రీమేక్ రైట్స్ కోసం తెలుగు హీరోల గొడవలు!

రీమేక్… సెక్సస్‌కు చాలా సులభమైన రూటు. ఆల్రెడీ ఒకసారి టెస్టింగ్ డోస్‌లా పడిన కథే కాబట్టి.. దాన్ని మళ్లీ చిత్రీకరించడం ద్వారా కొంత సేఫ్‌జోన్లో ఉండవచ్చు. ఇదే ఉద్దేశంతో తెలుగులో చాలా మంది హీరోలు…

రీమేక్… సెక్సస్‌కు చాలా సులభమైన రూటు. ఆల్రెడీ ఒకసారి టెస్టింగ్ డోస్‌లా పడిన కథే కాబట్టి.. దాన్ని మళ్లీ చిత్రీకరించడం ద్వారా కొంత సేఫ్‌జోన్లో ఉండవచ్చు. ఇదే ఉద్దేశంతో తెలుగులో చాలా మంది హీరోలు రీమేక్‌లను చేస్తున్నారు. హిందీలోనో.. తమిళంలోనో.. ఆఖరికి కన్నడ, పంజాబీలో వచ్చిన సినిమాలను కూడా మనోళ్లు రీమేక్ చేస్తున్న సందర్భాలు మనకళ్ల ముందునే అనేకం కనిపిస్తున్నాయి. కొందరు హీరోలు అయితే తమ కెరీర్‌లో ఎక్కువ సందర్భాల్లో రీమేక్‌ల మీదే ఆధారపడ్డారు. స్ర్టైట్ సినిమాలు చేసి హిట్స్ కొట్టే సత్తా ఉన్నా… ఈ హీరోలు రీమేక్‌లు అంటే చాలు వీళ్లు చాలా ఉత్సాహపడిపోతున్నారు. తమకంటూ స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా వీళ్లు రీమేక్‌లను చేయడానికి ఎలాంటి మొహమాటపడరు. మరి రీమేక్‌లు చేయడానికి ఏ హీరో కూడా మినహాయింపు కాదు. 

ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఒక రీమేక్ విషయంలో తెగ చర్చ జరుగుతోంది. జయంరవి హీరోగా రూపొందిన తమిళ సినిమా ‘‘తనీ ఒరువన్’’ను తెలుగులో రీమేక్ చేయడం గురించి తెలుగు హీరోల మధ్య పోటీ నెలకొని ఉందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆ సినిమాను రూపొందిస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్న హీరోలు దాన్ని తెలుగులో తీయడానికి తెగ ఉత్సాహపడిపోతున్నారు. ఇద్దరు పెద్ద హీరోలు ఆ సినిమా రీమేక్ పట్ల ఆసక్తితో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరిలో ఎవరు దాని రైట్స్‌ను సొంతం చేసుకొంటారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. మరి ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ఎవరు సొంతం చేసుకొంటారో ఏమోకానీ… తెలుగు హీరోలు రీమేక్ రైట్స్ కోసం పోటీలు పడటం కొత్తకాదు. 

ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాను తాము చేయాలంటే తాము చేయాలని స్టార్ హీరోలే దూసుకెళ్లిన సందర్భాలున్నాయి. తమకు తెలిసిన నిర్మాతలతో తెలుగు హీరోలు ఆ సినిమాల హక్కులను కొనిపించడం జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో హీరోల మధ్య విబేధాలు కూడా తలెత్తిన సందర్భాలున్నాయి! ఇప్పటికీ ఆ సినిమాల విషయంలో ఆ హీరోలు పాత గొడవలను ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ వేరేవాళ్లు తన్నుకుపోయారు… అయినా నాకేం అయ్యింది. నేను దర్జాగా నిలబడ్డాను. ఆ సినిమాను రీమేక్ చేసి కూడా వాళ్లు ఏం సాదించారు? నాకు దక్కకుండా చేసి వాళ్లు సాదించుకొన్నది ఏమిటి? అంటూ హీరోలు నిష్టూరాలు అడటం కూడా జరుగుతూ ఉంటుంది!

