వుండిపోయారో, వెళ్లిపోయారో ఆ చరిత్ర నేను చదవలేదు. కానీ గాంధీ వ్యక్తిత్వాన్ని యీ సంఘటన తెలియపరుస్తుంది. ఈ యింటర్వ్యూ 1948 జనవరిలో గాంధీ హత్యకు నాలుగు రోజుల ముందు జరిగింది. ఢిల్లీలో ఆనాటి ఉద్రిక్త పరిస్థితులు ఎలా వున్నాయో అర్థం చేసుకోవడానికి యిది ఉపకరిస్తుంది. ఢిల్లీలో పరిస్థితులు యింత భీకరంగా వుండగా, హిందూ, శిఖ్కు శరణార్థుల హాహాకారాలతో దేశరాజధాని దద్దరిల్లుతూండగా రూ. 55 కోట్ల సమస్య వచ్చింది. దానిపై గాంధీ వ్యవహరించిన తీరు కాంగ్రెసు నాయకులకే రుచించలేదు. అప్పటికే కుతకుతలాడుతున్న గోడ్సేకు యిది 'లాస్ట్ స్ట్రా ఆన్ ద కామెల్స్ బాక్' (నడుం విరిగి వున్నవాడిపై మరో బండ పడేసినట్లు) అయింది, హత్యకు ప్రేరేపించింది. ఇది అతి ముఖ్యమైన విషయం కాబట్టి దీనిపై విస్తారంగా చర్చించవలసిన అవసరం వుంది. దేశవిభజన సమయంలో చరాస్తుల పంపకాల విషయంలో రూ.55 కోట్లు భారతప్రభుత్వం పాకిస్తాన్‌కు యివ్వవలసి వచ్చింది. విభజన జరిగిన నాలుగు నెలలైనా యింకా పంపడం కుదరలేదు. ఇంతలో పాకిస్తాన్ పరోక్షంగా కశ్మీరుపై దాడి చేసింది.
కశ్మీరు వివాదమేమిటో యిక్కడ కాస్త చెప్తాను. బ్రిటిషువారు విడిచి వెళ్లిపోయేటప్పుడు 562 మంది సంస్థానాధీశులకు యిచ్చిన వరం ఏమిటంటే – వాళ్లు ఇండియాలోకాని, పాకిస్తాన్‌లో కానీ కలవవచ్చు లేదా స్వతంత్రరాజ్యంగా కూడా వుండవచ్చు. చిన్నవాళ్లు ఇండియాలో కలిసిపోయినా ఆ అవకాశాన్ని వినియోగించుకుని కొందరు పెద్ద రాజులు స్వతంత్రంగా వుందామని చూశారు. అయితే పటేల్ రెండేళ్లకు పైగా శ్రమపడి చాకచక్యంగా అందర్నీ ఇండియన్ యూనియన్‌లోకి లాక్కుని వచ్చాడు. అతి క్లిష్టమైన హైదరాబాదు సమస్యను పరిష్కరించిన పటేల్ కశ్మీర్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాడన్న అనుమానం వస్తుంది. వాస్తవం ఏమిటంటే కశ్మీర్‌ను భారత యూనియన్‌లో కలుపుకునే విషయంలో పటేల్‌కు సందేహాలున్నాయి. ఎందుకంటే కశ్మీరు లోయలోని ప్రజలు అప్పటికీ, యిప్పటికీ తాము భారతీయుల కంటె భిన్నమనీ అనుకుంటూ స్వతంత్రంగా వుండాలని కోరుకోవడమే! జనాభాలో అత్యధికులు ముస్లింలు కాగా, రాజు హిందువు. హైదరాబాదులో దీనికి విరుద్ధం. అక్కడి ప్రజల ఇండియాలో విలీనమవుతామని ఆందోళన చేశారు. దానికి భారతప్రభుత్వం మద్దతు యిస్తోంది. అదే లాజిక్‌తో కశ్మీరు ప్రజలు ముస్లిములు కాబట్టి తాము మద్దతు యిచ్చిన వాళ్లను పాకిస్తాన్‌లో కలుపుకోవాలని పాకిస్తాన్ ప్లాను వేసింది. మహారాజు హరిసింగ్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు షేక్ అబ్దుల్లా ప్రజల్లో పలుకుబడి వున్నవాడు. హరిసింగ్‌కు ఎటూ చేరకుండా స్వతంత్ర రాజ్యంగా వుందామన్న కోరిక వుంది.
