క్రౌడ్ పుల్లింగ్ హీరో గా అఖిల్ అవతరించేనా.?

స్టార్ లందు.. టాప్ స్టార్‌లు వేరు.. టాప్ స్టార్ లందు నెంబర్ వన్‌లు వేరు. అసలు నటుడు వేరు.. హీరో వేరు.. మళ్లీ హీరోల్లో మాస్ హీరో వేరు… అలాంటి మాస్ హీరోలు ఎందరన్నా…

స్టార్ లందు.. టాప్ స్టార్‌లు వేరు.. టాప్ స్టార్ లందు నెంబర్ వన్‌లు వేరు. అసలు నటుడు వేరు.. హీరో వేరు.. మళ్లీ హీరోల్లో మాస్ హీరో వేరు… అలాంటి మాస్ హీరోలు ఎందరన్నా వుండొచ్చు. కానీ నెంబర్ వన్ ఒక్కరే వుంటారు. నటనారంగంలోకి రావాలనుకున్న, వచ్చినవారి అల్టిమేట్ గోల్ నెంబర్ వన్ కాకపోవచ్చు కానీ స్టార్ కావాలనుకోవడం ఖాయం.. మాస్ హీరో అనిపించుకోవడం అన్నది కూడా అంతే ఖాయం. 

మరి టాలీవుడ్ స్టార్లు, మాస్ హీరోలు, నెంబర్ వన్‌లు ఎవరు?

ఎన్టీఆర్.. చిరంజీవి.. మొన్న, నిన్న నిస్సందేహంగా మాస్ హీరోలు అనిపించుకుని, నెంబర్ వన్ స్థానంలో కొన్నాళ్ల పాటు స్థిరంగా కూర్చున్నవాళ్లు. అంతే కాదు, ఆ మాస్ చరిష్మాతో రాజకీయాల్లోకి అడుగుపెట్టగలిగిన ధైర్యం తెచ్చుకునన్నావాళ్లు, పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఈ నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా వచ్చిన మరో ఇద్దరు. వీళ్ల తరువాత చరణ్, బన్నీ, ప్రభాస్.. వీళ్లు కూడా ఆ స్థానానికి చేరువగా వస్తున్నవాళ్లే.  వీళ్లంతా 60 నుంచి 70, 80 కోట్లు కొల్ల గొట్టే స్టామినా వున్నవాళ్లే. ప్రభాస్ బాహుబలిని ఇక్కడలెక్కలోకి తీసుకోవడం లేదు. అలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ అలా ప్రభాస్ రేంజ్ తక్కువేమీ కాదు. మిర్చి రుచి జనాలకు గుర్తుంది. ఇక్కడ అక్కినేనిని విస్మరించారని ఎవరైనా అనుకోవచ్చు. ఆయన పరిపూర్ణ నటుడు. మాస్ స్టార్ కాదు. ఆయనకు కోట్ల మంది అభిమానులు వుండొచ్చు. ఆయన మరణించినా ఆ అభిమానం చెక్కుచెదరకపోయి వుండొచ్చు. కానీ, అక్కినేనిది అంతా క్లాసిక్ స్టయిల్. 

రెండుకళ్లు

టాలీవుడ్‌కు రెండు కళ్లు అని చెప్పుకనేవి ఎన్టీఆర్‌ఎఎన్నార్ కుటుంబాలు. తెలుగు సినిమా రంగం బుడిబుడి అడుగులు వేస్తున్న కాలంలో వచ్చిన హీరోలు. తొలినాళ్లలోనే పరిశ్రమపై, ప్రేక్షకులపై తమదైన ముద్ర వేసుకోవడం కాకుండా, టాలీవుడ్ అభివృద్ధిలో తమ పాత్ర అపరిమితం అన్నంతగా కృషి చేసారు ఇద్దరూ. చివరి క్షణం వరకు ఎఎన్నార్ నటిస్తే, ముదిమి మీద పడిన తరువాత కూడా, పడుచుపిల్లలతో స్టెప్‌లు వేసి, తనకు సాటిలేరనిపించుకున్నారు ఎన్టీఆర్.