ఉదాహరణకు నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను కాస్త కదిలిస్తే.. ఆయన ‘‘చంటి’’ సినిమా విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆ సినిమా తను చేయాల్సింది అనేది రాజేంద్ర ప్రసాద్ మాట. అయితే వెంకటేశ్ వాళ్లు ఆ సినిమాను తన్నుకుపోయారని రాజేంద్రుడు అంటాడు. అదేంటి అంటే… ఆ సినిమా ముందుగా తమిళంలో వచ్చింది. శివాజీ గణేషన్ తనయుడు ప్రభు హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా సూపర్ హిట్. ‘‘చిన్నతంబి’’ పేరుతో హిట్ అయిన ఆ సినిమా గురించి తెలుసుకొని రాజేంద్రుడు ఆ కథ మీద కన్నేశాడు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని తపించాడు. కామెడీ హీరోగా స్టార్ స్టేటస్‌లో ఉన్న రాజేంద్రుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఉంటే సూపర్‌గానే ఉండేదేమో కానీ.. మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ అడ్డుతగిలింది. 

తమ పరపతిని ఉపయోగించుకొని చిన్నతంబి సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకొంది. అయితే అప్పటికే రాజేంద్రుడు ఆ సినిమా రైట్స్ కోసం అడ్వాన్స్ ఇచ్చాడని.. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ తమ పరపతితో రాజేంద్రుడికి ఆ సినిమాను దక్కకుండా చేసిందని అంటారు. ఈ విషయంలో ఆ మధ్య రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ… తనకు చంటిలాంటి స్క్రిప్ట్‌ను దక్కకుండా చేయగలరు కానీ… ‘‘ఆ నలుగురు’’, ‘‘మీ శ్రేయోభిలాషి’’ వంటిసినిమాల విషయంలో నాకు పోటీ లేదు కదా.. వాటిని మాత్రం నా నుంచి దూరం చేయలేకపోయారు కదా.. అని వ్యాఖ్యానించాడు. మరి దీన్ని బట్టి ‘చంటి’ రీమేక్ రైట్స్ తన జేజారిపోవడం గురించి రాజేంద్రుడు ఇప్పటికీ ఫీలింగెట్టేసుకొన్నాడని స్పష్టం అవుతుంది.

ఇక రీమేక్ రైట్స్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని.. తెలుగు టాప్ హీరోలు కుట్రపూరితంగా వ్యవహరించి తనకు సినిమాలు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మరో తెలుగు హీరో రాజశేఖర్. తన కెరీర్‌లో చాలా రీమేక్ సినిమాలు చేశాడు రాజశేఖర్. అనేక తమిళ, మలయాళ, హిందీ సినిమాల హక్కులనుకొనుక్కొని వచ్చి రాజశేఖర్ వాటిని రీమేక్ చేశాడు. అయితే సరైన హిట్ మాత్రం దక్కలేదు. తమిళంలోనో.. హిందీలోనో… సూపర్ హిట్ అయిన సినిమాలను రాజశేఖర్ తెలుగులో రీమేక్ చేసినా అవి ప్లాఫే అయ్యాయి.

అయినా ఈ హీరోకి రీమేక్‌ల పిచ్చి తగ్గలేదు. తమిళంలో ‘సేతూ’ సూపర్ హిట్ అయితే దాన్ని తెచ్చి శేషుగా రీమేక్ చేశాడు. అది డిజాస్టర్ అయ్యింది. హిందీలో వచ్చిన ఖాకీ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేసి పరాజయాన్ని మూటగట్టుకొన్నాడు రాజశేఖర్. ఈ మధ్యనే ఈయన హీరోగా గడ్డంగ్యాంగ్ సినిమా వచ్చింది. అది కూడా ఒక తమిళ సినిమాకు రీమేకే.. తెలుగులో ప్లాఫే! మరి ఇన్ని సినిమాలు చేసినా.. కొన్ని రీమేక్‌ల విషయంలో రాజశేఖర్ చాలా అసంతృప్తితో ఉంటాడు. అవి తన జేజారడం గురించి బాధపడుతూ ఉంటాడు. అవేమంటే.. ఠాగూర్, లక్ష్మి నరసింహా! 

