ఎమ్బీయస్‌: గోడ్సే-35 ”నైన్‌ అవర్స్‌ టు రామా”5

మధ్యాహ్నం 2.50 గం|| హోటల్‌ రిసెప్షన్‌లో అడిగితే ఆమె గదిలో ఒంటరిగా వుందని, ఆమె భర్త టెన్నిస్‌ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నాడనీ తెలిసింది. రూముకి ఫోన్‌ కలిపారు. కొంతసేపు తటపటాయించి రాణి అతన్ని తన…

మధ్యాహ్నం 2.50 గం|| హోటల్‌ రిసెప్షన్‌లో అడిగితే ఆమె గదిలో ఒంటరిగా వుందని, ఆమె భర్త టెన్నిస్‌ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నాడనీ తెలిసింది. రూముకి ఫోన్‌ కలిపారు. కొంతసేపు తటపటాయించి రాణి అతన్ని తన రూముకి రమ్మనమంది. అతను రాగానే తన కోపాన్ని ప్రదర్శించింది. 'నువ్వెప్పుడూ బిజీయే, నా గురించి పట్టించుకోవు. నెలల తరబడి ఉలుకూ, పలుకూ వుండదు. దొరకవు. నిన్ను ప్రేమించడం నా బుద్ధితక్కువ' అని తిట్టిపోసింది. నాథూ అన్నీ సహించాడు. నిన్ను చూసి పోదామని వచ్చానంతే అన్నాడు. అతని ధోరణి చూడగా ఆమెకు అనుమానం వచ్చింది. నువ్వెందుకో కానీ నెర్వస్‌గా వున్నావ్‌. ఏమిటి సంగతి అని అడిగింది. 'ఏమీ లేదు, ఒక సంగతి చెప్పాలని వచ్చా..' అంటూ ఆమెను కౌగలించుకుని, తల ముద్దాడి 'నేను ఏ స్త్రీని ప్రేమిస్తానని ఎన్నడూ అనుకోలేదు. కానీ నిన్ను ప్రేమించాను, అది చెప్పాలనే..' అన్నాడు.

'నేను కూడా గాఢంగా ప్రేమిస్తున్నాను.' అని ఆమె గాఢంగా కౌగలించుకుంది. అతని నడుముకు వున్న తుపాకీ ఆమెకు తగిలింది. ఆమెకు సందేహం వచ్చింది. దానితో నీకు పనేముంది? ఢిల్లీకి వచ్చిన పనేమిటి? అని గుచ్చిగుచ్చి అడిగింది. మనిద్దరం కలిసి నడవాలి అంది. 'తప్పకుండా.. వచ్చే జన్మలో..' అని జవాబిచ్చాడు నాథూ. ఆమెకంతా అర్థమై పోయింది. 'ఓహో యీ జన్మలో ఆఖరి ఘడియలో నన్ను చూద్దామని వచ్చావు కదూ, నిన్ను పిచ్చిపనులేవీ చేయనివ్వను. నా భర్తకు యీ రోజే చెప్పేస్తాను విడాకులిస్తానని. మనిద్దరం పెళ్లి చేసుకుందాం…' అని ఆమె ఏదో చెప్పబోతూ వుండగా '..అది కుదరదు' అన్నాడు నాథూ. 

'ఓహో, భార్యగా నేను పనికిరాను కాబోలు' కన్నీళ్లు పెట్టుకుంది రాణి.

'పెళ్లంటూ చేసుకుంటే నిన్నే పెళ్లాడేవాణ్ని. కానీ పరిస్థితి విపులంగా చెప్తే తప్ప నీకు అర్థం కాదు' అంటూ నాథూ తమ ఉద్యమ లక్ష్యాల గురించి చెప్పసాగాడు. 

