మెగా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ ఇంతా అంతా కాదు

సీతయ్య..దేవదాసు..లాహిరి లాహిరి లాహిరిలో..ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి..దర్శకుడు వైవిఎస్ చౌదరి పేరు వినగానే. ..నలుగురు నడిచే బాటలో నడవని మనిషి. కొత్తగా ఆలోచిస్తాడు..నందమూరి-అక్కనేని వారసులతో సినిమా..హరికృష్ణ సోలో హీరోగా సినిమా…కొత్త హీరోతో అమెరికాలో…

సీతయ్య..దేవదాసు..లాహిరి లాహిరి లాహిరిలో..ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి..దర్శకుడు వైవిఎస్ చౌదరి పేరు వినగానే. ..నలుగురు నడిచే బాటలో నడవని మనిషి. కొత్తగా ఆలోచిస్తాడు..నందమూరి-అక్కనేని వారసులతో సినిమా..హరికృష్ణ సోలో హీరోగా సినిమా…కొత్త హీరోతో అమెరికాలో చిత్రం..ఇప్పుడు రేయ్ అంటూ మెగా క్యాంప్ నుంచి వచ్చిన హీరోతో సినిమా. 

కమర్షియల్ హిట్ లకు కేరాఫ్ అడ్రస్ అనుకున్న వైవిఎస్ చౌదరి, ఇటీవల సరైన హిట్ అందించలేదు. పైగా రేయ్ సినిమా కోసం ఏడాదిన్నరగా స్ట్రగుల్ అయ్యారు. కానీ మొండిగా ముందుకే సాగారు. ఆఖరికి తన రేయ్ సినిమాను ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూ.

మీరు చాలా సినిమాలు తీసారు..కానీ ఈ సినిమా పడ్డ కష్టం ఇంతకు ముందు ఎప్పుడూ పడినట్లు లేదు.?

నా దృష్టిలో ఏ దర్శకుడైనా ఒక కథ అనుకున్నపుడే, దానికి ఎంత టైమ్ పడుతుంది..ఎంత ఖర్చవుతుంది..ఎంత కష్టం వుంటుంది అని తెలిసి పోతుంది. రేయ్ కథ అనుకున్నపుడే నాకు తెలుసు. ఎందుకంటే ఈ కథ అలాంటిదే. ఒక వెస్టిండీస్ లో ఓ కుర్రాడు..ఇండియా నుంచి వచ్చిన అమ్మాయి లవ్ లో పడి, ఆ అమ్మాయి ఆశయాన్ని తన ఆశయంగా భావించి, అమెరికాలోని ఓ కీలమైన పోటీలో ఎలా విన్నయ్యాడు అన్నది లైన్. అక్కడే అర్థమైపోతోంది. ఈ కథ సినిమాగా తయారుచేయడానికి ఎంతకష్టం వుందన్నది. సగం వెస్టిండీస్ లో జరుగుతుంది..సగం అమెరికాలో. ఎంతో స్పాన్..రేంజ్ వున్న కథ. రియలిస్టిక్ గా వుండాలంటే అక్కడకు వెళ్లి తీయాలి..మళ్లీ మన నిబంధనల ప్రకారం ఇక్కడ కొంత తీయాలి.  

అక్కడి లోకేషన్లు, ఇక్కడ లొకేషన్లు మాచ్ కావాలి. అందుకోసం బ్యాంకాక్ రెండు సార్లు, మలేషియా ఒకసారి, ఇక్కడి రామోజీ ఫిల్మ్ సిటీలో వంద రోజులు. మొత్తం మూడు వందలకు పైగా షూటింగ్ డేస్. అంటే అనుకున్న ప్రాజెక్టులోనే కష్టం స్పష్టంగా వుంది. పైగా దీనికి ప్రొడక్షన్ కూడా నేనే. అంటే బాధ్యతలు అన్నీ నేనే చేసుకోవాలి. లోకేషన్ల సెలక్షన్ నేనే చేయాలి. పర్మిషన్లు నేనే తెచ్చుకోవాలి. ఇక ఇలాంటి ప్రాజెక్టుకు ఏవైనా అనుకోని అడ్డంకులు వస్తే, మరి మళ్లీ సెట్ కావడానిక చాలా టైమ్ పడుతుంది.

