ఇంద్రాణీ ముఖర్జీ ఆర్టికల్‌పై వ్యాఖ్యలు చూశాను. నేను ''ఇండియా టుడే''లోని వ్యాసాన్ని ప్లెజారైజ్ చేశానని ఒకాయన రాయగా, మరో ఆయన ఔనౌనన్నాడు. ఇంకొకరి ఆలోచనలను, రచనలను సంగ్రహించి, తన పేర వేసుకుంటే ప్లెజారైజ్ చేయడమంటారు. నేను అందిస్తున్నది సమాచారం. అది పలు పత్రికల నుండి, వార్తాపత్రికల నుండి సేకరిస్తానని ఎన్నోమార్లు చెప్పుకున్నాను. ఇదేమీ కాల్పనిక రచన కాదు, పరిశోధనా పత్రం కాదు. నేను నాలుగు తెలుగు పత్రికలు, ''హిందూ'', ''వీక్'', ''ఔట్‌లుక్'', ''ఇండియా టుడే'', ''ఫ్రంట్‌లైన్''లతో బాటు నచ్చే అంశమైతే ఆన్‌లైన్ సమాచారాన్ని కూడా చదువుతాను. టీవీ చర్చలు కొన్ని చూస్తాను. అన్నిటిద్వారా గ్రహించిన సమాచారాన్ని ఒకదానితో మరొకటి సరిచూసుకుంటే తప్ప ఒక అంశంపై నాకు పూర్తి అవగాహన రాదు. వచ్చాక, సమాచార సేకరణకు ఓపిక లేనివారికి ఆసక్తి కలిగించేందుకు విషయాలన్నీ ఒక క్రమంలో పెట్టి పాఠకులకు అందిస్తాను. వచ్చేవారం నుండి నాలుగు నెలలపాటు వ్యక్తిగత కారణాలపై నేను ఇంగ్లండులో వుండబోతున్నాను. ఆ సమయంలో యిన్ని సోర్సెస్ నాకు అందుబాటులో వుండవు. ఆన్‌లైన్‌లో ఒకటి రెండు చదివితే సరిపోదు. అందుకని కరంటు టాపిక్స్ మీద రాయలేను. గతచరిత్రపై ఆధారపడిన సీరియల్స్, జనరల్ టాపిక్స్‌పై మాత్రమే రాయగలుగుతాను. నేను ఔట్‌లుక్‌లో వ్యాసాలను మాత్రమే అనువదిస్తానని గతంలో ఒకరు రాశారు. అది తప్పు. ఇంద్రాణీ ఆర్టికల్ ఇండియా టుడేలో వ్యాసానికి అనువాదం అని రాసినదీ తప్పే. అనువదించాలంటే వారి అనుమతి వుండి తీరాలి. కొన్ని పత్రికలతోనే వారికి ఒప్పందాలుంటాయి. నేను అనువాదం చేసే సందర్భాల్లో మూలరచయిత పేరు స్పష్టంగా పేర్కొంటాను. నా పేర వేసుకోను. దీన్ని ఇండియా టుడే కథనానికి అనువాదం అనుకునేవారు దాన్నీ దీన్నీ చదివిచూస్తే పోలికలు, తేడాలు తెలుస్తాయి.
పదిరోజులుగా పది సోర్సెస్ నుంచి తీసుకున్న 18 పేజీల సమాచారంతో సెప్టెంబరు 3 సాయంత్రం నాటికి టాబ్లాయిడ్‌కోసం ఇంద్రాణి వ్యాసం పంపేనాటికి నేను ఇండియా టుడే ఆర్టికల్స్ చదవలేదు. (ఈ పత్రికలన్నీ నాకు పోస్టులో వస్తాయి. సెప్టెంబరు 7 సంచిక 5న, సెప్టెంబరు 14 సంచిక 10 వచ్చాయి) కథ అర్థం కావటానికే నాకు చాలా సమయం పట్టింది. దాన్ని ఎక్కణ్నుంచి ఎలా చెప్పాలో తెలియక రెండు రోజులు సతమతమయ్యాను. ప్రచురణ అయిన తర్వాత 07 09 15 ఇండియా టుడే కథనం చదివాను. దానిలో విషయాలు చాలా కన్‌ఫ్యూజ్ చేశాయి. నా వ్యాసంపై వచ్చిన వ్యాఖ్యలు చదివి 14 09 15 సంచికలో ఆర్టికల్ ఆన్‌లైన్‌లో చదివితే మరి కొన్ని విషయాలు తెలిశాయి. సెప్టెంబరు 13 వీక్, సెప్టెంబరు 14 ఔట్‌లుక్‌లలో మరి కొన్ని విశేషాలున్నాయి. వాటిని పాఠకులతో పంచుకుంటున్నాను.