xxxxxxxxxxx

మధ్యాహ్నం 3.50 గం|| నాథూ ఎంత చెప్పినా రాణీ వినలేదు. ఇతను చెప్పినదంతా విని పకపకా నవ్వింది. ''మీ సంఘం వాళ్లకి వయసు వచ్చింది కానీ బుద్ధి ఎదగలేదు. బ్రిటిషు వాళ్లకు వ్యతిరేకంగా పోట్లాడినంతకాలం మిమ్మల్ని దేశభక్తులని అందరూ అన్నారు. ఇప్పుడు యీ పని చేస్తే అందరూ తిట్టిపోస్తారు. ఎవరికి వ్యతిరేకంగా మీ పోరాటం, నాథూ? ముస్లిముల పట్ల ఆదరం చూపినంత మాత్రాన వాళ్లు దేశద్రోహులవుతారా? నాన్సెన్స్‌. మీరు చంపేది మీలాగే దేశం కోసం పోరాడిన ఆయన్ని..! అసలిదంతా నిజమా, పెద్ద జోకా అన్నది నాకు అర్థం కావటం లేదు.'' అంది. 

'నీతో వాదించలేను' అని విసుక్కున్నాడు నాథూ. 

'ఎందుకు? చేతకాకనా?నువ్వు చేసేది తప్పని నీకే తెలుసు కాబట్టా?' రాణి కవ్వించింది.

నాథూకి కోపం వచ్చి చెయ్యెత్తాడు. 'కొట్టు, కొట్టడం దేనికి, తుపాకీ వుందిగా, తీసి కాల్చేయ్‌, దిగొచ్చాడు పెద్ద మొనగాడు. మా ఆయన వుంటే నిన్ను ఉతికేసి వుండేవాడు. ఎటొచ్చీ నేనేమైనా ఆయనకు అనవసరం. అందుకని వూరుకున్నా వూరుకుంటాడు.' ఆమె ఏడవసాగింది.

నాథూ ఆమెను దగ్గరకు తీసుకుని లాలించబోయాడు. 'నన్ను ముట్టుకోకు, అరుస్తా. అందరూ వస్తారు, నీ తుపాకీ చూసి పట్టుకుంటారు' అందామె. 'నా మాట విని యిదంతా వదిలిపెట్టేయ్‌, నన్ను చేపట్టు' అంది.

'నిన్ను వదిలిపెట్టడం నా ధర్మం', – 'నిన్ను ప్రేమించడం నా ధర్మం', 

'నీ ధర్మాన్ని వదిలిపెట్టమని నేననడగను. నా గురించి నువ్వు అడగవద్దు. నా పరిస్థితి ఏమిటో రేపు నీకు తెలుస్తుంది. రేపటిదాకా ఎందుకు యింకో గంటలో…' హఠాత్తుగా ఆగిపోయాడు. 'గంటలో ఏమవుతుంది?' రాణి ఆదుర్దాగా అడిగింది.

'నా మాతృభూమి గౌరవాన్ని నిలుపుతాను.'

'అంటే నువ్వు ఆ పెద్దాయనను.. నో, నో,.. ఆయన్నేం చేయకండి, ఆయన యోగి, పరమ సాధువు, పరిశుద్ధాత్ముడు.. ఆయనకు హాని చేసేవాళ్లను దేవుడు క్షమించడు' అరవసాగింది.

నాథూకి అర్థమైంది తను చేసిన పొరపాటేమిటో. పది రోజుల క్రితం జరిగిన హత్యాప్రయత్నం సంగతి ఆమెకు గుర్తుంది, దానికీ, దీనికీ ముడిపెట్టింది. తనను ఆపమని హోటల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి చెప్పేముందు పారిపోవాలి. చప్పున తలుపు మూసేసి, గబగబా పరుగులాటి నడకతో హోటల్‌ నుంచి బయటపడ్డాడు. టాక్సీని పిలిచి గుప్తా మందిరానికి పోనీయ్‌ అన్నాడు.

xxxxxxxxxxxxxxx

సాయంత్రం 4.10 గం|| తనను కలవడానికి శ్యామా ప్రహ్లాద్‌ వచ్చాడని విని పికె ఆశ్చర్యపడ్డాడు. వెంటనే లోపలకి రమ్మనమని సెక్రటరీకి చెప్పాడు. అతను రాగానే మర్యాదలు చేయబోతే ప్రహ్లాద్‌ వాటికిప్పుడు టైము లేదు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడదామని వచ్చాను అన్నాడు.