దీనికి అలాంటివి చాలా వచ్చాయి. మొదట మలేషియా వెళ్లినపుడు వాతావరణం అనకూలించక రోజు అనుకుంటే రెండు రోజులు పట్టేది. 12 రోజులు అనుకుంటే 25 రోజులు పట్టింది. అలాగే వెస్ట్ ఇండీస్ లుక్ ఇక్కడ తీసుకురావాలి. వాటి కోసం చాలా కసరత్తుచేయాల్సివచ్చింది. రెండో షెడ్యూలుకు 42మందితో అమెరికా వెళ్తే, రెండో రోజే హీరో మోకాలికి గాయం కావడంతో మొత్తం షెడ్యూలు స్కాటర్ అయిపోయింది. 

ఇంతలో నిప్పు విడుదల కావడం, నేను కాస్త ఇబ్బందిపడి, కొన్నాళ్లకు కానీ తేరుకోకపోవడం జరగింది. ఇంతలో ఇంతకాలం మేము వుండలేమని హీరోయిన్లు తప్పుకున్నారు. అదృష్టం కొద్దీ తీసిన పార్ట్ లో వాళ్లు లేరు. కొత్త హీరోయిన్ తో బ్యాంకాక్ వెళ్లాం. అక్కడ అమ్మాయి కంటికి గాయం అయి, కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయింది. అంటే వరుసగా అనుకున్నవి ఏవీ జరగలేదు. . 2012లో మార్చి ప్రారంభమై 2013 మేకి పూర్తయింది. అంటే ఏడాదిలో పూర్తి చేసాం. ఈ లోగా విడుదల చేద్దాం అంటే రెండు రాష్ట్రాల గొడవలు, సరైన సీజన్ దొరికితే స్లాట్ దొరకదు..స్లాట్ దొరికితే సీజన్ దొరకదు. పెద్ద బడ్జెట్ కావడంతో ఎలా పడితే అలా వదిలేయలేం.

సరే..సబ్జెక్ ఇంత హెవీ అని తెలిసి, ఒక కొత్త కుర్రాడిపై ఇంత ఖర్చు ఎలా పెట్టాలనుకున్నారు.?

దేవదాసు అప్పటికి అది పెద్దసబ్జెక్ట్. అల్లు అర్జున్ కోసం అనుకుని, అనుకోని కారణాల వల్ల కుదరక, రామ్ తో చేసాం. అప్పుటికి రామ్ కొత్త కుర్రాడే. పైగా ఇక్కడ రామ్ కు మొదటి రోజు ఫాలోయింగ్ వుంటదని అనుకోలేదు. కానీ సాయితో అలా కాదు. చిరంజీవి, కళ్యాణ్ గారి మేనల్లుడు అన్న ఫాలోయింగ్ తో కొంత మంది వస్తారు. పైగా నా సినిమా షూటింగ్ ఎప్పుడూ స్మూత్ గా జరిగిపోతుంది.అదే ధీమా ఇప్పుడు కూడా. అందుకే ముందకెళ్లా. 

ఇప్పటికి థియేటర్లోకి రావడానికి ఎంతయింది..ఓ అంచనాగా.?

ముఫై, నలభై కోట్లు అయింది. అంటే పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ కన్నా ఎక్కువే అనాలి. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాకు ఇంత ఖర్చుచేసినా, ఇంకా అదనంగా వారి రెమ్యూనిరేషన్ కూడా వుంటుంది కదా. ఖర్చు రీత్యా కచ్చితంగా పెద్ద హీరోలకు కూడా పెద్ద బడ్జెట్ సినిమానే. 

సినిమా మధ్యలోనూ, చివర్లోనూ, ఇప్పుడు విడుదల ముందు వినిపిస్తోంది..పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సాయం చేసారని, మిమ్మల్ని బెయిలవుట్ చేసారని..ఎంతవరకు నిజం. అసలేమయినా వుందా?

కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వాళ్లు కుర్రాడ్ని నాకు అప్పగించారు. చౌదరి కొత్త వాళ్లని బాగా లాంచ్ చేస్తాడని నమ్మారు. అలాంటపుడు నేను ప్రాబ్లమ్ లో పడితే, వాళ్లు అర్థం చేసుకున్నారు. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు నాకు మోరల్ గా ఇచ్చిన సపోర్ట్ ఇంతా అంతాకాదు. దానికి వెలకట్టలేం.అదే చాలా ఎక్కువ. సాయం అంటే డబ్బు సాయమే కానక్కరలా..మాట సాయం, మోరల్ గా ధైర్యం చెప్పడం, అండగా నిల్చోవడం అవి కూడా కీలకమే. ఎ జెడ్ లుక్ కి అల్లు అర్జున్ వచ్చారు. ఆడియోకి కళ్యాణ్ గారు వచ్చారు. ఇదంతా చాలా చాలా సపోర్ట్ కదా. పైగా చిరంజీవిగారు, కళ్యాణ్ గారు, అల్లు అర్జున్,చరణ్ వీళ్లందరి సపోర్టు ద్వారా వచ్చే ఫ్యాన్ బేస్, ఈ కుర్రాడికి తోడయితే ఆ సినిమా రేంజ్ ఎలా వుంటుంది..అదంతా సాయం కాదా? అంతకన్నా సాయం ఇంకేం కావాలి? డబ్బులకన్నా ఎన్నో రెట్లు విలువైన సపోర్ట్ ఇచ్చారు. అది కీలకం.

అంటే ఈ విధమైన సపోర్ట్ మాత్రమే వచ్చిందంటారు. మీరేం అడగలేదంటారు.?

ఇదంతా తక్కవేమీ కాదు..కదా. ఇంకేం అడగాలి.తప్పు ఎక్కడ జరిగింది. ఇక్కడ అనుకోని సంఘటనలు జరిగాయి. ఊబిలో దిగిపోయేవాడిని,,నువు రాలేవు రాలేవు అనేకన్నా, నువ్వు రాగలవు అనే ధైర్యం చెప్పడం కూడా గొప్ప కదా.

ఈ ప్రాజెక్ట్ ఇలా ఇబ్బంది పెట్టినపుడు ఏ దశలోనే వదిలేద్దాం అన్న ఫ్రస్టేషన్ రాలేదా?

నాకు రాదు. నేనుకాస్త మొండి మనిషిని. నా నేచర్ అలాంటిది. సమస్య వచ్చినపుడే మరింత అలెర్ట్ గా వుండాలి. లేకుంటే ప్రొడక్ట్ దెబ్బ తింటుంది.

ఈ సినిమా కోసం మీరు మీ విలవైన ఆస్తులు కూడా అమ్మేయాల్సి వచ్చిందని, థియేటర్ ఒకటి అమ్మేసారని? 

ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్..పార్ట్ ఆఫ్ బిజినెస్. ఇదంతా పాసింగ్ క్లవుడ్స్ లాంటివి. ఆస్తులు పెట్టకపోతే సినిమా తీయడం ఎవరికీ సాధ్యంకాదు. అందువల్ల ఆ ఆలోచన, ప్రశ్న అనవసరం. నా దృష్టిలో వాటికి జీరో వాల్యూ.

అదంతాఓకె. మీకిష్టమైన థియేటర్ కూడా అమ్ముకున్నారని?

నేను ఏ ఆస్తి అమ్మలేదు..అన్నీ తాకట్టులో వున్నాయి. నాకంటూ వున్న ప్రతిఒక్కటీ తాకట్టులోనే వున్నాయి. 

మీరు ఎన్టీఆర్ కు వీరాభిమాని. ప్రతి ఏటా ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రకటనలిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మెగా గ్రూప్ వైపు తిరిగారని, ఇంకా చెప్పాలంటే, వారి భజన చేస్తున్నారని, కేవలం సినిమా కోసం, మీరన్న అభిమానుల కలెక్షన్ల కోసం అని వార్తలు వినిపిస్తున్నాయి.?