అయితే వారి వారసులు టాప్ హీరోలు అనిపించుకున్నారు తప్ప, నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా రాలేకపోయారు. ఎన్టీఆర్ టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరో అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తరువాత ఆయన వారసుడు బాలయ్య టాప్ హీరో అయ్యారు కానీ నెంబర్ వన్ కాలేకపోయారు.  బాలయ్య సినిమాలు కూడా నలభై కోట్లను దాటి వసూళ్లు సాగించాయి. బాలయ్య మాస్ హీరో అయి వుండొచ్చు. ఇప్పటికీ ఆయనకు విపరీతమైన క్రౌడ్ ఫాలోయింగ్ వుంటే వుండొచ్చు. అయితే ఆయనే నెంబర్ వన్ కాలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ సాధించిన ప్లేస్‌ను బాలయ్య సాధించలేదనే చెప్పాలి. 

జూనియర్ ఒక్కడే..

ఎన్టీఆర్ ప్యామిలీకే చెందిన కళ్యాణ్ రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్‌ల్లో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే టాప్ హీరో కమ్ మాస్ హీరో అయ్యారు. ఒక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్‌వన్ అవుతారమో అనిపించింది. కానీ అంతలోనే ఆయన కిందకు జారిపోయారు. ఇప్పుడు మళ్లీ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన బన్నీ, చరణ్ స్థిరంగా నలభై కోట్ల క్లబ్‌లో తమకు ఫిక్స్‌డ్ ప్లేస్ వుందని నిరూపించుకున్నారు కానీ ఇంకా నెంబర్‌వన్ ప్లేస్‌లోకి మాత్రం చేరలేదు. తమ క్యాంప్‌కే చెందిన పవన్ మాదిరిగా వరుసగా సినిమాలు ప్లాప్ అయినా, తమ కలెక్షన్లు స్థిరంగా వుంటాయి అనే రేంజ్‌కు చేరలేదు. సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చరిష్మా సాగించగలిగే స్థాయికి చేరుకోలేదు. 

ఎఎన్నార్ ఫ్యామిలీ

ఎఎన్నార్ టాప్ హీరో, క్లాస్ హీరో అయ్యారు కానీ, నెంబర్‌వన్ కాలేదు. పైగా ఇంకో వెలితి కూడా  వుంది. పెద్దగా మాస్ హీరో అనిపించుకోలేదు. ఆయన వారసుడు నాగార్జున మాస్ ఇమేజ్ కొంతవరకు తెచ్చుకున్నా, మన్మధుడు, వైవిధ్యం కోసం ప్రయత్నించే మంచి నటుడు అని మాత్రం అనిపించుకోగలిగాను. ఆయన సీజన్‌లో నెంబర్ వన్ మాత్రం కాలేకపోయారు.

అక్కినేని బుద్దిమంతుడు.. భక్త తుకారాం.. చిలిపికృష్ణుడు.. అంతే తప్ప, రౌడీ రాముడో, ఎదురులేని మనిషో కాలేకపోయారు. ఆయన వారుసుడిగా రంగప్రవేశం చేసారు నాగార్జున. తండ్రిలా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూనే, మాస్ సినిమాలు బ్రహ్మాండంగా చేసారు. ఫైట్లు, పాటలు, ప్రియురాళ్లు.. భక్తి.. ముక్తి… ఇలా అన్నీ టాలెంట్లు చూపించేసారు. మంచి నటుడు అనిపించుకున్నారు.  కానీ ఆయన సీజన్‌లో ఆయనా నెంబర్‌వన్ కాలేకపోయారు. చిరంజీవి మాత్రమే మెగాస్టార్ అయ్యారు. నాగ్ తన సహనటులు బాలయ్య, వెంకీ లతో పాటు తమ మార్కెట్ తాను నిలమెట్టుకుంటూ వెళ్లారు. అంతే తప్ప మెగాస్టార్‌ను దాటి నెంబర్‌వన్ అనిపించుకోలేకపోయారు. 