ఇండియా టుడే 07 09 15లో పొరబాట్లున్నాయి. '19 ఏళ్ల వయసులో ఆమె చిరాగ్ అనే అతనితో పారిపోయింది. వాళ్లకు పెళ్లి కాలేదు. షీనా, మిఖాయేల్ అతని వలన కలిగినవారే. ఇంద్రాణి తండ్రి ఉపేంద్ర అతని చేత రెస్టారెంట్ పెట్టించాడు. వ్యాపారం దెబ్బతింది, జంట విడిపోయారు. చిరాగ్ షిల్లాంగ్‌లో టీచరుగా పనిచేస్తున్నాడు. విడిపోయాక ఇంద్రాణి కలకత్తా వెళ్లి సిద్దార్థ దాస్‌ను పెళ్లాడింది.' అని రాశారు. 14 09 15 సంచికలో చిరాగ్ అనేది రెస్టారెంట్ పేరని, సిద్ధార్థ దాస్‌ను కలిసినది అక్కడే ననీ, మొదటగా సహవాసం చేసినది బిష్ణు చౌధురీతోననీ, షీనా, మిఖాయేల్ అతనికి పుట్టినవారు కాదని సవరించుకుంది. ఇంద్రాణి పేరు బొంబాయి వచ్చాకనే పెట్టుకుందని నేను రాశాను. ఇండియా టుడే చదివి వుంటే అలా రాసేవాణ్ని కాను. ఎందుకంటే ఆమె కలకత్తాలోనే ఇంద్రాణి దాస్‌గా చలామణీ అవుతూ ఐఎన్‌ఎక్స్ సర్వీసెస్ అనే ఎచ్‌ఆర్ కన్సల్టెన్సీ నడిపిందట! 1968లో పుట్టిన ఆమెకు పరీ అనేది ముద్దుపేరట. చదువుల్లో చాలా చురుగ్గా వుండేది. ఉపేంద్ర ఆమె కన్న తండ్రిట. నేను సవతి తండ్రి అని రాశాను – ఇంద్రాణి అలా చెప్పుకున్నట్టు పేపర్లలో వచ్చింది కాబట్టి! గోర్బచేవ్ అభిమానిగా తన మనుమడు మిఖాయేల్‌కు ఆ పేరు పెట్టినది అతనేట. షీనా పేరు వెనక్కాల కథేమిటంటే సిద్ధార్థ, ఇంద్రాణి ''షీనా, క్వీన్ ఆఫ్ ద జంగిల్'' సినిమా చూసి నచ్చి, కథానాయిక పేరును తమ కుమార్తెకు పెట్టుకున్నారట.