1947 అక్టోబరులో కశ్మీరు పశ్చిమప్రాంతంలో పస్తూన్ గిరిజనులు దాడి చేసి ఆందోళనలు చేయసాగారు. వారికి పాకిస్తాన్ సహాయం చేస్తోందన్నది బహిరంగరహస్యం. కానీ యుద్ధప్రకటన లాటిదేదీ జరగలేదు. ఒక పక్క పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న దాడులు, మరో పక్క షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అల్లర్లు, చూసి హరిసింగ్ ఇండియా ప్రభుత్వాన్ని సైనికసాయం అర్థించాడు. అయితే ఇండియా పాకిస్తాన్‌ల మధ్య నాన్-యింటర్‌వెన్షన్ ఒప్పందం వుంది. 'మీరు మా దేశంలో విలీనం అయితే తప్ప మేం కలగజేసుకోం' అని చెప్పింది. మహారాజు తటపటాయిస్తూ వుండడంతో ఆ గిరిజనులు శ్రీనగర్ వరకు వచ్చేశారు. చివరకు దిక్కులేని పరిస్థితుల్లో మహారాజు భారత్‌లో విలీనం గురించి మౌంట్‌బాటెన్‌తో ఒప్పందంపై సంతకం పెట్టాడంతో భారతసైన్యం కశ్మీరులో అడుగుపెట్టి, నేషనల్ కాన్ఫరెన్స్ వాలంటీర్ల సహాయంతో పాక్ గిరిజనులను తరిమి కొడుతోంది.
ఇప్పుడీ డబ్బు యిస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ డబ్బుతో ఆయుధాలు కొని వాళ్లకు అందచేస్తుందని భారతప్రభుత్వ పాలకులకు తోచింది. దాంతో ఆ డబ్బు పంపకుండా తొక్కిపెట్టేశారు. లెక్కప్రకారం యివ్వవలసిన డబ్బు యిచ్చివేయకుండా అలా వ్యవహరించడం భావ్యం కాదని, మన ప్రభుత్వపు విశ్వసనీయతకే దెబ్బ అనీ, అంతర్జాతీయంగా మన పరువు మంటకలుస్తుందని గాంధీ చెప్పినా కాంగ్రెసు నాయకులు ఎవరూ వినలేదు. హోం మంత్రిగా వున్న సర్దార్ పటేల్ 1948 జనవరి 12 న పార్లమెంటులో యీ మేరకు ప్రకటన చేశారు కూడా. పటేల్ యీ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే గాంధీ ఆమరణ నిరాహారదీక్ష ప్రకటించాడు. రూ. 55 కోట్ల గురించి అని చెప్పకుండా 'ఢిల్లీలో హిందూ-ముస్లిం ఐక్యత మెరుగుపడి శాంతిభద్రతలు నెలకొనేందుకు…' అని కారణం చెప్పాడు. కలకత్తాలో యిలాటి దీక్ష ఫలించింది. ఆయుధాల విసర్జించారు. ఢిల్లీలో ఆయుధాలతో కలహించడాలు లేవు, ఉద్రిక్తత మాత్రం వుంది. మూడు రోజులు పోయేసరికి ప్రభుత్వం దిగివచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పి మొత్తం డబ్బును పాకిస్తాన్‌కు బదిలీ చేస్తున్నామని ప్రకటించింది. అదే రోజు గాంధీ నిరాహారదీక్ష విరమించాడు. మూడు రోజుల్లోనే ఐక్యత సాధించేశాడా? ఇది ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదని మెడకాయ మీద తలకాయ వున్న ప్రతీవాడికీ అర్థమైంది. ఇదే విషయాన్ని గోడ్సే తన వాఙ్మూలంలో ఎత్తి చూపాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)