ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 16

ఇక సుహ్రవర్దీ జీవితంలో అత్యంత చీకటి అధ్యాయమైన 1946-47 మతకలహాలపై దృష్టి కేంద్రీకరిద్దాం. 1946లో బెంగాల్‌కు అతను ముఖ్య(ప్రధాన)మంత్రి అయ్యాడు. దేశంలో ఏకైక ముస్లిం లీగు ప్రభుత్వం అదే. 'దేశాన్ని చీలుస్తాం లేకపోతే నాశనం…

ఇక సుహ్రవర్దీ జీవితంలో అత్యంత చీకటి అధ్యాయమైన 1946-47 మతకలహాలపై దృష్టి కేంద్రీకరిద్దాం. 1946లో బెంగాల్‌కు అతను ముఖ్య(ప్రధాన)మంత్రి అయ్యాడు. దేశంలో ఏకైక ముస్లిం లీగు ప్రభుత్వం అదే. 'దేశాన్ని చీలుస్తాం లేకపోతే నాశనం చేస్తాం' అన్న జిన్నా బెదిరింపు అమలు చేయడానికి అవకాశం వున్న రాష్ట్రం బెంగాల్‌ ఒక్కటే. ఈ బెదిరింపుకు కారణం – వైస్రాయి లార్డ్‌ వేవెల్‌ కాంగ్రెసు సహాయంతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చూసాడు. పాకిస్తాన్‌ ఏర్పాటుకు కాంగ్రెసు ఒప్పుకోవటం లేదన్న కారణంగా జిన్నా అందులో చేరడానికి సిద్ధపడలేదు. బతిమాలడానికి వెళ్లిన నెహ్రూతో జిన్నా 'హిందూ, ఫాసిస్టు కాంగ్రెసు అధికార పీఠమెక్కి బ్రిటిషు తుపాకీల సహాయంతో ముసల్మానులను పాలిద్దామని చూస్తోంది.మా శక్తి మీకు తెలియచెప్పడానికి ఆగస్టు16న ప్రత్యక్ష చర్య చేపడుతున్నాం. ఆ నాటితో చట్టపరమైన విధానాలకు మేం సెలవు చెపుతున్నాం' అని విరుచుకుపడ్డాడు. ప్రత్యక్ష చర్య 'దినం' కలకత్తాలో నాలుగు రోజులు సాగింది. 5000 మంది (కొన్ని అంచనాల ప్రకారం 10 వేల మంది) మరణించారు, 1500 మంది గాయపడ్డారు. (ఆర్యసమాజ్‌ గణాంకాలు ఎక్కడివో వారికి తెలియాలి) ఈ ఘోరానికి బాధ్యత  సుహృవర్దీదే. పోలీసులను కలగచేసుకోవద్దన్నాడు. బెంగాలీ హిందువులు వూరుకోలేదు. తిరగబడి తమ తడాఖా చూపారు, వాళ్లు మెజారిటీలో ఉన్నారు కాబట్టి వారిదే పైచేయి అయింది. దానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని చూస్తున్న ముస్లిములకు నవ్‌ఖాలీ దొరికింది. తూర్పుబెంగాల్‌లో ముస్లిము మెజారిటీ ఉన్న జిల్లా నవ్‌ఖాలీ. అక్కడి ముస్లిములు హిందువులపై పెద్ద ఎత్తున దాడిచేసి అత్యాచారాలు జరిపేరు. కొంతమందిని బలవంతంగా మతం మార్పిడి కూడా చేయించారు.

గాంధీ ఇవన్ని చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఆరోగ్యం బాగాలేకున్నా 1946 నవంబరు నుంచి నాలుగు నెలలపాటు బెంగాల్‌లో బస చేసి ఇరుమతాల వారూ హింస మానేసి రాజీ పడాలని ఆయన నచ్చచెప్పాడు. ప్రజలు ఆయన మాటలకు స్పందించడం మొదలు పెట్టారు. కానీ ఇది లీగ్‌ నాయకులకు నచ్చలేదు. గాంధీ రాకను సుహృవర్దీ విమర్శించి తక్షణం బెంగాల్‌ విడిచి వెళ్లాలని డిమాండ్‌ చేసాడు. ఈలోగా నవ్‌ఖాళీలో హిందువులపై జరిగిన దానికి ప్రతీకారంగా బీహార్‌లో హిందూ రైతులు ముస్లిములను ఘోరంగా హింసించారు. అక్కడి పరిస్థితిని చల్లార్చడానికి 1947 మార్చిలో గాంధీ అక్కడకు ప్రయాణం కట్టాడు. ఈ విధంగా  విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు అహింసా మార్గం విడనాడకుండా చూడడానికి గాంధీ తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు. దేశవిభజన గురించి మాట్లాడిన నాయకులు ఎవ్వరూ శరణార్థుల సమస్యను ఊహించలేదు. ఎక్కడివారు అక్కడే ఉంటారని, పాలన మాత్రం మారుతుందని అనుకున్నారు. మతకలహాలు కూడా చల్లారిపోతాయని లెక్కవేసారు. కానీ జరిగింది వేరే. పాకిస్తాన్‌లోని ముస్లిమ్‌ ప్రజలు అక్కడి దుకాణాలు, ఆస్తులు అన్నీ తమవే అవుతాయని అనుకున్నారు. పాకిస్తాన్‌ ఏర్పడబోతున్నా, హిందువులు ఇంకా అక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటూ ఉండడం వారికి ఆశాభంగం కలిగించింది. 'మీరు ఇండియా పోవచ్చుకదా' అంటూ వారిపై దాడులు చేసేరు. అదే విధంగా 'మీరడిగిన పాకిస్తాన్‌ ఇచ్చేసినా మీరెందుకు ఇంకా ఇక్కడున్నారు? పొండి' అంటూ ఇండియాలోని ముస్లిములపై హిందువులు దాడులు చేశారు. 