ఇక యితర వివరాలు – బిష్ణు చౌధురీ తండ్రి గువాహటీకి చెందిన బిఎల్ చౌధురీ అనే డాక్టరు. కాటన్ కాలేజీలో ఇంటరు చదువుతున్న ఇంద్రాణితో నాలుగు నెలలు సహవాసం చేసేనాటికి అతను లా స్టూడెంటు. షిల్లాంగ్‌లో చదువుతూండగా ఆమె ప్రైవేటు కంపెనీలో పనిచేసే సిద్ధార్థ దాస్‌ను కలిసింది. అతని తండ్రి షిల్లాంగ్‌లో చిన్న వ్యాపారి. వారిదీ సహవాసమే ఐనా ఉపేంద్ర అతన్ని ఆమోదించి, యింట్లో పెట్టుకుని అతని చేత గణేశ్‌పురిలో ఓ రెస్టారెంటు పెట్టించాడు. కానీ అది పెద్దగా నడవలేదు. 1987లో షీనా, 1988లో మిఖాయేల్ పుట్టాక ఇంద్రాణి, సిద్ధార్థను, పిల్లల్ని తలిదండ్రుల వద్ద వదిలేసి 1990లో కలకత్తాకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోగానే సిద్ధార్థను తన్ని తగిలేశారు. ఉపేంద్రకు ఒక గెస్ట్ హౌస్ వుండేది. దానిపై వచ్చిన ఆదాయంతోనే యిల్లు గడిచేది. 2000లో అది మూతపడ్డాక వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. 1992లో స్కూల్లో చేర్చేటప్పుడు పిల్లలిద్దరికీ అమ్మమ్మ, తాతయ్యలను గార్డియన్లుగా పెట్టారు. 1993లో కామరూప్ మాజిస్ట్రేటు వద్ద దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇంద్రాణి పిల్లల జన్మసంవత్సరాలను మార్చివేసింది. సిద్ధార్థతో తనకు 1989లో సంబంధం తెగిపోయిందని, మిఖాయేల్ 1990లో పుట్టాడనీ కోర్టుకి తెలిపింది. షీనాకు టెన్త్‌లో 80% మార్కులు వచ్చాయి మిఖాయేల్ మాత్రం సరిగ్గా చదివేవాడు కాదు. షీనా పదో తరగతి చదివే రోజుల్లో తన తండ్రి సిద్ధార్థకు దీనంగా లేఖలు రాసేదని కూడా పేపర్లలో యిటీవల వచ్చింది.
1990లో ఇంద్రాణి దాస్‌గా కలకత్తా ప్రవేశించి సోషల్ సర్కిల్స్‌లో తిరగసాగింది. టిపి రాయ్ అనే టీ ప్లాంటేషన్ ఓనరు అనుగ్రహం సంపాదించి, అతని ద్వారా పరిచయాలు పెంచుకుంది. మార్వాడీ అమ్మాయిల ఫంక్షన్లు, ఐయేయస్ ఆఫీసర్ల భార్యల క్లబ్బుల్లోకి వెళుతూ పెద్దవాళ్లకు దగ్గరైంది. ఐఎన్‌ఎక్స్ సర్వీసెస్ పేర ఎచ్‌ఆర్ కన్సల్టెన్సీ పెట్టుకుని (ఎప్పుడు పెట్టిందో తెలియటం లేదు. 1996లో అని రాశారు. మరి అప్పటిదాకా భుక్తి ఎలా గడిచింది?) ఎబిసి కన్సల్టెంట్స్‌తో టై అప్ పెట్టుకుంది. అన్ని ఆఫీసులకు వెళుతూండేది. కలకత్తా క్రికెట్ అండ్ ఫుట్‌బాల్ క్లబ్‌లో సభ్యుడిగా వున్న సంజీవ్ ఖన్నాతో పరిచయమై 1993లో వివాహమాడింది. వాళ్లకు 1997లో విధి పుట్టింది. సంజీవ్‌కు తాగుడు ఎక్కువ, పని తక్కువ కావడంతో క్రమంగా ఎడముఖం, పెడముఖం అయ్యారు. ఆమె బొంబాయి రావడం కూడా పాదమ్‌సీ కారణంగానే! యాడ్‌మాన్ అలెక్ పాదమ్‌సీ కలకత్తాలో క్లయింట్లను కలవడానికి తన భార్య షారోన్ ప్రభాకర్‌తో కలిసి తరచుగా వస్తూండేవాడు. 