అక్కినేని నాగేశ్వరరావు.. 255 సినిమాలు.. అక్కినేని నాగార్జున దగ్గర దగ్గర 90 సినిమాలు.. నాగచైతన్య పది సినిమాలు.. ఆ ఇంటి మహిళలు, బంధువులు అందరూ ఎన్నో కొన్ని సినిమాలు చేసినవారే. అలా నటనతో పెనవేసుకుపోయిన కుటుంబం అది. అందరూ ఆ విధంగా నటులు అనిపించుకున్నవారే. జనాలతో జేజేలు కొట్టించుకున్నవారే.. అభిమానం మూటకట్టుకున్నవారే. కానీ ఎక్కడో చిన్న వెలితి.. వాళ్ల వాళ్ల తరంలో తిరుగులేని నెంబర్‌వన్ అని మాత్రం అనిపించుకోలేకపోయారు.

పవన్ ప్లేస్ వేరు

చిరంజీవి తరువాతి తరం వచ్చేలోగా మధ్యలో లైన్‌లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇటు మీది జోన్‌తో కానీ, అటు తరువాతి తరంతో కానీ సంబంధం లేకుండా తన లీడ్ తాను తెచ్చుకున్నారు. నెంబర్‌వన్ స్థానంలో అన్న వున్నా, తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. లేటుగా వచ్చినా, ఫ్లాప్ తరువాత వచ్చినా ఆయన స్టార్ డమ్ ఆయనకు వుంది. ఇంతలో కొత్త తరం వచ్చింది. రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా. అందరికీ మహా మాస్ హీరోలే.. మాంచి హిట్‌లు ఇచ్చినవారే.. నలభై నుంచి అరవై డెభై కోట్ల కలెక్షన్లు కొల్ల గొట్టినవారే. 

అయినా వారిలో నెంబర్‌వన్ అంటే మాత్రం మహేష్ బాబే ముందుంటారు. రామ్ చరణ్‌కు మగధీర వుండొచ్చు.. ప్రభాస్‌కు బాహుబలి వుండొచ్చు. కానీ ఓ కంటిన్యుటీ.. ఓ సగటు చూసుకుంటే.. మహేష్‌నే ముందుంటారు. ఈ రోజు తెలుగు సినిమాను వంద కోట్ల మార్క్‌ను దాటించింది మహేష్‌నే. మళ్లీ బాహుబలిని మినహాయించాలి. దానికి చాలా ఫ్యాక్టర్లున్నాయి. పైగా వరుసగా రెండు భయంకరమైన ఫ్లాప్‌లు వచ్చినా కూడా మహేష్ చరిష్మా చెక్కుచెదరలేదు. అది నెంబర్‌వన్‌కు కావాల్సిన కనీస అర్హత.

అక్కినేని వారి మాటేమిటి?

కానీ ఇక్కడా మళ్లీ అక్కినేని వారసులకు చుక్కెదురే. నాగ్ తరువాత నాగచైతన్య.. సుమంత్.. సుశాంత్.. వచ్చారు. కానీ ఎవ్వరూ ముఫై, నలభై కోట్ల హీరో కాలేకపోయారు. నాగచైతన్యకు హిట్‌లు వున్నా కూడా.. మాస్ రేంజ్, సూపర్ డూపర్ ఓపెనింగ్స్ వచ్చే స్థాయిరాలేదు. పది చిత్రాల వయసుతో అంచనా వేయకూడదు అనుకోవచ్చు కానీ, మిగిలిన హీరోలు పది చిత్రాల వయసుతోనే తమ పస చూపించేసారు. కానీ ఇప్పటికీ నాగచైతన్య ఎల్ కె జి, యుకెజిలోనే వుండిపోయారు. ఇప్పుడు ఈ లోటు పూడుతుందా అనిపిస్తోంది. 