మామూలు పరిస్థితులలో పౌరులు ఇటువంటి ఆటుపోటులకు నిలదొక్కుకునే వారే. కానీ సర్వసౌఖ్యాలు, భద్రత ఉన్న ప్రభుత్వోద్యోగులే మతపరంగా తరలిపోయారు. జిన్నా కోరికపై బ్రిటిషువారు సైన్యాన్ని కూడా ప్రాంతాలవారీగా చీల్చివేశారు. తమను ఆదుకునేవారెవరు లేరని భయపడిన సామాన్యులకు ఎదిరించే, తమాయించుకునే ధైర్యం చాలలేదు. తరలిపోవడం మొదలుపెట్టారు. వెళ్లేవారి ప్రాణ, మాన, ధనాలను దోచుకోవడం విచ్చలవిడిగా సాగింది. మౌంట్‌బాటెన్‌ మేజర్‌ జనరల్‌ రీస్‌ నాయకత్వంలో 55,000 మంది సరిహద్దు దళాలను ఏర్పాటు చేసారు. కానీ అప్పటికే పోలీసులలో కూడా మతజాడ్యం వ్యాపించింది. జూలై-ఆగస్టు 47లలో చెలరేగిన అల్లర్లు అణచడంలో వారు ఘోరంగా విఫలమయ్యేరు. గాంధీ మనసు వికలమైపోయింది. ఏళ్ల తరబడి అహింసే ఆయుధంగా పోరాటం సలిపి సాధించింది యీ హింసాయుత దేశాన్నా అని బాధపడ్డారు. ఆగస్టు 47లో స్వాతంత్య్ర సమారోహానికి తక్కిన నాయకులు ఆయత్తమవుతూంటే ఆయన మాత్రం ఆగస్టు మొదటివారంలోనే ఢిల్లీకి దూరంగా నవ్‌ఖాలీకి కలకత్తా మీదుగా ప్రయాణం కట్టారు. అందుకే 15-8-47 నాటి ప్రమాణ స్వీకారం ఫోటోలలో జాతిపిత కనిపించడు. ఆగస్టు 8న కలకత్తా చేరేసరికి హిందువులు అమీతుమీ తేల్చుకుంటున్నట్టు కనబడింది. ముస్లిములు బాగా దెబ్బతిన్నారు. సుహృవర్దీ అప్పటికి మాజీ ప్రధానమంత్రి అయిపోయారు. ఒకప్పుడు గాంధీని తిరస్కరించిన ఆ పెద్దమనిషి ఆనాడు గాంధీని కలిసి నవ్‌ఖాళీ పర్యటన రద్దు చేసుకుని కలకత్తాలోనే వుండి ఉద్రిక్తతలు చల్లార్చమని అర్థించారు. తనతో కలిసి బెలియఘాట్‌లో ఒక ముస్లిము పనివాడి ఇంట్లో ఉండి హిందూ-ముస్లిముల మధ్య మెలిగితే ఒప్పుకుంటానన్నారు గాంధీ. మహాత్ముని శాంతవచనాలతో కలకత్తా ఉపశమించింది. స్వాతంత్య్ర దినోత్సవం సంతోషంగా జరుపుకున్నారు కలకత్తా వాసులు. 

కానీ ఈ శాంతి ఒక పదిహేను రోజుల విరామమే అయింది. పాకిస్తాన్‌లో హిందువులపై జరిగిన హింసాకాండ వివరాలు వెంటబెట్టుకు తెచ్చారు శరణార్థులు. 31-8-47న హిందూ మూక గాంధీ నివాసంపై దాడి చేసింది. గాంధీకున్న ఏకైక ఆయుధం సత్యాగ్రహం. హింస చల్లబడి, అందరూ ఆయుధాలు అప్పగించేవరకూ నిరాహారదీక్ష చేస్తానని చెప్పి ఆయన 1-9-47న దీక్ష మొదలుపెట్టాడు. నిజంగానే ప్రజలు ఆయుధాలు అప్పగించడం మొదలుపెట్టారు. ఈ అద్భుతానికి ప్రపంచం విస్తుపోయింది. గాంధీని 'ఏక సైనిక దళం' (ఒన్‌ మ్యాన్‌ ఆర్మీ) గా అభివర్ణించారు మౌంట్‌బాటెన్‌. గాంధీ రాక వల్ల ఆ విధంగా బెంగాల్‌ అదృష్టం పొందింది. పంజాబ్‌కు ఈ అదృష్టం పట్టలేదు. గాంధీ సెప్టెంబరు 7 న కలకత్తా నుండి బయలుదేరి ఢిల్లీ మీదుగా పంజాబ్‌ వెళదామనుకున్నాడు కానీ ఢిల్లీలోనే శరణార్థుల గోడు చూసి ఆగిపోవలసి వచ్చింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

Click Here For Previous Articles