2000లో ఓ పార్టీలో ఇంద్రాణిని కలిశాడు. అప్పుడే ఆమె రిలయన్స్ వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని వుంది. పెళ్లి పెటాకులు అయ్యేట్లా వుంది. ఆ సందర్భంలో 'బొంబాయికి వస్తే బిజినెస్ పెరుగుతుంద'ని సలహా యిచ్చాడు. చివరకు 2001లో ఆమె బొంబాయి వచ్చేశాక ఆదరించాడు. 2002లో తాజ్ ప్రెసిడెంటులో సుహేల్ సేఠ్ యిచ్చిన పార్టీలో ఆమెను పీటర్ ముఖర్జీకి పరిచయం చేశాడు. అలా చేసిన నాలుగో రోజుకే పీటర్ ఇంద్రాణితో తలమునకలుగా ప్రేమలో పడిపోయాడు. అతని ద్వారా ఇంద్రాణి టైమ్స్ గ్రూప్, ఎచ్‌టి మీడియా, పెర్సెప్ట్ పిక్చర్ కంపెనీ, బిగ్ ఎఫ్‌ఎమ్, వరల్డ్‌స్పేస్ శాటిలైట్ రేడియో, ఫెడెక్స్ వంటి పెద్ద క్లయింట్లను సంపాదించుకుంది. సంజీవ్ ఖన్నాతో విడాకులు ఓ పట్టాన రాలేదని, పీటర్ ముఖర్జీ చొరవతో మృణాళిని దేశ్‌ముఖ్ అనే ప్రముఖ లాయరు ఇంద్రాణి తరఫున వాదించి విడాకులు యిప్పించిందని ఇండియా టుడే రాసింది.
పీటర్ ముఖర్జీతో పెళ్లి వార్తలు పేపర్లలో వచ్చాక ఇంద్రాణి తలిదండ్రులు, పిల్లలు డబ్బిచ్చి తమను ఆదుకోమని తల్లిని ఈమెయిల్ ద్వారా వేడుకోగా, కన్నవాళ్లను తోడబుట్టినవాళ్లగా పరిచయం చేస్తానన్న షరతుపై ఇంద్రాణి ఒప్పుకుంది. రాత్రికి రాత్రి ఉపేంద్ర యింటికి రిపేర్లు జరిగాయి. రెండు కార్లు వచ్చిపడ్డాయి. 2006లో ఇంద్రాణి గువాహతి వెళ్లి షీనాను తన వద్దకు తెచ్చుకుంది. మిఖాయేల్‌ను పుణెకు పంపించి చదువుకోమన్నారు. అతను ఢిల్లీలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్సులో పనిచేస్తూ రెండేళ్ల తర్వాత మానేసి 2011లో గువాహతి వచ్చి అమ్మమ్మ, తాతలను చూసుకుంటున్నాడు. షీనా హత్య తర్వాత అతనికి విపరీతంగా డబ్బు వచ్చిపడుతోందని, పార్టీలు, కార్లపై ఖర్చు పెడుతున్నాడనీ యిరుగుపొరుగు వాళ్లు చెప్తున్నారు. షీనా, విధికి మధ్య పొరపొచ్చాలు లేవు. పీటర్ విధిని దత్తతకు తీసుకున్నాడు. ఐఎన్‌ఎక్స్ టీవీ గ్రూపు మూతపడ్డాక, విధి చదువుతున్న బ్రిస్టల్‌కు పీటర్, ఇంద్రాణి వెళ్లారు. అప్పటికి రిలయన్సు అడాగ్ వారి యూనిట్ అయిన ముంబయ్ మెట్రో వన్‌లో పనిచేస్తున్న షీనా యిక్కడే వుండిపోయి, రాహుల్‌తో కలిసి కాపురం పెట్టింది. రాహుల్ ఏ ఉద్యోగం చేస్తాడో నాకు తెలియలేదు, వాళ్లకీ తెలిసినట్లు లేదు. 'పీటర్ ముఖర్జీకి 1980లో రాహుల్ అనే కొడుకు, 1984లో మరో కొడుకు పుట్టారు.' అని నేను రాశాను. అది తప్పు 1980లో పుట్టినది రాబిన్, 1984లో పుట్టినది రాహుల్. అతను లండన్‌నుంచి తిరిగి వచ్చాక తన కంటె మూడేళ్లు చిన్నదైన షీనాతో డేటింగ్ మొదలుపెట్టాడు. అతని తల్లి పేరు షబ్నమ్ ఆనంద్. (సింగ్ అని కొందరు రాశారు)