అక్కినేని అఖిల్ తెరంగ్రేటం చేయడంతో. 

అఖిల్ తన ఎంట్రీ తోనే మాస్ హీరోలకు కావాల్సిన హడావుడిని తోడు తెచ్చుకున్నాడు. కుర్రాళ్లలో క్రేజ్ పెంచేసుకున్నాడు. తొలిసినిమానే భారీ సినిమాగా మొదలుపెట్టేసాడు. అది కూడా భారీ,. మాస్ సినిమాల డైరక్టర్ వివి వినాయక్‌తో. ఇప్పుడు ఈ సినిమా పూర్తి కాకుండానే యాభై కోట్ల బిజినెస్ చేసేసిందని వినికిడి. 

అంటే ఆ విధంగా అక్కినేని కుటుంబంలో యంగ్ మాస్ హీరో ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లు కనిపిస్తోంది. నాగ్.. బాలయ్య.. మెగాస్టార్.. వెంకీలకు, మహేష్.. రామ్ చరణ్.. ప్రభాస్.. బన్నీల మధ్య గ్యాప్‌లో పవన్ వచ్చి, తనకంటూ ఓ టాప్ ప్లేస్ తయారుచేసుకున్నట్లు, వీరి తరువాత గ్యాప్‌లో అఖిల్ వచ్చి, తనకో ప్లేస్ తయారుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పటికైనా తీరుతుందా

అఖిల్ ప్లేస్ రేంజ్ ఎంతన్నది పక్కన పెడితే, మాస్ హీరో అనిపించుకోవడం, భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడం, తన కంటూ ఓ మార్కెట్‌ను గెలుపు ఓటములకు అతీతంగా తయారుచేసుకోగలగడం కీలకం. ఇవన్నీ టాప్ హీరోకు వుండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాలు అఖిల్ పుణికి పుచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఇన్నాళ్లు అక్కినేని కుటుంబానికి వున్న తీరని కోరిక అఖిల్ తీర్చేలా వున్నాడు. అఖిల్ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దులిపాయి. అఖిల్ స్టయిల్ అక్కినేని వంశంలో కొత్త షో చూపిస్తోంది. అఖిల్‌కు వస్తున్న హైప్…ఆ వంశంలో నెంబర్ వన్ స్టార్ కాకున్నా, కచ్చితంగా ఓ మహా మాస్ హీరో పుట్టుకు వస్తాడని జోస్యం చెబుతోంది. 

అభిమానుల ఆశ

అక్కినేని కుటుంబం నుంచి సినిమా వస్తోందంటే.. స్పెషల్ షో లు పడాలి. వెయ్యి రెండు వేలు టికెట్‌లు అమ్మగలగాలి. కనీసం వారం రోజులు అడ్వాన్స్ బుకింగ్‌లు కళకళ లాడాలి. ఇదీ అభిమానుల ఆశ.  అలాంటి క్రౌడ్ పుల్లింగ్ హీరోగా అఖిల్ అవతరించేలాగే వున్నాడు. అనకూడదు కానీ, అభిమానులేకనా అక్కినేని కుటుంబానికి కూడా ఇలాంటి కోరిక వుండే వుంటుంది. ఆ కోరిక ఇప్పటికి తీరేలాగే వుంది. అఖిల్ తన ఫస్ట్ సినిమా హిట్ కొడితే, గ్యారంటీగా అది వంద కోట్లకు దగ్గరలోకి వెళ్లిపోతుంది. అదే ఫౌండేషన్ పడితే, అఖిల్, అక్కినేని కుటుంబానికి నెంబర్ వన్ కిరీటాన్ని తెచ్చే యవరాజు అవుతాడు. అందులో సందేహం లేదు.

చాణక్య

[email protected]