తాను అందరి వాడినని, అన్ని కులాలు, మతాలు తనకు సమానమేనని, కాపు కులం ముద్ర తనపై వేస్తే బాధ కలుగుతుందని అవకాశం దొరికిన ప్రతిసారి చెప్పే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు తాజా భీమవరం అల్లర్ల రూపంలో శిరోభారం ఏర్పడింది. భీమవరంలో చెలరేగిన కుల ఘర్షణలు ఆయనకు ఇప్పుడు ఓ సవాల్‌గా మారాయి. జనసేన పార్టీని స్థాపించి, గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి, బిజెపికి అండగా నిలిచి, ఇప్పుడు రాష్ర్ట రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలున్న పవర్‌స్టార్‌కు ఈ పరిణామాలు మేలు కంటే కీడే ఎక్కువ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. భీమవరంలో ఇటీవల పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణకు వెనుక కేవలం కులం కార్డే కారణం కావడం, కాపు సామాజికవర్గం యావత్తూ పవన్‌కళ్యాణ్‌కు కొమ్ము కాస్తూ క్షత్రియ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు పవన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి.
దద్దరిల్లిన భీమవరం
సెప్టెంబర్ 2వ తేదీ….. ఈ తేదీ పవన్ అభిమానులకు పండుగ రోజు అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో సినీ నటులను ప్రాణాతిప్రాణంగా ప్రేమించి, పూజంచే పట్టణంగా భీమవరానికి పేరుంది. ఈ పట్టణంలో జనాభాపరంగా కాపులతో క్షత్రియులు ధీటుగా ఉన్నారు. పట్టణాన్ని మినహాయించి పరిసర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి గట్టి పట్టుంది. కాపు సామాజికవర్గం అది నుండి వన్‌సైడ్‌గా చిరంజీవి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటోంది. తన స్టామినా ఏంటో పవన్ నిరూపించుకున్నాక అన్నయ్యకు ధీటుగా పవర్‌స్టార్‌కు ఈ సామాజికవర్గంలో ఇమేజ్ పెరిగింది. వాస్తవానికి పవన్‌కు కులాలకు అతీతంగా లక్షల్లో అభిమానులు తయారయ్యారు.
భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లి గూడెం, ఏలూరు వంటి పట్టణాల్లో నేడు పవర్‌స్టార్ పేరు చెబితే తిరగులేని రీతిలో అభిమాన సందోహం స్పందిస్తుంది. ఇటువంటి స్థితిలో సెప్టెంబర్ 2వ తేదీన భీమవరంలో పవన్ అభిమానులు భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాపు సామాజికవర్గం పాత్రే కీలకంగా కనిపించింది. పట్టణంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. అభిమానులు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో కూడిన కటౌట్లు దర్శనం ఇచ్చాయి. భారీ కేక్ కట్ చేసి, బాణాసంచాతో హడావుడి సృష్టించారు. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరోజు 12గంటల వరకు అభిమానులు పట్టణంలో కలియదిరుగుతూనే ఉన్నారు. అయితే పట్టణంలో ఒక చోట పవన్ కళ్యాణ్‌కు చెందిన బ్యానర్ ఒకటి తెగిపడి ఉండటాన్ని అభిమానులు గ్రహించారు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రానికి సంబంధించిన బ్యానర్‌కు అడ్డుగా ఉండటం వలనే తమ హీరో బ్యానర్‌ను చింపేశారంటూ పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతే రాత్రికి రాత్రే పట్టణంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డియి. కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి బాహుబలి చిత్రం బ్యానర్లు, కటౌట్లు, పోస్టర్లను ధ్వంసం చేశారు, తమ హీరో కటౌనట్లు, బ్యానర్లు ధ్వంసం చేస్తున్నారని తెలిసి ప్రభాస్ అభిమానులు అలెర్టయ్యారు.
అయితే ఈ వ్యవహారం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అని కాకుండా రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారింది. బ్యానర్లు, కటౌట్లతో వదిలిపెట్టకుండా పట్టణంలో అల్లరిమూకలు చెలరేగిపోయారు. మున్సిపల్ ఆస్తులు, ఎటిఎంలను సైతం ధ్వంసం చేసే పరిస్థితి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పట్టణంలో అల్లర్లను అదుపు తెచ్చేందుకు ప్రత్యేక స్ర్టైకింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇరు వర్గాలకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ అల్లర్లు జరుగుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ భీమవరంలేనే ఉండటం విశేషం!
రెండో రోజూ అల్లర్లు….
ఈ సామాజిక కుల సమరం సెప్టెంబర్ 3,4 తేదీల్లో కూడా కొనసాగింది. ఏ క్షణంలో ఏ కొంప మునుగుతుందో అన్న భయంతో పోలీసులు ఎక్కడికక్కడే బృందాలుగా ఏర్పడి, పట్టణంలో కలియదిరుగుతూ అల్లర్లును అదుపు చేయాల్సి వచ్చింది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఈ ఘర్షణను నిలువరించేందుకు పవన్ కళ్యాణ్ సామాజికవర్గం నేతలు జరిపిన చర్చలు సైతం ఫలప్రదం కాలేదని, నేటికీ ఇరువర్గాల మధ్యా వివాదం నివురు గప్పిన నిప్పు మాదిరిగా నెలకొనివున్నట్టు తెలుస్తోంది.
ఘటనపై పవన్ విచారం….
రాష్ర్ట రాజకీయాల్లో కీలకంగా ఉన్న పవర్‌స్టార్ భీమవరం కుల రాజకీయంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్టు జనసేన వర్గాల సమాచారం! తమ అధినేత ఫలనా కులం కార్డ్, కుల ముద్ర కంటే అన్ని కులాలూ సమానమేనన్న ఆలోచనతో ఉంటారని, తన అభిమానుల్లో అన్ని కులాలు వారూ ఉన్న విషయాన్ని ఆయన తరచూ చెబుతుంటారని పేర్కొంటున్నారు., ఇటీవల కాలంలో పవన్ కూడా పలు చోట్ల జరిగిన సభల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెబుతున్నారు.
ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ సందర్భంగా ‘కాపుల సపోర్ట్ ఎవరడిగారు? నేడు అడిగానా?’ అని స్వయంగా పవన్ ప్రశ్నించిన విషయాన్ని ఆయన అభిమానులు ప్రస్తావిస్తున్నారు. ఇదిలావుండగా పవన్ కూడా భీమవరం ఘటనపై ట్వీట్ చేస్తూ తన అభిమానులు ఇటువంటి చర్యలకు పాల్పడరాదని, కుల, వర్గ పోరాటాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తన అభిమానులు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అయితే తన హీరో /నాయకుడి బ్యానర్లను చించే అధికారం ఎవరికి ఉందని, ఇటువంటి చర్యలను సహించేది లేదంటూ మరోవైపు పవన్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
విశ్వ