హత్య సమాచారం బయటకు ఎలా వచ్చిందన్నది ఆసక్తిదాయకం. ఇంద్రాణి కారు డ్రైవరు శ్యామ్‌రాయ్ ఓ రోజు బార్‌లో కూర్చుని తాగి వాగుతున్నపుడు దగ్గర్లో ఒక పోలీసు వున్నాడు. ఆ వాగుడులో షీనా హత్య ప్రస్తావన రావడంతో అతను పై అధికారికి చెప్పాడు. కొద్ది రోజులకే ఆగస్టు 21న శ్యామ్‌రాయ్‌ను 7.62 ఎమ్‌ఎమ్ పిస్టల్ కలిగి వున్నందుకు అరెస్టు చేశారు. అతని ద్వారా కూపీ లాగారు. మూడేళ్లగా అతను ఎలా బతికాడన్నది తెలిస్తే పోలీసులకు గట్టి సాక్ష్యం లభించినట్లవుతుంది. మేరఠ్‌నుంచి ఎవరో ఫోన్ చేసి ముంబయి పోలీసులకు షీనా మూడేళ్లగా మిస్సింగ్ అని చెప్పారనే కథనం కూడా వుంది. షీనా, తల్లిని బ్లాక్‌మెయిల్ చేసేదని బాండ్రా వెస్ట్‌లో వున్న 3బిఎచ్‌కె ఫ్లాట్ తన పేర రాయమని ఒత్తిడి చేసేదని అంటున్నారు. పీక నులిమేటప్పుడు కూడా ఇంద్రాణీ 'తీసుకోవే, నీ ఫ్లాట్' అందని డ్రైవర్ చెప్పాడట. పీటర్ ముఖర్జీ ఆస్తుల్లో చాలా వాటిల్లో ఇంద్రాణి వాటాదారుగా వుందట. ఢిల్లీలో వున్న ఒక ఆస్తి తన పేర రాయమని కూడా షీనా ఒత్తిడి చేసిందట. ఆమె పీడ వదుల్చుకోవాలంటే హత్య ఒక్కటే మార్గం అని ఇంద్రాణి అనుకుందట. ఇంద్రాణి చాలా పేచీకోరు మనిషని పీటర్ పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా కొత్త సమాచారం వస్తూంటే సందేహాల మబ్బులు విడిపోతూ వుంటాయి. నేను రాసిన వ్యాసం బేస్ మెటీరియల్‌గా పనికి వస్తుంది. చివరగా – ఓ పాఠకుడు ముఖర్జీ కాదు, ముఖర్జియా అని రాశారు. అలాటి యింటిపేరు బెంగాలీలలో లేదు. రావు అనే పేరును తెలుగువాళ్లు ఆర్‌ఎఓ అనీ, ఆర్‌ఏయూ అనీ, ఆర్‌ఓడబ్ల్యు అనీ.. రకరకాల స్పెల్లింగులతో రాస్తారు. దాన్ని బట్టి అసలు పేరు మారిపోదు. పేర్ల స్పెల్లింగ్ మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కొందరు చేస్తున్న ప్రచారం నమ్మి ఒకటికి రెండు అక్షరాలు చేర్చేసుకుంటున్నారు. ఖర్మకాలి రేపు నేను మరో పి చేర్చుకున్నా నా పేరు ప్రసాదే అవుతుంది తప్ప ప్ప్రసాద్ అవదు. ఎందుకంటే ఆ పదానికి అర్థం, పర్థం లేదు కాబట్టి. ఇక ప్రతీమ్ ముఖర్జీ పీటర్ కావడానికి పెద్ద కారణం అక్కరలేదు. విదేశాల్లో పనిచేసేటప్పుడు వారికి పలకడానికి సులభంగా వుంటుందని వాళ్లకు పరిచితమైన పేరును వాడుతూంటారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)