నేనేంటో అందరికీ తెలుసు. నేను భజన చేసేవాడినా కాదా, వ్యాపారం చేసేవాడినా కాదా? అన్నది అందరికీ తెలుసు.

కానీ ఇక్కడ కనిపిస్తున్నది..అలా లేదు కదా..సినిమాకు పవనిజంకు ఏమిటి సంబంధం? 

మనం ఒక ప్రొడక్ట్ కొనడానికి వెళ్లినపుడు బోలెడు చూస్తాం. అలాగే ఒక ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నపుడు, జనం కొన్ని ఆశించడం సహజం. హరికృష్ణ గారి కోసం వంశాలమీద డైలాగు రాసా. నందమూరి వంశ అభిమానులు హ్యాపీ అవ్వాలని. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నపుడు, ఆ ఫ్యామిలీ అభిమానులు అంతా హ్యాపీ ఫీలవ్వాలి. ఫ్యామిలీ ఫాలోయింగ్ ను మరిచిపోతే ఎలా?  పైగా షారూఖ్ ఖాన్ ను ఏం అవసరం. ఆ సినిమాకు ఏం సంబంధం అని చెన్నయ్ ఎక్స్ ప్రెస్ లో రజనీ పై పాట పెట్టారు? అదే ఇన్సిపిరేషన్ గా చేసాను. అలాగే బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్ పాట రీమిక్స్ చేసాను కాబట్టి, ఈ సినిమాలో చిరంజీవి గారి పాటను రీమిక్స్ చేసాను. ఎన్ని చెప్పండి..సౌత్ ఇండియాలో హీరో వర్షిప్ అన్నది చాలా పెద్ద లెవెల్లో వుంటుంది. వారిని సాటిస్ ఫై చేస్తే అది ఓ రేంజ్ లో హెల్ప్ అవుతుంది. అదే వాళ్లు ఆగ్రహిస్తే ఇంకోలా వుంటుంది. 

మీరు భలే ప్రయోగాలు చేసారు..ఎన్నో హిట్ లుకొట్టారు. అలాంటిది రీసెంట్ పాస్ట్ లో మూడు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి.?

టైమ్ అంతే..అన్ని సార్లూ మనం విజయాలు అందివ్వలేకపోవచ్చు. ప్రతి సారీ కష్టపడే పనిచేస్తాం. కానీ ఒక్కోసారి టైమ్ బాగాలేక ఇలా జరుగుతుంది. ఒక్కోసారి కథ ఎంపికలో తేడా వస్తుంది..మరోసారి ఎగ్జిక్యూషన్ లో తేడా వస్తుంది. 

రేయ్ మీ మీ కాన్పిడెన్స్ ఏ లెవెల్ కు వుంది.?

సినిమా సూపర్ హిట్ అన్నది గ్యారంటీ. ముఫై కోట్లకుపైగా వ్యాపారం చేస్తుందని నమ్ముతున్నాను.

సినిమా అమ్మకం పూర్తయిపోయిందా?

చాన్నాళ్లు డిలే అయిన సినిమాను ఎలా అడుగుతారో..అలాగే అడిగారు. ఏదో మొత్తానికి చేసాం. 

మరి ఖర్చు మేరకు అమ్మకాలు సరిపోతాయా?

ఓవర్ ఫ్లోస్ రావాలి.

ఇకపైనైనా మీరు ఖర్చువిషయంలో జాగ్రత్తగా వుంటారా?

ఇది నావల్ల జరిగిన తప్పు కాదండీ..పరిస్థితులు అలా తోసుకువచ్చాయి. నా బ్యాడ్ టైమ్. అయితే బ్యాడ్ టైమ్ లో గుడ్ టైమ్ ఏమిటంటే,. ఓ మంచి ప్రాజెక్ట్  బయటకు వచ్చింది. అదే సంతోషం. మీ విలువైన సమయం వృధా కాదు..100 పర్సంట్ శాటిస్ ఫాక్షన్ గ్యారంటీ అన్నది ఈ సినిమా ప్రచార స్లోగన్. అది కచ్చితంగా నిజం అవుతుంది.

చాణక్య

[email protected]