కళ్లల్లో ఆశలన్నీ నింపుకుని పెంచుకుంటున్న ఏకైక బిడ్డ. కళ్ల ముందే కన్నుమూశాడు. ఆ బిడ్డ… కన్ను మూసింది జబ్బుచేసి అని ప్రపంచం అనొచ్చు. కాని డబ్బు చేయలేక అని ఆ తల్లిదండ్రులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు వారూ చెప్పలేరు. ఎందుకంటే… కంటిపాపలాంటి కొడుకుకు కోల్పోయాక ఈ జీవితం ఎవరి కోసం అనుకున్న వారిద్దరూ కొడుకుని వెతుక్కుంటూ తామూ వెళ్లిపోయారు.
ఈ విషాదం జరిగింది సామాన్యుడి పేరుతో అధికారం అందుకున్న చీపురు పార్టీ ప్రభుత్వం నడుపుతున్న ఢిల్లీలో. అక్కడ ఆమ్ ఆద్మీ బతుకు ఇంకా అతుకుల బొంతలాగే ఉందని నిరూపిస్తున్నదీ ఉదంతం.
ఢిల్లోలని ఓ మారుమూల ప్రాంతమైన లాడో సరాయ్ అనే చోట గుట్టుగా బతుకుతోంది లక్ష్మీచంద్ర కుటుంబం. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే లక్ష్మీచంద్ర రెండు గదుల అద్దె ఇంట్లో భార్య, కొడుకు అయినాష్ సహా నివసిస్తున్నాడు. ఉన్నంతలో సంతోషంగా ఉన్న వారి కుటుంబానికి కొడుకుకు వచ్చిన వ్యాధి సమస్యగా మారింది. చివరికి అది డెంగ్యూ అని తేలింది. అది తేలాక… వాళ్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కొడుకుకు చికిత్స కోసం.
డబ్బు చేతికి అంటితే తప్ప రోగిని తాకడానికీ ఇష్టపడని ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర్నుంచి, జబ్బును చూసి జడుసుకునే ప్రభుత్వ ఆసుపత్రుల వరకూ అన్నీ తిరిగారు. ఎవరూ కనికరించలేదు. మేం చికిత్స చేయం పొమ్మన్నారు. చివరికి విసిగి వేసారిపోయిన చిన్నారి జీవితం.. ఆ తల్లిదండ్రుల చేతుల్లోనే ముగిసిపోయింది. ఈ నెల 8న అయినాష్ చనిపోయాడు.
తామేం తప్పు చేశామో ఆ తల్లిదండ్రులకు అర్ధం కాలేదు. తమ కంటూ ఉన్న ఏకైక సంతోషం దూరం అయ్యేంత దోషం తమ పేదరికానిదని మాత్రం అర్ధమైంది. ఆడుతూ పాడుతూ తిరిగే కొడుకు స్మృతులు తరుముతుంటే… ఒక్క రోజు మించి ఆ బిడ్డకు దూరంగా బతకలేకపోయిన ఆ తల్లిదండ్రులు… తాము అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకేశారు. చనిపోతూ కూడా తమ చావుకెవరూ బాధ్యులు కాదని ఉత్తరం రాసిపెట్టి మరీ దూకేశారు.
ఈ సంఘటనకు కారణం తెలుసుకున్న ఢిల్లీ ప్రభుత్వం చిన్నారిని జేర్చుకోలేదని ఆరోపణలు ఎదుర్కుంటున్న రెండు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంది. ఆత్మహత్య చేసుకున్న దంపతులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి పోలీసులూ ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. అయితే ఇది నిజంగా ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులన్నీ ముద్దాయిలుగా నిలవాల్సిన ఉదంతం. అవసరానికి వైద్యం అందివ్వలేక ఒక కుటుంబం మొత్తాన్నీ బలి తీసుకున్నందుకు ఆధునిక వైద్యరంగం మొత్తం దోషిగా తలవంచుకుని నిలబడాల్సిన ఉదంతం. ఒక మనిషి ప్రాణం కన్నా తనకు మరేదో ఎక్కువని ఏ ఆసుపత్రి అనుకున్నా… అది చచ్చినట్టే లెక్క. అలా అనుకుంటూ బతికే కన్నా ఆ ఆసుపత్రి ఆత్మహత్య చేసుకోవడం మిన్న. కాసులే తప్ప కారుణ్యం ఎరగని ఆసుపత్రులూ…. ప్లీజ్…ఆత్మహత్య చేసుకోండి.
ఎస్బీ