ఈ రెండు సినిమాలూ ఒరిజినల్‌గా తమిళంలో రూపొందించబడినవే. ఠాగూర్‌ను తమిళంలో విజయ్ కాంత్ ‘రమణ’ పేరుతో రూపొందించాడు. లక్ష్మి నరసింహా ‘‘స్వామి’’ పేరుతో హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చింది. విశేషం ఏమిటంటే.. తెలుగులో ఈ సినిమాలను స్టార్ హీరోలు రీమేక్ చేశారు. హిట్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్‌లో ఠాగూర్ సంచలన విజయం సాధించిన సినిమా కాగా, లక్ష్మి నరసింహ బాలయ్య అభిమానులను అమితంగా అలరించింది. అయితే వాస్తవంగా ఈ రెండు సినిమాలూ తాను చేయాల్సినవి అని రాజశేఖర్ అంటూ ఉంటారు. 

రమణ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం అయితే ఆడ్వాన్స్ కూడా ఇచ్చాడట రాజశేఖర్. అయితే ఆ వ్యవహారంలోకి మెగా ఫ్యామిలీ ఇన్‌వాల్వ్ అయ్యి ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొందట. దీంతో రాజశేఖర్ నుంచి ఆ సినిమా హక్కులు చేజారాయి. ఇక లక్ష్మి నరసింహ విషయంలో బాలయ్య నిర్మాతలు అడ్డుపడ్డారని.. తను ఆ సినిమా హక్కులను కొనే ప్రయత్నంలో ఉండగానే దాన్ని వారు కొనేశారు అని ఆ విధంగా తనకు అన్యాయం జరిగిందని ఒకసారి రాజశేఖర్ చెప్పారు.  కొన్ని తమిళ సినిమాల హక్కులను విడుదలకు ముందే కొనేశాడు రాజశేఖర్. అవికాస్తా ప్లాఫ్ అయ్యాయి. దీంతో వాటని తెలుగులో రీమేక్ చేసే ధైర్యం చేయలేదు. ఈ విధంగా రీమేక్స్ రాజశేఖర్‌కు చేదు అనుభవాలను ఇచ్చాయి.

‘‘పెదరాయుడు’’ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. తమిళంలో సంచలన విజయం సాధించిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం గురించి తెలుగులో వెంకటేశ్‌కు, మోహన్ బాబుకు మధ్య విభేదాలు వచ్చాయని.. చివరకు ఆ సినిమాను మోహన్ బాబు సొంతం చేసుకొన్నాడని అంటారు. అయితే ఈ సినిమా విషయంలో వెంకటేశ్ వెనక్కు తగ్గాడని.. ఆసబ్జెక్ట్ తనకు పడదని అర్థం చేసకొన్నాడని అంటారు. అప్పటికే తమిళం నుంచి చిన్నరాయుడు సినిమా హక్కులను సొంతం చేసుకొని రీమేక్ చేసిన వెంకీకి పెదరాయుడు తమిళ వెర్షన్ మీద కూడా దృష్టిపడిందట. అయితే చిన్నరాయుడు తన వయసుకు తగ్గ పాత్ర.. పెదరాయుడులో పెద్ద వయసు పాత్రలో సినిమా అంతా కనిపించాల్సి వస్తుంది. కాబట్టి.. ఆ సినిమా రీమేక్ చేయకపోవడమే మంచిదని వెంకీ భావించి ఆ సినిమాను వదులుకొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో మోహన్ బాబుకు లైన్ క్లియర్ అయ్యింది!

ఇవీ పరాయి భాషల్లో హిట్ అయిన సినిమాల తెలుగు రీమేక్ రైట్స్ విషయాల్లో తెలుగు హీరోల మధ్య చెలరేగిన రచ్చలు ఇవి! బాగా ప్రచారంలోకి వచ్చిన అంశాలు మాత్రమే ఇవి! ఇంకా అంతర్గతంగా వివిధ సబ్జెక్టుల విషయంలో హీరోల మధ్య తీవ్రమైన పోరాటాలు జరిగిన సందర్భాలు.. హక్కుల విషయంలో పోటీలు పడ్డ సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. ఏం చేసినా.. ఆ పోరాటాలు అన్నీ సెక్సస్ కోసం జరిగినవే కదా!