''ఏమిటి మా పార్టీలో చేరతావా?'' అడిగాడు పికె నవ్వుతూ.

''అది నీ పార్టీయే అయితే ఎప్పుడో చేరేవాణ్ని.. నీబోటి నిజమైన హిందూ అభిమానులకు అక్కడ ప్రాధాన్యత లేదు. అన్ని అర్హతలూ వున్నా ప్రధాని పదవికి దూరంగా వుంచారు.'' అన్నాడు ప్రహ్లాద్‌. 

''మాది జాతీయ పార్టీ, ప్రహ్లాద్‌, అన్ని మతాల వారినీ సమానంగా చూడాలి… తప్పదు కదా. ఇంతకీ నువ్వు చెప్పదలచినదేమిటి?''

''నువ్వూ నేనూ కలిసి ఒక జాతీయ హిందూ పార్టీ పెట్టాలనే ప్రతిపాదనతో వచ్చాను. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోవడం తథ్యం. మనం ముందే మేల్కొనడం మంచిది.''

''నువ్వు చెప్పేది జరగడానికి కనీసం 20 ఏళ్లు పడుతుంది..''

''.. 20 రోజులు చాలేమో''

పికె ఆశ్చర్యపడ్డాడు. 20 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందనడానికి కారణం ఏమిటో చెప్పమని గట్టిగా అడిగాడు. ''ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించడం వలన ప్రజలందరూ అసంతృప్తితో వున్నారు. ఇంగ్లీషువాళ్లు వెళ్లిపోతే సమస్తం మారిపోతుందని ఆశ పెట్టుకున్న జనాలు యిప్పటికీ వారిని నెత్తిన పెట్టుకుని వూరేగేవారిని చూస్తే మండిపడుతున్నారు. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వమని అర్థమైంది. ఏదైనా ఒక విశేషమైన సంఘటన జరిగితే చాలు. అగ్నిపర్వతంలా బద్దలవడానికి, తిరగబడడానికి సిద్ధంగా వున్నారు.''

''విశేష సంఘటనా? అది జరగడం, దానికి ప్రతిస్పందనగా ఆందోళన రేగడం, అంతా యిరవై రోజుల్లోగానా!? ఆశ్చర్యంగా వుందే!''

''పంచతంత్రం కథల్లో చదవలేదా? ముందుచూపవున్న చేప వేరే చెరువుకి వెళ్లిపోయి బతికింది. ఆలోచిస్తూ చివరిదాకా తాత్సారం చేసిన చేప గాలానికి చిక్కుకుంది. నేను చెప్పినదానిపై ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది.'' అని చెప్పేసి ప్రహ్లాద్‌ గదిలోంచి బయటకు నడిచాడు. అతను తలుపు తీస్తూండగానే పికె మెదడుకి ఏదో తట్టింది – 'ఇవాళ సాయంత్రం ఏదో జరగబోతోంది కదూ' అని అడిగాడు. ప్రహ్లాద్‌ వెనక్కి తిరగలేదు, కానీ అతని వెన్ను జలదరించినట్లు పికె గమనించాడు. 

సెక్రటరీని పిలిచి ''గుప్తా భవన్‌కు ఫోన్‌ చేసి నేను వచ్చేవరకు గాంధీజీని యింట్లోనే ఎలాగోలా వుంచమని చెప్పు, కారు పిలిపించు, నేను అక్కడకు వెళ్లాలి'' అని చెప్పాడు. జనవరి 20 నాటి బాంబు పేలుడు ఎవరో ఉన్మాది చేష్ట అనుకున్నాడు. పొద్దున్న దాస్‌ చెపుతున్నపుడు కూడా యివన్నీ అనవసర భయాలు అనుకున్నాడు. కానీ యిప్పుడు తెలుస్తోంది – దీని వెనక పెద్ద కుట్రే వుంది. అంతా పథకం ప్రకారం సాగుతోంది! (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives