జపాన్ సునామీ అయినా… విశాఖలో విలయం సృష్టించిన హుద్‌హుద్ తుపాను అయినా… నేపాల్‌లో సంభవించిన భూకంపం అయినా.. దేనికదే అత్యంత భయానకం. ఇదివరకటి రోజుల్లో మీడియా ఇంత యాక్టివ్‌గా లేదు. స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కూడా లేదు. దాంతో, ఏ చిన్న విషయం ఎక్కడ వింతగా జరిగినా, భయం గొలిపేలా వున్నా క్షణాల్లో అందరికీ అది చేరిపోతోంది.
నేపాల్‌ని కుదిపేసిన తీవ్ర భూకంపానికి సంబంధించి లెక్కకు మిక్కిలిగా వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దేనికదే అత్యంత భయానకంగా వుంటున్నాయి. ఫొటోలను మించి వీడియోలు, ప్రకృతి ప్రకోపాన్ని కళ్ళ ముందుంచుతోంటే, చూస్తున్నవారి కింద నేల నిజంగానే కంపించిపోతుందా.? అన్పిస్తోంది. అన్నట్టు, ఇలా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న వీడియోలు, ఫొటోల్లో కొన్ని ఫేక్ కూడా వుంటున్నాయనుకోండి.. అది వేరే విషయం.
లేటెస్ట్గా హియాలయా పర్వతాల్లో స్కీయింగ్ చేస్తున్న ఓ వ్యక్తి నెత్తిన హెల్మెట్‌కి వున్న కెమెరాలో భూకంపం సంభవించినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలు బంధింపబడ్డాయి. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అప్పటిదాకా వెన్నముద్దలా కనిపించిన మంచు, క్షణాల్లో ముక్కలు ముక్కలుగా విడిపోవడం, మంచు తుపాను పుట్టుకురావడం.. వెరసి అత్యంత భయానకం ఆ పరిస్థితి.
ఇదిలా వుంటే, నేపాల్ భూకంప మృతులు 10 వేలకుపైనే వుండొచ్చని నేపాల్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. శిధిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడ్తున్నాయి. మరోపక్క శకలాల వెలికి తీతకు, ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారుతోంది. ఎలాగో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ నేపాల్ ప్రజలు ఆహారానికే కాదు, మంచి నీటికీ అలమటిస్తున్నారు.